అంతర్జాతీయంగా భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకు ఎందుకు పడిపోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెర్లిన్ మొల్లాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత పాస్‌పోర్టు బలహీనమైనదని విమర్శిస్తూ ఈ ఏడాది మొదట్లో ఇండియన్ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఓ పక్క పొరుగుదేశాలైన భూటాన్, శ్రీలంక భారతీయ పర్యటకులను స్వాగతిస్తుంటే, యూరోపియన్, పశ్చిమ దేశాలకు మాత్రం భారత్ పాస్‌పోర్టుపై వీసా పొందడం సవాలుగా మారిందని ఆయన చెప్పారు.
తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ కూడా దీన్ని ప్రతిఫలించింది.
వీసా రహిత ప్రయాణం ఆధారంగా వివిధ దేశాల పాస్‌పోర్ట్‌లకు హెన్లీ ర్యాంకులు ఇస్తుంది.
ఈ జాబితాలోని 199 దేశాల్లో భారత్ 85వ స్థానంలో ఉంది. ఇది గత సంవత్సరం కంటే 5 స్థానాలు తక్కువ. ఈ నివేదికపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.ప్రభుత్వ స్పందన కోసం బీబీసీ ప్రతినిధి భారత విదేశాంగ శాఖను సంప్రదించారు.

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ కంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థలైన రువాండా, ఘనా, అజర్‌బైజాన్ వంటి దేశాలు హెన్లీ జాబితాలో 78,74,72 స్థానాల్లో నిలిచాయి.
గత దశాబ్ధంలో భారత్ ర్యాంక్ 80ల్లోనే ఉంది. 2021లో 90వ స్థానానికి పడిపోయింది.
జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ ర్యాంకింగ్ నిరాశాజనకంగా ఉంది.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సింగపూర్ తన పాస్‌పోర్ట్‌తో 193 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే అర్హత సాధించి జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియా పాస్‌పార్ట్‌తో 190, జపాన్ పాస్‌పోర్ట్‌తో 189 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. జాబితాలో ఈ రెండు దేశాలు రెండు,మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత పాస్‌పోర్ట్ ఉన్నవారికి 57 దేశాల్లోకి వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఉంది. ఆఫ్రికన్ దేశం మౌరిటానియా పరిస్థితి కూడా ఇదే.
భారత్, మౌరిటానియాలకు 85వ ర్యాంక్ దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత పాాస్‌పోర్ట్‌కు కష్టాలు
ఒక దేశ పాస్‌పోర్ట్ బలం ఆ దేశ అంతర్జాతీయ ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే, ఆ దేశ పౌరులు విదేశాలకు వెళ్లడానికి, వాణిజ్య అవకాశాలపై అవగాహన పెంచుకోడానికి ఉపయోగపడుతుంది. పాస్‌పోర్ట్ బలహీనంగా ఉంటే విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువ పేపర్ వర్క్, ఎక్కువ వీసా ఫీజులు, దీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం లాంటి సమస్యలు ఉంటాయి.
ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పడిపోతున్నప్పటికీ, గత దశాబ్దంలో భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి అనుమతిస్తున్న దేశాల సంఖ్య పెరిగింది.
ఉదాహరణకు 2014 అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయిన సంవత్సరం విడుదలైన జాబితాలోభారత్ పాస్‌పోర్ట్ ర్యాంక్ 76గా ఉంది. అప్పట్లో 52 దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రయాణాలకు అనుమతి ఇచ్చేవి.
ఏడాది తర్వాత అది 85వ స్థానానికి పడిపోయింది. 2023, 2024లో అది 80వ స్థానానికి చేరింది. ఈ ఏడాది మళ్లీ 85వ స్థానానికి పడిపోయింది.
ఇదిలా ఉంటే, ఇండియన్ పాస్‌పార్ట్‌తో వీసా రహిత ప్రయాణాలకు అనుమతించే దేశాల సంఖ్య 2015లో 52 నుంచి 2023లో 60కి 2024లో 62కి పెరిగింది.
2025లో ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రయాణానికి అనుమతించే దేశాల జాబితా 57కు చేరింది. 2015లో ఉన్న 52 దేశాలతోపోలిస్తే ఇది ఎక్కువే. అయితే చిత్రంగా ఈ రెండు సంవత్సరాలలో అంటే 2015, 2025లలో భారత్ ర్యాంకు 85గానే ఉంది. ఒకే ర్యాంక్ ఉన్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ వీసా రహిత ప్రయాణాలకు అనుమతించే దేశాల సంఖ్యలో మార్పు ఉంది. ఎందుకిలా?
ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టుల్ని ఆకర్షించే ప్రయత్నంలో వివిధ దేశాల మధ్య పోటీ పెరగడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
2025లో హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వీసా రహిత గమ్యస్థానాల సంఖ్య 2006లో 58 ఉండగా 2025లో 109కి చేరింది.
ఉదాహరణకు చైనాను తీసుకుంటే గత దశాబ్దంలో చైనా పాస్‌పోర్ట్ ఉన్న వారు వీసా రహిత ప్రయాణాలు చేసే గమ్యస్థానాల సంఖ్య 50 నుంచి 82కి పెరిగింది. అదే సమయంలో బలమైన పాస్‌పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో చైనా ర్యాంక్ 94 నుంచి 60కి చేరింది.
ఇదిలా ఉంటే, 2025 జులైలో భారత ర్యాంక్ 77గా ఉంది. ( ప్రపంచ వీసా విధానాలలో వచ్చిన మార్పులు ప్రతిఫలించేందుకు ప్రతి మూడునెలలకోసారి పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను హెన్లీ సవరిస్తుంటుంది) అప్పుడు భారత్ పాస్‌పోర్ట్‌తో 59 దేశాలకు వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఉంది. అయితే అక్టోబర్‌లో ఓ రెండు దేశాలు భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న వారికి వీసారహిత ప్రయాణాన్ని రద్దు చేయడంతో భారత్ ర్యాంక్ 85కి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
ర్యాంక్ పడిపోవడానికి కారణాలేంటి?
పాస్‌పోర్ట్ ర్యాంక్ మెరుగుపడటం వెనుక ఆర్థిక, రాజకీయపరమైన స్థిరత్వంతో పాటు ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడం వంటి అనేక అంశాలు ఉంటాయని అర్మేనియాలో భారత రాయబారిగా పని చేసిన అచల్ మల్హోత్రా చెప్పారు.
ఉదాహరణకు అమెరికా పాస్‌పోర్ట్ ర్యాంక్ 10 నుంచి 12కు దిగజారింది. అమెరికన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ చారిత్రక దిగువ స్థాయికి పడిపోయింది. ప్రపంచరాజకీయాలపై అమెరికా అనుసరిస్తున్న నియంత్రిత వైఖరి వల్లే ఆ దేశపు పాస్‌పోర్ట్ బలం తగ్గిందని నివేదిక తెలిపింది.
భారతీయులు 1970లలో యూరోపియన్ దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని ఆస్వాదించారని మల్హోత్రా చెప్పారు. అయితే 1980లలో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రమైన తర్వాత ఈ పరిస్థితి మారింది. తర్వాతి కాలంలో రాజకీయ తిరుగుబాట్ల వల్ల భారత్‌కున్న స్థిరమైన ప్రజాస్వామ్య దేశం అనే ప్రతిష్ట దెబ్బ తింది.
"చాలా దేశాలు వలసదారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నాయి. భారత్ నుంచి విదేశాలకు వెళ్లి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న వారి సంఖ్య పెరిగింది. దీని వల్ల దేశ ప్రతిష్ఠ మసక బారుతుంది" అని మల్హోత్రా చెప్పారు.
"ఒక దేశపు పాస్‌పోర్టు ఎంత భద్రమైనది,ఆ దేశపు వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలు ఎలా ఉన్నాయనే అంశాలు కూడా ఇతర దేశాలకు వీసా-రహిత ప్రయాణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అని మల్హోత్రా చెప్పారు.
భారతదేశపు పాస్‌పోర్ట్ భద్రత తరచుగా ముప్పును ఎదుర్కొంటోంది.
వీసా, పాస్‌పోర్ట్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో దిల్లీ పోలీసులు 2024లో 203 మందిని అరెస్ట్ చేశారు.భారత్‌లో సంక్లిష్టమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా జారీలో ఆలస్యం వంటి అంశాలు కూడా పాస్‌పోర్ట్ ర్యాంకుని దిగజార్చాయి.
ఇండియా ఇటీవల ప్రవేశ పెట్టిన ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ వంటి సాంకేతిక పద్దతులు భద్రతను మెరుగుపరచడంతో పాటు ఇమ్మిగ్రేషన్ పక్రియను సులభతరం చేస్తాయని మల్హోత్రా చెప్పారు.
ఈ- పాస్‌పోర్ట్‌లో బయోమెట్రిక్ సమాచారాన్ని నిల్వ చేసే చిన్న చిప్ ఉంటుంది. దీని వల్ల పాస్‌పోర్ట్‌ను ట్యాంపర్ చేయడం కష్టమవుతుంది.
భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ మెరుగుపరచడానికి, వీసా రహిత దేశాల సంఖ్యను పెంచుకోవడానికి దౌత్యపరమైన చర్యలు, ప్రయణా ఒప్పందాలు జరుగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














