ఈ-పాస్‌పోర్ట్: భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు.. వీటితో ప్రయోజనాలేమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
భారత్‌లో ఈ-పాస్‌పోర్టులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ) జారీ చేసింది. దీని ద్వారా ఈ-పాస్‌పోర్టులకు సంబంధించి ఐటీ వ్యవస్థను సిద్ధం చేసి, సేవలు అందించే సంస్థను ప్రభుత్వం ఎంపిక చేయనుంది.
ఈ-పాస్‌పోర్టులపై ప్రభుత్వం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టింది.
దాదాపు 20 వేల మంది ప్రభుత్వ, దౌత్య అధికారులకు ఈ-పాస్‌పోర్టులు జారీ అయినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ వార్త కూడా రాసింది.
వచ్చే ఏడాది ఈ సేవలు అందరికీ అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఎంచుకున్న సంస్థ ఈ-పాస్‌పోర్టుల కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రతి గంటకూ 10 వేల నుంచి 20 వేల దాకా ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దిల్లీ, చైన్నైల్లో ఇందుకోసం ఐటీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారని సమాచారం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ-పాస్‌పోర్టు అంటే...
ప్రస్తుతం ఇచ్చే పాస్‌పోర్టులు చిన్న పుస్తకంలా ఉంటాయి. ఎవరికి వారికి ప్రత్యేకంగా ముద్రించి వీటిని ఇస్తారు.
‘‘ఈ-పాస్‌పోర్టులు కూడా సంప్రదాయ పాస్‌పోర్టుల్లానే ఉంటాయి. కానీ, వాటిలో చిన్న ఇంటిగ్రేటెడ్ సర్యూట్ (చిప్) ఉంటుంది. పాస్‌పోర్టు అట్ట మీద లేక పేజీల్లో దీన్ని పెడతారు’’ అని థేల్స్ గ్రూప్ తెలిపింది.
విమానయాన, రక్షణ, రవాణా వంటి రంగాల్లో పరిశ్రమలకు అవసరమైన ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ను తయారుచేయడంలో థేల్స్ గ్రూప్ బాగా పేరుపొందిన సంస్థ.
చిప్ ద్వారా ఈ-పాస్‌పోర్టులకు కొన్ని డిజిటల్ భద్రత సదుపాయాలు వస్తాయి. చిప్‌లో పాస్‌పోర్టు వినియోగదారుడి వేలి ముద్రలు, రెటీనా వంటి బయోమెట్రిక్ వివరాలు నమోదై ఉంటాయి. పాస్‌పోర్టు అసలుదా, నకిలీదా అనే విషయం సులభంగా తెలుసుకోవచ్చు. చిప్‌లో నమోదైన వివరాలను మార్చడం చాలా కష్టం.
అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి కూడా ఈ-పాస్‌పోర్టు బాగా ఉపయోగపడుతుంది. ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఈ-పాస్‌పోర్టు ద్వారా యాత్రికుల గురించి మరింత లోతైన సమాచారం త్వరగా తెలుసుకోవచ్చు.
‘‘భద్రతపరంగా చూస్తే, ఈ-పాస్‌పోర్టుతో వినియోగదారుడి గుర్తింపును ధ్రువీకరించుకోవడం సులువు అవుతుంది. మామూలు పాస్‌పోర్టును స్కాన్ చేయడం, ఆ డేటాను పొందడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ-పాస్‌పోర్టుల ద్వారా బయోమెట్రిక్ వివరాలను కూడా ధ్రువీకరించుకోవచ్చు’’ అని సైబర్ భద్రత నిపుణుడు, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సలహాదారుడు రక్షిత్ టండన్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నేరస్థుల పరారీకి కళ్లెం పడుతుందా?
ఈ-పాస్‌పోర్టులతో నేరస్థులు దేశం విడిచివెళ్లకుండా కళ్లెం వేయవచ్చా?
‘‘నేరస్థులను బయటి దేశాలకు పారిపోకుండా నియంత్రించేందుకు, పోలీసులు పెద్ద ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. అప్పటికి నేరస్థులు దేశం దాటేస్తుంటారు. అదే ఈ-పాస్‌పోర్టులు అందుబాటులోకి వస్తే, ఆ ప్రక్రియను ఓ బటన్ నొక్కి చేసేయొచ్చు. వేరే దేశాల్లోకి వాళ్లు అడుగుపెట్టడం కూడా కుదరదు. ఎందుకంటే, మొత్తం సమాచారం డిజిటల్‌గా ఉంటుంది’’ అని రక్షిత్ టండన్ ఈ ప్రశ్నకు బదులిచ్చారు.
డార్క్ నెట్‌లో నకిలీ పాస్‌పోర్టుల విక్రయాలు కూడా సాగుతున్నాయని, అలాంటి సమస్యలకు ఈ-పాస్‌పోర్ట్‌లు మంచి పరిష్కారమని టండన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాణాలను ఎవరు నిర్దేశిస్తారు?
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) అంతర్జాతీయంగా పాస్‌పోర్టుల ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
ఇది ఐరాస కింద పనిచేసే సంస్థ. అయితే, ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన ప్రమాణాలు కూడా పాటించుకోవచ్చు.
మెషీన్ చదవగలిగే పాస్‌పోర్టులే అన్ని దేశాలూ జారీ చేయాలని 2016లో ఐసీఏఓ నిర్ణయం తీసుకుంది. మెషీన్ రీడెబుల్ ట్రావెల్ డాక్యుమెంట్స్ (ఎమ్‌ఆర్ఆర్‌టీడీ) అని వీటిని పిలుస్తున్నారు.
ఎమ్‌ఆర్ఆర్‌టీడీ అంటే, పాస్‌పోర్టు మొదటి పేజీలో అడుగున రెండు లైన్లలో పేరు, పాస్‌పోర్టు ఎక్స్పైరీ తేదీ, జారీ చేసిన దేశం పేరు వంటి వివరాలు ఉండాలి.
చిప్‌ను తప్పనిసరి చేస్తూ ఐసీఏఓ ఇప్పటివరకైతే నిబంధనలు విధించలేదు. కానీ, ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు చిప్ ఉన్న పాస్‌పోర్టులను వినియోగిస్తున్నాయి.
ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్న దేశాల సంఖ్య ప్రస్తుతానికి వందపైనే ఉన్నట్లు ఐసీఏఓ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల ఈ-పాస్‌పోర్టులు వినియోగంలో ఉన్నట్లు ఓ అంచనా ఉంది. యూరప్‌లో ఈ తరహా పాస్‌పోర్టులు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








