‘100 రోజుల సమయం ఇవ్వండి’ అని ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కల్యాణ్ ఎందుకన్నారు? అసలు వారి సమస్యేంటి?

సావిత్రి, ఉప్పాడ, మత్స్యకారుల సమస్యలు
ఫొటో క్యాప్షన్, సావిత్రి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"నాకు వంద రోజులు సమయం ఇవ్వండి. మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. అనేక ఇతర విభాగాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యలను పరిష్కరించేందుకే నేను వంద రోజులు సమయం అడుగుతున్నా".

2025 అక్టోబర్ 9న కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో మత్స్యకారులతో ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చెప్పిన మాటలివి.

పవన్ కల్యాణ్ మంత్రిగా ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్నారు.

అసలు పవన్ కల్యాణ్ వంద రోజుల్లో పరిష్కరిస్తానన్న ఆ సమస్యలేంటి?.

ఆ సమస్యలపై పవన్ ఇప్పుడే ఎందుకు దృష్టి పెట్టారు?

మత్స్యకారులు ఏ విధమైన పరిష్కారాలు కోరుకుంటున్నారు?.

ఈ విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామానికి వెళ్లింది.

ఉప్పాడలోని తీర ప్రాంతం, మత్స్యకారులు కష్టాలు, పవన్ కల్యాణ్ పర్యటన
ఫొటో క్యాప్షన్, ఉప్పాడను తాకుతున్న సముద్రపు అలలు

ఉప్పాడ గ్రామం ఎలా ఉందంటే...

వర్షాలు, తుపాన్ల హెచ్చరికలు వచ్చాయంటే ఉప్పాడలోని తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారులు తమ ఇళ్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోతారు.

బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు మొంథా తుపాను హెచ్చరికలు మొదలైయ్యాయి.

దాంతో ఉప్పాడ తీరంలో ఉన్న ఇళ్లలోని మత్స్యకారులు ఎప్పటిలాగే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి.

గ్రామం మొత్తాన్ని అధికారులు పునరావాస కేంద్రాలకు, తుపాను రక్షిత భవనాలకు తరలిస్తున్నారు.

అయితే, గ్రామంలో చాలామంది మత్స్యకారులు తమ ఇళ్లను వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. కొందరు అక్కడికి వచ్చిన పోలీసులు, ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రతిసారి తుపాను కేంద్రాలకు తరలించడం వల్ల ప్రయోజనం ఉండదంటూ ఆవేదనతో అరవడం కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉప్పాడ, మత్స్యకారులు

ఉప్పాడలోని తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న కృష్ణ ఇంటికి వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని మీడియా ప్రతినిధులుగా గుర్తించి, వెంటనే ఇంటిలోకి వెళ్లి పవన్ కల్యాణ్‌తో తాను తీసుకున్న ఫోటోను పట్టుకొచ్చారు.

తమ సమస్యలను పవన్ పరిష్కరిస్తారని నమ్ముతున్నామని చెబుతూ, ఉప్పాడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను బీబీసీకి వివరించారు.

"నేను చిన్నతనం నుంచి ఇక్కడే, ఇదే ఇంట్లో ఉంటున్నా. అప్పట్లో మా ఇంటికి, తీరానికి మధ్య కిలోమీటరున్నర దూరం ఉండేది. ఇప్పుడు నా ఇంటికి, సముద్రానికి 20 మీటర్లు దూరం కూడా లేదు. ఎన్నో ఇళ్లు మా కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి. కనీసం వాటి గుర్తులు కూడా లేవు" అని తన చెప్పారు కృష్ణ.

ఉప్పాడ, శ్రీను, మత్స్యకారుడు
ఫొటో క్యాప్షన్, శ్రీను

'ఇవే మా సమస్యలు'

మాకు చాలా సమస్యలున్నాయి కానీ, వాటిలో ప్రధానంగా పరిష్కారం కోరుకుంటున్నవి అంటూ స్థానిక మత్స్యకారులు కృష్ణ, రత్నం, సూరిబాబు, శ్రీనులు చెప్పిన జాబితా.

  • సమస్య: దాదాపు 40 ఏళ్లుగా తీరం కోతకు గురువుతోంది. ముందు దానిని పరిష్కరిస్తే, ఉప్పాడ గ్రామం మిగులుతుంది. లేదంటే కొన్నేళ్లలో ఊరు కనిపించదు.
  • కోరుకుంటున్న పరిష్కారం: గతంలో జియో ట్యూబ్ వేశారు, 7 ఏళ్లు తర్వాత అది కొట్టుకుపోయింది. శాశ్వత పరిష్కరం కావాలి.
  • సమస్య: కాకినాడ, తుని సమీపంలో ఉన్న పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలిపేస్తున్నారు. వాటి వల్ల మత్స్య సంపద తగ్గిపోతోంది.
  • కోరుకుంటున్న పరిష్కరం: పరిశ్రమలతో మాట్లాడి ఆ వ్యర్థాలను సముద్రంలో వదలకుండా చూడటం, లేదంటే తగ్గించడం చేయాలి.
  • సమస్య: తుపాన్లు, భారీ వర్షాలు వచ్చినప్పుడు పడవలు, ఆస్తులు, ఇల్లు ధ్వంసమైపోతున్నాయి.
  • కోరుకుంటున్న పరిష్కారం: కాలయాపన లేకుండా వాటికి వెంటనే నష్టపరిహారం వచ్చేలా చూడాలి.
  • సమస్య: ఉప్పాడ సమీపంలోని వేటకు అనుకూలత లేని సందర్భంలో, ఇతర ప్రాంతాలకు వేటకు వెళ్తే... అక్కడ మత్స్యకారులతో సమస్యలు తలెత్తుతున్నాయి.
  • కోరుకుంటున్న పరిష్కారం: మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అక్కడి మత్స్యకారులతో మాట్లాడి, మాకు ఇబ్బందులు లేకుండా చేయాలి. లేదంటే వేరే చోట వేటకు అనుకూలమైన చోటు చూపించాలి.
  • సమస్య: ఇటీవల కాలంలో వేట దాదాపు చేయపోవడంతో జీవన భృతి కష్టమైపోతుంది.
  • కోరుకుంటున్న పరిష్కారం: మా సమస్యలకు పరిష్కారం లభించే వరకు మత్స్యకారులకు నెలకు జీవనభృతి కోసం రూ. 5 నుంచి రూ. 10 వేల వరకు ఇస్తే బాగుంటుంది'' అని అన్నారు.
ఉప్పాడ, మత్స్యకారుల సమస్యలు, అప్పారావు,
ఫొటో క్యాప్షన్, అప్పారావు

'' ఈ సమస్యలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేసే సమయంలో మా సమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ కూడా హామీ ఇచ్చారు. అందుకే ఆయన రావాలంటూ మేం ఆందోళన చేశాం" అని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు ప్రసాద్, సతీష్, అప్పారావు, సావిత్రమ్మ బీబీసీతో అన్నారు.

అదే సమయంలో 100 రోజుల్లో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నట్లు వారు చెప్పారు.

మత్స్యకారులు,

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మత్స్యకారులు సెప్టెంబర్ 23, 24 తేదీలలో ఉప్పాడలో నిరసన తెలిపారు.

మత్స్యకారుల ఆందోళనలు

కాకినాడ రూర‌ల్ ప్రాంతంలోని తీర ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీల వ‌ల్ల స‌ముద్రంలో మ‌త్స్య‌సంప‌ద తీవ్రంగా న‌ష్ట‌పోయి, త‌మ జీవ‌నం దెబ్బ‌తింటుంద‌ని ఉప్పాడ మత్స్యకారులు గ‌త కొంతకాలంగా ఆందోళ‌నలు చేస్తున్నారు.

సముద్రంలోకి వదులుతున్న ప‌రిశ్ర‌మ‌ల వ్యర్థాల వల్ల తమ ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని, దీనికి కారణమైన కాలుష్య కారక పరిశ్రమలను తరలించాలంటూ మత్స్యకారులు సెప్టెంబర్ 23, 24 తేదీలలో ఉప్పాడలో నిరసన చేపట్టారు.

అలాగే తీరం కోత, మత్స్యసంపద తగ్గిపోవడం, తుపాన్లు, వరదలు సమయంలో తమ బోట్లు, వలలు ధ్వంసమవ్వడం, వాటి నష్టపరిహారం వంటి అంశాలపై ఆందోళన చేశారు.

ఈ సమస్యలన్నింటిని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, అయితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే, త్వరలోనే సమస్యలపై మాట్లాడతానని పవన్ హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ వెళ్లారు. అక్కడ మత్స్యకారులతో మాట్లాడి తనకు వంద రోజుల సమయం కావాలని కోరారు.

ఉప్పాడ, జనసేన పార్టీ, మత్స్యకారులు

ఫొటో సోర్స్, X/JanaSenaParty

ఫొటో క్యాప్షన్, ఉప్పాడలో మత్స్యకారులకు హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పవన్ అధికారులకు ఏం చెప్పారు?

ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడిన పవన్ కల్యాణ్... తనకు మత్స్యకారుల సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారానికి ఒక్కడితో సాధ్యం కాదని, ఇతర అనేక శాఖలతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే వంద రోజులు సమయంలో పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కారం చూపిస్తానన్నారు.

ఉప్పాడలో మత్స్యకారులకు హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కరం కోసం ముందుగా చేయాల్సిన పనులపై ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేశారు.

  • ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయాలి.
  • పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలో పర్యవేక్షణలో పారదర్శకత వ్యవహరించాలి.
  • 100 రోజుల ప్రణాళికతో మత్స్యకారుల సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణ.
  • వ్యర్థాల శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి.
  • పారిశ్రామిక వర్గాలు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలి.

" రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయి'' అని ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు.

" తీర ప్రాంతాల వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే రసాయిన వ్యర్థాలు తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు మత్స్యకారుల్లో ఉన్నాయి. ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన చేయడానికి అదే ప్రధాన కారణం. తక్షణం ఆయా పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలి. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)