థాయ్‌లాండ్: మిస్ యూనివర్స్ కార్యక్రమంలో ఏం జరిగింది, పోటీదారులు ఎందుకు వాకౌట్ చేశారు?

ఫొటో సోర్స్, RUNGROJ YONGRIT/EPA/Shutterstock
- రచయిత, ఇయాన్ ఐక్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
థాయ్‌లాండ్ ఆతిథ్యమిస్తున్న మిస్ యూనివర్స్ కార్యక్రమం నుంచి పలువురు పోటీదారులు వాకౌట్ చేశారు. థాయ్‌లాండ్ అధికారి ఒకరు బహిరంగంగా మిస్ మెక్సికోపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈఘటన చోటుచేసుకుంది.
ప్రమోషనల్ కంటెంట్‌ను పోస్టు చేయనందుకు మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ డైరెక్టర్ నవాత్ అనేకమంది పోటీదారుల ముందు మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఫాతిమాబోష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, నవాత్ భద్రతాసిబ్బందిని పిలిపించారు. ఆమెను పోటీ నుంచి తప్పిస్తానంటూ బెదిరించారు. దీంతో ఫాతిమాబోష్ ఆ ప్రాంతాన్ని వదిలి వెళుతుండగా, ఆమెకు మద్దతుగా అనేకమంది సహ పోటీదారులు కూడా వెంట నడిచారు.
ఈ సంఘటన ప్రత్యక్ష ప్రసారమవడమే కాక, ఆన్‌లైన్‌లోనూ షేర్ అయింది. నవాత్ తీరు 'దుష్ప్రవర్తన' అంటూ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్(ఎంయూఓ) ఖండించింది. దాంతో ఆయన క్షమాపణ చెప్పారు.
బయటికి వెళ్లే వారికి కూడా బెదిరింపులు
తమ దేశాల్లో జరిగిన జాతీయ పోటీలలో విజేతలైన మిస్ యూనివర్స్ పోటీదారులు, మంగళవారం సాషెస్, గౌన్లతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వీడియోలో నవాత్ ఫాతిమా బోష్‌ను గద్దిస్తూ, ఆమెను మాట్లాడొద్దని చెపుతుండగా,అక్కడి కొందరు ఆయనకు ఎదురుతిరిగి మాట్లాడటం కనిపించింది.
బోష్‌కు మద్దతుగా పోటీదారులు బయటకు వెళ్తుండగా…" ఎవరైనా పోటీలో ఉండాలనుకునేవారు కూర్చోండి. బయటకు వెళ్లేవారు పోటీలో ఉండరు. మిగిలిన అమ్మాయిలు ముందుకు వెళతారు" అని నవాత్ అన్నారు. అయినప్పటికీ… చాలామంది మహిళలు నిల్చునే ఉన్నట్లుగా, మరికొందరు బయటకు వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది.
కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తరువాత ఫాతిమా బోష్ మాట్లాడుతూ నవాత్ తనను ‘‘మూర్ఖురాలు’’ అని సంబోధించారని, ఆరుపదుల వయసులో ఉన్న ఆయన తనతో అమర్యాదగా వ్యవహరించారని తెలిపారు.
అయితే నవాత్ ఈ ఆరోపణలను ఖండించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. బోష్‌ను ‘‘అవివేకి’’ అని పిలిచినట్లుగా పలు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, బోష్ వల్ల "నష్టం" జరిగిందని మాత్రమే అన్నానని నవాత్ చెప్పారు.

ఎంయూఓ ఏమంది?
నవాత్ ప్రవర్తనను తప్పుబట్టిన మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (ఎంయూఓ) పోటీలను తమ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ నిర్వాహకుల బృందాన్ని పంపినట్లు తెలిపింది.
"ఆతిథ్య దేశ ప్రతినిధిగా ఉండాల్సిన గౌరవాన్ని నవాత్ పూర్తిగా మర్చిపోయారు" అని ఎంయూఓ ప్రెసిడెంట్ రౌల్ రోచా ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో అన్నారు.
థాయ్ అధికారి "బోష్‌ను అవమానించి భయపెట్టే ప్రయత్నం చేశారు " అని అన్నారు.
'ఒక నిస్సహాయురాలైన మహిళను బెదిరించడానికి ఆయన సెక్యూరిటినీ కూడా పిలిచారు' అని రౌల్ రోచా అన్నారు.
పోటీలలో నవాత్ భాగస్వామ్యాన్ని వీలైనంత వరకు 'పరిమితం' చేస్తామని, లేదా పూర్తిగా తొలగిస్తామని రౌల్ రోచా ప్రకటించారు . అంతేకాదు, ఆయనపై ఎంయూఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందనీ చెప్పారు.
"మిస్ యూనివర్స్ అనేది మహిళలకు ఓ సాధికారక వేదిక. దీని ద్వారా వారి గళాలను ప్రపంచానికి వినిపించగలుగుతారని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను" అని రోచా అన్నారు.
మంగళవారం బయటకు వచ్చినవారిలో డెన్మార్క్‌కు చెందిన మిస్ యూనివర్స్ విక్టోరియా క్జాయిర్ తెయిల్విగ్ కూడా ఉన్నారు.
"ఇది మహిళల హక్కులకు సంబంధించిన అంశం" అని ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె అన్నారు.
"మరొక మహిళను అవమానించడం చాలా అగౌరవంగా ఉంది. అందుకే, నేను నా కోట్ తీసుకొని, బయటకు వచ్చాను" అని తెయిల్విగ్ చెప్పారు.
'నేనేం బొమ్మను కాదు'
"నా గళాన్ని వినిపించడానికి నేను భయపడను అనే విషయాన్ని నా దేశానికి తెలియజేయాలనుకుంటున్నాను. నా గొంతు మునపటి కంటే బలంగా ఉంది. నాకో ఉద్దేశం ఉంది, నేను చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి" అని బోష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
"మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. నన్ను తయారు చేయడానికి, నా బట్టలు మార్చడానికి నేనేం బొమ్మను కాను" అని ఆమె అన్నారు.
"ఓ కారణం కోసం పోరాడే మహిళలు, అమ్మాయిలందరి గొంతుగా ఉండేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నానని నా దేశానికి చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు బోష్.

ఫొటో సోర్స్, RUNGROJ YONGRIT/EPA/Shutterstock
క్షమించండి: నవాత్
పోటీలలో జరిగిన ఘటన వీడియో చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవాత్ చర్యలను చాలా మంది విమర్శిస్తుండగా, బోష్ స్పందించిన తీరుకు ప్రశంసిస్తున్నారు.
"నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే లేదా అసౌకర్యంగా భావిస్తే, క్షమాపణలు కోరుతున్నాను. అక్కడ ఉన్న 75 మంది పోటీదారులను నేను ప్రత్యేకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో నవాత్ చెప్పారు.
ఈ వివాదం జరిగినప్పటికీ మిస్ యూనివర్స్ పోటీ కొనసాగుతోంది. బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన వెల్‌కమ్ ఈవెంట్‌లో పోటీదారులు పాల్గొన్నారు.
నవంబర్ 21న మిస్ యూనివర్స్ విజేతకు కిరీటం అలంకరిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














