ఎలాన్ మస్క్.. బిలియనీరే కానీ

Elon Musk

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిఫనీ వెర్థీమెర్, అలిస్ డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ చాలా కాలంగా ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.

అయితే ఇప్పుడు ఆయన సంపద భారీ స్థాయిలో పెరిగింది. ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి హాఫ్ ట్రిలియనీర్.

ఇంత సంపద ఉన్నా, ఎలాన్ మస్క్ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లుగా కనిపించరు. తాను టెక్సస్‌లో 50వేల డాలర్ల( సుమారు రూ. 44.31 లక్షలు) విలువైన ఇంట్లో ఉన్నట్లు ఆయన 2021లో చెప్పారు.

చాలా మంది అనుకుంటున్నట్లు ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, విలాసవంతమైన జీవితం గడపరని మస్క్ మాజీ భార్య గ్రైమ్స్ 2022లో వ్యానిటీ ఫెయిర్‌ మేగజీన్‌కు చెప్పారు.

"ఆయన బిలియనీర్‌లాగా జీవించరు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిలా జీవిస్తారు" అని ఆమె ‘వ్యానిటీ ఫెయిర్‌’తో అన్నారు.

తాము పడుకునే పరుపు ఒక వైపు రంధ్రం పడినప్పటికీ కొత్తది కొనేందుకు ఆయన అంగీకరించలేదని గ్రైమ్స్ చెప్పారు.

అందరూ అనుకుంటున్నట్లు ఆయన ఉంటున్న ఇల్లు విలాసవంతంగా ఏమీ ఉండదు. అయితే కార్ల మీద ఆయనకున్న ప్రేమ గురించి అందరికీ తెలుసు. ఆయన దగ్గర ఉన్న కార్లలో ఒకటి సబ్‌మెరీన్‌గా మారుతుంది. మస్క్ దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి.

2022లో ఆయన తన వద్ద ఉన్న సొమ్ములో కాస్త ఖర్చు పెట్టారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెల్ ఎయిర్ ప్రాంతంలో హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు నివాసం ఉంటున్నారు.

విలాసవంతమైన పెద్ద సౌధాలను అమ్మేశారు

మస్క్ దగ్గర ఒకప్పుడు ఆకర్షణీయమైన భవనాలు, ఆస్తులు ఉండేవి. ఆయన దగ్గర ఏడు ఇళ్లు ఉండేవి. వాటి కోసం ఆయన ఏడేళ్లలో 10కోట్ల డాలర్లు ఖర్చు చేశారని 2019లో వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.

ఆ ఇళ్లన్నీ కాలిఫోర్నియాలో ప్రముఖులు నివసించే బెల్- ఎయిర్‌ ప్రాంతంలో ఒకదానికొకటి కూతవేటు దూరంలోనే ఉండేవని ఆ కథనంలో పేర్కొంది.

ఆ ఇళ్లలో స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టు, వైన్ సెల్లార్, ప్రైవేట్ లైబ్రరీ, బాల్ రూమ్‌ ఉండేవి. అందులో ఒకటి రాంచ్ హౌస్. ఈ ఇల్లు ఒకప్పుడు ప్రముఖ నటుడు జీన్ వైల్డర్‌కు చెందింది.

అయితే 2020లో మస్క్ తన మనసు మార్చుకున్నారు. "ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నాను. నాకు సొంత ఇల్లు వద్దు" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

"నాకు డబ్బులు అక్కర్లేదు. నన్ను నేను మార్స్, భూమికి అంకితం చేసుకుంటున్నాను. ఎక్కువ ఆస్తులు ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి" అని ఆ ట్వీట్‌లో రాశారు.

తన ఇళ్లను అమ్మే సమయంలో 'జీన్ వైల్డర్ ఇంటిని కూల్చివేయడం లేదా, స్వరూపాన్ని మార్చేయడం లాంటివేమీ చేయవద్దని' షరతు పెట్టారు.

ఎలాన్ మస్క్ మూడు బెడ్‌రూముల ఆ ఇంటిని వైల్డర్ మేనల్లుడు జోర్డాన్ వాకర్ పర్ల్‌మ్యాన్‌కు అమ్మారు. అది కూడా భారీ మొత్తం అప్పుగా ఇచ్చారు. అయితే ఆ సొమ్మును జోర్డాన్ చెల్లించలేకపోవడంతో ఎలాన్ మాస్క్ ఈ ఏడాది జూన్‌లో ఆ ఇంటిని తిరిగి సొంతం చేసుకున్నారు.

ఇకపై తాను 50వేల డాలర్ల విలువైన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇంట్లో ఉంటానని 2021లో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఇల్లు దక్షిణ టెక్సస్‌లో ఉంది. మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కూడా ఇక్కడ నుంచే పని చేస్తోంది. ఈ ప్రాంతం ప్రస్తుతం అధికారికంగానే ఒక నగరంగా మారింది. దీన్ని స్టార్ బేస్ అని పిలుస్తున్నారు.

"ఇది చాలా అద్భుతంగా ఉంది" అని మస్క్ తన నివాసం గురించి చెప్పారు.

తనకు ఇల్లే లేదని మస్క్ 2022లో చెప్పారు. ఎంత సంపద ఉన్నప్పటికీ తాను పెద్దగా ఖర్చు పెట్టనని చెప్పడానికి దీనిని ఉదాహరణగా చూపించారు.

"నేను స్నేహితుల ఇళ్లలో ఉంటున్నాను. టెస్లా ఇంజనీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు వెళితే స్నేహితుల ఇళ్లలో ఖాళీగా ఉన్న బెడ్‌రూమ్‌లో పడుకుంటున్నాను" అని ఎలాన్ మస్క్ మీడియా సంస్థ టెడ్ యజమాని క్రిస్ అండర్సన్‌తో చెప్పారు.

ఇదేమీ కొత్త విషయం కాదు కూడా. 2015లో గూగుల్ సీఈఓ లారీ పేజ్ కూడా రచయిత అష్లీ వాన్స్‌తో ఒకరకంగా చెప్పాలంటే మస్క్‌కు 'ఇల్లు లేదు' అని చెప్పారు.

"ఆయన ఈమెయిల్ పంపిస్తారు. అందులో 'ఈ రాత్రికి ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. మీ ఇంటికి రావచ్చా'? అని అడుగుతారు" అని లారీ పేజ్ అన్నారు.

అయితే ఎలాన్ మస్క్ కొన్నేళ్లుగా అమెరికాలో అంతటా ఆస్తులు కొంటున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే, టెక్సస్‌లో ఆయన నివసిస్తున్న ఇల్లు మాత్రం ఆయన సొంతదే అని చెప్తారు.

ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఫోర్డ్ కంపెనీకి చెందిన టీ మోడల్ కారు పేరు లిజ్జీ. ఈ కారు1900లలో అందరికీ అందుబాటులో ఉన్న వాహనంగా గుర్తింపు పొందింది

కళ్లు చెదిరే కార్ల కలెక్షన్

ఇళ్లు, స్థలాల విషయంలో మస్క్ పెద్దగా ఖర్చు చేయకపోయినా.. కార్ల విషయంలో మాత్రం ఆయన ఎక్కడా రాజీ పడటం లేదు.

టెస్లా అధిపతిగా ఆయన దగ్గరున్న కార్ల కలెక్షన్ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఆయన దగ్గర అలాంటి అద్భుతమైన గొప్ప గొప్ప కార్లు ఉన్నాయి.

అందులో ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన, అందరికీ అందుబాటులో ఉన్న వాహనంగా గుర్తింపు పొందిన ఫోర్డ్ మోడల్ టీ కారు కూడా ఉంది.

మిగతావాటి విషయానికొస్తే మస్క్ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే 1967 నాటి జాగ్వార్ కంపెనీకి చెందిన ఈ టైప్ రోడ్‌స్టెర్, 1997 నాటి మెక్ లారెన్ ఎఫ్ 1 కూడా ఉంది. ఇది ఒక ప్రమాదంలో క్రాష్ కావడంతో చాలా ఖర్చు పెట్టి బాగు చేయించి అమ్మేశారు. వీటితో పాటు టెస్లా కంపెనీ అమ్మకానికి పెట్టిన తొలి మోడల్ టెస్లా రోడ్‌స్టర్ కూడా ఉంది. 2018లో ఈ కారును ఆయన అంతరిక్షంలోకి పంపించారు.

ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్

ఫొటో సోర్స్, Screen Archives/Getty Images

ఫొటో క్యాప్షన్, వెట్ నెల్లీ కారుకు సబ్ మెరీన్ సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో మస్క్ ఈ కారును కొన్నారు.

మస్క్ కార్ల కలెక్షన్‌లో అత్యంత అసాధారణంగా కనిపించేది ఏంటంటే 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ మూవీ 'ది స్పై హూ లవ్డ్ మీ' లో బాండ్ నడిపిన లోటస్ ఎస్ప్రిట్ కూడా ఆయన వద్ద ఉండటం.

ఈ సినిమాలో ఈ కారుకు వెట్ నెల్లీ అనే మారు పేరు ఉంది. ఇది నీటిలో ప్రవేశించగానే సబ్ మెరీన్‌గా మారుతుంది. ఈ కారును 2013లో వేలం వేసినప్పుడు మస్క్ మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవంలో కూడా దీన్ని సబ్ మెరీన్‌గా మార్చాలనే లక్ష్యంతోనే ఆయన ఈ కారును కొన్నారు.

ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బీజింగ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తన సొంత ప్రైవేట్ జెట్‌లోకి ప్రవేశిస్తున్న ఎలాన్ మస్క్

ప్రైవేట్ జెట్‌లో ఆఫీసుకు..

విమానాలు కొనుగోలు చేయడం తనకు చాలా ఇష్టమని, అందుకోసం డబ్బులు ఖర్చు పెడతానని మస్క్ గతంలో అంగీకరించారు. విమానాలు కొనడం దుబారా ఖర్చు కాదని, వాటి వల్ల తాను వేగంగా పని చేయగలనని ఆయన చెప్పారు.

"నేను విమానాన్ని ఉపయోగించకపోతే, నేను పని చేసే సమయం తగ్గిపోతుంది" అని ఆయన 2022‌లో టెడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మస్క్ దగ్గరున్న ప్రైవేట్ జెట్ విమానాల్లో ఎక్కువ భాగం గల్ఫ్ స్ట్రీమ్ మోడల్‌కు చెందినవి ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది.

వాటిని ఆయన అమెరికాలో స్పేస్ ఎక్స్, టెస్లా ఆఫీసుల మధ్య తిరగడానికి, అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)