భర్తను చంపి వంటగదిలో పాతిపెట్టి, టైల్స్‌తో కప్పేసిన మహిళ.. ఏడాది తర్వాత నిజం ఎలా బయటపడిందంటే..

ఫొటో సోర్స్, Bhargav Parikh/ Getty Images
- రచయిత, భార్గవ్ పరీఖ్
- హోదా, బీబీసీ కోసం
'ఎవరైనా నా భర్త గురించి అడిగితే, ఆయన డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లారని చెబుతుంటా. నిజానికి ఆయన్ను చంపేసి, వంటగదిలోనే శవాన్ని పాతిపెట్టా. తర్వాత రెండు నెలలు అదే గదిలో వంట వండి, పిల్లలకు తినిపించేదాన్ని. ఆ తర్వాత నా లవర్‌తో కలిసి ఉండడానికి వేరేచోటుకు వెళ్లా.'
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌లో రూబీ తన నేరాన్ని అంగీకరిస్తూ ఇదంతా చెప్పినప్పుడు పోలీసులు ఆశ్చర్యపోయారు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, వంటగదిలో గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు రూబీపై ఆరోపణలు వచ్చాయి. ఆధారాలను కప్పిపుచ్చడానికి గొయ్యిలో ఉప్పు కూడా వేసి, తర్వాత దాన్ని పూడ్చివేసి అనుమానం రాకుండా పైన టైల్స్ కూడా వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంత జరిగినా ఏడాది పాటు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ రహస్యాన్ని ఛేదించారు. మొహమ్మద్ ఇజ్రాయిల్ అక్బర్ అలీ అన్సారీ అలియాస్ సమీర్ బిహారీ అనే వ్యక్తి అవశేషాలను పోలీసులు కనుగొన్నారు. రూబీతో పాటు ఆమె ప్రియుడిగా చెబుతున్న ఇమ్రాన్ వాఘేలా సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, Bhargav Parikh
అసలు కేసు ఏంటి?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,
బిహార్‌కు చెందిన సమీర్, రూబీ పెద్దలకు ఇష్టం లేకుండా వివాహం చేసుకొని 8 ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. సమీర్ తాపీ పనికి, పెయింటింగ్ పనులకు వెళ్తుండేవారు. ఆయన సొంతూరు సివాన్ జిల్లాలోని రాంపూర్ గ్రామం.
'కరోనా మహమ్మారి సమయంలో, ఇమ్రాన్ వాఘేలా అనే వ్యక్తి వారి ఇంటికి సమీపంలో మరో ఇంట్లోకి నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో రూబీ, ఇమ్రాన్ ప్రేమలో పడ్డారు. ఈ విషయం సమీర్ బిహారీకి తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. సమీర్ తనను బాగా కొట్టేవాడని, విసిగిపోయి తన లవర్ ఇమ్రాన్‌తో కలిసి చంపేందుకు ప్లాన్ చేసినట్లు రూబీ చెప్పారు' అని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ వెల్లడించారు.
ఇమ్రాన్ మొదట ఈ ప్లాన్ గురించి వరుసకు తనకు సోదరులయ్యే రహీమ్ షేక్ (22), మోసిన్ పఠాన్ (20)లకు చెప్పి, వారి సాయం తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
'రాత్రి సమీర్ నిద్రపోతున్న సమయంలో ఇమ్రాన్, రూబీ, రహీమ్, మోసిన్ కలిసి ఆయన్ను హత్య చేశారు. తర్వాత ఇంట్లోని వంటగదిలో గొయ్యి తీసి ఉప్పు వేసి మృతదేహాన్ని పాతిపెట్టారు. దానిపై టైల్స్ అంటించారు' అని పోలీసులు వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుల సమక్షంలో పోలీసులు ఆ స్థలంలో తవ్వినప్పుడు సమీర్ వెంట్రుకలు, ఎముకలు, ఇతర అవశేషాలు లభ్యమయ్యాయి. వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు.
'రూబీ ప్రియుడు ఇమ్రాన్‌కు ఫోన్ చేసినప్పుడు మొదట ఆయన ఏమీ చెప్పలేదు. కానీ సుదీర్ఘ విచారణ తర్వాత, ఆయన నేరం అంగీకరించారు' అని డీసీపీ రాజియన్ అన్నారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
నేరం ఎలా బయటపడిందంటే..
సమీర్ హత్య గురించి ఒక ఏడాదిపాటు ఎవరికీ తెలియదు. ఆయన కుటుంబం కూడా అతని గురించి ఆరా తీయలేదు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఫతేవాడీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ భర్త ఏడాది కాలంగా కనిపించట్లేదని, ఏదో అనుమానంగా ఉందని ఇన్ఫార్మర్ నుంచి క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ షకీల్ మొహమ్మద్‌కు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
'సమీర్ బిహారీ, రూబీ ఇద్దరూ బిహార్ నుంచి 8 ఏళ్ల క్రితం పారిపోయి అహ్మదాబాద్‌కు వచ్చారని మాకు తెలిసింది. సమీర్ గురించి అడిగినప్పుడు, తన భర్త డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లాడని రూబీ చెప్పారు. పొరుగువారితో మాట్లాడినప్పుడు రూబీ ఆమె ప్రియుడితో కలిసి వేరేచోట నివసిస్తుందని చెప్పారు. దీంతో మా అనుమానాలు బలపడ్డాయి' అని క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌జే జడేజా బీబీసీతో చెప్పారు.
డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజిత్ రాజియాన్ మరిన్ని వివరాలు వెల్లడించారు.
'పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని పారిపోయి వచ్చిన జంట అహ్మదాబాద్‌లో ఇల్లు కట్టుకోవడం, తాపీ పని చేసుకునే అతను పిల్లల్ని భార్యను వదిలేసి దుబాయ్‌కి వెళ్లిపోవడం నమ్మశక్యంగా అనిపించలేదు. మరోవైపు ఇమ్రాన్‌కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు' అని ఆయన తెలిపారు.
హత్య తర్వాత రెండు నెలల వరకు తాను తన పిల్లలతో కలిసి అదే ఇంట్లో నివసించానని, తన భర్తను పాతిపెట్టిన వంటగదిలోనే వంట కూడా చేశానని రూబీ పోలీసులకు తెలిపారు.
కానీ, పొరుగువారు భర్త సమీర్ గురించి ఎప్పుడూ అడుగుతుండటంతో, ఇంటిని అద్దెకు ఇచ్చి, ఇమ్రాన్‌కు మూడో భార్యగా జీవిస్తున్నట్లు రూబీ పోలీసులకు చెప్పారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
ఊరి వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవు
సమీర్ 2016లో రూబీని వివాహం చేసుకోవడానికి ఊరు విడిచి వెళ్లిపోయాక, తర్వాత అక్కడి వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదని పోలీసులకు తెలిసింది.
తాపీ పని చేస్తూ సమీర్ బాగా సంపాదించేవాడని వారి ఇంటి పొరుగున నివసించే షబీనాబెన్ అనే మహిళ చెప్పారు.
'కానీ, కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతింది. ఆర్థిక సమస్యలు వచ్చాయి. అదే సమయంలో, మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతో ఇక్కడికి వచ్చిన ఇమ్రాన్ డబ్బును జల్సాలకు వాడేవారు. అప్పుడే రూబీ, ఇమ్రాన్ ప్రేమించుకున్నారు. వీళ్ల గురించి ఇక్కడ అందరికీ తెలుసు.
సమీర్ కనిపించకుండా పోయిన తర్వాత, అతని దుస్తులను రూబీ తగలబెట్టింది. తన భర్త తనను వదిలేసి డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లాడని చెప్పుకొచ్చింది. ఇమ్రాన్ రెండో భార్యతో రూబీ తరచుగా గొడవపడేది. సమీర్ చాలాకాలంగా కనిపించట్లేదు. అతన్ని హత్య చేసినట్లు మాకు తెలియదు' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
ఇమ్రాన్ గురించి ఫతేవాడీలో నివసించే ఖాలిద్ షేక్ మాట్లాడారు.
'ఇమ్రాన్ ఒక పెయింటర్. ఆయన తన బంధువుల్ని అహ్మదాబాద్‌కు పిలిపించి వారికి పనులు ఇప్పిస్తుండేవారు. వాళ్లకు అప్పుగా డబ్బిచ్చేవారు' అని ఆయన చెప్పారు.
ఈ కేసులో మోడసాలోని కుక్రీ గ్రామానికి చెందిన ఇమ్రాన్ బంధువు రహీమ్‌ను కూడా అరెస్టు చేశారు.
ఈ హత్య కేసులో ఇమ్రాన్ బంధువు మోసిన్ పేరు కూడా బయటపడింది.
'మోసిన్‌కు ఇమ్రాన్ టెంపో ఇప్పించారు. మోసిన్‌ను డ్రైవర్‌గా నియమించారు. మోసిన్ పండుగల సమయంలో ఇంటికి వచ్చినప్పుడు ఇమ్రాన్ దయవల్లే డబ్బు సంపాదిస్తున్నానని చెప్పేవారు. చూస్తుంటే, ఇమ్రాన్ కర్మల ఫలితం మోసిన్ అనుభవిస్తున్నట్లు ఉంది' అని వారు బంధువుల్లో ఒకరు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














