తలసీమియా బాధిత చిన్నారులకు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించారు.. అయిదుగురు పిల్లలకు సోకిన ఎయిడ్స్.. ఎవరు బాధ్యులు?

ఫొటో సోర్స్, Yousuf Sarfaraz
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలమ్
- హోదా, బీబీసీ కోసం
తలసీమియాతో బాధపడుతున్న పిల్లలకు హెచ్‌ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించిన కేసు ఝార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని ప్రభుత్వ సదర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
ఎనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసున్న, తలసీమియాతో బాధపడుతున్న అయిదుగురు పిల్లలకు హెచ్‌ఐవీ సోకినట్లు పశ్చిమ సింగ్‌భూమ్ కలెక్టర్ చందన్ కుమార్ బీబీసీకి ధ్రువీకరించారు.
ఈ కేసులో చైబాసా సివిల్ సర్జన్, హెచ్‌ఐవీ యూనిట్ ఇన్‌చార్జ్ డాక్టర్, సంబంధిత టెక్నీషియన్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.
బాధిత పిల్లల కుటుంబాలకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రూ.2 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు.
రక్త మార్పిడి కారణంగా హెచ్ఐవీ సోకిన ముగ్గురు తలసీమియా బాధిత పిల్లలు ప్రస్తుత స్థితిగతులను తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఇన్‌ఫెక్షన్ సోకిన రక్త మార్పిడి వల్ల మంఝారి బ్లాక్‌కు చెందిన ఏడేళ్ల శశాంక్ (పేరు మార్చాం) హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలారు.
ఈ విషయం తెలియడంతో అక్టోబర్ 30న ఇంటి యజమాని చైబాసాలో వారు అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించారు.
శశాంక్ ఇక్కడే ఉంటూ చికిత్స పొందుతూ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకునేవారు.


ఫొటో సోర్స్, Yousuf Sarfaraz
'ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది'
''మీ కుమారుడికి హెచ్‌ఐవీ సోకింది. కాబట్టి ఇల్లు ఖాళీ చేయండి అని ఇంటి ఓనర్ చెప్పారు' అని శశాంక్ తండ్రి దశరథ్ (పేరు మార్చాం) తెలిపారు.
''ఆయనకు నచ్చజెప్పడానికి నేను చాలా ప్రయత్నించా. కానీ, ఆయన ఇల్లు ఖాళీ చేయాలంటూ మొండిపట్టు పట్టారు. దీంతో నేను దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంఝారి బ్లాక్‌లోని నా ఊరికి తిరిగొచ్చేశాను'' అని ఆయన వివరించారు.
తలసీమియా కారణంగా నెలకు రెండుసార్లు శశాంక్‌కు రక్తం ఎక్కించాల్సి వస్తుంది. దీనికోసం వారు నెలకు రెండుసార్లు సదర్ ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది.
'ఊరుకు తిరిగొచ్చాక నా కొడుకుకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు పొందడం సవాలుగా మారింది. వాడికి మంచి విద్య కూడా అందట్లేదు' అని ఆయన అన్నారు.
కేవలం వరి పంటపైనే ఆధారపడిన రైతు దశరథ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
'తలసీమియాతోనే నా బిడ్డ బాధపడేవాడు. ఇప్పుడు హెచ్‌ఐవీ కూడా సోకడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Yousuf Sarfaraz
చిన్న కూతురికి ఎయిడ్స్ పాజిటివ్ తేలడంతో...
హాట్‌గహ్మారియా బ్లాక్‌కు చెందిన తలసీమియా రోగి దివ్య (పేరు మార్చాం) కూడా ఏడేళ్ల వయసులో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా మారారు.
తన మిగతా ఇద్దరు పిల్లలను ఈ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో దివ్య తల్లి సునీతా (పేరు మార్చాం) తన పుట్టింటికి పంపించేశారు.
దివ్యకు తలసీమియా ఉన్నట్లు నిర్ధరణ అయినప్పటి నుంచి రక్త మార్పిడి కోసం నెలకు రెండుసార్లు దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న సదర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని సునీత చెప్పారు.
'మీ అమ్మాయికి తప్పుడు రక్తం ఎక్కించారని, దాని కారణంగానే ఆమె హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిందని అక్టోబర్ 4న ఒక ఆరోగ్య కార్యకర్త నాకు చెప్పారు' అని సునీత వెల్లడించారు.
'హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలితే దివ్య భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మొదట్లో దాని తీవ్రత నాకు అర్థం కాలేదు. కానీ, ఇప్పుడు క్రమంగా ఎయిడ్స్ తీవ్రత గురించి నాకు అర్థం అవుతోంది' అని ఆమె రోదిస్తూ చెప్పారు.

ఫొటో సోర్స్, Yousuf Sarfaraz
అమ్మకు సర్వస్వం ఆరున్నరేళ్ల శ్రేయ
ఝీక్పానీ బ్లాక్‌లోని ఒక గ్రామంలోని ఒక పూరింటిలో కూతురు శ్రేయతో తల్లి శ్రద్ధ కలిసి జీవిస్తున్నారు. (వీరిద్దరి పేర్లు మార్చాం).
మట్టి గోడలు, గడ్డి పైకప్పుగా ఉన్న ఆ ఇంట్లో వారిద్దరే ఉంటున్నారు.
భర్త మరణం తర్వాత ఆరున్నరేళ్ల కూతురు శ్రేయ తన సర్వస్వంగా జీవిస్తున్నారు శ్రద్ధ.
శ్రేయకు ప్రతి నెలా రక్త మార్పిడి కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైబసా సదర్ ఆసుపత్రికి శ్రేయ తీసుకెళ్తారు.
ఇప్పుడు శ్రేయ తలసీమియాతో పాటు ఎయిడ్స్ బారిన పడటంతో ఆమె కష్టాలు మరింత పెరిగాయి. శ్రద్ధకు ఎయిడ్స్ గురించి పెద్దగా ఏమీ తెలియదు.
'హెచ్‌ఐవీ అనేది కచ్చితంగా ఏదో పెద్ద వ్యాధే అయి ఉంటుంది. అందుకే ఆసుపత్రి వాళ్లు తాము చేసిన తప్పు దిద్దుకోవడానికి నాకు 2 లక్షల చెక్ ఇచ్చారు' అని శ్రద్ధ అన్నారు.

ఈ విషయం ఎలా బయటకు వచ్చింది?
అక్టోబర్ చివర్లో శశాంక్‌కు హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దశరథ్‌ను స్థానిక మీడియా సంప్రదించడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
''నా కొడుకుకు రక్తం ఎక్కించే ముందు అక్టోబర్ 18న డాక్టర్లు హెచ్‌ఐవీ టెస్ట్ చేశారు. పాజిటివ్ వచ్చినట్లు 20న చెప్పారు. ఆ తర్వాత నేను, నా భార్య హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నాం. మాకు నెగెటివ్ వచ్చింది. ఇన్‌ఫెక్షన్ ఉన్న రక్తం ఎక్కించం వల్ల నా కొడుకుకు పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు' అని దశరథ్ వివరించారు.
దీని గురించి దశరథ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్థానిక మీడియా ఆయన్ను సంప్రదించింది. తర్వాత ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని దర్యాప్తుకు ఆదేశించింది.
తన కుమారుడు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ తమను కలవడానికి వస్తున్నట్లు ఆయనకు తెలిసింది.
గృహనిర్మాణం, రేషన్, టాయిలెట్ మొదలైన అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను బాధిత కుటుంబాలకు అందిస్తామని కలెక్టర్ చందన్ కుమార్ చెప్పారు. బాధిత పిల్లల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, X/@IrfanAnsariMLA
బాధిత కుటుంబాల అసంతృప్తి
దశరథ్ కోపం, దు:ఖంతో ఈ ఘటన గురించి మాట్లాడారు.
'జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. ఝార్ఖండ్‌లో ఇలాగే జరుగుతుంది. పేద పిల్లలకు అయితే రూ. 2 లక్షలు ఇస్తారు. అదే మరి మంత్రి కొడుకుకు ఇలాగే జరిగితే వారికి కోట్లు అందేవి. పేదోళ్ల జీవితం విలువ కేవలం రెండు లక్షలేనా? 'అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు?
'ప్రభుత్వం సేవ చేయాలనుకుంటే, మాకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. పిల్లలకు పెద్ద ఆసుపత్రిలో చికిత్స అందించాలి. తప్పు ప్రభుత్వ ఆసుపత్రిది అయినప్పడు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి' అని ఆయన అన్నారు.
'పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా తలసీమియా జోన్. ప్రస్తుతం 59 మంది తలసీమియా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి నెలకు రెండుసార్లు రక్తం అవసరం. దీని సరఫరా దాతలపై ఆధారపడి ఉంటుంది' అని ఆరోగ్య మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ అన్నారు.

ఫొటో సోర్స్, Yousuf Sarfaraz
ఎవరైనా దాతకు హెచ్‌ఐవీ ఉందా?
అసలు ఆసుపత్రిలోకి ఇన్‌ఫెక్షన్ ఉన్న రక్తం ఎలా వచ్చిందనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న?
'2023 నుంచి 2025 మధ్య జిల్లాలో మొత్తం 259 మంది దాతలు రక్తదానం చేశారు. వీరిలో 44 మందిని గుర్తించాం. ఇందులో నలుగురు దాతలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మిగతా దాతల గురించి దర్యాప్తు జరుగుతోంది' అని చందన్ కుమార్ తెలిపారు.
ఎవరు బాధ్యులు?
ఈ విషయంలో సివిల్ సర్జన్, ఇతర అధికారుల నిర్లక్ష్యం ఉందని, కాబట్టి వారే దోషులని ఝార్ఖండ్ మాజీ ఆరోగ్య మంత్రి రామచంద్ర చంద్రవంశీ అన్నారు.
ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని ఝార్ఖండ్ ప్రత్యేక ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ నేహా అరోరా చెప్పారు.
మరోవైపు, లైసెన్స్ లేకుండా బ్లడ్ బ్యాంకులు ఎందుకు నడుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఝార్ఖండ్ హైకోర్టు ప్రశ్నించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














