అరుణాచలం: ‘కార్తీక దీపం’ రోజున 40 లక్షల మంది వస్తారని అంచనా.. అంత రద్దీని ఈ ఆలయం తట్టుకోగలదా? తెలుగు భక్తులు ఏమంటున్నారు?

- రచయిత, విజయానంద్ అర్ముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రోజున అరుణాచలాన్ని సందర్శిస్తుంటారు.
నవంబర్ 4న పౌర్ణమి రోజున 5 లక్షల మందికి పైగా భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారని తమిళనాడు దేవాదాయ శాఖ తెలిపింది.
రాబోయే కార్తీక దీపం పండుగ రోజు(డిసెంబర్ 4న) దాదాపు 40 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని ఆలయ పరిపాలనాయంత్రాంగం అంచనా వేసింది.
మరి అరుణాచలం ఆలయంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? రద్దీని ఎదుర్కోవడానికి తిరువణ్ణామలై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల గురించి బీబీసీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఏం తేలింది?

గిరి ప్రదక్షిణ మార్గం ఎలా ఉంది?
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం చుట్టూ ఉన్న కొండ దాదాపు 2,600 అడుగుల ఎత్తు, 14 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది. పౌర్ణమి రోజున భక్తులు చేసే గిరివలం ఇక్కడ ఒక ప్రధాన కార్యక్రమం.
నవంబర్ 4న ప్రారంభమైన పౌర్ణమి గిరివలం మరుసటి రోజు రాత్రి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గిరివలం మార్గాల్లో, ధార్మిక సంస్థలు, కొన్ని ఆశ్రమాల నిర్వాహకులు భక్తులకు ఆహారం అందిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
అయితే, భక్తులు తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను సరిగ్గా తొలగించలేదు. గిరివలం మార్గం చుట్టూ చాలా చోట్ల చెత్త పేరుకుపోయింది.

‘టాయిలెట్లు సరిపడా లేవు.. దారంతా రాళ్లు’
జిల్లా యంత్రాంగం కొన్ని చోట్ల తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించింది. అయితే, సరిపడా సౌకర్యాలు లేవని చెన్నైలోని కొళత్తూరు నివాసి నరసింహారావు అన్నారు.
చెన్నైలో బియ్యం వ్యాపారి అయిన ఆయన పౌర్ణమి గిరివలం కోసం తిరువణ్ణామలైకి వచ్చారు. "మహిళలకు సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవు. టాయిలెట్లు, మంచి నీటి సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఆయన అన్నారు.
"మరుగుదొడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో చిన్న చిన్న రాళ్లు ఉండడంతో నడవడం కష్టంగా ఉంది" అని బెంగళూరుకు చెందిన న్యాయవాది రాధాకృష్ణన్ అన్నారు. ఆలయం వద్ద, ఆలయానికి వెళ్లే మార్గాలలో రద్దీ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు.

'చాలా కిలోమీటర్లు నడవాలి'
కిక్కిరిసిన జనాన్ని నియంత్రించడానికి, భక్తులను తీసుకెళ్లే వాహనాలను ఆలయానికి 2 కిలోమీటర్ల ముందు ఆపివేశారు. అక్కడి నుంచి, వారు ఆటోలలో లేదా నడిచి వెళ్ళాలి. దీంతో ప్రజలు పోలీసులతో వాదనకు దిగారు.
"ముఖ్యమైన రోజుల్లో ఆలయానికి చేరుకోవడానికి తగినన్ని బస్సులు లేవు. చాలా కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అంతేకాకుండా దర్శనానికి చాలా ఆలస్యమవుతోంది" అని నరసింహారావు అన్నారు.
"ఆలయం లోపల తాగునీరు సహా సౌకర్యాలు ఉన్నాయి. అయితే, పూజల నిర్వహణ చాలా ఆలస్యమవుతోంది. ఆలయ పరిపాలనాయంత్రాంగం దానిని సరిచేయాలి" అని విశాఖపట్నానికి చెందిన శ్యామల బీబీసీతో అన్నారు.

'భోజనం, పాలు దొరకడం లేదు'
"గిరివాల రోజుల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ పిల్లలు, గర్భిణులకు తగినంత సౌకర్యాలు లేవు" అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రివేణి అన్నారు.
"నేను గిరివలానికి రావడం ఇది వరుసగా మూడోసారి. నా బిడ్డ వయసు ఏడాది. బిడ్డకు అవసరమైన ఆహారం, పాలు దొరకడం కష్టమవుతోంది" అని ఆమె బీబీసీతో చెప్పారు.
"గర్భిణులు, పిల్లలు ఉన్నవారికి పూజల నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఆమె అన్నారు.
ఆలయంలోని రాజగోపురం ముందు ఉన్న రోడ్డుపై నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేయడం ప్రధాన కార్యక్రమం. దీని కోసం రోడ్డులోని ఒక భాగంలో పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు. దీని కారణంగా ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది.
ఆలయ సిబ్బంది దానిపై నీళ్లు పోయడంలో బిజీగా ఉన్నారు.

‘గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది’
బీబీసీ సిబ్బంది ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు, భక్తులు పొడవైన క్యూలో వేచి ఉన్నారు "ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు అన్నదానం చేసే క్యూలో అక్రమాలు జరుగుతున్నాయి" అని కొందరు భక్తులు ఆరోపించారు.
"ఆహారం, దర్శనం కోసం ప్రత్యేక క్యూలు ఉన్నప్పటికీ వాటిలో ఎవరూ సరిగ్గా నిల్చోవడంలేదు. ఇది గందరగోళానికి దారితీస్తోంది. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది" అని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సురేంద్ర బాబు అన్నారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏమన్నారంటే..
తమిళనాడు ‘హిందూ మత - ధార్మిక దేవాదాయ శాఖ’ అసిస్టెంట్ కమిషనర్ రామసుబ్రమణ్యం ఈ ఆరోపణలను ఖండించారు. ఆలయ సముదాయంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో బీబీసీ ఆయనను కలిసింది.
"భక్తుల కోసం తగినంత ఆహారం, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాం. రద్దీని నియంత్రించడానికి పోలీసులు, రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అయితే, గిరివలంలో ఎక్కువగా పాల్గొనేది తమిళులే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

కార్తీక దీపం రోజున ధార్మిక శాఖ బాధ్యత ఏంటి?
గిరివలం సహా ముఖ్యమైన రోజులలో దేవాదాయ శాఖ ఒక్కటి మాత్రమే అన్ని వ్యవహారాలను పర్యవేక్షించలేదని, జిల్లా యంత్రాంగం పోలీసు, రవాణా శాఖలు సహా ఇతర విభాగాలతో సంప్రదింపులు జరుపుతోందని రామసుబ్రమణ్యం చెప్పారు.
భక్తుల భద్రత కోసం ఆలయ ప్రాంగణంలో వందకు పైగా నిఘా కెమెరాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో 70 కి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
"రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఐదు లక్షలకు పైగా ప్రజలు ఉంటారు. రాబోయే ‘కార్తీక దీపం’ డిసెంబర్ 4న దాదాపు 40లక్షలమంది వచ్చే అవకాశం ఉందని అంచనా" అని ఆయన అన్నారు.

భక్తులను అడ్డుకోవడంపై హైకోర్టులో కేసు
తిరువణ్ణామలైలోని కొండ, కొండ మార్గాలపై ఆక్రమణలు పెరగడం వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతోందని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.
"పర్వతం చుట్టూ నిర్మించిన భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు చట్టవిరుద్ధంగా కల్పించారు. వాణిజ్య సంస్థల విస్తరణ కారణంగా గిరివల మార్గం కలుషితమైంది" అని కేసు దాఖలు చేసిన న్యాయవాది యానై రాజేంద్రన్ ఆరోపించారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు, రిటైర్డ్ జస్టిస్ గోవిందరాజన్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కొండ, పరిసర ప్రాంతాల్లో సుమారు 3,430 ఇళ్లు, 154 వాణిజ్య భవనాలు అక్రమంగా నిర్మించారని జూన్ 25న గోవిందరాజన్ కమిటీ మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
పర్వతం చుట్టూ ఉన్న సుమారు 554 ఎకరాల విస్తీర్ణాన్ని రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించాలని పర్యవేక్షణ కమిటీ సూచించింది.
కమిటీ నివేదికను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు తదుపరి చర్యలపై నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, కేసును రెండు నెలల పాటు వాయిదా వేశారు.
కొండ, కొండ మార్గాలపై నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన నివాస, వాణిజ్య నిర్మాణాలకు విద్యుత్ బోర్డు, స్థానిక ప్రభుత్వాలు నోటీసులు జారీ చేస్తున్నాయి.

'సమన్వయం తప్పనిసరి'
"అయితే, కొండలలో నివసించే ప్రజలు ఆ ప్రదేశాల నుంచి బయటకు వెళ్లబోమని నిరసన తెలుపుతున్నారు. తిరువణ్ణామలైలోని కొండలు, చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించారు. దీంతో గిరివలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి" అని న్యాయవాది యానై రాజేంద్రన్ అన్నారు.
అటవీ శాఖ, ప్రజా పనుల శాఖ, ధార్మిక శాఖలు కలిసి పనిచేస్తేనే ఆక్రమణలను తొలగించగలరని రాజేంద్రన్ అంటున్నారు. "ప్రభుత్వ శాఖలు దీన్ని సరిచేస్తేనే లక్షలాది మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతారు" అని ఆయన చెప్పారు

' పనులు వేగంగా జరుగుతున్నాయి' - కార్పొరేషన్ మేయర్
ఈ విషయమై తిరువణ్ణామలై కార్పొరేషన్ మేయర్ నిర్మలా వెల్మారన్‌తో బీబీసీ మాట్లాడింది.
"కోర్టు ఆదేశాల ప్రకారం ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గిరివలపాద చుట్టూ దాదాపు కోటిరూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావస్తోంది" అని మేయర్ చెప్పారు.
భక్తుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక బస్ స్టాప్‌లు, టాయిలెట్ సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నామని చెబుతున్న మేయర్ నిర్మల వెల్మారన్, "ముఖ్యమైన రోజుల్లో రద్దీని నియంత్రించడానికి అన్ని శాఖల సహకారంతో పనులు జరుగుతున్నాయి" అని సమాధానమిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














