అమెరికాలో గందరగోళం, వేల విమానాల రద్దు.. షట్‌డౌన్ ప్రభావంలో విమానయాన రంగం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్వాసీ గ్యాంఫీ అసైదు, అనా ఫగై, నర్దీన్ సాద్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికాలో శుక్రవారం ఒక్క రోజే 5,000కు పైగా విమాన సర్వీస్‌లు రద్దు, ఆలస్యమయ్యాయి.
షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ తగ్గించుకోవాలని విమానయాన సంస్థలకు సూచించిన తొలి రోజే వేల సంఖ్యలో విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి.
ప్రభుత్వ నిధుల ప్రతిష్టంభన కారణంగా జీతాలు రాకపోయినా విధులకు వస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఇతర ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు 40 పెద్ద విమానాశ్రయాల్లో కొత్త నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
అక్టోబర్‌లో షట్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో పని చేసే అనేక మంది ఉద్యోగులు రోజు గడవడం కోసం వేరే పనులు చేసుకుంటున్నారు, మరికొందరు అనారోగ్య కారణాలతో విధులకు రావడం లేదు.

ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం 4 శాతం విమాన సర్వీసులను తగ్గించాలని.. వచ్చే వారం చివరి నాటికి దీన్ని 10 శాతానికి పెంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలతో న్యూయార్క్, లాస్ ఏంజెలస్, షికాగో, వాషింగ్టన్ డీసీ లాంటి ప్రముఖ నగరాల్లో విమానాల రాకపోకలు తగ్గాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులు కీలకం
విమానయానానికి సంబంధించి అత్యంత కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులకు షట్‌డౌన్ కారణంగా జీతాలు అందడం లేదు. అమెరికా చరిత్రలోనే ఇది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది.
నెలకు పైగా జీతాలు లేకుండా పని చేయాల్సి రావడంతో ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యం పాలయ్యారని, మరికొందరు రోజు వారీ అవసరాల కోసం వేరే ఉద్యోగాలు చేస్తున్నారని యూనియన్ల ప్రతినిధులు తెలిపారు.
శుక్రవారం అమల్లోకి వచ్చిన ఆదేశాల వల్ల అంతర్జాతీయ సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదని, అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉందని ఆ దేశ రవాణా శాఖమంత్రి సీన్ డఫీ బీబీసీతో చెప్పారు.
విమానాశ్రయాల్లో గందరగోళం ఇప్పుడే మొదలైందని, విమాన సర్వీసుల్లో కోతలు 20శాతానికి చేరతాయని ఆయన ‘ఫాక్స్ న్యూస్’తో అన్నారు.
రాజకీయ ప్రతిష్టంభనలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పావులుగా మారారని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిక్ డేనియల్స్ అన్నారు.
షట్‌డౌన్ ప్రభావం విమాన రాకపోకలతో పాటు ఆహార సహాయ కార్యక్రమాలపైనా పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్‌పోర్టుల్లో పొడవాటి క్యూ లైన్లు
అత్యవసర ఆదేశాలతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఒత్తిడితో పరుగులు పెడుతూ కనిపించారు. విమాన రాకపోకల్ని సూచించే బోర్డుల్లో ఎక్కువగా క్యాన్సిల్డ్ అనే పదం కనిపించింది.
ఎక్కువగా దేశీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు సందేశాలు పంపాయి.
పలు సంస్థలు సిబ్బందికి కూడా మార్గదర్శకాలు జారీ చేశాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి పంపిన మెమోను బీబీసీ పరిశీలించింది.
సీఈవో స్కాట్ కిర్బీ ఇచ్చిన మెమోలో పేర్కొన్న దాని ప్రకారం.. విమాన ప్రయాణం రద్దయితే ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఒకవేళ ప్రయాణం రద్దు కాకపోయినా ప్రయాణికులు కోరితే పూర్తి రీఫండ్ చేస్తారు. నాన్ రీఫండబుల్ టికెట్లు, బేసిక్ ఎకానమీ టికెట్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ ప్రయాణ తేదీ మార్చుకోవాలనుకున్నా ఆరోజు ఉన్న అధిక ధరలు వర్తించవు. అంటే, ఆరోజు టికెట్ ధర ఎక్కువైనా అదనపు చార్జీలు వర్తించవు.
డెల్టా సంస్థ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తోంది.
తనకు విమాన సంస్థ నుంచి మెసేజ్ వచ్చే సమాయానికి తాను రీగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఉన్నానని, అయితే అట్లాంటా వెళ్లాల్సిన తన విమానం రద్దయిందని జో సలివాన్ అనే ప్రయాణికుడు చెప్పారు. అట్లాంటాలో జరుగుతున్న తన కజిన్ పెళ్లికి వెళ్లేందుకు తాను బయల్దేరినట్లు ఆయన వివరించారు.
"నేనిప్పుడు వేరే విమానం బుక్ చేసుకోవాలి. అది కూడా కరెక్ట్ సమయానికి వెళితే పెళ్లికి 2 గంటల ముందు అక్కడకు చేరుకుంటాను. ఇప్పుడిక ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడమే" అని ఆయన అన్నారు.
విమాన సర్వీసులు రద్దు కావడంతో కొంతమంది తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వేరే మార్గాల్ని వెదుక్కుంటున్నారు. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో 300 డాలర్లతో రైలు టిక్కెట్ కొన్నానని, విమానంలో గంట ప్రయాణానికి బదులు రైల్లో 7 గంటలు ప్రయాణించాలని ఓ మహిళ బీబీసీతో చెప్పారు.
న్యూయార్క్ వెళ్లాల్సిన తన విమానం రద్దు కావడంతో తాను మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్నట్లు మీకిన్స్ అనే మహిళ చెప్పారు.
"న్యూయార్క్‌లో మాకు చాలా పనులు ఉన్నాయి. మేము వెళ్లకపోతే అంతా గందరగోళంగా మారుతుంది" అని ఆమె అన్నారు.
అరినా జకోవిచ్ ఇటీవలే ఉద్యోగంలో చేరారు. షట్‌డౌన్ కారణంగా ఆమెకు జీతం రావడం లేదు.
"నేను ఇటీవలే గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇది నా తొలి ఉద్యోగం. నాకు లక్కీ ఛాన్స్ వచ్చిందని అనుకున్నాను. నా జీవితం సెటిల్ అవుతుందని అనుకున్నాను" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
షట్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది?
38 రోజుల షట్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై స్పష్టత లేదు.
షట్‌డౌన మొదలైన తొలి వారాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య చాలా తక్కువగా చర్చలు జరిగాయి.
అయితే ప్రస్తుతం రెండు వైపులా దీన్ని ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
విమానాల రాకపోకలకు సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కున్న ప్రాధాన్యం దృష్ట్యా అందులో ఉద్యోగులు జీతం లేకుండా పని చేయడం సరైనది కాదని బెన్ సౌసైడా అనే ప్రయాణికుడు చెప్పారు.
"నేను విమానంలో ప్రయాణించే ప్రతిసారీ నా జీవితం వారి చేతుల్లో పెడుతున్నాను. అయితే ప్రస్తుతం నా జీవితం జీతం లేకుండా పని చేస్తున్న ఉద్యోగుల్లో ఉంది. వారిపై చాలా ఒత్తిడి ఉంది" అని ఆయన చెప్పారు
"మమ్మల్ని రక్షించడానికి వాళ్లు చాలా ఉన్నతంగా పని చేయాలి. వాళ్ల మీద ఉన్న ఒత్తిడి చాలా తీవ్రమైనది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి" అని సౌసెడా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














