సెకండ్ హ్యాండ్ వాహనంతో కేసుల్లో ఇరుక్కోకుండా ఉండటం ఎలా? ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ అంటే ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పవన్ కుమార్.డి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఐ20 కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఈ కారు కీలకంగా మారింది.
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సుబాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐ20 కారులో పేలుడు సంభవించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
ఈ కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కారు ఒకరి నుంచి ఇంకొకరికి పలుమార్లు చేతులు మారినట్లు కూడా రిపోర్ట్ చేశాయి.
ఈ నేపథ్యంలో అసలు సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి?
రిజిస్ట్రేషన్ పద్దతి ఏంటి?
కేసుల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.


ఫొటో సోర్స్, Getty Images
కొనేటపుడు మొదట చేయాల్సిందేంటి?
దేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మధ్య తరగతివారిలో చాలామంది సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తుంటారు.
అయితే, ఇలా కొనేవారు ముందు దాని మెకానికల్, ఎలక్ట్రిక్ కండీషన్ ఎలా ఉందో ఓ మెకానిక్ ద్వారా చెక్ చేయించుకోవాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి. రమేష్ బీబీసీతో చెప్పారు.
"చలాన్ల కోసం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే, కేసులు ఏమైనా ఉన్నాయో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తెలుసుకోవచ్చు" అని అన్నారు.
"అలాగే ఆ కారు మీద ఏమైనా చలాన్లు గానీ, కేసులుగానీ ఉన్నాయో, ఫైనాన్సింగ్ పూర్తయిందో లేదో చెక్ చేయించుకోవాలి. వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో సరిచూసుకోవాలి" అని సూచించారు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్.
'థర్డ్ పార్టీని సంప్రదిస్తే ఉత్తమం'
వాహనం కొనేవారు ఎవరి దగ్గర కొంటున్నాం అనేది చెక్ చేసుకోవాలని, అలాగే ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటివి చూసుకోవాలని విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ బీబీసీకి చెప్పారు.
"నేరుగా కొనడం కంటే, థర్డ్ పార్టీ ద్వారా కొంటే మంచిది. నేరుగా కొన్నట్లయితే.. ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకువచ్చి అమ్మే అవకాశాలు ఉంటాయి. అదే థర్డ్ పార్టీ ద్వారా అయితే దాని తయారీ సంవత్సరం, ఓనర్ వంటి వివరాలను మధ్యలో ఉండేవారు చెక్ చేసుకుంటారు" అని అన్నారు.
అలాగే వాహనం ఆధార్ కార్డుతో ఉందో లేదో చూసుకోవాలన్నారు ఎస్పీ దామోదర్. వాహనం అమ్మేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.
"తెలిసిన వారికి అమ్మడం, లేదా ఏదైనా ఏజెన్సీకి అమ్మడం మంచిది. ఎందుకంటే.. కొంతమంది మనకు డబ్బులు ఇచ్చేసి సంతకం పెట్టించుకుని మన వాహనాన్ని తీసుకువెళ్తారు. అలా చేయకూడదు. వారి ఆధార్ కార్డుతో సహా అన్ని వివరాలు నిర్ధరించుకోవాలి. ఏజెన్సీకి అమ్మినట్లయితే.. వాళ్లివన్నీ ధ్రువీకరించుకుంటారు కాబట్టి ఇబ్బందులు ఉండవు" అని ఎస్పీ దామోదర్ అన్నారు.
వాహనం డబ్బుల చెల్లింపు ప్రక్రియ పూర్తి కాగానే వెహికిల్‌కు సంబంధించిన పత్రాలను ఒకరికొరు మార్చుకుంటారు. దాంతో ఆ ప్రక్రియ అక్కడితో ముగిసిపోయినట్లు భావిస్తారు.
కానీ, " మోటార్ వాహనాల చట్టం(సవరణ), 2019 కింద, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్, 1989 ప్రకారం ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ జరిగినప్పుడే ఈ ప్రక్రియ ముగిసినట్లు'' అని జేటీసీ సి. రమేశ్ తెలిపారు.
లేదంటే.. ఆ వాహనం ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు అమ్మినవారు లేదా కొన్నవారూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోటార్ వాహనాల చట్టం(సవరణ) 2019 సెక్షన్ 50, సెంట్రల్ మోటార్ వాహనాల రూల్స్ 1989లోని 55, 56, 57వ నిబంధనలు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ గురించి చెబుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ ?
ట్రాన్స్‌ఫర్ ఆప్ ఓనర్‌షిప్ లేదా యాజమాన్య బదిలీ. అంటే.. ఒకరి పేరు మీద ఉన్న వాహన రిజిస్ట్రేషన్‌ను మరొకరి పేరు మీదుగా మార్చడం.
ఇందులో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ అయితే పర్మిట్ కూడా మరొకరి పేరు మీదుగా మార్పు జరుగుతుందని రమేష్ బీబీసీకి తెలిపారు.
ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ మూడు రకాలుగా ఉంటుందని ఆయన చెప్పారు.
- ఎవరైనా అమ్మితే కొనుగోలు చేసినప్పుడు,
- వాహన యజమానికి మరణించినప్పుడు,
- బహిరంగ వేలంలో వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మార్చుకోవాలి?
ఒక వ్యక్తి తన వాహనానికి సంబంధించి యాజమాన్యాన్ని వేరే వ్యక్తికి బదిలీ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఫామ్ 29 ద్వారా ఆ విషయాన్ని ఆర్‌టీఓ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని అమ్మేవారు సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరివాహన్ పోర్టల్ మార్గదర్శకాల ప్రకారం ఒకే రాష్ట్రంలో ఈ యాజమాన్య బదిలీ చేసుకుంటున్నట్లయితే.. 14 రోజుల్లోపు ఫామ్ 30ని అనుసరించి ట్రాన్స్‌ఫరీ(బదిలీ చేసుకునే వ్యక్తి) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వేరే రాష్ట్రంలో వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు, ఫామ్ 30 అనుసరించి ట్రాన్స్‌ఫరీ 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనిపై ట్రాన్స్‌ఫరర్, ట్రాన్స్‌ఫరీ, ఫైనాన్షియర్ సంతకం చేయాల్సి ఉంటుంది.
ఫామ్-30తో దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు ప్రధానంగా ఉండాలి.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- ఇన్సూరెన్స్ సర్టిఫికేట్
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
వేరే రాష్ట్రం నుంచి బదిలీ చేసుకోవాలనుకున్నప్పుడు.. పోలీస్ క్లియరెన్స్‌తో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ)తో కూడా అవసరం. ఆర్‌టీఓ పరిధి మారినప్పుడు కూడా ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్‌ఓసీ కోసం ఫామ్ 28 ద్వారా ఆర్‌టీఓకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
యజమాని చనిపోతే రిజిస్ట్రేషన్ ఎలా?
యజమాని చనిపోయాక ఈ యాజమాన్య హక్కులు ఆ వ్యక్తి చట్టపరమైన వారసులకు అనుకూలంగా బదిలీ అవుతాయని సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989లోని 56వ నిబంధన చెబుతోంది.
వాహన యజమాని మరణించిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నవారు మూడు నెలలపాటు దాన్ని తనకు బదిలీ చేసినట్లుగా ఉపయోగించవచ్చు. అయితే… యజమాని మరణించిన 30 రోజుల్లోపు యజమాని మరణించారని, అలాగే తాను ఆ వాహనాన్ని వినియోగించడానికి గల ఉద్దేశాన్ని రిజిస్టరింగ్ అథారిటీకి తెలియజేయాల్సి ఉంటుంది.
ఓనర్ చనిపోయినప్పుడు ఆ వాహనాన్ని తమ పేరు మీదుగా మార్చుకోవడానికి ఫామ్ 31ని ఉపయోగించి మూడు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్(పర్మిట్ ఒకవేళ ఉన్నట్లయితే)తో పాటు యజమాని డెత్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక బహిరంగ వేలంలో వాహనాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఫామ్ 32ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది 30 రోజుల్లోపు జరగాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో వేలంలో కొనుగోలు చేసినట్లు ధ్రువీకరణ పత్రం, వేలం నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నాక..
తెలంగాణలో అయితే ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లే ముందు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఫీజు, సర్వీసు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రమేశ్ తెలిపారు.
ఇదే మనం దరఖాస్తు చేసుకున్నరోజునే ఈ అనుమతుల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కానీ, డాక్యుమెంట్స్ రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పారు.
ఇదే ప్రక్రియ అన్ని రకాల వాహనాలకు అంటే కార్లకు, బైకులకు ఇతర కార్గో వాహనాలకు వర్తిస్తుంది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ స్టేటస్‌ను పరివాహన్ పోర్టల్‌లో కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రక్రియ రాష్ట్రాలను బట్టి వేరువేరుగా ఉంటుంది.
ట్రాన్స్‌ఫర్ చేయకపోతే ఏమవుతుంది?
ప్రమాదాలు గానీ, మరేదైనా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అప్పుడు ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారు దానికి బాధ్యులవుతారని జేటీసీ రమేశ్ తెలిపారు.
అలాంటి సందర్భాల్లో అమ్మినవారు తమ వాహనాన్ని ఇతరులకు అమ్మామనే విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని జేటీసీ రమేశ్ చెప్పారు.
అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా ఎవరి పేరు మీదు వాహనం రిజిస్టర్ అయి ఉంటుందో వారే బాధ్యులవుతారని, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ జరిగితే అమ్మినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అంటున్నారు.
భారత్‌లో సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఎలా ఉందంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఈ ఏడాది జులైలో విడుదల చేసిన ఓ రిపోర్టులో వెల్లడించింది.
ఐదేళ్ల కిందట కొత్త కార్లు, సెకండ్ హ్యాండ్ కార్ల మధ్య నిష్పత్తి ఒకటి కంటే తక్కువగా ఉండగా ఇప్పుడు అది 1.4కి చేరుకుందని తెలిపింది. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వ్యాల్యూ రూ.4 లక్షల కోట్ల వరకు ఉంటుందని క్రిసిల్ రేటింగ్ అంచనా వేసింది. ఇది దాదాపు కొత్త కార్ల అమ్మకాలకు సమానం అని చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














