దిల్లీ పేలుడుకు ముందు అరెస్టయిన ముగ్గురు డాక్టర్లు ఎవరు?

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సయ్యద్ మోజిద్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారులో జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

ఈ పేలుడు జరగక ముందు జమ్మూకశ్మీర్ పోలీసులు హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో కొంత మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో ముగ్గురు వృత్తిరీత్యా డాక్టర్లు.

'ఇది 15 రోజులుగా చేసిన ఉమ్మడి ఆపరేషన్ ఫలితం. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది' అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేంద్ర కుమార్ గుప్తా అన్నారు.

అయితే, దిల్లీ పేలుడు ఘటనకు, ఈ అరెస్టైనవారికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశంపై పోలీసులు ఏమీ చెప్పలేదు.

దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తును ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి(ఎన్‌ఐఏ) అప్పగించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొనసాగుతున్న ఆపరేషన్

జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం కూడా సోదాలు కొనసాగించారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన నిందితులు పనిచేసే చోట ప్రజల్ని పోలీసులు ప్రశ్నించారు.

అదే సమయంలో సహారన్‌పూర్, లఖ్‌నవూల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.

అల్ ఫలాహ్ యూనివర్సిటీ, ఫరీదాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో దాదాపు 800 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నట్లు ఫరీదాబాద్ పోలీస్ శాఖ వెల్లడించింది. అయితే, పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు, అరెస్టు చేయలేదు. అల్ ఫలాహ్, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారిని విచారిస్తున్నారు.

నిషేధిత సంస్థలు జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్‌లతో సంబంధాలు కలిగి ఉన్నారంటూ ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 10న దిల్లీ పేలుడుకు ముందే ఈ అరెస్టులు జరిగాయి. తమ వారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిందితుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

అరెస్టయిన డాక్టర్ అదీల్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, షాహీన్ సయీద్‌ల మధ్య ఏదైనా నెట్‌వర్క్ లింక్ ఉందా అని తెలుసుకోవడానికి భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ఎర్రకోట వద్ద సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్న సిబ్బంది

ఫొటో సోర్స్, ANI

అనుమానితుడిగా డాక్టర్ ఉమర్ నబీ

ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రధాన అనుమానితుడిగా దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని భావిస్తున్నారు.

ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబం ఉమర్ నిర్దోషి అని చెబుతోంది. కొన్ని నెలలుగా ఆయన తన పనిలో బిజీగా ఉన్నారని అంటోంది.

ఎర్రకోట మెట్రోస్టేషన్ పార్కింగ్ సమీపంలో పేలిన తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారును 34 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

బీబీసీ దీన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

హరియాణాలోని ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన ఉగ్రవాద మాడ్యూల్‌కు, ఎర్రకోట సమీపంలో పేలుడుకు ఉపయోగించిన కారుకు మధ్య సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల ఫరీదాబాద్‌లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి, దిల్లీ పేలుడుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి తీవ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌కు డాక్టర్ ఉమర్ నబీకి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సోర్స్‌లు వెల్లడించాయి. అయితే, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

నబీతో శుక్రవారం మాట్లాడినట్లు ఆయన సమీప బంధువు ముజమ్మిలా చెప్పారు. పోలీసులు తన భర్త, అత్త, మరిదిలను తీసుకెళ్లారని, తర్వాత నబీ తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారని ఆమె తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో నవంబర్ 7న డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్‌ను అరెస్ట్ చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. రాథర్ ఆధార్ కార్డులో అనంత్‌నాగ్‌లోని చిరునామా ఉంది. సహారన్‌పూర్‌లో అంబాలా రోడ్‌లోని ‘ఫేమస్ హాస్పిటల్‌’లో ఆయనను అరెస్ట్ చేశారు.

అనంత్‌నాగ్‌లో జైషే మొహమ్మద్‌కు మద్దతుగా డాక్టర్ అదీల్ పోస్టర్లు వేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

దర్యాప్తులో భాగంగా శ్రీనగర్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా, డాక్టర్ అదీల్ పోస్టర్లు అంటిస్తున్నట్లు కనిపించారని పోలీసులు తెలిపారు. ఈ ఫుటేజీ ఆధారంగా ఆయనను సహారన్‌పూర్‌లో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

'డాక్టర్ అదీల్ దాదాపు మూడేళ్లుగా సహారన్‌పూర్‌లో నివసిస్తున్నారు. మాన్కమౌ ప్రాంతంలో ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఒక అద్దె ఇంట్లో ఆయన ఉన్నారు. ఈ సమయంలో వీ-బ్రోస్, ఫేమస్ మెడికేర్ హాస్పిటల్‌లో పనిచేశారు. దీని కంటే ముందు, అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు.

ఆయన 2024 అక్టోబర్ 24 వరకు జీఎంసీ అనంత్‌నాగ్‌లో పని చేశారు. యూపీ పోలీసులు, సహారన్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్లి ఆయన రికార్డులను పరిశీలించి, సిబ్బందిని విచారించారు. పోలీస్ దర్యాప్తులో అదీల్‌కు అంబాలా రోడ్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందని తేలింది.

డాక్టర్ అదీల్ 2025 అక్టోబర్ 4న జమ్మూకశ్మీర్‌లో వివాహం చేసుకున్నారు. ఆయన సెప్టెంబర్ 26న సెలవుపై వెళ్లి కొంతమంది సిబ్బందికి పెళ్లి పత్రికలు పంచారు. అదీల్ అరెస్ట్ తర్వాత, ఆసుపత్రి యాజమాన్యం ఆయన నేమ్‌ప్లేట్‌ను తొలగించింది' అని పోలీసులు వెల్లడించారు.

సహారన్‌పూర్

ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి?

ఆసుపత్రిలో ఫిజీషియన్ ఉద్యోగం ఖాళీ ఉండటంతో మార్చిలో అదీల్‌ను నియమించామని ఫేమస్ మెడికేర్ హాస్పిటల్ మేనేజర్ మనోజ్ మిశ్రా చెప్పారు. అరెస్ట్ తర్వాత ఆయనను ఉద్యోగం నుంచి తొలగించామని తెలిపారు.

స్థానిక పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, మీడియాతో ఏమీ చెప్పడం లేదు.

'ఇది జమ్మూకశ్మీర్ పోలీసుల వ్యవహారం, యూపీ పోలీసులు కేవలం సహాయపడ్డారు' అని మీడియాకు సహారన్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యోమ్ బిందల్ చెప్పారు.

వీ బ్రోస్ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ మమతా వర్మ మాట్లాడుతూ, 'డాక్టర్ అదీల్ ఇక్కడ దాదాపు నాలుగు నెలలు పని చేశారు. ఆయన మెడిసిన్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు' అని చెప్పారు.

ఫిబ్రవరి 28న ఆయన ఈ ఆసుపత్రిని వదిలేసి ఫేమస్ హాస్పిటల్‌లో చేరారు

జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక డాక్టర్‌తో తనకు నిశ్చితార్థం అయిందని ఆదిల్ అహ్మద్ రాథర్ చెప్పినట్లు ఆయనతో పనిచేసిన సిబ్బంది చెప్పారు. అయితే వారు తమ గుర్తింపు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

అదీల్ ఆసుపత్రికి ఆటోలో వచ్చేవారని, ఆన్‌లైన్‌లో ఆహారం తెప్పించుకునేవారని, ఆయన ఎక్కడ ఉండేవారో తమకు సరిగ్గా తెలియదని వారు చెప్పారు.

దిల్లీ పేలుడు, ఫరీదాబాద్‌లో అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫరీదాబాద్‌లో అరెస్ట్

హరియాణాలోని ధౌజ్‌లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బోధకుడిగా ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

డాక్టర్ ముజమ్మిల్ షకీల్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

డాక్టర్ ముజమ్మిల్‌ను అక్టోబర్ 30న అరెస్టు చేశారు. ఆయన తీసుకున్న అద్దె ఇంట్లో పేలుడు పదార్థాలు దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేంద్ర గుప్తా ఈ వివరాలు వెల్లడించారు.

'అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ముజమ్మిల్ బోధించేవారు. ఆయన వద్ద నుంచి ఒక కిర్నికోవ్ రైఫిల్, ఒక పిస్టల్, టైమర్ స్వాధీనం చేసుకున్నాం' అని చెప్పారు.

షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టరై ఉన్న ఒక కారును గుర్తించామని, ఆ తర్వాత షాహీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

'360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. కానీ, అవి ఆర్డీఎక్స్ కాదు' అని సతేంద్ర గుప్తా చెప్పారు.

'ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసినట్లు వేరే వాళ్ల ద్వారా మాకు తెలిసింది. తనను కలవడానికి మేం ప్రయత్నించాం. కానీ, పోలీసులు అతన్ని కలవడానికి మమ్మల్ని అనుమతించలేదు' అని వార్తా సంస్థ పీటీఐతో డాక్టర్ ముజమ్మిల్ తల్లి నసీమా అన్నారు.

ముజమ్మిల్ అరెస్టు తర్వాత, షాహీన్ సయీద్ అనే మహిళా వైద్యురాలిని ఫరీదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముజమ్మిల్ వద్ద దొరికిన కారు షాహీన్‌దేనని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'ముజమ్మిల్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మూడేళ్లుగా దిల్లీలో డాక్టర్‌గా ఉన్నారు. నా సోదరుడిని కలిసేందుకు నన్ను అనుమతించట్లేదు. ఆయన ఏడాదికి రెండుసార్లు ఇంటికి వచ్చేవారు' అని ఆయన సోదరుడు ఆజాద్ షకీల్‌ను ఉటంకిస్తూ వార్తాసంస్థ పీటీఐ పేర్కొంది.

ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు

లఖ్‌నవూ కనెక్షన్‌పై దర్యాప్తు

ఫరీదాబాద్‌లో అదుపులోకి తీసుకున్న షాహీన్ సయీద్‌కు చెందిన లఖ్‌నవూ ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు.

లఖ్‌నవూలో లాల్ బాగ్‌లోని ఖండారీ బజార్‌లో డాక్టర్ షాహీన్ సయీద్ కుటుంబం నివసిస్తుంది. ఆమెకు ఇద్దరు సోదరులు.

అన్నయ్య షోయబ్ సయీద్ తన తండ్రితో నివసిస్తున్నారు. మరో సోదరుడు పర్వేజ్ సయీద్, ఐఐఎం మడియావ్ సమీపంలో నివసిస్తున్నారు.

షాహీన్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ దీని గురించి మాట్లాడారు.

'నాకు ముగ్గురు పిల్లలు. షాహీన్ రెండో సంతానం. ఆమె అలహాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ చదివారు. మీరు చెప్పేది నేను ఇంకా నమ్మలేకపోతున్నా. పోలీసులు ఎవరూ ఇంకా నా దగ్గరకు రాలేదు. పర్వేజ్‌తో నేను ప్రతి వారం మాట్లాడుతుంటా. షాహీన్‌తో గత నెలలో మాట్లాడాను. ఏడాదిన్నర క్రితం ఆమెను కలిశాను' అని ఆయన అన్నారు.

షాహీన్ తండ్రితో పాటు సోదరుడు పర్వేజ్ అన్సారీ ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు.

దిల్లీలోని లాజ్‌పత్ నగర్ మార్కెట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని లాజ్‌పత్ నగర్ మార్కెట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు

మొదట అరెస్ట్‌లు, తర్వాత పేలుడు

ఉత్తరప్రదేశ్, హరియాణా పోలీసుల సహకారంతో ఈ ఉమ్మడి ఆపరేషన్ చేపట్టినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

దీర్ఘకాలిక పర్యవేక్షణ, నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వారు వెల్లడించారు.

'ఈ మాడ్యూల్ జమ్మూకశ్మీర్ వెలుపల చురుగ్గా ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారం చేయడం, యువతను ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్‌లను సేకరించడంలో పాల్గొన్నట్లు తెలిసింది.

సోదాలు చేసినప్పుడు అనేక డిజిటల్ పరికరాలు, పోస్టర్లు, ఎలక్ట్రానిక్ రికార్డులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులు నిషేధిత సంస్థల భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది' అని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఈ కేసులో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)