ఇస్లామాబాద్‌ బాంబు పేలుడుపై భారత్‌‌ను నిందిస్తూ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రకటన, ఆరోపణలపై స్పందిస్తూ ఇండియా ఏమందంటే..

ఇస్లామాబాద్ పేలుడు, దిల్లీ పేలుడు, పాకిస్తాన్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో, సెక్టార్ జి-11లోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు బయట జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందారు.

ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 27 మంది గాయపడినట్లు పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ మీడియాతో చెప్పారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని హోం మంత్రి మొహ్సిన్ నక్వీ తెలిపారు.

ఈ ఘటనపై భారత్‌ను నిందిస్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని వెనుక భారత్ మద్దతున్న తీవ్రవాదుల గ్రూపు ప్రమేయముందని ఆరోపించింది.

దీనిపై భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇస్లామాబాద్ పేలుడు, దిల్లీ పేలుడు, పాకిస్తాన్, భారత్,
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ

హోం మంత్రి ఏం చెప్పారు?

ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.

'మధ్యాహ్నం 12:39 గంటలకు కోర్టు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ప్రధాన మంత్రి స్వయంగా చెప్పారు' నక్వీ అన్నారు.

ఇది ఎలాంటి పేలుడనే విషయంలో పోలీసులు ఇంకా నిర్ధరణకు రాలేకపోయారు.

పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.

ఇస్లామాబాద్ పేలుడు, దిల్లీ పేలుడు, పాకిస్తాన్, భారత్,

ఫొటో సోర్స్, Getty Images

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ శాఖ ప్రతినిధిని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

'పేలుడుపై దర్యాప్తు జరుగుతోంది. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫోరెన్సిక్ బృందం నుంచి సమాచారం అందిన తర్వాతే మేం ఏదైనా చెప్పగలం' అని పోలీసులు తెలిపారు.

ఈ పేలుడు ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారం సమీపంలో జరిగింది. సాధారణంగా కోర్టు పనులపై వచ్చేవారితో ఈ ప్రదేశం రద్దీగా ఉంటుంది.

ఇస్లామాబాద్ పేలుడు, దిల్లీ పేలుడు, పాకిస్తాన్, భారత్,

ఫొటో సోర్స్, Zulqarnain

భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఆరోపణలు

ఇస్లామాబాద్‌లోని జి-11 కోర్టు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, దీని వెనుక 'భారత్ మద్దతు ఉన్న తీవ్రవాదుల గ్రూపు' ప్రమేయం ఉందని ఆరోపించారు.

'భారత్‌ ప్రోద్బలంతో టెర్రరిస్టులు పాకిస్తాన్‌లోని నిరాయుధులైన పౌరులపై జరిపిన టెర్రర్ దాడులు ఖండించదగినవి' అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ తెలిపింది.

'ఈ ప్రాంతంలో ప్రాక్సీల (పరోక్షంగా) ద్వారా టెర్రరిజాన్ని వ్యాప్తి చేసే దుశ్చర్యలకు భారత్ దూరంగా ఉండాలి' అని ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులను శిక్షిస్తామని ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు.

ఇస్లామాబాద్ పేలుడు, దిల్లీ పేలుడు, పాకిస్తాన్, భారత్,

అఫ్గాన్ ప్రస్తావన తెచ్చిన పాక్ రక్షణ మంత్రి

పేలుడు తర్వాత, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేస్తూ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితిలో ఉందని చెప్పారు.

''అఫ్గాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో లేదో సుదూర బలూచిస్తాన్ ప్రాంతంలోనే పాకిస్తాన్ సైన్యం యుద్ధం చేస్తోందని అనుకునేవారికి ఇదొక మేల్కొలుపు. ఇది మొత్తం పాకిస్తాన్‌పై యుద్ధం.

ప్రజలను రక్షించడానికి పాకిస్తాన్ సైన్యం రోజూ త్యాగాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్ పాలకులతో చర్చలు ఫలప్రదమవుతాయని ఆశించడం వ్యర్థం.

అఫ్గాన్ పాలకులు పాకిస్తాన్‌లో టెర్రరిజాన్ని ఆపగలరు. కానీ, యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు తీసుకురావడం అనేది వారి నుంచి వచ్చిన ఒక సందేశం. దీనికి దీటుగా స్పందించే సామర్థ్యం పాకిస్తాన్‌కు ఉంది'' అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

‘పాకిస్తాన్ కుయుక్తులకు ఎవరూ మోసపోరు’

భారత్‌పై పాక్ నాయకత్వం చేసిన ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు భారత అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు.

పాకిస్తాన్ అస్థిర నాయకత్వం చేస్తోన్న ఆధారం లేని, తప్పుడు ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని ఆయన చెప్పారు.

'వారి దేశంలో జరుగుతున్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం, అధికార ఆక్రమణ నుంచి తమ ప్రజల దృష్టిని మరల్చడానికి భారత్‌పై పాక్ తప్పుడు కథనాలు అల్లుతోంది. పాక్ నుంచి ఈ చర్యను ఊహించదగినదే.

అసలు నిజమేంటో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసు. పాకిస్తాన్ కుయుక్తులకు అంతర్జాతీయ సమాజం మోసపోదు' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)