శిశువుల తొలి మలంతో భవిష్యత్‌లో వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలిసిపోతుందా?

శిశువుల తొలి మలం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్ స్కెల్లీ

అది 2017.. ఒక రోజు లండన్‌లోని క్వీన్స్ హాస్పిటల్ పాథాలజీ లేబొరేటరీ టెక్నీషియన్లు ఇద్దరు చాలా ఆత్రుతగా ఆ రోజు రావాల్సిన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ లేబొరేటరీకి ఒక్కోరోజు 50 ప్యాకేజ్‌ల వరకు వస్తుంటాయి. అందులో నవజాత శిశువుల న్యాపీల నుంచి సేకరించిన మలం నమూనాలు ఉంటాయి.

బేబీ బయోమ్ అధ్యయనం పేరిట జరుగుతున్న పరిశోధనను ఈ టెక్నీషియన్లు ముందుండి నడిపిస్తున్నారు.

శిశువు గట్ మైక్రోబయోమ్ అనేది భవిష్యత్‌లో వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడమే ఈ అధ్యయనం లక్ష్యం. గట్ మైక్రోబయోమ్ అంటే జీర్ణవ్యవస్థలో నివసించే కోట్ల సూక్ష్మజీవులు.

2016-17 మధ్య ఈ ల్యాబ్ పరిశోధకులు 3,500 మంది నవజాత శిశువుల మలం నమూనాలను విశ్లేషించారు. అందులో చాలా ముఖ్యమైన అంశాలు వెల్లడయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మొదటి వారంలో గట్ మైక్రోబయోమ్ వృద్ధి

శిశువు జన్మించిన మూడు లేదా నాలుగు రోజుల తర్వాతే శిశువు పేగుల్లోకి మంచి సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) చేరడం మొదలవుతుందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్, బేబీ బయోమ్ ప్రాజెక్ట్ లీడ్ నిజెల్ ఫీల్డ్ చెప్పారు.

'పుట్టినప్పుడు శరీరం క్రిమిరహితంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైన సమయం. మూడు నాలుగు రోజుల తర్వాతే సూక్ష్మజీవులు లోపలికి రావడం మొదలవుతుంది.

పుట్టిన ప్రతీఒక్కరిలో ఈ సమయంలోనే గట్ మైక్రోబయోమ్ అభివృద్ధి చెందుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లతో కూడిన ఈ మైక్రోబయోమ్ కమ్యూనిటీ భవిష్యత్‌లో మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెద్దయ్యాక ఫైబర్‌ను జీర్ణం చేయడంలో, విటమిన్లు అందించడంలో, హానికర క్రిములను చంపడంలో ఇవి సహాయపడతాయి.

మంచి గట్ మైక్రోబయోమ్ ఉంటే యాంగ్జైటీ, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి పరిస్థితుల నుంచి రక్షణ ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి'' అని ఆయన వివరించారు.

చెడు గట్ మైక్రోబయోమ్ కారణంగా పెద్దల్లో గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్, ఒబెసిటీ, జీర్ణాశయంలో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి.

గట్ మైక్రోబయోమ్

ఫొటో సోర్స్, Getty Images

శిశువు పేగుల్లోకి చేరే తొలి సూక్ష్మజీవులు, మన రోగ నిరోధక వ్యవస్థకు ఆర్కిటెక్టుల వంటివని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలోని సీనియర్ లెక్చరర్ అర్చిత మిశ్రా అన్నారు. చిన్నతనంలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో మైక్రోబయోమ్ పాత్రపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.

ఈ సూక్ష్మజీవులు మన శరీరానికి మేలే చేసేవి ఏంటో, కీడు చేసేవి ఏంటో గుర్తించడంలో శిక్షణ ఇస్తాయి. ఆహారంలోని అలెర్జీ కారకాలు, హానిచేయని సూక్ష్మజీవుల విషయంలో ఎలా సహనంగా ఉండాలో, చెడు క్రిములపై ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తాయని ఆమె చెప్పారు.

'మనిషి జీవితంలోని తొలి వెయ్యి రోజులు చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మైక్రోబయోమ్‌లు వేసే ముద్ర దశాబ్దాల పాటు ఉంటుంది' అని ఆమె అన్నారు.

నవజాత శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

‘ముఖం నిండా మలంతో’

నవజాత శిశువులో గట్ మైక్రోబయోమ్‌ను ఏర్పరచడానికి ప్రకృతి వద్ద చక్కటి పద్ధతి ఉందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌ వేల్స్‌లోని గ్యాస్ట్రోఇంటెస్టినల్ మైక్రోబయోమ్ సీనియర్ లెక్చరర్ స్టీవెన్ లీచ్ చెప్పారు.

'పిల్లలు పుట్టే పద్ధతిని చూస్తే, తల్లి వెన్నెముక వైపుగా ముఖం పెట్టి, తల కిందకు పెట్టి బిడ్డ పుడుతుంది. శరీర నిర్మాణం ప్రకారం, చూస్తే బిడ్డ తల, తల్లి పేగుల్లోని పదార్థాలను బయటకు నెడుతుంది. కాబట్టి, పిల్లలు పుట్టినప్పుడు వారి ముఖం నిండా మలం ఉంటుంది' అని ఆమె వివరించారు.

పుట్టిన మరు క్షణం నుంచే గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. తొలినాళ్లలో సరైన బ్యాక్టీరియా ఉండటం వల్ల పిల్లలు భవిష్యత్‌లో వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందుతారని నిజెల్ ఫీల్డ్ పరిశోధనలో వెల్లడైంది.

గట్ మైక్రోబయోమ్

ఫొటో సోర్స్, Getty Images

సిజేరియన్ పిల్లలు ఏం కోల్పోతున్నారంటే..

'సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లల ముఖాలకు మలం చేరినట్లుగా సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువులకు జరుగదు. సీ సెక్షన్ అనేది ప్రాణాల్ని కాపాడేందుకు, తరచుగా అవసరమయ్యే వైద్యవిధానమే. అయితే, సిజేరియన్‌లో పుట్టిన శిశువులు శ్వాసకోశ అంటువ్యాధుల (రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్) నుంచి తమను తాము రక్షించుకోవడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియాను కోల్పోతున్నారు' అని ఆమె చెప్పారు.

శిశువు పుట్టిన వారంలో మూడు ప్రధాన బ్యాక్టీరియాలైన బైఫిడోబ్యాక్టీరియం లాంగమ్ (బి. లాంగమ్), బైఫిడోబ్యాక్టీరియం బ్రేవ్ (బి. బ్రేవ్), ఎంటెరోకాకస్ ఫికాలిస్ (ఈ. ఫీకాలిస్)లలో ఏదో ఒకటి బిడ్డ పేగుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటుందని 2019నాటి అధ్యయనం తెలిపింది.

వీటిలో ఏ రకం బ్యాక్టీరియా బిడ్డకు లభిస్తుందనే దాన్ని బట్టి, ఆ తర్వాత పేగుల్లో స్థిరపడే ఇతర బ్యాక్టీరియాల నిర్ణయం అవుతుందని నిజెల్ ఫీల్డ్ అధ్యయనంలో పేర్కొన్నారు.

‘సిజేరియన్ కంటే సాధారణ ప్రసవమే మేలు అనుకోకూడదు’

సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు, సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువులకు మధ్య పేగు బ్యాక్టీరియాల్లో తేడా ఉంటుందని ప్రొఫెసర్ ఫీల్డ్ అన్నారు.

సాధారణ ప్రసవంలో, శిశువులు తల్లి పేగు నుంచి బి.లాంగమ్ లేదా బి.బ్రేవ్ బ్యాక్టీరియాను పొందుతారని, అందుకే వారి పేగు మైక్రోబయోమ్ తల్లితో సరిపోలుతుందని చెప్పారు. సీ సెక్షన్ పిల్లల్లో ఈ. ఫీకాలిస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు వ్యాధులను కలిగిస్తుందని ఫీల్డ్ చెప్పారు.

అయితే, సంవత్సరం తర్వాత బ్యాక్టీరియాలో ఈ తేడా పెద్దగా ఉండదు. కానీ, ముందునుంచే మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల సాధారణ ప్రసవంలో జన్మించిన పిల్లలు అదనపు ఆరోగ్య ప్రయోజనం పొందుతారు.

బి.లాంగమ్ ప్రధానంగా ఉన్న పిల్లలు ఇతర బ్యాక్టీరియా ఉన్న పిల్లలతో పోలిస్తే మొదటి రెండేళ్లలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. బి. లాంగమ్ వంటి బ్యాక్టీరియా లేకపోవడంతో సీ సెక్షన్ పిల్లల్లో ఆస్తమా, అలర్జీలు, స్థూలకాయం, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు వచ్చే ప్రమాదం కాస్త ఎక్కువగా ఉండటానికి కారణం కావొచ్చని ఫీల్డ్ అన్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అయితే, ఇదంతా ఎందుకు, ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఇంకా మొదటి దశలోనే ఉన్నారు.

'ఇదంతా చూసి సిజేరియన్ అంత మంచిది కాదు, సాధారణ ప్రసవమే మేలు అని నిశ్చయించుకోకూడదు. అసలు విషయం ఇంకేదో అయి ఉండొచ్చు. సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లలందరికీ ప్రమాదాన్ని తగ్గించే బ్యాక్టీరియా లభించలేదు. అలాగే సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలందరికీ మనం ఆందోళన చెందుతున్నట్లుగా ఆరోగ్య సమస్యలూ రాలేదు' అని ఫీల్డ్ చెప్పారు.

శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

మైక్రోబ్ ఇంజినీరింగ్

అయితే సీ సెక్షన్ ద్వారా జన్మించిన శిశువులకు మైబ్రోబియల్ బూస్ట్‌ను అందించడానికి మనం జోక్యం చేసుకోవాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

'సీ సెక్షన్లు ప్రాణాలను కాపాడతాయి. కాబట్టి కోల్పోయిన మైక్రోబయోమ్‌ను తిరిగి వచ్చేలా చేయడం మన విధి' అని మిశ్రా అన్నారు. కానీ ఎలా?

కొన్నిసార్లు 'వెజైనల్ సీడింగ్'ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియలో యోని ద్రవాన్ని స్వాబ్‌లో ముంచి నవజాత శిశువు చర్మం, నోటిపై పూస్తారు. దీనివల్ల శిశువు గట్‌లో మంచి బ్యాక్టీరియా స్థిరపడుతుందని భావిస్తారు.

ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నప్పటికీ, దీనివల్ల ప్రమాదకర అంటువ్యాధుల కారకాలు బదిలీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నాలుగింట ఒక వంతు మహిళలు తమ యోనిలో గ్రూప్ బి స్ట్రెప్ అనే బ్యాక్టీరియాను కలిగి ఉంటారు. ఇది శిశువుకు ప్రాణాంతకం కావొచ్చు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, శిశువుకు మంచి బ్యాక్టీరియా అనేది తల్లి వెజైనా నుంచి సంక్రమించట్లేదని 2019నాటి అధ్యయనం తేల్చింది.

ఫీకల్ మైక్రోబియల్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది. దీన్నే మల మార్పిడి విధానం అంటారు. ఈ ప్రక్రియలో తల్లి మలాన్ని శిశువు గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు బదిలీ చేస్తారు. కొన్ని చిన్నస్థాయి ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ విధానాన్ని ప్రస్తుతం సిఫార్సు చేయట్లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)