పాకిస్తాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 12 మంది మృతి

ఫొటో సోర్స్, Zulqarnain
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు వెలుపల భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించారని, 27 మంది గాయపడ్డారని పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ మీడియాకు తెలిపారు.
"మధ్యాహ్నం 12:39 గంటలకు కోర్టు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో భారీ నష్టం వాటిల్లింది. 12 మంది చనిపోయారు. దాదాపు 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు" అని మొహ్సిన్ నఖ్వీ అన్నారు.
ఈ పేలుడుకు గల కారణాలను పాకిస్తాన్ పోలీసులు ఇంకా నిర్ధరించలేదు. పోలీసులు కోర్టు నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాధారణ ప్రజలను తరలించారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ప్రతినిధి చెప్పినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ రిపోర్టు చేసింది.
"పేలుడుపై దర్యాప్తు జరుగుతోంది. కారణాలు ఇంకా తెలియలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అందాకే ఏదైనా చెప్పగలం" అని పోలీసులు తెలిపారు.
ఇస్లామాబాద్ జిల్లా సెక్టార్ G-11లోని కోర్టు ప్రవేశ ద్వారం దగ్గర ఈ పేలుడు సంభవించింది. కోర్టు పనులపై వచ్చేవారితో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నారు?
పేలుడు ఘటన తర్వాత, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితిలో ఉందని చెప్పారు.
"పాకిస్తాన్ సైన్యం అఫ్గాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోనో, బలూచిస్తాన్ మారుమూల ప్రాంతాల్లోనో యుద్ధం చేస్తుందని ఎవరైనా అనుకుంటే, నేడు ఇస్లామాబాద్ జిల్లా కోర్టు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఒక మేల్కొలుపు, ఇది మొత్తం పాకిస్తాన్‌పై యుద్ధం" అని తెలిపారు.
"ప్రజలను రక్షించడానికి పాకిస్తాన్ సైన్యం రోజూ త్యాగాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కాబూల్ పాలకులతో సఫలీకృతమైన చర్చలు జరుగుతాయని ఆశించడం వ్యర్థం" అని చెప్పారు.
"కాబూల్ పాలకులు పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ఆపగలరు. కానీ, ఇస్లామాబాద్‌కు యుద్ధం తీసుకురావడమనేది కాబూల్ నుంచి వచ్చిన సందేశం. దీనికి ప్రతిస్పందించే పూర్తి బలం పాకిస్తాన్‌కు ఉంది" అని ఆయన తన ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














