ఎర్రకోట: 'హై ఇంటెన్సిటీ' పేలుడు తర్వాత ఎర్రకోట దగ్గర ఇప్పుడెలా ఉంది?

ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Images
- రచయిత, దిగవల్లి పవన్ కాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట ప్రాంతంలో కారు పేలుడుతో ఒక్కసారిగా అలజడి రేగింది. కాలుష్యం పెరుగుతోన్న రోజుల్లో సోమవారం రాత్రి పొగ మంచు లాంటి పరిస్థితుల్లో, పురావస్తు శాఖకు చెందిన ఎర్రకోట బోర్డు మెరుస్తూ కనిపించింది. కానీ, దాని ఎదురుగా రోడ్డుపైన, పేలుడు ధాటికి ముక్కలైన i20 కారు శకలాలు కనిపిస్తున్నాయి.
ఘటనా స్థలానికి దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, దిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) బృందాలు కూడా చేరుకున్నాయి.
అదనంగా జాతీయ సంస్థలైన ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు కూడా ఉన్నాయి.
అత్యంత తీవ్రత (హై ఇంటెన్సిటీ) కలిగిన పేలుడుగా దీన్ని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ పేలుడుకి కారణాలేంటనేది ఇంకా తెలియలేదు.


ఫొటో సోర్స్, Getty Images
పేలుడు ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని నాతో మాట్లాడిన ఎల్ఎన్‌జేపీ వైద్య అధికారులు తెలిపారు.
అలానే, పేలుడు ఘటనతో దిల్లీ మొత్తం హై అలర్ట్ ఉందని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని అధికారులు స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల కోసం వెతుకుతూ కనిపించాయి.
రాత్రి 10:45 నిమిషాల సమయంలో సేకరించిన ఆధారాలను ఒక డబ్బాలో పట్టుకెళ్తోన్న ఫోరెన్సిక్ అధికారులు కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యం
రోడ్డుపై పడి ఉన్న కారు శకలాలు, మధ్యలో పసుపు పచ్చ రంగులో వెలుగుతున్న సిగ్నల్ లైట్, పొగ మంచులో కనిపిస్తున్న ఎర్రకోట, రోడ్లన్నీ మూతపడి నిర్మానుష్యంగా మారిన చాందినీ చౌక్ మార్కెట్... ఇవీ రాత్రి 10:30 గంటలకు కనిపించిన దృశ్యాలు.
ఎర్రకోట, చాందినీ చౌక్ మధ్యనున్న రోడ్డు మీద, సరిగ్గా సిగ్నల్ జంక్షన్‌లో ఈ పేలుడు జరిగింది.
ఎర్రకోట చుట్టూ ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రోడ్లన్నీ పేలుడు జరిగిన తర్వాత నిర్మానుష్యంగా మారాయి.
మీడియా, వైద్య బృందాలు, ఎన్ఎస్‌జీ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాలు మినహా ఇతర వాహనాలేవీ రాకుండా ఎర్రకోట చుట్టూ ఒక కిలోమీటరు దూరంలో దిల్లీ పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి రోడ్లను మూసేశారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన ట్వీట్ ద్వారా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
అగ్ని మాపక సిబ్బంది తమ వాహనాల్లో కూర్చుని ఉన్నారు. ఒకవైపు ఎన్ఎస్‌జీ వాహనాలు, మరోవైపు అంబులెన్స్‌లు రోడ్డుపైనే నిలిచి ఉన్నాయి.
అనేక మీడియా సంస్థలకు చెందిన విలేఖరులు బిజీగా, పేలుడు ఘటనను రిపోర్ట్ చేస్తున్నారు.
దిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు రోడ్డుపైన గస్తీ కాస్తున్నాయి. ఇంకొంత మంది బారికేడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించడం, లేదా వాహనాలను తిరిగి వెనక్కు పంపడం చేస్తున్నారు.
పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారిని, గాయపడిన బాధితులను సమీప లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్‌జేపీ) ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
తర్వాత, ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. దర్యాప్తు అధికారులతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
దిల్లీలో ప్రధాన పర్యటక ప్రాంతం ఎర్రకోట... పాపులర్ మార్కెట్ చాందినీ చౌక్
ఎర్రకోట ప్రాంతం ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశమే కాకుండా దిల్లీలో ప్రధాన పర్యటక కేంద్రం కూడా.
ఎర్రకోటకు ఎదురుగా ఉండే చాందినీ చౌక్ మార్కెట్.. చాలా పాపులర్ మార్కెట్.
ఇక్కడ బట్టల మార్కెట్‌కు, హోల్‌సేల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మార్కెట్లకు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు షాపింగ్ కోసం వస్తూ ఉంటారు.
సమీపంలోనే పాత దిల్లీ రైల్వే స్టేషన్, జామా మసీదు ఉంటాయి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కోసం ప్రజలు భారీగా వస్తారు.
చాందినీ చౌక్‌లోని హోల్‌సేల్ మార్కెట్ల నుంచి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఎగుమతులకు పాత దిల్లీ రైల్వే స్టేషన్ చాలా కీలకం.
కొన్ని వేల మంది రోజువారీ కూలీలు, కార్మికులు, ప్లాట్‌ఫాంపైన బతికే చిన్న వ్యాపారులు ఉంటారు.
పైగా ఎర్రకోట ముందు విస్తారమైన మైదానంలో ఎప్పుడూ ఎగ్జిబిషన్స్, సంత వాతావరణం ఉంటుంది.
జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతం.
అలానే ఆగస్టు పదిహేను వస్తే దేశ ప్రధాని ప్రసంగించే అత్యంత ముఖ్యమైన ప్రాంతం.
ఇక్కడ పేలుడు ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images
'పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉంది'
కానీ, ఈ పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక కారులో హై ఇంటెన్సిటీ పేలుడు జరగడానికి వెనుక కారణాలు ఏమై ఉండొచ్చనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది. ఆ కారు యజమానిని పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు పేర్కొంది.
ఈ పేలుడు ఘటనపై కుట్ర కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కానీ, ఇప్పుడే ఇది తీవ్రవాద చర్య అని చెప్పడం తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














