దిల్లీలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసన, అదుపులోకి తీసుకున్న పోలీసులు

- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా ఆదివారం ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వచ్ఛమైన గాలి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఈ నిరసనలో పురుషులు, మహిళలు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు.


అనుమతి లేదు: పోలీసులు
" ఇక్కడ నిరసనలకు అనుమతి లేదు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటానికి వీలు లేదు" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ సింగ్ మైక్‌లో నిరసనకారులతో చెప్పారు.
"నిరసనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అన్నారు.
నిరసనకారులు జంతర్ మంతర్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు.
అయినా వినకుండా, ఇండియా గేట్ సమీపంలో నిరసనకారులు ధర్నాకు కూర్చోవడంతో, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

'నిరసన స్థలంగా మార్చలేం'
నిరసనలను నియంత్రించడానికి దిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారని ఇండియా గేట్ వద్ద ఉన్న బీబీసీ ప్రతినిధి ఉమాంగ్ పొద్దార్ చెప్పారు.
"ఇండియా గేట్ నిరసనలకు అనువైన ప్రదేశం కాదు. సుప్రీంకోర్టు న్యూదిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా ఎంపిక చేసింది. ఇండియా గేట్ వద్ద ఎలాంటి నిరసనకు అనుమతి లేదు" అని డీసీపీ దేవేష్ కుమార్ మీడియాతో అన్నారు.

"ప్రజలు ఇక్కడికి వచ్చి తమ కుటుంబాలతో కలిసి ఆనందిస్తారు. దీనిని నిరసన స్థలంగా మార్చలేం. కాబట్టి, ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను, నియమాలను పాటించాలి" అని ఆయన అన్నారు.
"మీరు దరఖాస్తును సమర్పించి, సరైన విధానం ద్వారా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేయవచ్చు" అని అన్నారు డీసీపీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














