అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను దాచేస్తున్నారు.. ఏమిటీ ట్రెండ్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెరెనా కోబ్బినా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటున్నారు.
ఒకప్పుడు ఈ ధోరణి కేవలం సెలబ్రిటీలకే పరిమితమైనప్పటికీ, ఇప్పుడు సామాన్యుల్లోనూ కనిపిస్తోంది. అయితే, అమ్మాయిలు ఇలా ఎందుకు చేస్తున్నారు? వాటి వెనుక కారణాలేంటి.
తవానా ముస్వాబురికి ఇన్‌స్టాగ్రామ్‌లో 33,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, వారిలో చాలామందికి ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉంటారో తెలియదు.
తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఆమె కొన్ని సూచనలు ఇస్తుంటారు. ఆమె తల వెనుక ఎవరో ఉన్నట్లు, లేదా డిన్నర్ సమయంలో రెండు వైన్ గ్లాసుల ఫోటో వంటివి పంచుకుంటారు. కానీ, బాయ్‌ఫ్రెండ్ ముఖాన్ని పోస్ట్ చేసే ఆలోచన తనకు లేదని 24 ఏళ్ల తవానా చెబుతున్నారు.
తవానా బలంగా, స్వతంత్రంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ లేని బ్రాండ్‌ను నిర్మించుకున్నారు.
తన విజయం ఒక పురుషుడి వల్లనే అని ఎవరూ అనుకోకూడదని తవానా అంటున్నారు.
"ఇది నేనే చేశాను" అని చెప్పుకోవడానికి గర్వపడతానని ఆమె చెప్పారు.
తన భాగస్వామి గురించి ఆన్‌లైన్‌లో పంచుకోవడానికి నిశ్చితార్థపు ఉంగరమూ సరిపోదని, తన నిర్ణయం అంత త్వరగా మారబోదని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Tawana Musvaburi
మహిళలు తమ రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడని ఎంతోమంది మహిళల్లో తవానా కూడా ఒకరు.
ఈ మార్పును బ్రిటిష్ వోగ్ పత్రిక "ఈజ్ హావింగ్ ఏ బాయ్‌ఫ్రెండ్ ఎంబరాసింగ్ నౌ?" అనే ఆర్టికల్‌లో హైలైట్ చేసింది. ఇది ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చాలామంది దృష్టిని ఆకర్షించింది.
బాయ్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండడాన్ని ఇకపై "ఏదో సాధించినట్లుగా" పరిగణించలేరు అని ఆర్టికల్ రాసిన చాంటే జోసెఫ్ చెప్పారు.
"మనం నివసిస్తున్న పితృస్వామ్యం, మహిళల అణచివేత" కారణంగా మహిళలు తమ పార్ట్‌నర్స్ గురించి పోస్ట్ చేసేందుకు సంకోచిస్తున్నారని ఆమె భావిస్తున్నారు.
నేటి మహిళలు "ఫియాన్సీ లేదా భర్త ఉండడం బాగుంటుంది" అని చెబుతున్నారని జోసెఫ్ బుధవారం బీబీసీ రేడియో 4 విమెన్ అవర్‌తో అన్నారు.
అయితే, "అది నిజం కాదు. ప్రస్తుత వాతావరణంలో పురుషులతో మనకున్న సంబంధాన్ని తిరిగి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది."


ఫొటో సోర్స్, Getty Images
'1,000 మంది అన్‌ఫాలో చేశారు'
తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు చింతిస్తున్నానని దక్షిణ లండన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్, రచయిత స్టెఫానీ యెబోహ్ బ్రిటిష్ వోగ్‌తో చెప్పారు.
బాయ్‌ఫ్రెండ్ ఉన్నారని తెలిశాక, తన కంటెంట్ ఇక వారికి సంబంధించినది కాదని, అకౌంట్‌ను అన్‌ఫాలో చేశామని తనకు మెసేజ్‌లు పంపారని ఆమె బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
ఆ రోజు దాదాపు 1,000 మంది ఫాలోవర్లను కోల్పోయినట్లు యెబోహ్ గుర్తుచేసుకున్నారు.
బాయ్‌ఫ్రెండ్ పోస్ట్‌లను ప్రజలు ఎందుకు ఇష్టపడరో అర్థం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. చాలా రిలేషన్‌షిప్ కంటెంట్ వాస్తవికతకు దూరంగా ఉంటోందని, ప్రజలకు అది నచ్చడం లేదని ఆమె భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Stephanie Yeboah
సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదించేవారు, వారి బ్రాండ్ స్థిరంగా ఉండాలని కొత్త భాగస్వామి గురించి పోస్ట్ చేయరని సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నిపుణులైన డాక్టర్ గిలియన్ బ్రూక్స్ అన్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లు కంటెంట్‌లో వారికంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుంటారని, దీంతో వారికి నమ్మకమైన ఆడియెన్స్ ఉంటారని ఆమె చెప్పారు. అకస్మాత్తుగా తమ రెగ్యులర్ కంటెంట్‌కు భిన్నంగా పోస్ట్ చేస్తే, అది ఫాలోవర్లను గందరగోళానికి గురి చేస్తుందని, వారిని కోల్పోవచ్చని అభిప్రాయపడ్డారు.
25 ఏళ్ల మిల్లీకి నిశ్చితార్థం అయింది. ఐదేళ్లయినా కానీ, తన కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదామె. అలా చేయడం వల్ల తను ఆయనపై ఆధారపడుతున్నట్లు అనిపించవచ్చని మిల్లీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Dr Gillian Brooks
'ప్రైవేటుగానే ఉండాలి'
20 ఏళ్ల షార్లెట్ తన భాగస్వామితో రెండేళ్లుగా కలిసి ఉంటున్నారు. కొన్నికారణాల వల్ల ఆయన గురించి పోస్ట్ చేయడానికి ఆమె నిరాకరిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌తో పోలిస్తే రిలేషన్‌షిప్స్ ఎక్కువ ప్రైవేట్‌గా ఉండాలని ఆమె భావిస్తున్నారు.
"నేను నా రిలేషన్‌షిప్ గురించి పోస్ట్ చేస్తే, 'నన్ను చూడండి, నా పర్పెక్ట్ రిలేషన్‌షిప్‌ను చూడండి' అని నేను చెబుతున్నట్లుగా ఉంటుంది, కానీ అది నిజం కాదు" అని అన్నారు షార్లెట్.
21 ఏళ్ల అథెరా(పేరు మార్చాం) కూడా గోప్యతను ఇష్టపడుతున్నారు. తన స్నేహితుల్లో చాలామంది కూడా అలాగే భావిస్తారని, "ఎవిల్ ఐ" .. (అంటే అసూయతో నిండిన చూపు వల్ల దురదృష్టం లేదా శాపం తగులుతుందనే నమ్మకం) కారణంగా భాగస్వాముల గురించి పోస్ట్‌లు చేయరని ఆమె చెప్పారు.
"ఎవరైనా అసూయతో నా రిలేషన్‌షిప్‌పై చెడు దృష్టి పెట్టకూడదని ఆయన గురించి పోస్ట్ చేయను. అది అనుకోకుండా, తెలియకుండా అయినా కూడా" అని అథెరా అన్నారు.

ఫొటో సోర్స్, Dr Gillian Brooks
పోస్టు శాశ్వతంగా ఉండిపోతుందని..
ప్రజలు తమ ప్రేమ సంబంధాలను ఆన్‌లైన్‌లో ఎలా పంచుకుంటారనే విషయంపై మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో సామాజిక మనస్తత్వవేత్త, డాక్టర్ గ్వెన్డోలిన్ సీడ్మాన్ అధ్యయనం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఏదైనా పోస్ట్ చేస్తే అది శాశ్వతంగా ఉంటుందనే భయం కారణంగా, వ్యక్తిగత వివరాలను షేర్ చేసేటప్పుడు ఆందోళనగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఆన్‌లైన్ కంటెంట్ శాశ్వతంగా ఉంటుందని, దానిని తొలగించడం కష్టమని ప్రజలు గ్రహించినందున, ఇప్పుడు తక్కువగా పోస్ట్ చేస్తున్నారని డాక్టర్ సీడ్మాన్ గమనించారు.
"మీరు నిజంగా దాన్నుంచి దూరంగా ఉండలేరు. అందుకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














