రాహుల్ రవీంద్రన్: సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో చిన్మయి ఫిర్యాదు, ఏమిటీ కేసు? ఎందుకీ వివాదం?

రాహుల్ రవీంద్రన్

ఫొటో సోర్స్, FB/Rahul Ravindran

    • రచయిత, పవన్ కుమార్.డి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొందరిపై గురువారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది జరగడానికి ముందు చిన్మయి ‘ఎక్స్‌’లో ఒక పోస్టు చేశారు.

"ప్రతిరోజు ఈ వేధింపులతో విసిగిపోయాను. మహిళలకు తెలంగాణ‌లో ఉత్తమమైన స్థానం దక్కాలి" అని ‘ఎక్స్‌’లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.

తన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ ఆరుగురు యూజర్ల పేర్లను కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొన్నిరోజులుగా చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్‌ చుట్టూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. రాహుల్ రవీంద్రన్ నటుడు, దర్శకుడు.

మంగళసూత్రంపై రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వివాదం మొదలైంది.

ఇంతకీ రాహుల్ ఏమన్నారు? చిన్మయి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాహుల్ రవీంద్రన్

ఫొటో సోర్స్, FB/Rahul Ravindran

ఫొటో క్యాప్షన్, రాహుల్ రవీంద్రన్

రాహుల్ రవీంద్రన్ ఏమన్నారు?

రాహుల్ రవీంద్రన్ తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐడిల్‌బ్రెయిన్‌ వెబ్‌సైట్‌కు ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

అక్టోబర్ 31న ఆ ఇంటర్వ్యూ వీడియో క్లిప్‌ను 'ఎక్స్'లో ఐడిల్‌బ్రెయిన్ పోస్ట్ చేసింది.

"పెళ్లయినప్పుడు తనకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే.. తాళిబొట్టు నీకు కావాలంటే వేసుకో. నాకు తాళిబొట్టు వద్దు. నేను నిన్ను ఎప్పుడూ అడగను. దానికి చిన్మయి, అదేంటి తాళిబొట్టు వద్దు అనడం ఏంటని అంది. నేను పెళ్లయిన మహిళ అని తెలిసేలా ఏమీ లేదు. నేను వ్యక్తిగతంగా తెలిసినవాళ్లకు తప్ప నాకు పెళ్లయిందా లేదా అనేది ఎవరికీ తెలియదు.

కానీ, మహిళకు అది ఓ సర్టిఫికేట్ ఆఫ్ పొసెషన్. ఇది ఫలానా వాళ్ల ప్రాపర్టీ, దగ్గరికి రావద్దు అనేలా ఉంటుంది. నాకు అది నచ్చదు. అలా అని నేను వేసుకోవద్దని చెప్పను. ఇప్పటిదాకా తను తాళిబొట్టు వేసుకుంటోంది. ఇంకా బొట్టు పెట్టుకుంటోంది. కానీ, నేను ఎప్పుడు దాని గురించి అడగను" అని అన్నారు రాహుల్.

తర్వాత రాహుల్ వ్యాఖ్యలను ‘ఎక్స్’లో నవంబర్ 3న ఓ పేజీ పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

రాహుల్ మాట్లాడిన క్లిప్ కింద వందల కొద్దీ కామెంట్లు కనిపించాయి. అందులో కొందరు రాహుల్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడారు.

రాహుల్ రవీంద్రన్, చిన్మయి

ఫొటో సోర్స్, Getty Images

సమర్థించే వారు ఏమన్నారు?

"నా భార్య ఎప్పుడు మంగళసూత్రాన్ని ధరించలేదు. తన ఉద్యోగాన్ని వదిలేసి మా బిడ్డను చూసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను తనకు నా శాలరీలో 50 శాతం ఇస్తున్నాను. తనకు సరిగా వంట చేయడం రానందున పదేళ్లుగా నేనే మా ఇంట్లో వంట చేస్తున్నాను. ఆమె కొన్ని ఉద్యోగాలు కూడా చేసింది. దీన్నే మీ భాగస్వామిని సమానంగా చూడడం అంటారు" అని విష్ణు అనే యూజర్ కామెంట్ చేశారు.

"మంగళసూత్రాన్ని ధరించాలా వద్దా అనేది వాళ్ల ఎంపికే- పూర్తిగా అంగీకరిస్తాను. కానీ సంబంధాలు, సామాజిక జీవితమనేవి కొన్ని నియమాలు, పరిమితుల మీద ఆధారపడిన సమాజంలో మనం జీవిస్తున్నాం. అలాంటి సమాజంలో జీవిస్తున్నప్పుడు ఆ నియమాలను పాటించాలి. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీకు నచ్చినట్టుగా మీరు బతకొచ్చు’’అని అరుణ్ కుమార్ విజయ్ అనే ఓ యూజర్ ట్వీట్ చేశారు.

విమర్శించే వారు ఏమన్నారు?

"వివాహం అంటే ప్రదర్శించేది కాదు. మంగళసూత్రం అనేది ఆత్మల ఐక్యతకు పవిత్ర చిహ్నం. ఇది వైవాహిక జీవిత సముద్రంలో పురుషులు అవిధేయులుగా ఉండకూడదని, స్త్రీల జీవ గడియారాన్ని అర్థం చేసుకోవడానికి ఉండే ఒక బాధ్యత. ఇది పురుషుల నుంచి స్త్రీత్వం పట్ల గౌరవం, బాధ్యత" అని నల్లారి నాయుడు అనే యూజర్ ట్వీట్ చేశారు.

" సంప్రదాయాలపైన గౌరవం లేనప్పుడు, సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటా! హ్యాపీగా పెళ్లి అనే కాన్సెప్ట్ లేకుండా కలిసి బతకవచ్చుగా!" అని వాల్తేటి అనే యూజర్ ట్వీట్ చేశారు.

చిన్మయి

ఫొటో సోర్స్, Insta/Chinmayi

ఎక్స్ స్పేసెస్‌లో ఏం జరిగింది?

రాహుల్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ యశస్విని అనే యూజర్ కామెంట్ చేయడంతో కొంతమంది ట్విట్టర్ యూజర్లు ఆమెను, చిన్మయిని లక్ష్యంగా చేసుకుని "మేల్ ఫెమినిస్ట్స్ కమ్ హియర్" అని ఎక్స్ స్పేసెస్‌లో మాట్లాడారు.

అక్కడ శ్రోతగా ఉన్న యశస్విని వాళ్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేశారు. అందులో వాళ్లు అసభ్యంగా మాట్లాడారు.

చిన్మయి

ఫొటో సోర్స్, Insta/Chinmayi

చిన్మయి పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు?

యశస్విని పోస్ట్ చేసిన ఈ రికార్డింగ్ క్లిప్‌ను జోడిస్తూ పోలీసులకు చిన్మయి ‘ఎక్స్‌’లో ఫిర్యాదు చేశారు.

"ఇలాంటి ప్రవర్తనకు ఇక్కడ అనుమతి ఉందా అనేది తెలియదు. దయచేసి చర్యలు తీసుకోండి. నేను ఫిర్యాదు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను" అని తెలంగాణ డీజీపీ, షీటీమ్స్, తెలంగాణ పోలీసులను ఆమె ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

మరో పోస్టులో.. "దీన్ని పరిగణనలోకి తీసుకోండి. ప్రతిరోజు ఈ వేధింపులతో నేను అలసిపోయాను. తెలంగాణలో మహిళలకు ఉత్తమ స్థానం ఉండాలి.

వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వదిలేసి వెళ్లిపోవచ్చు. నేను ఫిర్యాదు చేయడానికి సంతోషిస్తున్నా. ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి" అని వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ అన్నారు.

ఈ ఫిర్యాదుకు స్పందించిన సజ్జనార్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను, హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేసి, పరిశీలించాలని కోరారు.

స్పందించిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)