భారత్‌కు ఇబ్బంది కలిగేలా డోనల్డ్ ట్రంప్ చేసిన 6 ప్రకటనలేంటి?

ఫొటో సోర్స్, JIM WATSON/AFP via Getty Images
ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అనేక సందర్భాలో చేసిన ప్రకటనలు, చర్యలతో భారత్ ఎన్నో సార్లు అసౌకర్యానికి గురైంది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదంటూ ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఈ మధ్యనే చెప్పారు.
దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకున్న సమాచారం ప్రకారం..'' ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు'' అని గురువారం నిర్వహించిన తన వీక్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపింది.
అయితే, ట్రంప్ తన ప్రకటనలతో భారత్‌ను ఇబ్బంది పెట్టడం ఇదే తొలిసారి కాదు.
ఇంతకుముందు కూడా, చాలా సందర్భాల్లో ట్రంప్ ఇలాంటి ప్రకటనలు, చేతల కారణంగా భారత్ వాటిని తిరస్కరించడమో, లేదంటే మౌనంగా ఉండటమో చేయాల్సి వచ్చింది.
ఈ కథనంలో ట్రంప్ చేసిన ప్రకటనలు, వాదనలతో భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురైందో చూద్దాం..

1. భారత్‌పై సుంకాలు, ఈయూకు విజ్ఞప్తి
ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు, ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగాల్లో.. ఒకవేళ తాను అధ్యక్షుడినైతే, ఒక్క రోజులో రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపివేస్తానని చెప్పారు.
కానీ, తాను అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు ఆ విషయంలో విజయం సాధించలేకపోయారు. బదులుగా రష్యాపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చేందుకు దాని వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు.
ఈ ఏడాది జులైలో అప్పటికే భారత్‌పై విధిస్తోన్న 25 శాతం సుంకాలకు అదనంగా మరో 25 శాతం సుంకాలను పెనాల్టీగా విధించారు.
రష్యా నుంచి చమురు కొనడాన్ని భారత్ ఆపివేయాలని హెచ్చరించారు.
అంతేకాక, రష్యాకు కౌంటర్‌గా భారత్, చైనాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించాలని యూరోపియన్ యూనియన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆ సమయంలో ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు జరుపుతోంది.

2. ‘‘భారత్ రష్యా చమురు కొనదని మోదీ చెప్పారు’’
కిందటివారం ఓవల్ ఆఫీసులో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ''భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు స్నేహితుడు. మా మధ్య మంచి స్నేహబంధం ఉంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై నేను సంతోషంగా లేను. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ఈరోజు మోదీ నాకు హామీ ఇచ్చారు'' అని పేర్కొన్నారు.
యుక్రెయిన్‌పై యుద్ధంలో పోరాడేందుకు రష్యాకు ప్రధాన ఆదాయ వనరు చమురు విక్రయాలేనని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే పని మొదలుపెట్టాయి.
''ప్రధాని మోదీ ట్రంప్‌కు భయపడుతున్నారు. రష్యా ఆయిల్‌ను భారత్ కొనుగోలు చేయదని నిర్ణయించడానికి, ప్రకటించడానికి ఆయన ట్రంప్‌కు అనుమతించారు. పదేపదే ఈ ప్రకటనలు చేస్తూ అవమానిస్తున్నప్పటికీ, ట్రంప్‌కు ఆయన శుభాకాంక్షల సందేశాలు పంపుతూనే ఉంటారు'' అని ఎక్స్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
ట్రంప్ ప్రకటనపై భారత్ ఒకరోజు తర్వాత స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని పేర్కొంది.
'' భారత్ పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. భారత వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మా ప్రాధాన్యత. అనిశ్చితిగా ఉండే ఇంధన మార్కెట్‌లో ధరలను స్థిరంగా ఉంచడం, సవ్యంగా సరఫరా చేయడం మా రెండు ప్రధాన లక్ష్యాలు'' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, EVAN VUCCI/POOL/AFP via Getty Images
3. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన
పాకిస్తాన్‌తో భారత్ నాలుగు రోజుల సైనిక ఘర్షణ సమయంలో ట్రంప్ చేసిన ఎన్నో ప్రకటనలు, వ్యాఖ్యలు భారత్‌కు ఇబ్బంది కలిగించాయి.
కాల్పుల విరమణపై ఆయన తొలి ప్రకటన చేశారు. మే 10న సాయంత్రం 5 గంటలకు ట్రంప్ హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన చేశారు.
కాల్పుల విరమణ గురించిన తొలి సమాచారం భారత ప్రజలకు ఇటు భారత్ నుంచి కానీ, అటు పాకిస్తాన్ నుంచి రాలేదు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచే వారు ఆ విషయాన్ని తెలుసుకున్నారు.
'' భారత్, పాకిస్తాన్ మధ్య రాత్రంతా అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఈ తర్వాత ఇరు దేశాలు పూర్తిగా, తక్షణ,సంపూర్ణ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి'' అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో రాశారు.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో నుంచి కూడా ఇదే రకమైన ప్రకటన వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కాల్పుల విరమణ ప్రకటన విషయంలో ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అయితే, కశ్మీర్ అనేది ద్వైపాక్షిక సమస్య అని, ఏ మూడో దేశ మధ్యవర్తిత్వం దీనిలో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమని భారత్ విధానం చెబుతోంది.
ట్రంప్ ప్రకటన భారత్‌కు అసౌకర్యం కలిగించింది.
ట్రంప్, రుబియో ప్రకటనల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్న వివరాల్లో.. ఈ ప్రకటన విషయంలో రెండు దేశాల మధ్య పెద్దగా సమన్వయం లేదని లేదంటే అమెరికా ప్రకటనలోని ప్రతి అంశంతోనూ భారత్ పూర్తిగా ఏకీభవించలేదని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే, తన పోస్టులో జైశంకర్ అమెరికా పేరును ప్రస్తావించలేదు. ''కాల్పులు, సైనిక చర్యల విరమణ ఒప్పందంపై భారత్, పాకిస్తాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. టెర్రరిజం విషయంలో భారత్ రాజీపడదు. మా ఈ వైఖరిని కొనసాగిస్తాం'' అని జైశంకర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4. పదేపదే కాల్పుల ఘనత తనదేననడం
డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చేసే పోస్టులలో, తన ప్రకటనలలో కాల్పుల విమరణను తానే తీసుకొచ్చినట్లు పదేపదే చెబుతున్నారు.
కాల్పుల విరమణకు ఒప్పుకునేందుకు వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడానని చెప్పిన ఆయన, భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించిన ఘనతను తీసుకున్నారు.
ట్రంప్ ప్రకటనతో భారత్‌లోని విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టాయి. దీనికి ప్రధాని సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించాయి.
అయితే, ట్రంప్ వాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. జులైలో ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో, ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఆ ప్రకటనలన్నీ నిరాధారమని ప్రధాని మోదీ చెప్పారు.
''ఏ ప్రపంచ నేత ఆపరేషన్‌ను ఆపమని భారత్‌కు చెప్పలేదు'' అని పార్లమెంట్‌లో మోదీ ప్రకటించారు.
అయినప్పటికీ, ట్రంప్ దీనిపై తన ప్రకటనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏడు నెలల్లో పలు యుద్ధాలను ఆపానని, దీనికి తాను నోబెల్ బహుమతికి అర్హుడని యూఎన్ జనరల్ అసెంబ్లీలో కూడా తెలిపారు.

ఫొటో సోర్స్, BING GUAN/POOL/AFP via Getty Images
5. ఫైటర్ జెట్ల కూలిపోయాయనే ప్రకటన
మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయని జులైలో డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
అయితే, ఏ దేశానికి చెందిన ఎన్ని విమానాలు కూలిపోయాయో ట్రంప్ స్పష్టం చేయలేదు.
ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ అంతకుముందు తెలిపింది. ఈ ప్రకటనను భారత్ కొట్టివేసింది.
మే నెలలో బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. 'విమానం కూలిపోయిందా లేదా అనేది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు, కానీ అది ఎందుకు జరిగిందనేదే ముఖ్యం' అని స్పష్టం చేశారు.
అయితే, విమానాల సంఖ్య గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు.
అలాగే, ఆరు విమానాలను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ వాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు.
పాకిస్తాన్ వాదనలు పూర్తిగా అబద్ధాలని అనిల్ చౌహాన్ మే 31న పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6. శ్వేతసౌధంలో ఆసిమ్ మునీర్‌తో సమావేశం
మేలో భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ తర్వాత జూన్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించారు.
ఈ సమయంలో వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, మునీర్‌తో కలిసి భోజనం చేశారు. ఇస్లామాబాద్‌లో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా కనిపించింది. ఇది భారత్‌కు అసౌకర్యంగా అనిపించింది.
అంతకుముందు ప్రధాని మోదీ జీ-7 సదస్సు కోసంయ కెనడాలోనిఅల్బెర్టా చేరుకోకముందే ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ సమావేశం కావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. "అమెరికా సీనియర్ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో తరచుగా సమావేశమవుతారు. కానీ, అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడం అసాధారణం" అని దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను నిశితంగా పరిశీలించే మైకేల్ కుగెల్‌మన్ ఎక్స్‌లో రాశారు.
"ఇప్పుడు భారత్ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఉగ్ర దాడికి సూత్రధారిగా భారత్ ఎవరినైతో భావిస్తుందో అదే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో ట్రంప్ కలవబోతున్నారు" అని ఇండో-పసిఫిక్ ప్రాంత వ్యవహారాలను నిశితంగా పరిశీలించే విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మాన్ ఎక్స్‌లో తెలిపారు.
ఆ తర్వాత అక్టోబర్‌లో ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో కలిశారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను తనను కలవడం గౌరవంగా భావించానని చెప్పారు.
''పాకిస్తాన్‌కు చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి నన్ను కలిశారు. లక్షల మంది జీవితాలను కాపాడినందుకు ఆయన నన్ను అభినందించారు'' అంటూ ట్రంప్ ఆసిమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














