గుజరాత్‌: ఆ గేదె పాలు తాగినవారందరికీ టీకాలు.. అసలేమైంది?

రేబిస్, గేదె, వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Pravin Fatehsinh Raj/getty

    • రచయిత, అపూర్వ అమీన్
    • హోదా, బీబీసీ కోసం

ఇటీవల గుజరాత్ రాష్ట్రం భరూచ్‌లోని అమోద్ తాలూకా కోబ్లాలో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది.

ఈ గ్రామంలో నవంబర్ 8న ఓ గేదె పాలు తాగిన తర్వాత, గ్రామస్తులు టీకాలు వేయించుకోవడానికి పరుగులుపెట్టినట్టు తెలుస్తోంది.

దాదాపు ఏడాదికిందట గ్రామంలో పాలిచ్చే గేదెను కుక్క కరిచిందని, తర్వాత ఆ గేదెకు రేబిస్ లక్షణాలు కనిపించడంతో, ఆ గేదె పాలు తాగిన గ్రామస్తులు రేబిస్ టీకాలు వేయించుకున్నారు. మరోపక్క గేదె యజమాని, ఆయన కుటుంబం కూడా అమోద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రేబిస్ వ్యాక్సీన్ వేయించారు.

తరువాత, ఆ పాలు వినియోగించినవారికి, గేదె పాలతో తయారు చేసిన జున్ను తిన్న వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రేబీస్ సోకిన గేదెపాలు తాగామనే భయంతో గ్రామస్తులలో చాలామంది డాక్టర్ సలహామేరకు ఆమోద్ సామాజిక ఆరోగ్యకేంద్రం ముందు టీకాలు వేసుకోవడానికి బారులు తీరారు.

ఇప్పటివరకు 39 మందికి రేబిస్ టీకాలు వేశారు.

అసలింతకీ ఏం జరిగింది? రేబీస్ సోకిన గేదె పాలు తాగినవారికి కూడా ఆ వ్యాధి వ్యాపిస్తుందా? దీనిపై డాక్టర్లు ఏం చెబుతున్నారు?

రేబీస్ ఓ ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులు కరవడం లేదా దాని లాలాజలం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.

ఈ వైరస్ మానవ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.

దీంతో కోబ్లాలోని మిగతా ప్రజలు కూడా వీలైనంత త్వరగా యాంటీ-రేబిస్ వ్యాక్సీన్ తీసుకోవాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

గ్రామస్తులకు రేబిస్ వ్యాక్సీన్ బూస్టర్ డోస్ ఇచ్చినట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.

వైరస్, గ్రామస్తులు, ప్రభుత్వ ఆస్పత్రి

ఫొటో సోర్స్, Sajid Khan

ఫొటో క్యాప్షన్, భరూచ్‌లోని కోబ్లాలో రెేబిస్ సోకిన గేదె పాలు తాగిన స్థానికులందరూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ వద్ద క్యూ కట్టారు.

గ్రామస్తులు ఏమంటున్నారు?

గేదె యజమానితో సహా గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు, ఈ గేదె పచ్చి పాలతో వంకాయ కూర తయారుచేసుకుని తిన్నారు.

ఆ గేదె రేబిస్ లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత చనిపోయింది.

గేదెకు రేబిస్ ఉందని పశువైద్యుడు నిర్ధరించడంతో, ఆ గేదె పాలు తాగిన స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి.

"మా గ్రామంలో 500 మంది జనాభా ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఆ గేదె పాలు తాగారు. దానికి రేబిస్ ఉందని తేలడంతో, గ్రామస్తులకు టీకాలు వేయించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పటికైతే ఎవరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదు" అని కోబ్లా సర్పంచ్ రాజు భర్వాద్ చెప్పారు.

"ఆ సమయంలో గ్రామంలో బేసన్ అనే కార్యక్రమం జరిగింది. అప్పుడు ప్రజలు ఈ గేదె పాలతో తయారు చేసిన టీ తాగారు. ఇప్పుడేమో ఆ గేదె మృతదేహాన్ని జేసీబీతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు" అని గ్రామస్థుడు విజయ్ ఠాకోర్ అన్నారు.

రేబిస్

ఫొటో సోర్స్, Pravin Fatehsinh Raj

ఫొటో క్యాప్షన్, రేబిస్ సోకిన గేదె తరువాత చనిపోయింది.

గేదెలో ఏ లక్షణాలు కనిపించాయి?

"ఆ గేదె వయసు మూడేళ్లు, ఏడాది కిందట కుక్క కరిచింది. నెల క్రితం ఒక దూడకు జన్మనిచ్చింది. ఇటీవల ఆ గేదె మాపై దాడిచేయడానికి వచ్చింది. అప్పటినుంచి దాన్ని ఒక గుంజకు కట్టేసి ఉంచాం. ఆ సమయంలో దానికి రేబిస్ లక్షణాలు కనిపించాయి. అది పాలు పితకనీయలేదు. దాని దూడ కూడా పాలు తాగడం లేదు" అని ఆ గేదె యజమాని ప్రవీణ్ సింగ్ ఫతే సింగ్ రాజ్ అన్నారు.

అనుమానం వచ్చి స్థానిక పశు వైద్యుడిని పిలిపించానని, ఆ గేదెను పరీక్షించిన డాక్టర్, దానికి రేబిస్ వ్యాధి ఉందని నిర్ధరించారని, మిగిలిన గేదెలకు అలాగే కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేయించాలని డాక్టర్ సూచించడంతో అందరికీ టీకాలు వేయించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మిగిలిన గేదెలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు.

ఈ గేదెను పరీక్షించడానికి వచ్చిన రావుజీభాయ్ చునారా, ఆ గేదె లక్షణాల గురించి మాట్లాడుతూ, "ఈ గేదె ప్రజలపై దాడిచేయాలనుకోవడంతోపాటు ఎక్కువగా మూత్ర విసర్జన చేసింది. ఒకచోట నిలబడేది కాదు. అటు ఇటూ తిరుగుతుండేది . ఆ తర్వాత, వారం రోజుల్లోనే అది చనిపోయింది" అన్నారు.

గుజరాత్, వైరస్

ఫొటో సోర్స్, Sajid Khan/BBC

39 మందికి టీకాలు

"గ్రామస్తులకు యాంటీ-రేబిస్ వ్యాక్సీన్ ఇచ్చాం. ఇప్పటివరకు, ఎవరికీ రేబిస్ లక్షణాలు కనిపించలేదు కానీ ఈ గ్రామానికి 'వెయిట్ అండ్ వాచ్' విధానం అమలు చేశారు. గ్రామంలోని మొత్తం 39 మందికి టీకా వేశారు" అని భరూచ్ అదనపు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మునిరా శుక్లా వివరించారు.

"గేదెలలో రేబిస్ చికిత్స గ్రేడ్ ఆధారంగా ఉంటుంది, కానీ ఈ సందర్భంలో, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, గేదెతో సంబంధం ఉన్న వారందరికీ టీకా బూస్టర్ డోస్ ఇవ్వడం మా ప్రాధాన్యం. ఈ టీకాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు" అని కోబ్లా గ్రామ వైద్య అధికారి డాక్టర్ మాన్సి రాఠీ అన్నారు.

కుక్క కాటు, రేబిస్, వైరస్, నాడీ వ్యవస్థ

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

రేబిస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) వెబ్‌సైట్‌లో రేబిస్ గురించి ప్రచురించిన సమాచారం ప్రకారం ,150కి పైగా దేశాలలో, ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో రేబిస్ ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. ఈ వ్యాధి ఏటా వేలాది మరణాలకు కారణమవుతుంది. వీటిలో 40% మరణాలు 15 సంవత్సరాలలోపు వయసు వారివే అని తెలుస్తోంది.

కుక్క కాటు లేదా కుక్క గోళ్లతో గీరడం వల్ల మానవులలో 99% రేబిస్ కేసులు సంభవిస్తాయి.

"క్లినికల్ లక్షణాలు కనిపించకముందే వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకి సోకిన 100% కేసులలో రేబిస్ ప్రాణాంతకమే. అయితే, తక్షణమే పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స అందించడం ద్వారా రేబిస్ మరణాలను నివారించవచ్చు, ఇది వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరకుండా నిరోధిస్తుంది" అని డబ్యూహెచ్ఓ పేర్కొంది.

రేబిస్

ఫొటో సోర్స్, Dr. Aniket Patel/BBC

"రేబిస్ ప్రధానంగా కుక్కలలో కనిపిస్తుంది. ఇది సోకిన జంతువుల లాలాజలంలో వైరస్ ఉంటుంది. ఈ లాలాజలం మనిషి లేదా ఇతర జంతువుల రక్తంతో కలిసినప్పుడు, శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుంది" అని గాంధీనగర్‌లోని ఇండ్రోడా నేచర్ పార్క్-గిర్ ఫౌండేషన్‌లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అనికేత్ పటేల్ అన్నారు.

"వైరస్ వివిధ కణజాలాల ద్వారా ప్రయాణించి,కేంద్ర నాడీ వ్యవస్థను చేరుకుంటుంది. దీనికి కొన్ని వారాల నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. వ్యాధి సోకిన జంతువుపాలు తాగడం ద్వారా వ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దానిని తోసిపుచ్చలేం" అని ఆయన చెప్పారు.

"ఏదేమైనా, మేం డబ్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తుంది. ఇది అన్ని పట్టణ, ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లతో పాటు సివిల్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంది. ఒక వ్యక్తికి రేబిస్ వచ్చే అవకాశం 1% (వైద్య భాషలో దీనిని ఆ వ్యక్తి 'ఎక్స్‌పోజర్' అంటారు)కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తప్పనిసరిగా వ్యాక్సీన్ తీసుకోవాలని సూచిస్తాం. కాబట్టి రేబిస్ సోకిన గేదె పాలను కాచుకుని తాగినాసరే, ఆ వ్యక్తులను ఎక్స్‌పోజర్ కేటగిరీలో ఉంచడం అవసరం" అని డాక్టర్ అనికేత్ పటేల్ అంటున్నారు.

కుక్క కాటు, వైరస్, రేబిస్

ఫొటో సోర్స్, Getty Images

రేబిస్ వ్యాధి లక్షణాలు ఏమిటి?

"రేబిస్ వ్యాధికి ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. అయితే లక్షణాలు బయటపడే సమయం మాత్రం వైరస్ ప్రవేశించిన ప్రదేశం, వైరల్ లోడ్ వంటి అంశాలపై ఆధారపడి వారం నుంచి ఏడాది వరకు మారొచ్చు" అని డబ్యూహెచ్ఓ పేర్కొంది.

రేబిస్ ప్రారంభ లక్షణాలలో జ్వరం, నొప్పి, గాయమైనచోట తీవ్రమైన మంటపుట్టడం, దురద లేదా ఉంటాయి అని డబ్యూహెచ్ఓ వివరించింది.

వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు, మెదడు, వెన్నుపాములలో వాపు ఏర్పడుతుంది. క్లినికల్ రేబీస్ ఉన్న రోగిలో లక్షణాలను నియంత్రించవచ్చు, కానీ వ్యాధిని పూర్తిగా తగ్గించడం అసాధ్యమని డబ్యూహెచ్ఓ పేర్కొంది.

"ఒక వ్యాధి సోకిన జంతువు మరొక జంతువును కరిచినప్పుడు, రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి ఉగ్రంగా ప్రవర్తించడం, రెండోది చలనం లేకుండా ఉండడం" అని డాక్టర్ అనికేత్ పటేల్ అంటున్నారు.

"కోపంగా మారిన జంతువు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అంటే దాడిచేయడం మొదలుపెడుతుంది. గొంతులో వాపు కారణంగా నీరు లేదా ఆహారాన్ని మింగలేకపోతుంది. చలించకుండా ఉన్న జంతువు చొంగ కార్చుతూ, పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది" అని ఆయన చెప్పారు.

"రేబిస్ ఉన్న మనిషికి వెలుతురు, నీరు పడకపోతే దానిని హైడ్రోఫోబియా అంటారు" అని ఆయన చెప్పారు.

"హైడ్రోఫోబియాకు కారణం గొంతు చుట్టూ ఉన్న కండరాల పక్షవాతం, దీని కారణంగా రోగి ఏమీ మింగలేడు. అలాగే నియంత్రణ కోల్పోతాడు. వస్తువులను కూడా కొరకాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితి వస్తే ఆ రోగి రెండు నుంచి నాలుగు రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది" అని డాక్టర్ అనికేత్ పటేల్ తెలిపారు.

ఇక టీకా విషయానికొస్తే, రేబిస్ సోకిన జంతువు లేదా కుక్క మనిషిని కరిచిన రోజు నుంచే టీకా వేయడం మొదలవుతుందని ఆయన చెబుతున్నారు.

"కుక్క కరిచిన రోజు నుంచి 3వరోజు, 7వరోజు, 14వరోజు, 28వ రోజుల్లో ఇస్తారు. మొత్తం ఐదు డోసుల టీకాలు అవసరం" అని ఆయన తెలిపారు.

"ప్రథమ చికిత్సలో, ముందుగా గాయాన్ని నీరు, యాంటిసెప్టిక్‌తో శుభ్రం చేయాలి. ఆపై టీకా కోసం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. గాయం కేటగిరీ 2 కంటే ఎక్కువగా ఉంటే, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్‌ను గాయం చుట్టూ ఉన్న ప్రాంతంలో 24 గంటల్లోపు ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు" డాక్టర్ అనికేత్ పటేల్ వివరించారు.

రేబీస్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో రేబిస్

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం 2024లో మొత్తం కుక్క కాటు కేసుల సంఖ్య 37,17,336 కాగా, 'అనుమానిత రేబిస్ మరణాల' సంఖ్య 54గా ఉన్నట్టు ది హిందూ.కామ్ పేర్కొంది.

భారతదేశంలో విస్తృతమైన అంటువ్యాధులు, మరణాలకు రేబీస్ కారణం అని నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పేర్కొంది.

అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తప్ప, దేశవ్యాప్తంగా రేబిస్ కేసులు నమోదవుతున్నాయి.

భారతదేశంలో పిల్లులు, తోడేళ్ళు, నక్కలు, ఉడుములు, కోతులు కూడా రేబిస్ వ్యాధికి ఇతర కారకాలు. భారత్‌లో గబ్బిలాల నుంచి రేబిస్ సోకినట్టుగా ఇప్పటివరకు కేసులేవీ నమోదుకాలేదు.

2030 నాటికి రేబిస్ నుంచి మానవ మరణాలను పూర్తిగా నివారించాలని ఎన్ఆర్‌సీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)