రోజ్ వాటర్‌‌ భారత్‌లోకి ఎలా వచ్చింది? దీని చుట్టూ ఉన్న కథేంటి?

రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పవన్ కుమార్.డి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోజ్ వాటర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగులో గులాబీ నీళ్లు అని, ఉర్దూలో అర్క్-ఇ-గులాబ్ అని పిలిచే దీనికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది.

శరీర సౌందర్యం కోసం, కొన్ని వ్యాధుల నుంచి రక్షణ కోసం, అంతేకాదు హైదరాబాద్ బిర్యానీ సహా పలు రకాల వంటకాల్లోనూ దీన్ని విరివిగా వినియోగిస్తుంటారు.

భారత్‌లో హాథ్రాస్, కనోజ్, శ్రీనగర్, పుష్కర్ వంటి ప్రాంతాల్లో రోజ్ వాటర్ తయారీపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు.

మరి ఈ రోజ్ వాటర్ అసలు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించింది? దీని చరిత్ర ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ చరిత్రలో రోజ్ వాటర్ ఆనవాళ్లు ఏంటి?

ప్రాచీన మెసపటోమియా నాగరికత కాలం నాటి ‘క్యూనిఫామ్ టెక్ట్స్‌’లో గులాబీలను వేడి చేసి సువాసన భరితమైన నీళ్లను తయారు చేశారని ఉన్నట్లు నేషనల్ ప్రొడక్ట్స్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన కథనంలో నియర్ ఈస్ట్ యూనివర్సిటీ ఫార్మసీ ఫ్యాకల్టీ కె. హుస్ను క్యాన్ బసేర్ చెప్పారు.

పురావస్తు, శిలాజాల ఆధారంగా వేల ఏళ్ల కిందటి నుంచే గులాబీలు మనుగడలో ఉన్నాయని యూకేకు చెందిన ఆర్ట్ క్రిటిక్, రీసెర్చర్ సెలియా లిటెల్టన్ 2007లో రాసిన "ది సెంట్ ట్రయల్" పుస్తకంలో పేర్కొన్నారు.

రోమన్లు గులాబీలను ఎక్కువగా ఇష్టపడేవారు. నీరో చక్రవర్తి(క్రీ.శ. 37- 68), గులాబీ విందులను ఏర్పాటు చేసేవారని లిటెల్టన్ రాశారు.

‘ఆ విందుల్లో రోజ్ వాటర్ ఫౌంటెయిన్లను కూడా ఏర్పాటు చేసి, అతిథులను ఆకట్టుకునేవారు. అలాగే భోజనశాల పైభాగంలో తిరిగే డిస్క్‌లు అమర్చి ఉండేవి. అవి తిరినప్పుడల్లా అతిథులపై గులాబీ రేకులు, పర్ఫ్యూమ్‌ను కురిపించేవి’ అని లిటెల్టన్ రాశారు.

తుర్కియేలో రోజ్ వాటర్‌ను 2 వేల సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగించారు.

ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర స్నానం చేసే విధానానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉంది. క్లియోపాత్ర స్నానం చేసేటప్పుడు రోజ్‌వాటర్‌ను కూడా వినియోగించేవారని చెబుతారు.

రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

రోజ్ వాటర్‌ను ఎవరు కనిపెట్టారు?

రోజ్ వాటర్‌ను ఎవరు మొదట తయారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ, రోజ్ వాటర్‌కు చరిత్రలో ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా ఇబ్న్-ఇ-సినా లేదా అవిసెన్నాగా చెబుతారు. నేషనల్ జియోగ్రఫిక్‌ సహా వివిధ వెబ్‌సైట్లు ఈ విషయం పేర్కొన్నాయి.

అమెరికాకు చెందిన ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ ప్రకారం.. రోజ్ వాటర్ మూలాలు ఇరాన్‌లో ఉన్నాయి.

ఇరాన్‌లోని బుఖారా ప్రాంతంలో జన్మించిన అవిసెన్నా ఓ ముస్లిం వైద్యుడు. మధ్యయుగ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, ప్రభావవంతమైన తత్వవేత్త-శాస్త్రవేత్త అని బ్రిటానికా ఓ కథనంలో తెలిపింది. ఈయన 980లో జన్మించి, 1037వ సంవత్సరంలో మరణించారు.

రోజ్ వాటర్‌ను అవిసెన్నా అనేక వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. గులాబీల సారాన్ని మరింత ప్రభావవంతమైనదిగా మార్చేందుకుగాను ఆవిరి ద్వారా డిస్టిల్లేషన్ చేసిన తొలి వ్యక్తిగా ఆయన పేరు పొందారు.

రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Kapil Jain

రోజ్ వాటర్‌ వాడకం భారత్‌లో ఎప్పుడు మొదలైంది?

భారత్‌లో రోజ్ వాటర్ వినియోగం చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి.

అయితే దీనికి మొగల్స్ కాలంలో(1526–1761) ప్రాచుర్యం లభించిందని తెలుస్తోంది.

మొగల్ రాణులు రోజ్ వాటర్‌లో స్నానం చేసేవారు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

చరిత్రకారుడు ఆర్. నాథ్ రాసిన "ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మొగల్స్" పుస్తకంలో రోజ్ వాటర్ ప్రస్తావన ఉంది.

జహంగీర్ తన భార్యల వద్దకు వెళ్లిన రాత్రి ఆయనకు తన భార్య నుంచి, సేవకుల నుంచి ఘనమైన స్వాగతం లభించేదని ఆయన రాశారు.

రాగానే ఆయన వస్త్రాలు తొలగించి, చందనం లేదా రోజ్ వాటర్ లేదా ఇతర ఏదైనా కూలింగ్ ఆయిల్‌తో ఆయన శరీరాన్ని మర్ధనం చేసేవారని పుస్తకంలో పేర్కొన్నారు.

‘ఖుష్బు-ఖానా పేరుతో అక్బర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో అర్గాజా, గుల్‌కర్నా, రూహ్-అఫ్జా, ఒపట్నా, అబిర్మయా, బుఖుర్, కిష్టా వంటి శరీర సౌందర్య ఉత్పత్తుల తయారీలో రోజ్ వాటర్‌ను వినియోగించేవారు’ అని ఆర్.నాథ్ రాశారు.

రోజ్ వాటర్‌ చల్లుతూ వేడుకలు

జహంగీర్ ఆత్మ కథ జహంగీర్ నామాలో రోజ్ వాటర్ ప్రస్తావన ఉంది.

దీన్ని జహంగీర్ భార్య నూర్జహాన్ తయారు చేసినట్లు చెబుతారు. కానీ, దీన్ని నూర్జహాన్ తల్లి అస్మత్ బేగం తయారు చేశారని అందులో జహంగీర్ వివరించారు.

"అస్మత్ బేగం రోజ్ వాటర్‌ తయారు చేస్తుండగా జగ్గుల ద్వారా ఆ వేడి రోజ్ వాటర్ పోసిన పాత్రలపై ఒక తెట్టు ఏర్పడింది. ఆమె దాన్ని మెల్లమెల్లగా సేకరించింది. ఆ పరిమళం ఎంత ఘాటుగా ఉందంటే, ఒక చుక్కను అరచేతిపై రుద్దితే ఆ ప్రాంగణం అంతా గులాబీల వాసనతో గుబాళించేది. ఒకేసారి అనేక గులాబీ మొగ్గలు వికసించినట్లుగా అనిపించేది"

'గులాబ్-పషి' పేరుతో రోజ్‌ వాటర్‌ను చల్లుతూ వేడుకలను జరుపుకునే వారని జహంగీర్ నామా పుస్తకంలో పేర్కొన్నారు.

షాజహాన్ కాలంలో ఉత్సవాల సమయాల్లో రోజ్ వాటర్‌ను చల్లుకునేవారని చరిత్రకారులు రాశారు.

రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

కాకతీయుల కాలంలోనూ..

కాకతీయుల కాలంలోనూ రోజ్ వాటర్ గురించి తెలుసని చెప్పేందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.

గుంటూరు సమీపంలోని మోటుపల్లి వద్ద కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవుని శాసనంలో… చైనా నుంచి వచ్చిన రోజ్ వాటర్ సహా ఇతర వస్తువులపై సుంకాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారని ఇండియన్ రోజ్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌ తెలిపింది.

'అర్క్‌ప్రకాశ్' అనే సంస్కృత గ్రంథంలో రోజ్ వాటర్ గురించి ప్రస్తావించారని, క్రీ.శ.8వ, 9వ శతాబ్దానికి చెందిన ఆచార్య నాగార్జునుడు రోజ్ వాటర్ గురించి వివరాలు అందించారని ఇండియన్ రోజ్ ఫెడరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంది.

రోజ్ వాటర్‌ను ఆహార పదార్థాల్లో ఎక్కడ వాడుతారంటే..

రోజ్ వాటర్‌ను హైదరాబాద్ బిర్యానీ తయారీలో ఎక్కువగా వాడుతారని న్యూజిలాండ్‌లోని కంట్రీబేక్‌లో హెడ్ షెఫ్‌గా పని చేస్తున్న అనిల్ కుమార్ తెలిపారు.

చమ్‌చమ్ వంటి అనేక పదార్థాల తయారీలోనూ, కబాబ్స్‌లోనూ రోజ్ వాటర్‌ను వాడుతారని ఆయన చెప్పారు.

అంతేకాకుండా కాక్‌టెయిల్స్, లస్సీ, రూహ్-అఫ్జా వంటి అనేక రకాల డ్రింక్స్‌లో, రసగుల్లా వంటి స్వీట్స్ తయారీలోనూ దీన్ని వినియోగిస్తారని చెప్పారు.

‘నార్త్ ఇండియన్‌లో రైస్, కర్రీ, డెసర్ట్స్, డిషెస్‌లో వాడుతారని చెప్పారు.

మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో పిలాఫ్, మండి వంటి వాటిల్లో దాన్ని వాడుతారు’ అన్నారు.

ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సర్టిఫై చేసిన రోజ్ వాటర్‌ను ఆహార పదార్థాల్లోను, శరీర సౌందర్యానికి కూడా వినియోగించ్చవచ్చని ఆయన చెప్పారు.

రోజ్ వాటర్

ఫొటో సోర్స్, Getty Images

సెలబ్రిటీలకు రోజ్ వాటర్‌పై ఆసక్తి

రోజ్ వాటర్ స్కిన్ కేర్ కోసం చక్కగా పని చేస్తుందని, అది యాంటీబ్యాక్టీరియల్ ప్రభావాలు కలిగిస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది.

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఫేస్ మాస్క్‌గా తాను రోజ్ వాటర్‌ను వినియోగిస్తానని చెప్పారు.

మరో సందర్భంలో నటి ప్రియాంక చోప్రా తన డీఐవై ఫేస్ ప్యాక్‌లో రోజ్ వాటర్‌ను ప్రస్తావించారు.

అలాగే కాలిన గాయాలు, మచ్చలు, శరీరం కోసుకుపోయినప్పుడు వాటిని నయం చేయడంలోనూ రోజ్ వాటర్‌ను వినియోగిస్తారని మెడికల్ న్యూస్‌ టుడే తెలిపింది.

రోజ్ వాటర్ మార్కెట్ ఎలా ఉందంటే...

2024లో ప్రపంచ రోజ్ వాటర్ మార్కెట్ విలువ 495 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 4,381 కోట్లు) అని లండన్‌కు చెందిన మార్కెట్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది.

2025 నుంచి 2035 మధ్య ఈ మార్కెట్ 7.2శాతం వార్షిక వృద్ధి(సీఏజీఆర్)తో కొనసాగి, 2035 నాటికి మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 8,800 కోట్లు) చేరనున్నట్లు అంచనా వేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)