జలుబు, ఫ్లూ, కోవిడ్.. తేడా ఏమిటి?

ఫొటో సోర్స్, iStock/Getty Images
- రచయిత, నిక్ ట్రిగిల్
- హోదా, హెల్త్ కరస్పాండెంట్
మీకు అనారోగ్యంగా ఉందా? లేకపోతే, మీకు తెలిసినవారెవరైనా ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారా? లేదా ఇటీవల అనారోగ్యం పాలై ఇప్పుడిప్పుడే కోలుకున్నవారైనా ఉండొచ్చు.
చలికాలం ప్రారంభమవుతున్న ప్రస్తుత సమయంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
నాకు తెలిసినవారి అనుభవాలను బట్టి చూస్తే, ఈసారి వ్యాపిస్తున్న వైరస్‌లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
గొంతునొప్పి ఉందా? ఉంది.
ముక్కు కారుతుందా? కారుతుంది.
సైనస్ ఒత్తిడి? అది కూడా చాలా ఉంది.
అయితే.. ఏం జరుగుతోంది?


ఫొటో సోర్స్, Getty Images
''ఇది సాధారణమే, ఏదేమైనా ఇప్పుడు సీజన్ మారుతుంది కదా'' అని లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ జోనాథన్ బాల్ అన్నారు.
వాతావరణంలో మార్పులతో ప్రజలు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం తదితర కారణాలు శ్వాసకోశ వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని స్పష్టిస్తుందని చెప్పారు.
ప్రాథమికంగా, ఇప్పుడు వివిధ రకాల వైరస్‌లన్నీ కలిసి తిరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
సాధారణం కంటే ఎక్కువ అనారోగ్యం ఉందా?
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) డేటా ప్రకారం, గత కొన్ని వారాలుగా రైనోవైరస్ (దీనినే సాధారణంగా మనం జలుబు అని పిలుస్తాం) విజృంభిస్తోంది. ప్రస్తుతం అనారోగ్యానికి ఇదే అత్యంత సాధారణ కారణంగా కనిపిస్తోంది.
కోవిడ్ కూడా ఇప్పుడు వ్యాపిస్తోంది. దీనికి ఎక్స్ఎఫ్‌జీ, ఎంబీ.1.8.1 అనే రెండు కొత్త వేరియంట్‌లు కారణం.
అయితే, ప్రజల్లో ఇప్పటికే అధిక స్థాయిలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందడంతో, చాలామందికి కోవిడ్ చాలా తేలికపాటి ఇన్ఫెక్షన్‌గా మాత్రమే ఉంటోంది.
ఫ్లూ కూడా విజృంభిస్తున్న సంకేతాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల్లో 15 నుంచి 25 సంవత్సరాల వయసు గలవారిలో ఇది పెరిగింది. మరోవైపు, చిన్న పిల్లలలో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ఆర్ఎస్‌వీ కూడా సాధారణంగా ఈ సీజన్‌లో విజృంభించడం కనిపిస్తుంది,
ప్రస్తుతానికి అనారోగ్యాల స్థాయి అంత ఎక్కువగా లేదని యూకేహెచ్ఎస్ఏ కన్సల్టెంట్ ఎపిడెమియాలజిస్ట్ (అంటువ్యాధుల వ్యాప్తి నిపుణుడు) డాక్టర్ జామీ లోపెజ్ బెర్నాల్ అన్నారు.
''కోవిడ్ సాధారణ స్థాయి (బేస్ లైన్) కంటే ఎక్కువగా ఉంది. రైనోవైరస్ అధికంగా వ్యాపిస్తోంది. పిల్లలలో ఫ్లూ వ్యాపించడం మనం ఊహించిన దానికంటే కొంచెం ముందుగానే వచ్చి ఉండవచ్చు. కానీ, ఇది ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది జలుబా, కోవిడా?
లక్షణాలలో చాలావరకూ జలుబు, ఫ్లూ, కోవిడ్ వైరస్‌ల మధ్య ఒకదానితో ఒకటి పోలికలు ఉంటాయి.
ఎన్‌హెచ్‌ఎస్ ప్రకారం, అత్యంత సాధారణమైన లక్షణాలు ఏమిటంటే...
జలుబు:
- లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి
- ఎక్కువగా ముక్కు, గొంతుపై ప్రభావం చూపిస్తాయి
- ప్రారంభ సంకేతంగా చెవుల్లో ఒత్తిడి వస్తుంది
- శ్లేష్మంతో కూడిన దగ్గు
ఫ్లూ:
- అకస్మాతుగా మొదలవుతుంది.
- చాలా అలసటగా అనిపిస్తుంది.
- జ్వరం, కండరాల నొప్పులు, తీవ్ర అలసట
- పొడి దగ్గు
కోవిడ్:
- సాధారణ ఫ్లూ లక్షణాలు
- రుచి లేదా వాసన కోల్పోవడం
- విరేచనాలు లేదా కడుపునొప్పి

ఫొటో సోర్స్, John Ricky/Anadolu via Getty Images
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే...
బలహీనంగా ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రమాదకరంగా మారతాయి. తీవ్రమైన చలికాలంలో ఫ్లూ వేలాది మందికి ప్రాణాంతకంగా మారవచ్చు.
అయితే, ప్రస్తుతం వ్యాపిస్తున్న శ్వాసకోశ వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు సూచించడానికి ఎటువంటి ఆధారం లేదు.
''మనమంతా వేర్వేరు విధాలుగా స్పందిస్తాం. ఎందుకో మనకూ సరిగా తెలియదు'' అని ప్రొఫెసర్ బాల్ అన్నారు.
''వయస్సు, ఫిట్‌నెస్‌కు కచ్చితంగా చాలా సంబంధం ఉంది. కానీ కొన్నిసార్లు ఇది కేవలం మీ వ్యక్తిగత జన్యువులు లేదా మీరు ఎంత అలసటగా, బలహీనంగా ఉన్నారనే దానిపై, లేదా ఆ వైరస్‌కు మీరు చివరిసారిగా ఎప్పుడు గురయ్యారనే దానిపై ఆధారపడి ఉంటుంది'' అని ప్రొఫెసర్ బాల్ చెప్పారు.
ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉంటే, ఇతరులకు వైరస్ సోకకుండా రక్షించడానికి కొన్ని పనులు చేయాలని యూకేహెచ్‌ఎస్ఏ సూచిస్తోంది.
- తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి
- ముఖ్యంగా దగ్గిన తర్వాత లేదా తుమ్మిన తర్వాత చేతులు కచ్చితంగా కడుక్కోవాలి
- వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి, ఒకవేళ బయటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














