అమెజాన్ : భారత్ కన్నా రెండింతలు పెద్దదైన ఈ అడవిలో ‘ఎగిరే నదులు’ ఎందుకు అంతరించిపోతున్నాయి?

ఫొటో సోర్స్, BBC, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా, ఆంటోనియో క్యూబెరో, విజువల్ జర్నలిజం టీమ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 30) ఉత్తర బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలో జరుగుతోంది. ఈ నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్‌కు ముఖద్వారంగా తరచూ చెబుతుంటారు.
పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో భూతాపానికి కారణమయ్యే వాయు ఉద్గారాలను నియంత్రించే ఒప్పందం కుదిరి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో అమెజాన్‌కు ముఖద్వారంగా చెప్పే బెలెమ్ నగరంలో ఈ సదస్సు జరగడం ఓ ప్రతీకాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది.
అయితే ఆ ప్రయత్నాలు ఇంకా ఫలితం ఇవ్వలేదు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణం నుంచి పెద్దఎత్తున కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే అమెజాన్ అడవులు భూతాపాన్ని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కానీ దశాబ్దాలుగా కొనసాగుతున్న అడవుల నరికివేతకు తోడు ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల అసలు అమెజాన్ భవితవ్యం ఏమిటన్నదే అస్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెజాన్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బెలెమ్ రాజధానిగా ఉన్న పారా రాష్ట్రంలో అటవీ విధ్వంసం ఎక్కువగా ఉంది. అందుకే అమెజాన్ అడవుల స్థితిగతులు, అవి ఎదుర్కొంటున్న ముప్పును బీబీసీ లోతుగా పరిశీలించింది.
అమెజాన్ అడవుల్లో 60శాతం బ్రెజిల్‌లో ఉన్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలకు గట్టి రక్షణ కల్పించే ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తున్నానని బ్రెజిల్ చెబుతోంది. ఈ అడవులు భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటాయి. అక్కడ పొడవైన, దట్టమైన పచ్చని చెట్లు ఉంటాయి. అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. తేమ ఎక్కువగా ఉంటుంది.
అమెజాన్‌లో నదీతీర ప్రాంతాలు, చెరువులు, సవన్నాలుగా పిలిచే గడ్డిమైదానాలుంటాయి.
దక్షిణ అమెరికాలో 6.7మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. ఇది భారత్ కన్నా రెండింతలకు పైగా పెద్దది. భూమిపై జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి.


ఫొటో సోర్స్, Reuters/Amanda Perobelli
అమెజాన్ అడవుల్లో ఏమేం ఉన్నాయి?
- 40,000 రకాల మొక్కలున్నాయి.
- యాంట్‌ఈటర్స్, భారీ ఒట్టర్లు సహా 427 క్షీరదజాతులు
- 1,300 రకాల పక్షులున్నాయి.
- గ్రీన్ ఇగ్వానా, నల్లని మొసలి సహా 378 రకాల సరీసృపాలున్నాయి
- విషతుల్యమైన డార్ట్ ఫ్రాగ్ సహా 400రకాలకు పైగా ఉభయచర జాతులున్నాయి. పిరానా, 200కేజీల వరకు బరువుండే అరపైమా సహా మూడు వేల రకాల జల చరాలున్నాయి.
- వీటిలో చాలా రకాలు ఇంకెక్కడా కనిపించవు.
అమెజాన్ నది ప్రపంచంలోనే పెద్దది. దానికి 1100కు పైగా ఉపనదులున్నాయి. ప్రపంచంలోనే తాజా నీటివనరులు ఎక్కువున్న ప్రాంతం.
ఈ నీరు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. స్థానికంగా, అంతర్జాతీయంగా వాతావరణ వ్యవస్థలపై ప్రభావం చూపే సముద్ర ప్రవాహాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెజాన్ అడవులు కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అవి గ్రహించేవాటికన్నా ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయి. ఆహారం, ఔషధాలకు కుడా అమెజాన్ ప్రధాన ప్రాంతంగా ఉంది. బంగారం సహా కొన్ని లోహాలు లభిస్తాయి. చమురు, గ్యాస్ వంటివాటికి ప్రధాన ఉత్పత్తిదారుగా మారవచ్చు. చెట్ల నరికివేతతో భారీ కలప సరఫరా ప్రాంతంగా కూడా మారింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images/NELSON ALMEIDA
ఇప్పుడేం జరుగుతోంది?
20శాతం అడవి నాశనమైందని అంతే మొత్తంలో అడవి పాడైపోయిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు చెబుతున్నాయి. వ్యవసాయం, పశువుల పెంపకం, చెట్ల నరికివేత, మైనింగ్ వంటి కార్యకలాపాలు దీనికి కారణం. కరవు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వంటి వాతావరణ మార్పులు కూడా ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయి.
2022లో దాదాపు 20వేల చదరపు కిలోమీటర్ల అడవి దెబ్బతింది. 2004 తర్వాత ఇంతపెద్దమొత్తంలో అడవి ధ్వంసమవ్వడం ఇదే తొలిసారని అమెజాన్ కన్జర్వేషన్స్ మానిటరింగ్ అండ్ ఏండెస్ అమెజాన్ ప్రోగ్రామ్ (ఎంఏఏపీ)తెలిపింది. 2023లో బ్రెజిల్‌లో ప్రభుత్వం మారిన తర్వాత బ్రెజిల్‌లో ఉన్న అమెజాన్ అడవుల విధ్వంసం చాలా వరకు తగ్గింది.
అయితే అమెజాన్‌లోని కొన్ని భాగాలు తిరిగి సాధారణస్థితికి చేరలేనంత తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి.
చాలా ఏళ్లపాటు జరిగిన చెట్ల నరికివేతతో పాటు వాతావరణ సంక్షోభాలు కూడా దీనికి కారణమయ్యాయి. ఇప్పుడవే అమెజాన్‌కు కొత్త ప్రమాదంగా మారాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images/Pedro Pardo
వరుసగా అగ్నిప్రమాదాలు
ఉష్ణోగ్రత స్థాయుల్లో గణనీయమైన పెరుగుదల, అలాగే దీర్ఘకాల కరువు దశలు, అమెజాన్ అడవుల మౌలికతపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా తేమగా ఉండే ఈ వర్షారణ్యం ఇప్పుడు మరింత పొడిగా మారి అగ్నిప్రమాదాలకు సులభంగా గురయ్యే స్థితికి చేరింది.
ఉదాహరణకు 2024 సెప్టెంబరులో41,463 అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇది 2010 తర్వాత ఆ నెలలో నమోదైన అత్యధిక సంఖ్య అని బ్రెజిల్ అంతరిక్ష సంస్థ (ఐఎన్‌పీఈ) చెబుతోంది.
కరవు, అగ్నిప్రమాదాలు పెరగడం అమెజాన్‌లోని చాలా ప్రాంతాలను దెబ్బతీస్తున్నాయని అమెరికాలోని యేల్ యూనివర్శిటీ ఎకోసిస్టమ్ కార్బన్ క్యాప్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ పాలో బ్రాండో చెప్పారు.
''ఇలా దెబ్బతినడం అమెజాన్‌కు పెద్ద ముప్పుగా మారింది'' అంటారు ఆయన.

ఫొటో సోర్స్, The Washington Post via Getty Images/Rafael Vilela
అంతరించిపోతున్న ఎగిరే నదులు
అమెజాన్ అనే విశాలమైన ఈ అరణ్య ప్రాంతం తనకంటూ ఒక అంతర్గత వాతావరణ వ్యవస్థను కలిగి ఉంది. అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చే తేమను ఈ అరణ్యాలు గ్రహించి, మళ్లీ గాల్లోకి విడుదల చేస్తాయి. ఈ విధంగా వాయుమండలంలో ఏర్పడే తేమ ప్రవాహాలనే శాస్త్రవేత్తలు ఎగిరే నదులు (Flying Rivers) అని పిలుస్తుంటారు.
మొదట ఈ ఎగిరే నదులు అమెజాన్ తూర్పు భాగంలో అట్లాంటిక్ సముద్రానికి దగ్గరగా వర్షాన్ని కురిపిస్తాయి. ఆ తరువాత నేల, మొక్కల ద్వారా ఆ నీటి ఆవిరి మళ్లీ వాయుమండలంలోకి చేరి, పశ్చిమ దిశగా ప్రయాణించి అడవిలో మరోచోట వర్షం కురిపిస్తాయి.
ఇలా తేమచక్రం ఒక అటవీభాగం నుంచి మరో చోటవరకు కొనసాగడమనేది అమెజాన్ అంతటా కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్లే ఈ విస్తారమైన వర్షారణ్యం ఇంతకాలం పుష్ఠిగా, జీవంతో నిండుగా నిలిచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు ఈ తేమ ప్రయాణానికి అంతరాయమేర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విధ్వంసానికి గురైన అటవీప్రాంతాలు సముద్రం నుంచి వచ్చే తేమను సరైన విధంగా వ్యాపింపచేయలేకపోతున్నాయి. ఫలితంగా తక్కువ మొత్తంలో మాత్రమే తేమ మళ్లీ వాతావరణంలోకి చేరుతోంది.
అమెజాన్ అడవుల్లో అంతర్గతంగా అనుసంధానమై ఉండి, తేమను సరఫరా చేసే చిన్నతరహా వాతావరణ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని అమెజాన్ కన్జర్వేషన్ శాస్త్రవేత్త మాట్ ఫైనర్ చెప్పారు. మాట్ ఫైనర్ అమెజాన్ భవిష్యత్తు- ఫ్లైయింగ్ రివర్స్ పాత్రపై తాజాగా విడుదలైన రిపోర్ట్ సహ రచయిత కూడా.
పశ్చిమ అమెజాన్‌పై మరీ ముఖ్యంగా దక్షిణ పెరు, ఉత్తర బొలీవియాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.
''పెరూ, బొలీవియా అడవులు తూర్పున ఉన్న బ్రెజిల్ అడవులపై ఆధారపడి ఉంటాయి.బ్రెజిల్ అడవులు నాశమైతే ఫ్లయింగ్ రివర్స్‌ను ఏర్పరిచే వాటర్ సైకిల్ నాశనమవుతుంది. ఆ నీళ్లు పశ్చిమ అమెజాన్‌కు చేరలేవు. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి'' అని మాట్ ఫైనర్ తెలిపారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images/Rafael Guadeluppe
కోలుకోలేనంతగా నష్టపోయిన కొన్ని ప్రాంతాలు
వాతావరణం పొడిగా ఉండే జూన్ నుంచి నవంబరు వరకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తడిగా, తేమగా ఉండే ప్రాంతాలు గతంలో అగ్నిప్రమాదాలను నిరోధించేవి. కానీ వర్షాలు లేక ఆ ప్రాంతాల్లో ఈ సామర్థ్యం తగ్గుతోంది. అడవులు ఎండిపోవడం ప్రమాదకర స్థాయికి చేరిందని, తిరిగి ఎప్పటికీ కోలుకోలేనంతగా నష్టపోయాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
''అమెజాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి తొలి సంకేతాలు కనిపిస్తున్నాయి'' అని ఫైనర్ చెప్పారు.
ప్రమాదం పెరుగుతోందని, అయితే కొన్ని ప్రాంతాలు ఇంకా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని ఎకోసిస్టమ్స్ ల్యాబ్‌లో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఎరికా బెరెన్‌గ్యూర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters/Ueslei Marcelino
నీటి సమస్య
ఆకాశంలో తేమ ప్రవాహాలు తగ్గడమనేది అడవిపై మాత్రమే కాకుండా అమెజాన్, దాని ఉపనదులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అమెజాన్ బేసిన్‌లో చాలా నదుల్లో ఇటీవలి సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో నీరు తగ్గిపోయింది. 2023లో అయితే 45ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరవు సంభవించింది. ఎల్‌నినో వల్ల 2023లో, 2024 తొలి ఆరు నెలల్లో తీవ్ర ప్రభావం పడింది.

ఫొటో సోర్స్, REUTERS/Amanda Perobelli
మైనింగ్ ప్రభావం
అక్రమ మైనింగ్ ముఖ్యంగా బంగారం తవ్వకాలు అటవీవాతావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ''ఇప్పుడు రేర్ ఎర్త్ మినరరల్స్ కోసం కూడా ఈ ప్రాంతంలో మైనింగ్ మొదలయింది'' అని బెరెన్‌గ్యూర్ చెప్పారు.
మైనింగ్ వల్ల నదులు, మట్టి, మొక్కలు వంటివి కలుషితమవుతాయి. పాదరసం వంటి రసాయనాలు మనుషులకు, జంతువులకు ప్రమాదకరం.
అక్రమంగా మైనింగ్ చేసేవారికి, తుపాకీలు, ఇతర ఆయుధాల అక్రమరవాణాదారులకు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్పారు.
''అమెజాన్ అంతటా నేర వ్యవస్థ విస్తరిస్తోందని, దీనిపై పట్టు సాధించడం అధికారయంత్రాంగానికి కష్టంగా మారిందని మాట్ ఫైనర్ చెప్పారు.
ఎనిమిది దేశాల్లో అమెజాన్ విస్తరించి ఉండడం, ప్రతి ఒక్కదేశానికి సొంత న్యాయవ్యవస్థ ఉండడంతో సీమాంతర నేరాలను నియంత్రించడం సవాలుగా మారింది.
అమెజాన్‌లో హైడ్రోకార్బన్స్ నిల్వలు భారీ ఎత్తున బయటపడడం అమెజాన్ పరిరక్షణకు మరో ప్రమాదంగా మారింది. 2022 నుంచి 2024 మధ్య దాదాపు 5.3 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను కనుగొన్నట్టు ఇన్ఫోఅమెజానియాలో ఉంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కనుగొన్న నిల్వల్లో ఇది దాదాపు ఐదోవంతు. ఇది శిలాజ ఇంధన పరిశ్రమకు కొత్త క్షేత్రంగా మారుతోంది.
ఈ నిల్వలను కనుగొనకముందు, ఫ్లయింగ్ రివర్స్‌పై జరిపిన తాజా పరిశోధన కంటే ముందే ఈ వర్షారణ్యాన్ని ధ్వంసం చేయడం వల్ల 10వేల రకాలకుపైగా మొక్కలు, జంతువులు ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయని అమెజాన్ సైన్స్ ప్యానెల్ తెలిపింది.
అమెజాన్ ఇప్పటికీ కార్బన్‌డైఆక్సైడ్‌ను పెద్దస్థాయిలో పీల్చుకుంటోంది. అమెజాన్ ధ్వంసమవ్వడమంటే వాతావరణ సంక్షోభంపై పోరాటంలో ఓడిపోవడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''అమెజాన్ వంటి ఉష్ణమండల అడవికి కార్బన్ నిల్వ, ఉష్ణోగ్రతలను నియంత్రించడం, భూమిని చల్లబరచడం వంటి సామర్థ్యాలుంటాయి''అని బ్రెజిల్ అటవీశాస్త్రవేత్త టస్సో అజెవెడో చెప్పారు.
''అందుకే అమెజాన్‌ను మనం ప్రపంచాన్ని చల్లబరిచే భారీ ఎయిర్ కండీషనర్ అని పిలుస్తాం'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














