కట్ల పాము కరిస్తే నిద్రలోనే చనిపోతారా? ఇది కరిచిన చోట గాయం కూడా కనిపించదా?

కట్ల పాము

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుభగుణం.కె
    • హోదా, బీబీసీ తమిళ్

ఉత్తర భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో కట్ల పాము(కామన్ క్రైట్)ను ‘శ్వాసను మింగే పాము’ అని పిలుస్తారు.

ఈ పేరు రావడానికి కారణం వీటి కాటుకు గురైన చాలామంది బాధితులు నిద్రలోనే చనిపోవడం.

అయితే ఈ పాము కాటు వల్ల అన్ని సందర్భాల్లోనూ ప్రాణాపాయం ఉండదని.. వీలైనంత వేగం చికిత్స అందితే రోగి ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ఇటీవల తమిళనాడులోని పుదుక్కోటైలో కట్ల పాము కాటుకు గురైన ఆరేళ్ల బాలిక వారం రోజుల చికిత్స తర్వాత కోలుకుంది.

అయితే, కట్ల పాము కాటుకు గురైనవారిలో చాలామంది నిద్రలోనే ఎందుకు చనిపోతారు?

దీని విషం మనిషి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కట్ల పాముల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి.. పాములు, వాటి విషంపై అధ్యయనం జరిపే నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కట్ల పాము, కామన్ క్రైట్ , కోబ్రా, పాము కాటు, విషం

ఫొటో సోర్స్, Dr A. Thanigaivel

కడుపునొప్పితో బాధపడ్డ ఆరేళ్ల బాలిక

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని ఇలుపూర్ దగ్గరలో ఉన్న కులవాయిపట్టి గ్రామంలో పళని, పాపతి దంపతులు జీవిస్తున్నారు. వారి ఆరేళ్ల కుమార్తె శ్రీమతి అక్టోబర్ 15న రాత్రివేళ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది.

కడుపునొప్పితో కూతురు బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రెండు వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. బాలికను రెండు రోజుల తర్వాత పుదుక్కోటై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికి బాలిక కళ్లు తెరవలేని స్థితిలో ఉందని, ఆస్పత్రికి ఆలస్యంగా రావడంతో చికిత్స చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అక్కడి పిల్లల వైద్యుడు అరవింద్ బీబీసీతో చెప్పారు.

"ఆ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందని తల్లిదండ్రులు చెప్పారు. దాంతోపాటు కళ్లు తెరవలేకపోయింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కట్ల పాము కాటు వల్ల కలిగే లక్షణాలు.

మాకు ఈ విషయం అర్ధమైన వెంటనే నిర్ధరణ కోసం అవసరమైన వైద్య పరీక్షలు చేశాం.

ఆ తర్వాత ఆ అమ్మాయికి పాము కాటుకు విరుగుడు మందుతో చికిత్స ప్రారంభించాం" అని ఆయన చెప్పారు.

కట్ల పాము, కామన్ క్రైట్ కోబ్రా, పాము కాటు, విషం

ఫొటో సోర్స్, Dr.MPKoteesvar

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మనోజ్

పాము కాటేసిన తరువాత ఎంతసేపు బతుకుతారు?

కట్ల పాము కాటేసినవారు మరణించడం, చికిత్స తరువాత కోలుకోవడం అనేది వారి శరీరంలోకి ఎంత విషం చేరింది? ఎంత వేగం చికిత్స అందింది అనేదాన్ని బట్టి ఉంటుందని ‘యూనివర్సల్ స్నేక్‌బైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మనోజ్ చెప్పారు.

"ఈ చిన్నారి విషయంలో, పాము ఆమెను ఎప్పుడు కరిచిందో ఎవరికీ తెలియదు. కానీ పాము ఆమెను కరిచినప్పుడు ఆ బాలిక శరీరంలోకి కొద్ది మొత్తంలో మాత్రమే విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉండవచ్చు. ఇలా అందరికీ జరగకపోవచ్చు.. కానీ, ఆ అమ్మాయికి అలా జరిగింది" అని ఆయన అన్నారు.

పాము కాటు వేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందినవారిని తాను చూశానని డాక్టర్ మనోజ్ అన్నారు.

"కట్ల పాము విషం శరీరంలోకి ప్రవేశించిన వెంటనే పనిచేయదు. విషం తక్కువ ఎక్కితే అది ప్రభావం చూపడానికి కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు సమయం పట్టొచ్చు" అని తెలిపారు.

"శరీరం తట్టుకోగలిగేంత తక్కువ మొత్తంలో విషం ఎక్కినా, దాని ప్రభావం కనిపిస్తుంది. అయితే దానికి చాలా సమయం పడుతుంది. బహుశా పుదుక్కోటైలోని బాధిత బాలిక అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చు" అని ఆయన వివరించారు.

విషం తక్కువగా ఉన్నా, శరీరంపై దాని ప్రభావం ఉంటుందని, చికిత్స చేసేవరకు ఆ ప్రభావం తగ్గదని ఆయన అన్నారు.

కట్ల పాము, కామన్ క్రైట్ , కోబ్రా, పాము కాటు, విషం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కట్ల పాము

రాత్రిపూట కాటువేసే పాము

కట్ల పాము కరిచిన తర్వాత ఆ అమ్మాయి రెండు రోజులకు పైగా బతికిందని, ఆ తర్వాత వారం రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుందని మనోజ్ చెప్పారు.

"పాము విషం తక్కువ పరిమాణంలో ఎక్కితేనే ఆ బాలిక తరహాలో కోలుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు. ‘‘లేకపోతే విషం ఊపిరితిత్తులలో వాపునకు కారణమవుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. మరణాలకు దారితీస్తుంది’’ అని తెలిపారు.

‘‘కట్ల పాములు రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటాయి’’అని హెర్పెటాలజిస్ట్ రామేశ్వరన్ చెప్పారు.

"ఇళ్లల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు అవి ఇళ్లలోకి వస్తాయి కాబట్టి, ప్రజలు వాటిని గమనించే అవకాశం తక్కువ. అంతే కాదు, కట్ల పాము ఇతర కొన్ని విషపూరిత పాముల మాదిరిగా కరిచినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. అందువల్ల, దాని ఉనికి గుర్తించలేం'' అని తెలిపారు.

"ఈ పాములు కట్టెల కుప్పలు, సిలిండర్ సందులు వంటి చోట దాక్కుంటాయి, వర్షాకాలం,శీతాకాలాల్లో వెచ్చదనం కోసం ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తాయి" అని చెప్పారు.

కట్ల పాము, కామన్ క్రైట్ , కోబ్రా, పాము కాటు, విషం

ఫొటో సోర్స్, Herpetologist Rameswaran

ఫొటో క్యాప్షన్, రామేశ్వరన్

శరీరంపై పాము ఎక్కడ కరిచిందో తెలియడం లేదా?

చాలా పాములు కాటు వేస్తే గాయాలు కనిపిస్తాయి. కానీ కట్ల పాము కరిస్తే ఒక్కోసారి గాయం కూడా కనిపించదని డాక్టర్ మనోజ్ చెప్పారు.

సాధారణంగా పాము కాటు వేసిన చోట గాయం కనిపిస్తుంది. ఒక్కో రకం పాముల వల్ల అయ్యే గాయం ఒక్కో రకంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి, వాపు, గాయమైన చోట ఎర్రగా లేదా నల్లగా మారడం, బొబ్బలు ఏర్పడడం వంటివి ఉంటాయి.

కానీ కట్ల పాము విషయంలో కాటు వేసిన శరీరభాగంపై ఎలాంటి గుర్తులు కనిపించవు. అందువల్ల, చూడగానే పాము కాటు అని అనుమానించడానికి, నిర్ధరించడానికి అవకాశం తక్కువ’ అని మనోజ్ వివరించారు.

నాగుపాము కోరలు సగటున 8 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. కొన్ని రకాల వైపర్‌లు కాటు వేసిన ప్రదేశంలో బొబ్బలు లాంటి గాయాలు ఉంటాయి.

కానీ కట్ల పాము కాటు వేసిన చోట అలాంటి గుర్తు ఉండదు. దీనికి 4 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో విషపూరిత కోరలుంటాయి.

‘రోగి లక్షణాలు కట్ల పాము కాటు లక్షణాలను పోలి ఉంటే, వెంటనే వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి, తగిన పరీక్షలు నిర్వహించి, ఆపై చికిత్స ప్రారంభించడం మంచిది" అని పదిహేనేళ్లకు పైగా పాము విషం, పాము కాటుపై పరిశోధన చేస్తున్న డాక్టర్ మనోజ్ వివరించారు.

కట్ల పాము, కామన్ క్రైట్ , కోబ్రా, పాము కాటు, విషం

ఫొటో సోర్స్, Getty Images

నిద్రలో మరణానికి కారణమవుతుందా?

"చలిగా ఉన్న సమయంలో వేడిగా ఉండే ఇళ్లలోకి ప్రవేశించే ఈ పాములు కొన్నిసార్లు మనుషులకు దగ్గరగా ముడుచుకుని ఉంటాయి. మనుషులు పొరపాటున వాటికి తగిలినప్పుడు అవి వెంటనే కాటువేస్తాయి'' అని మనోజ్ తెలిపారు.

కట్ల పాము విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి, కాటుకు గురైన వారికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు అవుతున్నట్టు అనిపించడం, కళ్ళు తెరవలేకపోవడం, లాలాజలం దుర్వాసనతో ఉండడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మనోజ్ చెప్పారు.

"దీని విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో, అది ఊపిరితిత్తులలో వాపునకు కారణమవుతుంది, కాటుకు గురైన వారు కనురెప్పలను తెరవలేరు. ఊపిరితిత్తులు శరీరమంతా ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోవడంతో కాటుకు గురైన వారు శ్వాస తీసుకోలేక చనిపోతారు" అని మనోజ్ వివరించారు.

రాత్రి నిద్రపోతున్నప్పుడు కట్ల పాము కాటు వేస్తే, ఆ వ్యక్తిని ఉదయం వరకు ఎవరూ గమనించకపోతే, కాటుకు గురైన వ్యక్తి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని, అందుకనే దాన్ని నిద్రలో మరణానికి కారణమయ్యే పాము అంటారని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)