ఎప్‌స్టీన్ ఫైల్స్: ట్రంప్ ప్రస్తావన ఉన్న ఎప్‌స్టీన్ ఈమెయిల్స్‌లో ఏముందంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాడిన్ యూసుఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్థిక, లైంగిక నేరాల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ నుంచి సంపాదించిన 20 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా చట్టసభ సభ్యులు విడుదల చేశారు. వాటిలోని కొన్ని పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రస్తావన ఉంది.
హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రాట్లు బుధవారం ఉదయం మూడు ఈమెయిల్ సంభాషణలను బయటపెట్టారు. వీటిలో ఎప్‌స్టీన్, ఆయన దీర్ఘకాల సహచరి ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయి.
ఎప్‌స్టీన్ 2019లో జైలులో చనిపోగా, సెక్స్ ట్రాఫికింగ్ నేరానికి గానూ ఘిస్లెయిన్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ట్రంప్ గురించి ఎన్నో పుస్తకాలు రాసిన రచయిత మైఖేల్ వోల్ఫ్, ఎప్‌స్టీన్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలను కూడా విడుదల చేశారు.

ఇందుకు ప్రతిగా గంటల వ్యవధిలోనే రిపబ్లికన్లు కూడా పెద్దసంఖ్యలో పత్రాలను విడుదల చేశారు.
ఎంపిక చేసిన పత్రాలను విడుదల చేసి అధ్యక్షుడు ట్రంప్‌ను అపఖ్యాతి పాలు చేసేలా తప్పుడు కథనాలను సృష్టించేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారంటూ భారీ సంఖ్యలో డాక్యుమెంట్లను రిపబ్లికన్లు విడుదల చేశారు.
'వాస్తవం ఏంటంటే, అధ్యక్షుడు ట్రంప్ దశాబ్దాల క్రితమే జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను బయటకు పంపించేశారు. గియుఫ్రేతో పాటు ఇతర మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకే ఎప్‌స్టీన్‌ను ఆయన దూరం పెట్టారు' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ అన్నారు.
ట్రంప్, ఎప్‌స్టీన్ చాలా ఏళ్లపాటు స్నేహితులుగా ఉన్నారు. ఎప్‌స్టీన్ తొలిసారి అరెస్ట్ కావడానికి రెండేళ్ల ముందు, 2000ల ప్రారంభంలో తమ మధ్య విభేదాలు వచ్చాయని ట్రంప్ చెప్పారు.
ఎప్‌స్టీన్ చేసిన పనులకు తనకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ పదేపదే ఖండిస్తూ వచ్చారు.

'ఈ వ్యవహారంలో ట్రంప్ బయటపడలేదు'
డెమొక్రాట్లు విడుదల చేసిన తొలి ఈమెయిల్ 2011 నాటిది. అది ఎప్‌స్టీన్, మ్యాక్స్‌వెల్ మధ్య జరిగిన సంభాషణ.
ఈ మెయిల్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఎప్‌స్టీన్.. 'ఈ వ్యవహారంలో బయటపడని వ్యక్తి ట్రంప్ అని మీరు గుర్తించాలి. (బాధితురాలు) నా ఇంట్లో గంటల పాటు ట్రంప్‌తో గడిపారు. అయినప్పటికీ, పోలీస్ చీఫ్‌తో సహా ఎవరూ కూడా ట్రంప్ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు' అని రాశారు.
తాను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నానంటూ మ్యాక్స్‌వెల్ మరో ఈమెయిల్‌లో ప్రతిస్పందించారు.
డెమొక్రాట్లు విడుదల చేసిన ఈమెయిల్‌లో బాధితురాలి పేరును గోప్యంగా ఉంచారు. అయితే, కమిటీ విడుదల చేసిన పత్రాలలో ఆమె పేరును 'వర్జీనియా'గా చూపారు.
పత్రాల్లో పేర్కొన్న పేరు.. ఈ ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన, ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రేను సూచిస్తుందని వైట్‌వైస్ తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని, ఎప్పుడైనా కలిసినప్పుడు చాలా స్నేహంగా మాట్లాడేవారని గియుఫ్రే పదే పదే చెప్పినట్లు ఒక ప్రకటనలో వైట్‌హౌస్ వెల్లడించింది.
ట్రంప్ ఒక తప్పులో భాగంగా ఉన్నట్లు తానెప్పుడూ చూడలేదని 2016లో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో గియుఫ్రే పేర్కొన్నారు.
ఈ ఏడాది విడుదలైన ఒక పుస్తకంలో కూడా ఆమె అధ్యక్షుడిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
బాధితురాలి పేరు విషయంలో ఎందుకు గోప్యత పాటించారని అడగగా, బాధితుల కుటుంబాల కోరిక మేరకు తమ పార్టీ ఎప్పుడూ బాధితుల పేర్లను బయటపెట్టదని డెమొక్రాట్ ప్రతినిధి రాబర్ట్ గార్సియా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్‌పై వోల్ఫ్ అభిప్రాయాన్ని కోరిన ఎప్‌స్టీన్
వోల్ఫ్‌తో జరిగిన సంభాషణల్లో ట్రంప్‌తో తన అనుబంధం గురించి ఎప్‌స్టీన్ పంచుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ తన మొదటి పదవీకాలానికి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.
డెమొక్రాట్లు విడుదల చేసిన రెండో ఈమెయిల్, వోల్ఫ్ 2015లో ఎప్‌స్టీన్‌కు రాసినది.
'మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి సీఎన్ఎన్ చానెల్ ట్రంప్‌ను అడగాలని ప్లాన్ చేస్తోంది' అంటూ ఎప్‌స్టీన్‌కు వోల్ఫ్ చెప్పారు.
'ట్రంప్ చెప్పడానికి ఏమైనా సమాధానం సిద్ధం చేయగలమా? దీనికి ఏ సమాధానం చెబితే బాగుంటుంది' అని వోల్ఫ్‌ను ఎప్‌స్టీన్ తిరిగి ప్రశ్నించారు.
దీనికి వోల్ఫ్ ఇలా సమాధానం ఇచ్చారు.
'అతను తనంతట తానే దీనికి సొంత సమాధానం ఇచ్చేలా చేయండి. ఒకవేళ తానెప్పుడూ ఎప్‌స్టీన్ విమానంలో తిరగలేదు, ఇంటికి వెళ్లలేదని చెబితే అది మీకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకవేళ ఆయన నిజంగానే ఎన్నికల్లో గెలిచేలా కనిపిస్తే ఆయన్ను కాపాడి, ఆయన మీకు రుణపడి ఉండేలా చేసుకోవచ్చు.
అలాకాకుండా జెఫ్రీ ఒక గొప్ప వ్యక్తి, అతనికి అన్యాయం జరిగిందని ట్రంప్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి' అని ఈమెయిల్‌లో వోల్ఫ్ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ట్రంప్ నన్నురిజైన్ చేయమన్నారు’
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అంటే 2016 అక్టోబర్‌లో చేసిన ఒక ఈమెయిల్‌లో ఎప్‌స్టీన్‌కు వోల్ఫ్ చేసిన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి.
'ఈ వారం ట్రంప్ గురించి మాట్లాడేందుకు మీకు ఒక ఇంటర్వ్యూ అవకాశం రావొచ్చు. అందులో మీరు మాట్లాడే మాటలతో మీకు గొప్ప సానుభూతి పెరగడంతో పాటు ట్రంప్ కథ ముగించడానికి సహాయపడుతుంది. ఆసక్తి ఉందా?' అని ఆ ఈమెయిల్‌లో వోల్ఫ్ పేర్కొన్నారు.
డెమొక్రాట్లు విడుదల చేసిన మూడో ఈమెయిల్ 2019 జనవరి నాటిది.
'ట్రంప్ నన్ను రిజైన్ చేయమని చెప్పారు. కానీ, నేనెప్పుడూ అందులో సభ్యుడిగా లేను. ఆయనకు ఆ అమ్మాయిల గురించి తెలుసు. అందుకే ఇదంతా ఆపమని ఘిస్లెయిన్‌కు చెప్పారు' అని వోల్ఫ్‌కు రాసిన ఈమెయిల్‌లో ఎప్‌స్టీన్ పేర్కొన్నారు.
'ట్రంప్‌తో తన సంబంధం గురించి ఎప్‌స్టీన్ కొన్ని ఈమెయిల్స్ నాకు చేశారు. వీటి గురించే మాట్లాడాలని నేను చాలాకాలంగా ప్రయత్నిస్తున్నా' అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వోల్ఫ్ అన్నారు.
విడుదలైన ఒక పత్రంలో ట్రంప్‌తో పాటు ప్రిన్స్ ఆండ్రూ గురించి కూడా ప్రస్తావించారు. అలాగే లార్డ్ పీటర్ మాండెల్సన్ గురించి కూడా కొత్త డాక్యుమెంట్లలో ప్రస్తావన వచ్చింది. వీటి ప్రకారం, 2016 వరకు కూడా ఆయన ఎప్‌స్టీన్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారు.
ఎప్‌స్టీన్‌తో సంబంధాల కారణంగా అమెరికాలో యూకే రాయబారి పదవి నుంచి సెప్టెంబర్‌లో లార్డ్ పీటర్‌ను తొలగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














