‘‘పాములు, తేళ్లు, జంతువులతో కాదు, మా భయమంతా మనుషులతోనే’’ అన్న ఈ రష్యన్ మహిళ ‘గుహ జీవితం’ గురించి ఇంకా ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Nina Kutina
ఇటీవల కర్ణాటకలోని అడవుల్లో ఎర్రటి జుట్టుతో చెప్పులు లేకుండా తిరుగుతున్న ఓ చిన్నారి కనిపించడం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది.
ఆ తర్వాత స్థానిక పోలీసుల విచారణలో ఆమె రష్యన్ మహిళ నీనా కుటినా కుమార్తెల్లో ఒకరని తేలింది.
ఒకరికి ఐదు, మరొకరికి ఆరేళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలతో నీనా కుటినా అక్కడ ఉన్న గుహలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ గుహలో కొన్ని స్థానికంగా తయారైన కళాకృతుల్ని కూడా కనుక్కున్నారు.
"మేము ఇంతకు ముందెప్పుడూ గుహలో నివసించలేదు" అని 40 ఏళ్ల నీనా కుటినా బీబీసీతో చెప్పారు.

కుమార్తెలతో కలిసి తాను 9 నెలలు గుహలో ఉన్నట్లు నీనా కుటినా చెప్పారు. ఆ సమయంలో ఆమె కుమారుడు లూచెజర్ గోవాలోని అరంబోల్‌లో ఓ స్నేహితుడితో కలిసి ఉండేవాడు. అక్కడే స్కూలుకు వెళుతుండేవాడని ఆమె వివరించారు.
వాళ్లు ఉంటున్న గుహ అడవిలోనే ఉన్నప్పటికీ అది గోకర్ణ పట్టణానికి దగ్గరగా ఉండేది. దీంతో గోకర్ణలోనే వాళ్లు తమకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేసేవారు.
గుహలో ఉన్నప్పుడు వాళ్లు మాంసం తినలేదు.
పుట్టినప్పటి నుంచి తన కుమార్తెలు శాఖాహారులేనని, ప్రకృతిలో జీవించడం వల్ల వాళ్లు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడలేదని ఆమె బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Nina Kutina
అసలామె అక్కడకు ఎలా చేరుకున్నారు?
"అక్కడకు అనేకమంది యాత్రికులు వస్తుంటారు. అది చాలా ఆసక్తికరమైన ప్రదేశం. మేము కూడా ఆ ప్రాంతాన్ని చూడాలనే వెళ్లాం. నాకు ప్రకృతి అంటే ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా అడవులు, కొండ ప్రాంతాల్లో నివసించాం. గుహలో జీవించడం కొత్త అనుభవం" అని ఆమె బీబీసీకి చెప్పారు.
తన పెద్ద కుమారుడు దిమిత్రీ మరణం తర్వాత ఆ బాధను మర్చిపోయేందుకు తాను గుహలో జీవించాలని నిర్ణయించుకున్నట్లు నీనా కుటినా వివరించారు.
ఆమె పెద్ద కుమారుడు దిమిత్రీ 2024 సెప్టెంబర్‌లో గోవాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అది తనకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని ఆమె అన్నారు.
గుహలో ఉన్నప్పుడు పడుకునేందుకు ఆమె చెక్కతో బెడ్ తయారు చేసుకున్నారు. నేల మీద చాపలు పరిచారు. గుహను కొన్ని కళాకృతులతో అలంకరించారు.
ఆ కుటుంబం గుహలో ఉండగా గుర్తించినప్పుడు వాళ్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.
వర్షాకాలంలో పాములు, అడవి జంతువుల వల్ల ప్రమాదం ఉందని, అందుకే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఒప్పించి వాళ్లను అక్కడ నుంచి తరలించారు.
"ఏ పాము కూడా మాకు ఎప్పుడూ హాని చేయలేదు. మా మీద ఏ జంతువు దాడి చేయలేదు. అనేక ఏళ్లుగా మనుషులను చూసే మేము భయపడుతున్నాం" అని నీనా కుటినా తన టెలిగ్రామ్ చానల్‌లో రాశారు.
అయితే అమె వీసా గడువు ముగియడం వల్లనే ఆమెను మైగ్రేషన్ సెంటర్‌కు తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
కుమారుడి మరణంతో బాధలో ఉన్న తనకు వీసా గడువు పొడిగించుకునేందుకు అవసరమైన పత్రాలు సేకరించేందుకు తగినంత శక్తి లేకుండా పోయిందని ఆమె బీబీసీతో చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో నీనా కుటినా కుటుంబం రష్యాకు చేరుకుంది.

ఫొటో సోర్స్, Karnataka Police
గుహలో జీవితం
తాను రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌లో( ప్రస్తుత సెయింట్ పీటర్స్‌బర్గ్) పుట్టానని, సైబీరియన్ నగరం క్రస్నోయర్స్క్‌లో 8 ఏళ్లు చదువుకున్నానని కుటినా చెప్పారు.
ఆ తర్వాత తాను రష్యా అంతటా పర్యటించానని, యుక్రెయిన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, కోస్టారికా, నేపాల్, భారత్‌లో కొంతకాలం నివసించినట్లు ఆమె తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మాస్కోలో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేశారు నీనా కుటినా. ఆ తర్వాత 15 ఏళ్ల కిందట పెద్ద కొడుకు దిమిత్రీని తీసుకుని రష్యా నుంచి విదేశాలకు వెళ్లారు.
"మాస్కోలో నాలుగు గోడల మధ్య బతకడం నాకిష్టం లేదు. నేను సముద్రం పక్కన జీవించాలని అనుకున్నాను. అప్పుడే నా పిల్లలు ఇసుకలో ఆడుకోగలుగుతారు. ప్రపంచాన్ని చూడగలుగుతారు. అలాంటప్పుడే వారికి జీవితం మీద ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు" అని కుటినా చెప్పారు.
విదేశాల్లోనే ఆమె లూచెజార్‌కు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమె ఇద్దరు కూతుళ్లు అమ, ప్రేమ కూడా విదేశాల్లోనే పుట్టారు. వాళ్లంతా ఇంటి వద్దనే పుట్టారని, ఎలాంటి వైద్య సాయం లేకుండానే బిడ్డల్ని కన్నట్లు నీనా కుటినా చెప్పారు. తామంతా సన్నిహితంగా ఉంటామని తెలిపారు.
"నేను రోజంతా నా పిల్లలతోనే ఉంటాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. సంగీతంలో ప్రవేశం ఉంది. అనేక ఏళ్ల పాటు ఆకాశం కింద, ప్రకృతితో కలిసి జీవించాను" నీనా వివరించారు.
'గుహలో జీవితం' అనే పేరుతో నీనా కుటినా నిర్వహిస్తున్న టెలిగ్రామ్ చానల్‌లో కుట్లు, అల్లికల గురించిన పాఠాలను పోస్ట్ చేశారు. తమను కర్నాటకలోని నిర్బంధ కేంద్రానికి తరలించిన తర్వాత అక్కడున్న వారికి బొమ్మలు గీయడం, బొమ్మల్ని చెక్కడం గురించి నేర్పించినట్లు నీనా చెప్పారు.
"నిజంగా ఆమె ఒక గొప్ప వ్యక్తి" అని భారత్‌లో ఆమెకు పరిచయమైన వసిలీ కొండ్రోషోవ్ అభివర్ణించారు. పదేళ్ల క్రితమే ఆమె పిల్లలతో కలిసి గోవాలోని అడవులలో నివసించారని ఆయన చెప్పారు.
ఉత్తర గోవాలో అడవుల్లో నీనా కుటినా ఉన్నప్పుడు కొండ్రషోవ్ అక్కడకు వెళ్లి ఆమె జీవితాన్ని పరిశీలించారు.
"ఒక పెద్ద చెట్టు ఊడల కింద నీనా బట్టలతో రెండు గదులను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లివింగ్ రూమ్. మరొకటి బెడ్‌రూమ్. చెట్టు పక్కన నీటి ప్రవాహం ఈత కొట్టేందుకు వీలుగా ఉంది. చుట్టు పక్కల ప్రాంతమంతా మట్టితో నిండి ఉంది. అక్కడ మట్టి, రాళ్లతో అరుగులాంటిది నిర్మించారు. అలాగే ఒక పొయ్యి, కొన్ని గిన్నెలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. "మీకు పాములంటే భయం లేదా" అని నేను వాళ్లను అడిగాను. మా ఇంటి పక్కనే రెండు పాములు ఉన్నాయి. వాటికి మేము బాగా తెలుసని ఆమె చెప్పారు" అని కొండ్రషోవ్ వివరించారు.

ఫొటో సోర్స్, Nina Kutina
భారత అధికారులపై ఆరోపణలు
పోలీసులు తమను అదుపులోకి తీసుకున్న తర్వాత బెంగళూరు సమీపంలోని నిర్బంధ కేంద్రానికి(డిటెన్షన్ సెంటర్) తరలించారని ఆమె చెప్పారు. తనను విడుదల చేసి అద్దె ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని చెప్పారు. తన కుమారుడిని కూడా దగ్గర్లో ఉన్న షెల్టర్‌లో ఉంచారని వివరించారు. తాము ఉన్న నిర్బంధ కేంద్రంతో పాటు తన కుమారుడు ఉన్న షెల్టర్ చాలా అసహ్యంగా ఉన్నాయని అన్నారు.
"ఆ కేంద్రంలో పరిస్థితులు గుహలో కంటే దరిద్రంగా ఉన్నాయి" అని ఆమె బీబీసీకి చెప్పారు.
డిటెన్షన్ సెంటర్ టార్చర్ సెంటర్‌లాగా ఉంది. అక్కడి సిబ్బంది తమ ఆహారంతో పాటు తమ వస్తువుల్ని దొంగిలించారని చెప్పారు. గుహలో భద్రపరచిన తన కుమారుడి అస్తికల్ని అధికారులు తీసుకున్నారని, తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.
"పోలీసులు మమ్మల్ని అడవి జంతువుల నుంచి రక్షించాలి. అయితే వాళ్లు మమ్మల్ని పెద్ద పెద్ద బొద్దింకలు ఉన్న చోట ఉంచారు" అని ఆమె చెప్పారు.
"వాళ్లు పిల్లల్ని ఆకలి, చలి నుంచి కాపాడామని అనుకుంటున్నారు. గుహలో పిల్లలకు నేను రుచికరమైన ఆహారం వండి పెట్టేదాన్ని. సెంటర్‌లో వాళ్లకు ఆహారం అందలేదు. అక్కడ పిల్లలు ఆకలి, విటమిన్ల లోపంతో బాధ పడ్డారు" అని నీనా ఆరోపించారు.
నీనా ఆరోపణలపై బీబీసీ ప్రతినిధి భారత్‌లో అధికారులను సంప్రదించారు.
"రష్యా పౌరురాలి ఆరోపణలు తీవ్రమైనవిగా భావిస్తున్నాం. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తుముకూరు జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్‌ను ఆదేశించాం. ఆమె ఆరోపణలు వాస్తవమని తేలితే వాటిని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు చేపడతాం" అని కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి పి. మణివణ్ణన్ బీబీసీతో చెప్పారు.
"దొంగతనం గురించి ఆమె ఆరోపణలు అతిగా ఉన్నాయని ప్రాథమిక పరిశీలనలో తేలింది. జిల్లా అధికారుల నివేదిక కోసం మేము ఎదురు చూస్తున్నాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Nina Kutina
అతనితో 'సంబంధం' లేదు
రష్యా తిరిగి వెళ్లేందుకు సాయం కోసం ఆమె రష్యన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
అయితే గోవాలో నివసిస్తున్న ఇజ్రాయెలీ వ్యాపారవేత్త ష్లోమో గోల్డ్‌స్టీన్ వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమైంది.
అమ, ప్రేమకు తాను తండ్రినని, వాళ్లను అప్పగించాలని, రష్యా పంపించవద్దని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
"కొన్ని రోజులుగా పిల్లలను కలవడం కొంత కష్టంగా మారింది. వాళ్ల దగ్గరకు వెళ్లిన తర్వాత కూడా వాళ్లు నాకు దూరంగా ఉన్నారు. వాళ్లు పుట్టక ముందు నీనాను పట్టించుకోలేదని చెప్పారు. అయితే నేను వాళ్లను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను" అని గోల్ట్ స్టీన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
పిల్లలను తనకు అప్పగిస్తారని ఎదురుచూస్తున్నట్లు ఆయన బీబీసీతో చెప్పారు. అయితే డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టు కోరిందని, ప్రస్తుతం వాళ్లు రష్యాలో ఉండటంతో అది వీలుకాకపోవచ్చని అన్నారు.
గోల్డ్ స్టీన్ గురించి మాట్లాడేందుకు కుటినా నిరాకరించారు. తనకు ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ప్రస్తుతం నీనా కుటినా బంధువులతో కలిసి మాస్కోలో ఉంటున్నారు.
తన పిల్లలను స్కూలుకు పంపించాలని భావించడం లేదని, వాళ్లకు ఇంట్లోనే చదువు చెబుతానని ఆమె అన్నారు.
తాను అడవుల్లో పిల్లలతో కలిసి జీవించడాన్ని ఆనందించానని, అదే సమయంలో పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించానని చెప్పారు.
తాము మరో ప్రాంతానికి వెళ్లేందుకు పత్రాలు సిద్ధం చేసుకుంటున్నామని, అవి రాగానే మరో సాహస యాత్ర చేపడతామని నీనా కుటినా చెప్పారు.
(ఇమ్రాన్ ఖురేషి అదనపు సమాచారంతో)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














