అమ్మానాన్నలను పట్టించుకోని ఉద్యోగుల జీతాలలో కోత - తెలంగాణ సీఎం తెస్తానంటున్న కొత్త చట్టం ఫలితమిస్తుందా?

revanth reddy

ఫొటో సోర్స్, CMO Telangana

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10 -15శాతం కోత వేసి మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా''

గ్రూపు -2 కింద ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి.

ఇప్పడు ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

సీఎం చెప్పినట్లు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టేందుకు వీలవుతుందా? ఇది ఎంతవరకు సాధ్యం? అనే దానిపై చర్చ మొదలైంది.

''ప్రస్తుతమైతే ఉద్యోగుల జీతం నుంచి ఆ విధంగా కోత పెట్టి ఇచ్చేందుకు వీల్లేదు'' అని బీబీసీతో అన్నారు ఎస్టీఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లల ఆదరణ లేక అవస్థలు పడుతున్న వృద్ధులు ఎందరో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల ఆదరణ లేక అవస్థలు పడుతున్న వృద్ధులు ఎందరో

అయితే, దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.

కొత్తగా సెక్రటేరియట్‌లో విధుల్లో చేరే వారితో ప్రత్యేకంగా కమిటీ వేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సూచించారు.

''ప్రత్యేక చట్టం తీసుకువచ్చి జీతం నుంచి కోత విధించాలనుకుంటే చేయొచ్చు'' అన్నారు చావా రవి.

అయితే, కొత్త చట్టం తీసుకురావడానికి బదులు ఉన్న చట్టాలను అమలు చేయాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Revanthreddy

ఉద్యోగుల జీతాలు ఎలా ఉంటాయంటే..

సాధారణంగా తల్లిదండ్రులు, వృద్ధుల ఆస్తి వారి సంరక్షణ బాధ్యతలు చూసేవారికి లేదా సంతానానికి వెళ్తుంది. పెద్దవాళ్ల సమ్మతి మేరకు గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, వృద్ధులను తమ బిడ్డలు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తుంటాయి.

కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు ఒక నిబంధన ఉంటుందని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.

''కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పుడు మిగిలిన కుటుంబీకులు, చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడిన వారిని చూడాల్సిన బాధ్యత ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఉంటుంది'' అని చావా రవి బీబీసీతో చెప్పారు.

సాధారణంగా ఉద్యోగుల జీతాల పరంగా చూస్తే కొన్ని కోతలు, సేవింగ్స్ కనిపిస్తుంటాయి.

ఉదాహరణకు రూ.31వేల బేసిక్ పేతో ఉద్యోగం ప్రారంభిస్తే, ఇతర అలవెన్సులు మొత్తం కలుపుకుని రూ.50వేల వరకు జీతం వస్తుందని రవి చెప్పారు.

అందులోంచి 6 శాతం సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం - గతంలో జీపీఎస్) కింద మినహాయిస్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్‌కు రూ.30, టీజీ జీఎల్ఐ (గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్) కింద కనీసంగా రూ.600 (ఉద్యోగి తన ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు), ప్రొఫెషనల్ టాక్స్ రూ.150 నుంచి రూ.200 మధ్య జీతం నుంచి కోతలు విధిస్తారు.

బేసిక్ పే

ఫొటో సోర్స్, Getty Images

'బేసిక్ పే నుంచి కట్ చేయాలి'

ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చి తల్లిదండ్రుల కోసం ఉద్యోగుల వేతనం నుంచి 10శాతం మళ్లించాలని చూస్తే దాన్ని బేసిక్ పే నుంచి కట్ చేయాల్సి ఉంటుందని రవి అభిప్రాయపడ్డారు.

అయితే, బిడ్డల నుంచి నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు జీతం మళ్లించి న్యాయం చేయాలనుకుంటే ప్రత్యేక చట్టం తీసుకురానక్కర్లేదని, ఉన్న చట్టంలోనే మార్పులు చేస్తే సరిపోతుందన్నారు ‘భూమిక’ పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి.

''ముఖ్యమంత్రి చేసిన ప్రకటన బాగుంది. మరి అది అన్నివర్గాల వారికి వర్తిస్తుందా? ప్రభుత్వ ఉద్యోగుల సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం చట్టం చేస్తే.. అది ప్రైవేటు ఉద్యోగులకు వర్తిస్తుందా? కొడుకులకు ఉద్యోగం లేని తల్లిదండ్రుల సంగతేంటి, వారికి ఎలా ఇస్తారు? ఇలాంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'' అని ఆమె అన్నారు.

వృద్ధులు, తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty Images

2007లో వచ్చిన చట్టం ఏం చెబుతోంది?

2007లో తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆస్తి పొందిన వారసులు లేదా సంతానం నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వృద్ధులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.

ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2008 ఏప్రిల్ 22న జీవో విడుదల చేసింది. కానీ, ఈ చట్టం అమలులో నిరాదరణకు గురవుతోందని చెబుతున్నారు న్యాయ నిపుణులు.

చట్ట ప్రకారం ప్రతి సబ్ డివిజన్‌కు ఒకటి లేదా అంతకు మించి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ తరహా వ్యవస్థ ఏపీ, తెలంగాణల్లో అమల్లోకి రాలేదు.

''చట్టాన్ని అమలు చేసే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంటుంది. పక్కాగా అమలు చేస్తే తల్లిదండ్రులు, వృద్ధుల పరంగా సంతానం లేదా ఆస్తి పొందినవారి వల్ల వచ్చే సమస్యలు చాలావరకు తగ్గే వీలుంది'' అని కేంద్ర మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ప్రముఖ న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ అన్నారు.

అలాగే చట్టం ప్రకారం వృద్ధుల నుంచి గిఫ్ట్ లేదా అగ్రిమెంట్ ప్రకారం ఆస్తిని పొందిన వ్యక్తులపై వారి సంరక్షణ బాధ్యత ఉంటుంది. వృద్ధులు లేదా తల్లిదండ్రుల జీవన అవసరాలు తీర్చడంలో ఆస్తి పొందిన వ్యక్తి విఫలమైతే, ఆస్తి బదిలీ చెల్లదని చట్టం చెబుతోంది.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

ఇదే విషయంపై ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత సంతానానిదే అని న్యాయస్థానం అన్నది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి ఆస్తి పొందిన తర్వాత తన కుమారుడు పట్టించుకోవడం లేదంటూ మధ్య ప్రదేశ్‌లోని చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ మేరకు తీర్పు చెప్పింది. కుమారుడు గిఫ్ట్ డీడ్‌గా పొందిన ఆస్తి బదలాయింపును రద్దు చేసింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2007లో తీసుకువచ్చిన చట్టాన్ని ప్రస్తావించింది సుప్రీంకోర్టు.

''చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకు సమాజంలో ఉన్న ఎన్నో అంశాలు కారణం కావొచ్చు'' అని మాడభూషి శ్రీధర్ అన్నారు.

కానీ, ఎక్కువగా శిక్షలు వేసుకుంటూ వెళ్తే సమస్యలు కూడా పుట్టుకొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2007లో వచ్చిన చట్టం ప్రకారం, ఆస్తి పొందిన వారు తమ తల్లిదండ్రులు లేదా వృద్ధులను చూడకుండా నిర్లక్ష్యం చేస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండు శిక్షలూ కలిపి విధించే అవకాశం ఉంది.

వేతనంలో వృద్దులకు భాగం

ఫొటో సోర్స్, Getty Images

'చట్టంలో మార్పులతోనే ఏదైనా సాధ్యం'

ఉద్యోగుల జీతం నుంచి కోత విధించి తల్లిదండ్రులకు అందించాలనుకుంటే, ఆ మేరకు చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని మాడభూషి శ్రీధర్ బీబీసీతో చెప్పారు.

''దీనిపై అసెంబ్లీలో చర్చించాలి. ఎంత శాతం ఇస్తారు, ఎలా వేస్తారు.. ఎక్కడకు మళ్లిస్తారు, నేరుగా తల్లిదండ్రులకు వేస్తారా.. ఇలా చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి'' అని వివరించారు.

2007లో తీసుకువచ్చిన చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కొత్త చట్టాలు తీసుకువస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు కొండవీటి సత్యవతి.

''గత చట్టంలో ఉన్న గిఫ్ట్ డీడ్ రద్దు చేసే అవకాశం 2007 చట్టంతోనూ సాధ్యమవుతుంది. ప్రభుత్వం తలచుకుంటే, చొరవ తీసుకుంటే ఆర్డీవో స్థాయిలో ట్రిబ్యునళ్ల ద్వారా కూడా ఇప్పించవచ్చు'' అని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)