వందేళ్ల ఆరెస్సెస్: గోల్వాల్కర్‌ను హిందుత్వ రాజకీయాల్లో దేవుడిగా ఎందుకు చూస్తారు? గాంధీ హత్య తర్వాత సంఘ్‌లో ఏం జరిగింది?

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ రెండో సర్‌సంఘ్‌చాలక్
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సర్దార్ పటేల్ మరణించడానికి కొన్ని నెలల ముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాగ్‌పూర్ వెళ్లారు. అప్పటికి కొన్నిరోజుల క్రితమే ఆయన క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. నాగ్‌పూర్‌లో ప్లాస్టరింగ్ చేయని ఓ ఇంటి లోపలికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెళ్లారు.

ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఎంఎస్ గోల్వాల్కర్ (మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ ) ఆ ఇంట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోసం ఎదురుచూస్తున్నారు.

అప్పటికి భారత తొలి సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది సమయముంది. కొత్త పార్టీ ప్రారంభించడానికి తనకు సహాయం చేయాలని ముఖర్జీ గోల్వాల్కర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీని అనుసరించబోదని చెబుతూ, ముఖర్జీ విజ్ఞప్తిని గోల్వాల్కర్ తిరస్కరించారు.

కొన్ని నెలల తర్వాత గోల్వాల్కర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తనకు విశ్వసనీయమైన ఐదుగురిని ముఖర్జీకి సాయం చేయడానికి పంపిస్తానని హామీ ఇచ్చారు.

ఆ ఐదుగురు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, సుందర్ సింహ్ భండారీ, నానాజీ దేశ్‌ముఖ్, బాపూసాహెబ్ సోహ్నీ, బల్‌రాజ్ మధోక్.

అప్పటికి ఈ జాబితాలో చేర్చే అంత అనుభవం అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలకు లేదు.

కొన్ని నెలల తర్వాత ఈ ఐదుగురి నేతృత్వంలో 1951 అక్టోబరు 21న భారతీయ జన్ సంఘ్ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు దీపం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బనారస్‌లో గోల్వాల్కర్

నాగ్‌పూర్‌కు దగ్గరలోని రామ్‌టెక్‌లో 1906లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు గోల్వాల్కర్. చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో (ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం) బయాలజీ చదివారు.

'గోల్వాల్కర్ ఎప్పుడూ గంజిపెట్టిన తెల్లటి ధోతీ, కుర్తా వేసుకునేవారు. ఆయన కళ్లు చాలా పెద్దవి, కళ్ల ద్వారా అనేక భావాలు వ్యక్తంచేయగలరు. ఆ కళ్లు చాలా ప్రకాశవంతంగా ఉండేవి, అయితే ఆయన మాత్రం సిగ్గరి' అని గత అక్టోబరులో ప్రచురితమైన 'గోల్వాల్కర్ ద మిథ్ బిహైండ్ ద మ్యాన్, ద మ్యాన్ బిహైండ్ ద మిషన్' అనే పుస్తకంలో రచయిత ధీరేంద్ర కె.ఝా రాశారు.

గోల్వాల్కర్ ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషల్లో ప్రావీణ్యులు.

''గోల్వాల్కర్ చాలా ఎక్కువ చదువుతారు. బనారస్ హిందూ యూనివర్శిటీ లైబ్రరీలో హిందూ మతం, ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన పుస్తకాన్ని ఆయన చదివారు'' అని 'గురూజీ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్' అనేక పుస్తకంలో గంగాధర్ ఇందుర్కర్ రాశారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, rss.org

ఫొటో క్యాప్షన్, ఆర్ఎస్ఎస్‌ను డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు.

హెడ్గేవార్ వారసుడిగా గోల్వాల్కర్ ఎలా ఎంపికయ్యారు?

బనారస్‌లో చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌ను మొదటిసారి గోల్వాల్కర్ కలుసుకున్నారు. అయితే గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్‌లో చేరడానికి కారణం అప్పుడు బనరాస్ హిందూ యూనివర్శిటీలో చదువుతున్న భయ్యాజీ దానీ.

1939లో గోల్వాల్కర్ ఆరెస్సెస్ కార్యకర్తగా నియమితులయ్యారు.

ఆ సమయంలో ఆయన బాబారావ్ సావర్కర్ మరాఠీ పుస్తకం 'రాష్ట్ర మిమాన్సా' స్ఫూర్తితో 'వి ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్' అనే పుస్తకం రాశారు. 1939 మార్చిలో అది ప్రచురితమైంది.

తాను చనిపోవడానికి ఒకరోజు ముందు గోల్వాల్కర్‌కు హెడ్గేవార్ ఒక పేపర్ ఇచ్చారు. ''నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి సంస్థ బాధ్యతలన్నీ నువ్వు తీసుకోవాలి.'' అని ఆ పేపర్‌లో రాసి ఉంది. (గోల్వాల్కర్ ద మిథ్ బిహైండ్ ద మ్యాన్, ద మ్యాన్ బిహైండ్ ద మిషన్)

ఆర్ఎస్ఎస్ బాధ్యతలను గోల్వాల్కర్‌కు అప్పగించడం చాలా మంది ఆర్ఎస్ఎస్ నేతలను ఆశ్చర్యపరిచింది. అనుభవం ఉన్న సీనియర్ నేతను హెడ్గేవార్ ఈ పదవికి ఎంపిక చేస్తారని అందరూ భావించారు.

''మొదట్లో బాలాజీ హుద్దార్‌ను తన వారసుడిగా హెడ్గేవార్ భావించేవారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన్ను ఎంపిక చేశారు. సంఘ్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 1936లో ఆయన చదువుకోడానికి లండన్ వెళ్లారు. అక్కడ ఆయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి ఆయన స్పెయిన్ వెళ్లారు. అక్కడ స్పానిష్ అంతర్యుద్ధంలో పాల్గొన్నారు.

1938లో ఆయన స్పెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు ఆయన భావజాలం పూర్తిగా మారిపోయింది. హెడ్గేవార్ బ్రిటన్ మద్దతుదారు కాగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని హుద్దార్ పూర్తిగా వ్యతిరేకించారు. అక్కడినుంచి హెడ్గేవార్, హుద్దార్‌కు మధ్య దూరం బాగా పెరిగిపోయింది. దీంతో గోల్వాల్కర్‌ను వారసుడిగా చూడడం మొదలుపెట్టారు హెడ్గేవార్'' అని సీనియర్ జర్నలిస్ట్, రచయిత ధీరేంద్ర ఝా తెలిపారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 15 రోజుల తర్వాత గాంధీజీ, గోల్వాల్కర్ సమావేశం జరిగింది.

క్విట్ ఇండియా ఉద్యమంపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయమేంటి?

శాసనోల్లంఘన ఉద్యమం(1930)నుంచి తమ కార్యకర్తలను హెడ్గేవార్ ఎలా దూరంగా ఉంచారో, అలాగే గోల్వాల్కర్ ఆరెస్సెస్‌పై బ్రిటిష్ వాళ్లకు కోపం తెప్పించే ఏ కార్యక్రమానికయినా తమ కార్యకర్తలను దూరం పెట్టారు.

క్విట్ ఇండియా ఉద్యమానికి కూడా ఆర్ఎస్ఎస్ దూరంగా ఉంది.

'జైలుకు వెళ్లే హాస్యాస్పద కార్యక్రమం'గా కాంగ్రెస్ నేతృత్వంలోని క్విట్ ఇండియా ఉద్యమాన్ని అభివర్ణించిన సావర్కర్, హిందువులు దీన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. (అఖిల భారత హిందూ మహాసభ, బ్రిటిష్ పాలన ముగింపు, పేజ్ -55)

''ఓవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్యమంలో పాల్గొనవద్దని జిన్నా ముస్లింలకు పిలుపునిచ్చారు. మరోపక్క సావర్కర్ హిందువులనూ ఉద్యమం వైపు వెళ్లొద్దని చెప్పారు'' అని చరిత్రకారుడు రామచంద్ర గుహ 'గాంధీ: ద ఇయర్స్ దట్ చేంజ్డ్ ద వరల్డ్'' అన్న పుస్తకంలో రాశారు.

''ఆర్ఎస్ఎస్ స్థాపన బ్రిటిష్ ప్రభుత్వం 'విభజించు-పాలించు' విధానంలో ఉంటుంది. బ్రిటిష్ వారి ఉద్దేశం హిందూ, ముస్లింలను విభజించడం. 'హిందువుల ప్రధాన ప్రత్యర్థి బ్రిటిష్ ప్రభుత్వం కాదు..ముస్లింలు' అని వారికి చెప్పేవారు'' అని ధీరేంద్ర ఝా తెలిపారు.

''ఆర్ఎస్ఎస్ ఏర్పాటయిందే ఈ సూత్రం మీద కాబట్టి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకునేది కాదు. ఏ కారణం వల్లయినా బ్రిటిష్ పాలకులకు కోపం వస్తే, హిందువులను ఏకం చేయాలన్న తమ లక్ష్యంపై ప్రభావం పడుతుందని ఆర్ఎస్ఎస్ భావించేది'' అని ధీరేంద్ర ఝా విశ్లేషించారు.

అయితే ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ హెడ్ రామ్ బహదూర్ రాయ్‌కు భిన్నాభిప్రాయం ఉంది.

'' క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా గోల్వాల్కర్ ఎవరికీ చెప్పలేదు. అదే సమయంలో ఆయన ఎవరినీ వారించలేదు కూడా. ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు ముజఫర్‌పుర్, సతారా, పుణెలాంటి చోట్ల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారనడానికి ఉదాహరణలున్నాయి'' అని రామ్ బహదూర్ రాయ్‌ చెప్పారు.

''సంస్థను రక్షించాలని గురూజీ అనుకున్నారు. అందుకనే ఈ విషయంలో ఆయన చొరవ తీసుకోలేదు. మరో విషయం ఏంటంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అని నా వ్యక్తిగత అభిప్రాయం'' అని ఆయన అన్నారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దని హిందువులను సావర్కర్ కోరినట్టు పలువురు చరిత్రకారులు చెబుతుంటారు.

గాంధీజీతో గోల్వాల్కర్ సమావేశం

స్వాతంత్ర్యానికి ముందు దేశంలోని ఆర్ఎస్ఎస్‌ను అనేక ప్రాంతాలకు గోల్వాల్కర్ విస్తరించగలిగారు. ఆల్వార్, భరత్‌పూర్ వంటి అనేక రాజసంస్థానాల నుంచి ఆయనకు సహకారం లభించింది.

ఆల్వార్‌లో ఆర్ఎస్ఎస్ అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించింది. వాటిలో ఒకదానికి గోల్వాల్కర్ హాజరయ్యారు.

స్వాతంత్ర్యం తర్వాత 15 రోజుల పాటు దిల్లీ ప్రశాంతంగా ఉంది. తర్వాత అక్కడి నుంచే మతపరమైన హింస వ్యాపించింది.

1947 సెప్టెంబరు 8న దిల్లీని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. సెప్టెంబరు 9న గాంధీజీ దిల్లీ చేరుకున్నారు. సెప్టెంబరు 12న గోల్వాల్కర్‌తో గాంధీ సమావేశమయ్యారు.

'ఆర్ఎస్ఎస్ చేతులు రక్తంతో తడిశాయి' అని ఈ సమావేశంలో గోల్వాల్కర్‌తో గాంధీ స్పష్టంగా చెప్పారు.

''ఆర్ఎస్ఎస్ ఎవరికీ శత్రువు కాదు. ముస్లింలను చంపడాన్ని ఆర్ఎస్ఎస్ సమర్థించదు. వీలయినంతమేర హిందువులను రక్షించడం మా ఉద్దేశం'' అని గోల్వాల్కర్ గాంధీతో చెప్పారు. (కలెక్టెడ్ వర్స్క్ ఆఫ్ మహాత్మాగాంధీ, పేజ్ -77)

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'ఆర్ఎస్ఎస్ చేతులు రక్తంతో తడిశాయి' అని గోల్వాల్కర్‌తో గాంధీ స్పష్టంగా చెప్పారు.

గాంధీజీ, గోల్వాల్కర్ మధ్య అభిప్రాయభేదాలు

''తనపై వచ్చిన ఆరోపణలను, దిల్లీలో ముస్లింల హత్యలను ఖండిస్తూ ఓ ప్రకటన చేయాలని గోల్వాల్కర్‌ను గాంధీజీ అడిగారు. ఈ ప్రతిపాదనను గోల్వాల్కర్ అంగీకరించలేదు'' అని మహాత్మాగాంధీ సెక్రటరీ ప్యారేలాల్ తన పుస్తకం 'మహాత్మా గాంధీ, ద లాస్ట్ ఫేజ్'లో రాశారు.

''తనకు బదులుగా గాంధీ ఈ ప్రకటన విడుదల చేయాలని గోల్వాల్కర్ కోరారు. తాను కచ్చితంగా అలా చేస్తానని గాంధీ చెప్పారు. కానీ గోల్వాల్కర్ నిజాయితీ గల వ్యక్తి అయితే ఆయనే ఇది చెప్పాలి'' అని ప్యారేలాల్ అన్నారు.

నాలుగు రోజుల తర్వాత సెప్టెంబరు 16న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి గాంధీజీ ప్రసంగించారు.

''భారత్‌లో ముస్లింలకు సమానత్వపు హక్కులేదని హిందువులు అనుకుంటే, పాకిస్తాన్‌లో హిందువులు పాలితులుగా మాత్రమే ఉండాలని ముస్లింలు కోరుకుంటే, అది హిందూ, ఇస్లాం రెండు మతాల పతనానికి దారితీస్తుంది'' అని గాంధీజీ హెచ్చరించారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరెస్సెస్‌ సారధ్యం తీసుకున్న రెండో వ్యక్తి గోల్వాల్కర్

ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన హింస

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన హింస పెరిగింది.

దీని గురించి అప్పటి ఉత్తరప్రదేశ్ హోంసెక్రటరీ రాజేశ్వర్ దయాల్ ఆటోబయోగ్రఫీ 'ఎ లైఫ్ ఆఫ్ అవర్ టైమ్'‌లో రాశారు. 'పశ్చిమ రేంజ్ డీఐజీ జెట్లీ నా దగ్గరకు పెద్ద తాళాలు వేసి ఉన్న ట్రంకు పెట్టెలు తెచ్చారు. వాటిని తెరిచి చూడగా పశ్చిమ ప్రాంతంలో మతపరమైన అల్లర్లకు గల కారణాలన్నింటి గురించి బ్లూ ప్రింట్ ఉంది. నేను వెంటనే ఈ సాక్ష్యాలను తీసుకుని హౌస్ ఆఫ్ ప్రీమియర్ గోవింద్ వల్లభ్ పంత్ దగ్గరకు వెళ్లాను.

నేను, జైట్లీ ఇద్దరం గోల్వాల్కర్‌ను అరెస్టు చేయాలని పట్టుబట్టాం. ఈ మొత్తం వ్యవహారం వెనక గోల్వాల్కర్ హస్తం ఉంది. ఇప్పటికీ ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నారు. కానీ గోల్వాల్కర్‌ను వెంటనే అరెస్టు చేయడానికి బదులుగా ఈ విషయాన్ని తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని పంత్ నిర్ణయించుకున్నారు'' అని రాజేశ్వర్ దయాల్ రాశారు.

''గోల్వాల్కర్‌కు దీనిపై సంకేతాలు అందడంతో, వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు'' అని దయాల్ తెలిపారు.

కొన్నేళ్ల తర్వాత గాంధీ హత్య కుట్ర కేసుపై దర్యాప్తు చేస్తున్న కపూర్ కమిషన్ విచారణకు హాజరైనప్పుడు రాజేశ్వర్ దయాల్ చేసిన ఆరోపణలను జైట్లీ ధ్రువీకరించారు. జీబీ పంత్‌ను తాను, దయాల్ కలిశామని చెప్పారు.(కపూర్ కమిషన్ రిపోర్ట్, పేజ్ 62).

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీజీ మరణం బాధాకారమని గోల్వాల్కర్ అన్నారు.

గాంధీ హత్యపై గోల్వాల్కర్ స్పందన

1948 జనవరి 30న మహాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే హతమార్చారు.

ఆ సమయంలో గోల్వాల్కర్ మద్రాస్(చెన్నై)లో ఉన్నారు. ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. గాంధీజీ మరణంపై సంతాపపాన్ని వ్యక్తం చేస్తూ నెహ్రూ, పటేల్, గాంధీ కుమారుడికి టెలిగ్రామ్ పంపారు.

''గౌరవ గాంధీజీ మరణం బాధాకరం. అన్ని శాఖల్లో 13రోజుల పాటు సంతాపదినాలు పాటించాలి. రోజువారీ కార్యక్రమాలన్నీ వాయిదావేయాలి' అని ఆర్ఎస్ఎస్ అన్ని బ్రాంచులకు అంతర్గత ఆదేశాలు పంపారు. (శ్రీ గురూజీ సమగ్ర, వాల్యూమ్ -10, పేజ్ 5)

తర్వాతి రోజు ఆయన నాగ్‌పూర్ వెళ్లారు. బాంబే(ముంబై)లోని సావర్కర్ ఇంటిపై వేలాదిమంది దాడి చేశారు.

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ కార్యాలయాలపై దాడులు మొదలయ్యాయి.

దర్యాప్తు తర్వాత గాంధీజీ హత్య కేసులో వినాయక్ దామోదర్ సావర్కర్‌ను నిందితునిగా చేర్చారు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

''ఈ విషాదం నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని, ప్రేమ, సేవాభావంతో పనిచేస్తారని నేననుకుంటున్నా. అపార్థంతో ముఖం మీదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారితో సైతం కార్యకర్తలు ప్రేమగా వ్యవహరించాలని ఆదేశిస్తున్నా. మరణించినవారికి నివాళులర్పిస్తున్నా' అని ఫిబ్రవరి 1న గోల్వాల్కర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

(ది జన్‌సంఘ్, ది బయోగ్రఫీ ఆఫ్ యాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ, పేజ్ -43)

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించారు.

ఆర్ఎస్ఎస్‌పై నిషేధం

కొన్ని రోజులకే గోల్వాల్కర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర దాదాపు వేయిమంది గుమికూడారు.

1948, ఫిబ్రవరి 4న సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించారు.

1948, ఆగస్టు 6 వరకు గోల్వాల్కర్ జైలులోనే ఉన్నారు. జైలు నుంచి విడుదల చేసేటప్పుడు ఆయన నాగపూర్ పరిసరాల్లోనే ఉండాలన్న నిబంధన విధించారు.

సంఘ్‌పై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ సర్దార్ పటేల్, నెహ్రూకు ఆయన చాలా లేఖలు రాశారు.

గోల్వాల్కర్ లేఖలకు సర్దార్ పటేల్ బదులిచ్చారు.

''హిందూ సమాజానికి సంఘ్ సేవ చేసింది. అయితే ప్రతీకారం పేరుతో ఆర్ఎస్ఎస్ ముస్లింలమీద దాడులు చేయడం అభ్యంతరకరం. మీ ప్రతి ప్రసంగం మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉంది.

దీని ఫలితంగా దేశం గాంధీని కోల్పోవాల్సి వచ్చింది. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది'' అని 1948 సెప్టెంబరు 11న గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో సర్దార్ పటేల్ చెప్పారు.

తర్వాత గోల్వాల్కర్‌ను మరోసారి అరెస్టు చేసి మొదట నాగ్‌పూర్ జైలుకు, తర్వాత సియోని జైలుకు తరలించారు.

1949 జూలై 12న ఆర్ఎస్ఎస్‌పై నిషేధం ఎత్తివేశారు. గోల్వాల్కర్‌ను జైలు నుంచి విడుదల చేశారు.

1950 డిసెంబరు 15న సర్దార్ పటేల్ మరణించినప్పుడు గోల్వాల్కర్ నాగ్‌పూర్‌లో ఉన్నారు.

పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సెంట్రల్ ప్రావిన్సెస్ ముఖ్యమంత్రి రవి శంకర్ శుక్లా బాంబే(ముంబై) వెళ్తున్నారని తెలుసుకుని విమానంలో ఓ సీటు తనకు ఇప్పించాలని గోల్వాల్కర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు.

శుక్లా దీనికి అంగీకరించారు. బాంబే(ముంబై)లో సర్దార్ పటేల్‌కు గోల్వాల్కర్ నివాళులర్పించారు.

(ద నెహ్రూ అప్రోచ్, ఫ్రమ్ డెమోక్రసీ టు మోనార్కీ, పేజ్-194)

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1963 రిపబ్లిక్ పరేడ్‌లో ఆర్ఎస్ఎస్ పాల్గొంది. (ప్రతీకాత్మక చిత్రం)

1963 రిపబ్లిక్ డే పరేడ్

1962లో భారత్‌పై చైనా దాడిచేసినప్పుడు గోల్వాల్కర్ నెహ్రూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.

ఈ ఉద్యమంలో గోల్వాల్కర్ భారత కమ్యూనిస్టులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. చైనా కమ్యూనిస్టు పాలన ఏజెంట్లుగా ఆయన భారత కమ్యూనిస్టులను అభివర్ణించారు.

యుద్ధంలో ఓటమితో 1963లో రిపబ్లిక్ డే పరేడ్ రద్దు చేయాలని రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కానీ నెహ్రూ దీన్ని వ్యతిరేకించి మిలటరీ పరేడ్‌కు బదులుగా 'సివిలియన్ పరేడ్-పౌర కవాతు' నిర్వహించాలని సూచించారు.

ఈ పరేడ్‌కు దిల్లీ మేయర్ నూరుద్దీన్ అహ్మద్‌ను ఇన్‌చార్జ్ చేశారు. పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా సమాజంలోని అన్ని వర్గాలను ఆయన ఆహ్వానించారు.

మిగిలిన అన్ని కార్మిక సంఘాలలానే ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్‌కు కూడా పరేడ్‌కు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందింది. (సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్‌లాల్ నెహ్రూ, పేజ్ 396)

''ఈ పరేడ్ భిన్నమైనది. ఎంపీలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. తన క్యాబినెట్ మంత్రులతో నెహ్రూ వారికి నేతృత్వం వహించారు. దిల్లీ పౌరులతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రెండు వేలమంది తమ యూనిఫామ్‌తో పరేడ్‌లో పాల్గొన్నారు. వారి చేతుల్లో ఎలాంటి బ్యానర్ కానీ, జెండా కానీ లేవు’’ అని ధీరేంద్ర ఝా రాశారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఖిలపక్షసమావేశంలో పాల్గొనడానికి లాల్ బహదూర్ శాస్త్రి గోల్వాల్కర్‌ను ఆహ్వానించారు.

అఖిలపక్ష సమావేశానికి గోల్వాల్కర్‌కు ఆహ్వానం

1965లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మిగిలిన పార్టీలతో కలిపి గోల్వాల్కర్‌ను లాల్ బహదూర్ శాస్త్రి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు.

ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మహారాష్ట్రలోని సాంగ్లి నుంచి ఆయన ప్రత్యేకంగా దిల్లీ వచ్చారు.

సాధ్యమైన అన్ని మార్గాల్లో ప్రభుత్వానికి సహకరించాలని మరుసటిరోజు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గుజరాత్‌లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో గోల్వాల్కర్ పర్యటించారు. ఆయన అక్కడ చేసిన ప్రసంగాలను బరోడా కేంద్రం నుంచి ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసింది.

ఆ తర్వాత ఆయన పంజాబ్ వెళ్లి అంబాలా కంటోన్మెంట్‌లోని భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. (ద ఇన్‌కంపారబుల్ గోల్వాల్కర్, పేజ్ -274)

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత ఆరెస్సెస్ సర్‌ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్

ముస్లింలపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయమేంటి?

గోల్వాల్కర్ రాసిన 'వి ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్' పుస్తకం ఆయన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని 'మిలిటెంట్ హిందూయిజమ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్' అనే తన పుస్తకంలో జె.ఎ.కరణ్ రాశారు.

ఈ పుస్తకాన్ని ఆర్ఎస్ఎస్ బైబిల్‌గా పిలవొచ్చు అని ఆయనన్నారు.

జాతీయవాదం, దేశంలో మైనార్టీల స్థానం విషయంలో సంఘ్ ఆలోచనావిధానం గురించి ఈ పుస్తకం ఒక అవగాహన కల్పిస్తుంది.

'ముస్లింలు మనలాంటివారు కాదు. ఇస్లాం భారత్‌లో పుట్టలేదు' అని గోల్వాల్కర్ రాశారు. సావర్కర్ పుణ్యభూమి సిద్ధాంతాన్ని గోల్వాల్కర్ నమ్మేవారు.

''భారత్ ముస్లింల పవిత్ర దేశం కాదు. వారికి నమ్మకం ఉన్న ప్రాంతాలు మక్కా-మదీనా. అందుకే భారత్‌పై వారికున్న నిబద్ధతపై అనుమానాలున్నాయి'' అని సావర్కర్ వ్యాఖ్యానించారు.

''వి ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్' ద్వారా గోల్వాల్కర్ సిద్ధాంతాలను అర్ధం చేసుకోవచ్చు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే రాజకీయ దృక్పథంపై ఇది చర్చ జరుపుతుంది.

''అయితే తర్వాత గోల్వాల్కర్ కూడా దీన్నుంచి దూరం జరగానికి ప్రయత్నించారు. 'వి ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్' మా బ్లూ ప్రింట్ కాదని ఆర్ఎస్ఎస్‌కు మద్దతుగా ఉండే రచయితలు చాలాకాలం నుంచి చెబుతున్నారు. విచిత్రంగా పరిశోధకులు, రచయితలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. దీనికి అంగీకారం లభిస్తోంది'' అని ధీరేంద్ర ఝా విమర్శించారు.

గోల్వాల్కర్ ఆలోచనల్లో అత్యంత వివాదాస్పదమైనది...క్రిస్టియన్లు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశానికి అంతర్గత శత్రువులని ఆయన తన 'బంచ్ ఆఫ్ థాట్స్'లో రాయడం.

2018 సెప్టెంబరులో బంచ్ ఆఫ్ థాట్స్ నుంచి దీన్ని తొలగించారు.

''అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది చెప్పారు. అది శాశ్వత సత్యం కాదు. ఆర్ఎస్ఎస్ మూసేసిన సంస్థ కాదు. కాలానుకనుగుణంగా, మా ఆలోచనా విధానం మారుతుంటుంది'' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు.

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, హెడ్గేవార్

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

ఫొటో క్యాప్షన్, గోల్వాల్కర్‌ను అనుసరించేవారిలో మోదీ, వాజ్‌పేయిలాంటి వారు ఉన్నారు

సుదీర్ఘకాలం సర్‌సంఘ్‌చాలక్‌గా...

గోల్వాల్కర్ సిద్ధాంతాలమీద చాలా చర్చ జరుగుతుంటుంది. అయితే ఆర్ఎస్ఎస్‌ను ఆయన దేశవ్యాప్తంగా విస్తరించారన్నది నిజం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌గా గోల్వాల్కర్ 33ఏళ్లపాటు పనిచేశారు.

రాజు కావడం కన్నా, రాజులను తయారుచేయడంపై గోల్వాల్కర్‌కు చాలా ఎక్కువ ఆసక్తి ఉందని తన పుస్తకం 'హిందూ నేషనలిస్ట్ మూమెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్స్'లో క్రిస్టోఫర్ జెఫ్రెలాట్ రాశారు.

గాంధీ హత్య తర్వాతి పరిస్థితుల్లోనూ ఆర్ఎస్ఎస్ విచ్ఛిన్నం కాకుండా గోల్వాల్కర్ కాపాడారని, దేశరాజకీయాల్లో ఆర్ఎస్ఎస్‌ను భాగం చేశారని రామ్ బహదూర్ రాయ్ అభిప్రాయపడ్డారు.

''మరణం తర్వాత హిందుత్వ రాజకీయాల్లో గోల్వాల్కర్ దాదాపు దేవుని స్థాయి అందుకున్నారు. ఆయన అనుచరుల్లో చాలామంది మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ భారత ప్రధానులయ్యారు'' అని ధీరేంద్ర ఝా రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)