పొరపాటున అడ్రస్ మారి వేరే ఇంటికి వచ్చిన పనిమనిషిని కాల్చి చంపిన యజమాని

ఫొటో సోర్స్, CBS
పొరపాటున అడ్రస్ మారి వేరే ఇంటికి వచ్చిన పనిమనిషిని కాల్చి చంపిన ఇండియానాకు చెందిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే అంశాన్ని అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం, బుధవారం ఉదయం 7:00 గంటలకు ఇండియానా శివారు ప్రాంతమైన వైట్‌స్టౌన్‌లోని ఒక ఇంటి ముందు వరండాలో మారియా ఫ్లోరిండా రియోస్ పెరెజ్ అనే మహిళ తన భర్త చేతుల్లో కన్నుమూసినట్లు పోలీసులు గుర్తించారు.
మారియా , ఆమె భర్త వేలాజ్‌క్వెజ్ క్లీనింగ్ కోసం ఒక క్లయింట్ ఇంటికి వెళ్లారు, అయితే వారు పొరపాటున మరో అడ్రస్‌కు వెళ్లినట్లు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
దీనికి ముందు, ఇంటి ఆక్రమణకు వచ్చారంటూ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది, వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఆ ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపించలేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కేసులో క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలో లేదో నిర్ణయించేందుకు కేసు వివరాలను బూన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి నివేదించారు.

ఫొటో సోర్స్, CBS
'నా భార్యకు న్యాయం చేయండి'
ఇంట్లో ఉన్న లేదా కాల్పులు జరిపిన వారిని పోలీసులు ఇంకా గుర్తించలేదు.
ఇది "సంక్లిష్టమైన, సున్నితమైన, దర్యాప్తు దశలో ఉన్న కేసు" అని శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ దశలో సమాచారాన్ని విడుదల చేయడం "తగనిది, ప్రమాదకరమైనది" అన్నారు.
ఈ కేసుకు సంబంధించి "ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంపై" అధికారులు హెచ్చరిస్తూ, ప్రజలు ఓపికగా ఉండాలని కోరారు.
తన భార్యకు న్యాయం చేయాలని మరియా భర్త మౌరిసియో వెలాజ్‌క్వెజ్ సీబీఎస్ న్యూస్‌తో అన్నారు. రిపోర్టుల ప్రకారం, 32 ఏళ్ల మారియా నలుగురు పిల్లల తల్లి, గ్వాటెమాల నుంచి వచ్చారు.
బుల్లెట్ ఇంటి తలుపు గుండా వచ్చిందని డబ్ల్యూటీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలాజ్‌క్వెజ్ అన్నారు.
"వారు అలా కాల్చడానికి బదులుగా ముందుగా పోలీసులను పిలవాల్సింది" అని ఒక అనువాదకుడి ద్వారా వెలాజ్‌క్వెజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు నమోదులో ఎందుకు ఆలస్యం?
ఇండియానా 'స్టాండ్-యువర్-గ్రౌండ్' చట్టం కారణంగా ఈ కేసు సంక్లిష్టమైందని 'ది ఇండియానాపోలిస్ స్టార్' వార్తాసంస్థతో బూన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కెంట్ ఈస్ట్‌వుడ్ చెప్పారు.
చాలా అమెరికా రాష్ట్రాలలో స్టాండ్-యువర్-గ్రౌండ్ చట్టాలు అమల్లో ఉన్నాయి, వాటి ప్రకారం, ఒక వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు ఎంతదూరమైనా వెళ్లే అవకాశం ఉంది.
ఇటీవలి సంవత్సరాలలో ఇలాంటి సంఘటనలు అమెరికాలో జరిగాయి. 2023లో 16 ఏళ్ల రాల్ఫ్ యార్ల్, మిస్సోరిలో మరో ఇంట్లో డోర్‌బెల్ మోగించడంతో కాల్చి చంపారు. ఇంటి యజమాని, 84 ఏళ్ల ఆండ్రూ లెస్టర్‌పై అభియోగం నమోదైంది. నేరాన్ని అంగీకరించిన ఆండ్రూ, శిక్ష విధించకముందే మరణించారు.
మరొక కేసులో, 20 ఏళ్ల కైలిన్ గిల్లిస్ న్యూయార్క్‌లో రాంగ్ డ్రైవ్‌వేలోకి కారు నడపడంతో, ఆమెను కాల్చి చంపారు. కైలిన్‌ను కాల్చి చంపిన ఇంటి యజమానిని దోషిగా నిర్ధరించారు. 25 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














