ప్రశాంత్ కిశోర్ బిహార్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? సొంత రాష్ట్రంలో ఆయన వ్యూహాలు బెడిసికొట్టాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్‌కు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక పీడకలలా అనిపించొచ్చు.
బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
మూడేళ్లగా బిహార్‌లో రాజకీయ పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
బీజేపీ నుంచి జేడీయూ, టీఎంసీ వరకు వివిధ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే ప్రశాంత్ కిశోర్‌కు ఇప్పుడిలా జరిగింది.
తన జన్ సురాజ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ పెద్దగా ఏమీ లాభం చేకూర్చలేకపోయారు. ఈసారి బిహార్‌లో మార్పు వస్తుందని, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కాలేరని ఎన్నికల ప్రచారంలో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
బిహార్‌లో విద్య, ఉపాధి, వలసలను ప్రధాన సమస్యలుగా మార్చడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన జన్ సురాజ్ పార్టీ ఎన్నికల గుర్తు స్కూల్ బ్యాగ్.
జనసురాజ్ ప్రచార నినాదం "ప్రజలకు మంచి పాలన కోసం, బిహార్ మార్పు కోసం."

ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ బిహార్‌లోని 243 స్థానాలకూ పోటీ చేయాలని ప్రణాళిక వేసింది, కానీ ఓటింగ్‌కు ముందే ఎదురుదెబ్బలు తినడం మొదలైంది.
జన్ సురాజ్ పార్టీకి చెందిన చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇది ప్రశాంత్ కిశోర్‌కు అసౌకర్యంగా అనిపించింది.
అయితే, తమ అభ్యర్థులను బెదిరించి వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, @jansuraajonline
జన్ సురాజ్ పార్టీ ప్రభావం ఎలా ఉందంటే..
తన పార్టీ అగ్రస్థానంలో ఉంటుందని లేదా దిగువన ఉంటుందని బీబీసీ న్యూస్ హిందీ కార్యక్రమం 'ది లెన్స్'లో ప్రశాంత్ కిశోర్ అన్నారు. తన పార్టీ 10 కంటే తక్కువ సీట్లు లేదా 170 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.
"ఇటీవలి కాలంలో, ప్రశాంత్ కిశోర్ వేసిన ప్రతి అంచనా తప్పు అని రుజువైంది. 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీకి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన అన్నారు. కానీ, అలా జరగలేదు'' అని సీనియర్ జర్నలిస్ట్ నచికేతా నారాయణ్ అన్నారు.
"ప్రశాంత్ కిశోర్ తన అంచనాల్లో నితీశ్ కుమార్‌పై కొంత వ్యక్తిగత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది, ఎందుకంటే ఆయన గతంలో నితీశ్ కుమార్ పార్టీలో ఉండడం " అని నచికేతా నారాయణ్ అభిప్రాయపడ్డారు.
అయితే, రాజకీయ విశ్లేషకులు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాజీ ప్రొఫెసర్ పుష్పేంద్ర కుమార్ ఈ ఫలితాన్ని భిన్నంగా చూస్తున్నారు.
"ప్రశాంత్ కిశోర్ పార్టీ భారీ ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించి ఉండరు, ప్రశాంత్ కిశోర్ కూడా అది ఊహించి ఉండరు, కానీ ఈ ఎన్నికలు బిహార్ అంతటా ఆయన పార్టీని పరిచయం చేశాయి" అని పుష్పేంద్ర కుమార్ అంటున్నారు.
"ఈ ఎన్నికను ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీకి ఒక ప్రారంభ వేదికగా చూడాలి. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఇది ఒక అవకాశం" అని పుష్పేంద్ర కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేజ్రీవాల్‌ను ప్రశాంత్ కిశోర్ అనుకరించారా?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రశాంత్ కిశోర్ మొదట్లో ప్రకటించారు. ఆ సీటు నుంచి ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ పోటీ చేశారు.
ప్రశాంత్ కిశోర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ కూడా న్యూదిల్లీ స్థానం నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇలాగే సవాల్ చేశారు.
కేజ్రీవాల్ షీలా దీక్షిత్‌ను ఓడించడమే కాకుండా, ఆయన పార్టీ దీల్లీలో కాంగ్రెస్‌కు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడింది.
తేజస్వి యాదవ్ బిహార్‌లో అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, ప్రశాంత్ కిశోర్ చివరి క్షణంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా వైదొలిగారు.
రాష్ట్రంలోని ఇతర స్థానాలపై దృష్టి పెట్టాలని పార్టీ కార్యకర్తలు కోరినందున తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.
"ప్రశాంత్ కిశోర్ వ్యూహం విజయవంతం కాలేదు. కేజ్రీవాల్ తరహాలో రాజకీయాలు చేయాలని ఆయన భావించారు. కానీ, ఆయన తప్పు చేశారు. బిహార్ ఒక పెద్ద రాష్ట్రం. ఒక సంవత్సరం పనిచేసి రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించలేరు'' అని సీనియర్ జర్నలిస్ట్ మాధురి కుమార్ అన్నారు.
"జనరేషన్ జెడ్ అయినా, జనరేషన్ ఎక్స్ అయినా లేదా జనరేషన్ వై అయినా, అన్ని వయసుల వారు దీనిని అర్థం చేసుకుంటారు. ఇప్పటికే అనుభవం ఉన్న పార్టీల కోసం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను రూపొందించగలరు. ప్రశాంత్ కిశోర్ గెలిపించినట్టు చెప్పుకునే వ్యక్తులు అప్పటికే రాజకీయాల్లో అనుభవజ్ఞులు. రాజకీయాలకు ఏళ్లతరబడి అంకితభావం అవసరం" అని మాధురి కుమార్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉప ఎన్నికల్లో 10 శాతం ఓట్లు..
సరిగ్గా ఏడాది క్రితం బిహార్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఈ ఉప ఎన్నిక ఆ పార్టీకి కీలకంగా మారింది.
ఆ సమయంలో తరారీ, రామ్‌గఢ్ సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఇమామ్‌గంజ్ సీటును జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం-సెక్యులర్) కైవసం చేసుకోగా, బెలాగంజ్ సీటు జేడీయూ గెలుచుకుంది.
ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏ సీటునూ గెలుచుకోలేదు, పోటీలో ఉన్నట్టు కూడా కనిపించలేదు. అయితే, కనీసం రెండు సీట్లలో ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిలో అది కీలకపాత్ర పోషించింది.
ఆ ఫలితాల తర్వాత, ప్రశాంత్ కిశోర్ విలేఖరులతో మాట్లాడుతూ, " 50 ఏళ్లుగా కుల రాజకీయాలు ఆధిపత్యం చెలాయించిన చోట, మొదటి ప్రయత్నంలోనే 10 శాతం ఓట్లు పొందడం మా పార్టీ గొప్పతనమా కాదా, మీరే నిర్ణయించుకోండి" అని అన్నారు.
"మా పార్టీకి 10 శాతం ఓట్లు వస్తే, అది నా బాధ్యత. అది నా ఒక్కడి బాధ్యత కాకపోయినా, నేను వెనక్కి తగ్గను. ఈ 10 శాతాన్ని 40 శాతానికి పెంచాలి. ఇది ఒక సంవత్సరం లేదా ఐదు సంవత్సరాలలో జరగవచ్చు" అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఆ తరువాత, ప్రశాంత్ కిశోర్ ఏడాదిపాటు బిహార్‌లో తన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ వచ్చిన ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు.
ఈ ఎన్నికలలో జన్ సురాజ్ పార్టీ పదిశాతం కాదు.. కనీసం ఐదు శాతం ఓట్లను కూడా పొందలేదు.
"ఏదో ఒకటి మాట్లాడటం కొన్నిసార్లు పనిచేస్తుంది. అభివృద్ధి అంటే ఏమిటో, అది ఎలా జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకున్నారు. గత 20 ఏళ్లలో నితీశ్ కుమార్ బిహార్‌లో క్రమబద్ధమైన అభివృద్ధిని తీసుకువచ్చారని ప్రజలు భావించారు" అని మాధురి కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశాంత్ కిశోర్ భవిష్యత్తు..?
ఈసారి జేడీయూ 25 కంటే తక్కువ సీట్లు గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ చెప్పారని, అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారని నచికేతా నారాయణ్ అన్నారు. అయితే, నితీశ్ కుమార్ పార్టీ అంతకంటే గణనీయంగా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రశాంత్ కిశోర్ అంచనా కూడా విఫలమైంది.
మరి ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
"ప్రశాంత్ కిశోర్ రాజకీయాల నుంచి పారిపోరని నేననుకుంటున్నా. ఆయన చాలా కాలం ఈ రేసులో ఉంటారు. ఆయన విద్యావంతుల్లో పట్టుపెంచుకోవడానికి ప్రయత్నించారు" అని పుష్పేంద్ర కుమార్ అన్నారు.
"ఈ ఎన్నికలలో ఆయనకు సానుకూల పరిణామం ఏంటంటే బిహార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ చాలా బలహీనంగా మారింది, కాబట్టి ఇప్పుడు ఆయన మొదటి లక్ష్యం ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడం, ఇది కొంచెం సులభం అనిపిస్తోంది" అని తెలిపారు.
అయితే, ఆర్జేడీ ప్రధాన ఓటర్లు ఇప్పటికీ దానితోనే ఉన్నారని పుష్పేంద్ర కుమార్ భావిస్తున్నారు, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఓట్లను బట్టి ఇది స్పష్టంగా తెలుస్తోంది.
బిహార్‌లో ప్రతిపక్షం బలహీనపడటం వల్ల, ప్రస్తుత ఫలితాల తర్వాత ప్రశాంత్ కిశోర్ ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకోవడం సులభం అవుతుందని నచికేతా నారాయణ్ అభిప్రాయపడ్డారు.
"ప్రశాంత్ కిశోర్ వైపు నుంచి చూస్తే ప్రస్తుత ఫలితాలు ఊహించినవి కావు. అధికార కూటమికి ఇన్ని సీట్లు రావడం కచ్చితంగా ఆశ్చర్యకరం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా ఫలితాల మాదిరిగానే ఉన్నాయి" అని ఆయన అన్నారు.
"ఈ పరిస్థితిలో ప్రశాంత్ కిశోర్ ఏమి చేస్తారన్నది చూడాలి. గత మూడు, నాలుగేళ్లనుంచే ఆయన గురించి మనకు తెలుసు. బిహార్ ప్రజలకు ఆయన గురించి, గతంలో ఆయన చేసిన పనుల గురించి పెద్దగా తెలియదు. అందువల్ల, ఆయన ఏం చేస్తారనే అంచనా వేయడం అంత సులభం కాదు" అని నచికేతా నారాయణ్ విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














