బిహార్ ఎన్నికలు: కాంగ్రెస్‌ పార్టీ 6 సీట్లకే ఎందుకు పరిమితమైంది? 5 కారణాలు

రాహుల్ గాంధీతో ఖర్గే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను ఎన్‌డీఏ 202 చోట్ల విజయంతో చరిత్రాత్మక ఆధిక్యం సాధించింది. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్, ఇతర పార్టీల మహాఘట్‌బంధన్‌కు ఘోర పరాజయం ఎదురైంది.

ఇందులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 60 స్థానాల్లో పోటీచేస్తే, కేవలం 6 చోట్ల మాత్రమే గెలిచింది.

ఈసారి ఏకపక్షంగా జరిగిన బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఓట్ల వాటా 8.71 శాతం మాత్రమే. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా 9.6 శాతం. అప్పుడు 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 19 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 27 సీట్లు గెలుచుకుంది. 2010 ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే సాధించింది.

కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బిహార్‌లో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈసారి ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీచేసి 6 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. అంటే, ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఒకరు మాత్రమే గట్టెక్కగలిగారు.

కాంగ్రెస్ పార్టీ తీరు ఇంత పేలవంగా ఉండటం అనూహ్యంగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, దీని సంకేతాలు ఎన్నికల ప్రచార సమయంలోనే వెలుగుచూశాయంటున్నారు విశ్లేషకులు.

1990 నుంచీ బిహార్‌లో ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి దూరమై చాలా కాలమైంది. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిస్పందిస్తూ, ఈ ఫలితానికి ఎలక్షన్ కమిషన్‌ను బాధ్యులుగా చేస్తూ మాట్లాడారు.

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ, ''ఈ ఎన్నికలు బిహార్ ప్రజలకు, ఎలక్షన్ కమిషన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం. ఇందులో ఎలక్షన్ కమిషన్ పైచేయి సాధిస్తోంది'' అన్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ''ఈ మొత్తం గేమ్ అంతా నకిలీ ఓటర్ల జాబితాలు, నకిలీ ఈవీఎంల గురించే, నా అనుమానం నిజమైంది'' అని వ్యాఖ్యానించారు.

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా మాట్లాడుతూ, ''ర్యాలీలకు వచ్చిన జనసందోహాన్ని బట్టి చూస్తే మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనిపించింది. ఈ ఓటమి అనూహ్యం, కారణాలను మేం సమీక్షిస్తాం'' అని చెప్పారు.

బలమైన సామాజిక పునాదులు లేకపోవడం, బలహీనమైన సంస్థాగత నిర్మాణం, మహాఘట్ బంధన్‌లోని పార్టీల మధ్య సమన్వయలోపం, అభ్యర్థుల ఎంపికలో అలక్ష్యం... కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

1. సామాజిక పునాదుల లోపం

కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో బలమైన సామాజిక పునాదులు లేకపోవడం ఆ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

''కాంగ్రెస్ పార్టీకి బలమైన సామాజిక పునాదులు లేవు. అగ్రకులాలు ఇప్పటికే ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. మరోవైపు, వెనుకబడిన కులాలు పార్టీకి చేరువకాలేదు'' అని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సురూర్ అహ్మద్ చెప్పారు.

''కాంగ్రెస్ ఒక సైద్ధాంతిక పార్టీ. కానీ బిహార్ రాజకీయాల్లో కులం, సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషిస్తాయి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగేంత పెద్ద సామాజిక బలం ఏ పార్టీకీ లేదు'' అన్నారు ఆయన.

‘‘ఓటుబ్యాంకును ఏకీకరణ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలేవీ చేయలేదని భావిస్తున్నాను'' అని బిహార్‌లోని ప్రముఖ దినపత్రిక ప్రభాత్ ఖబర్ స్టేట్ హెడ్ అజయ్ కుమార్ చెప్పారు.

''కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో ఉన్న సామాజిక బలం క్రమంగా బలహీనపడింది. దాన్ని తిరిగి పటిష్టం చేసుకోవడానికి 2005 నుంచి పార్టీపరంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ దళిత, ఈబీసీ కులాలతో మమేకమవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నం ఈ ఎన్నికల్లో విఫలమైంది'' అని వివరించారు.

ఎన్నికల సమయంలో తమ సామాజిక బలాలను బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చురుకైన ప్రయత్నాలేవీ చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

''ఎన్నికలకు రెండు నెలల ముందు వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక తీర్మానాన్ని రాహుల్ గాంధీ విడుదల చేశారు. కానీ దాని గురించి పార్టీ ప్రచారం చేయలేదు. ఫలితంగా, వెనుకబడిన కులాలలో ఆ పార్టీ పట్టు బలహీనంగానే ఉంది. ఈలోగా, బీజేపీ, జేడీయూ కూటమి అనుసరించిన బలమైన సామాజిక, సంస్థాగత వ్యూహాలు ఎన్నికలలో బాగా పనిచేశాయి'' అని జర్నలిస్టు నచికేత నారాయణ్ చెప్పారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ

2. సైద్ధాంతిక సవాళ్లు

బీజేపీకి బలమైన హిందుత్వ ఎజెండా ఉంది. గత కొన్నేళ్లుగా ఆ పార్టీ చాలా ఎన్నికల్లో విజయం సాధించింది.

హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తర్వాత ఇప్పుడు బిహార్‌లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఒక పెద్ద విజయాన్ని నమోదుచేసింది.

బీజేపీ నాయకులు తమ పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు.

''కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఏమిటంటే, దాని భావజాలంతో ప్రజలు అనుసంధానం కాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం, వ్యూహం రెండింటినీ బిహార్ ప్రజలు తిరస్కరించారు. అయితే, ఈ సవాలు బిహార్‌కే పరిమితం కాదు. కాంగ్రెస్ పార్టీ లోతుగా స్వీయసమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే, బిహార్‌లోనే కాదు దేశవ్యాప్తంగా వామపక్ష, మధ్యేవాద పార్టీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కానీ మరోవైపు, మితవాద పార్టీలు మరింత బలోపేతం అవుతున్నాయి'' అని సీనియర్ జర్నలిస్టు సురూర్ అహ్మద్ చెప్పారు.

సామాజిక మాధ్యమాలు, సమాచార విప్లవం ఉన్న ఈ రోజుల్లో ప్రజలు భావోద్వేగాలతో అధికంగా ప్రభావితమవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెబుతున్న అంశాలు సైద్ధాంతికపరమే అయినప్పటికీ వాటికి భావోద్వేగ స్పందన ఉండట్లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు.

బిహార్‌లో ఒక ర్యాలీలో పాల్గొన్న మహాఘట్‌బంధన్ నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో ఒక ర్యాలీలో పాల్గొన్న మహాఘట్‌బంధన్ నాయకులు

3. ప్రచార వైఫల్యం...

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నిరుద్యోగం, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, ఉచిత విద్యుత్తు, పేదల సంక్షేమం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలను చేర్చింది. తీరా ఎన్నికల ప్రచారంలో మాత్రం బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్), ఓట్ల చోరీ వంటి అంశాలనే ఎక్కువ ప్రచారం చేసింది. మీడియా కవరేజీలో కూడా పార్టీ ప్రచారం దీన్నే ప్రతిబింబించింది.

అయితే ఎస్ఐఆర్, ఓట్ల చోరీ అంశాలపై ప్రజలు అంతగా స్పందించలేదు, వాటిని విస్పష్టంగా చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలపై ఎలాంటి గణనీయమైన ప్రభావం చూపలేదని చెబుతున్నారు.

''ఓట్ల చోరీని ప్రధానంగా ఎన్నికలలో ప్రచారం చేసినా ఆ వివాదమేమిటో ప్రజలకు అర్థంకాలేదు, విస్పష్టంగా చెప్పలేకపోవడంతో కొత్త సమస్యలకు దారితీసింది. ప్రజలు ఓటు వేయడానికి వెళ్తుంటే, తమ ఓట్లు చోరీ అవుతాయని రాహుల్ గాంధీ ఆరోపించారు'' అని జర్నలిస్టు నచికేత నారాయణ్ చెప్పారు.

బిహార్‌లో తొలి దశ పోలింగ్‌కు ముందు రోజు రాహుల్ గాంధీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రెస్ మీట్‌లో చెప్పారు. బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లకు వ్యతిరేకంగా ఆయన పలు ఆరోపణలు చేశారు.

''స్పష్టమైన ఎజెండా, చురుగ్గా ఉంటూ ప్రజలతో మమేకమైనప్పుడే ఏ పార్టీ అయినా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. తమ విధానాలను స్పష్టంగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ చాలాకాలంగా కష్టపడుతోంది. బిహార్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. తన ఎజెండాను ప్రచారం చేసుకోవడంలో విఫలమైంది'' అని జర్నలిస్టు అజయ్ కుమార్ అన్నారు.

అదే సమయంలో ఎన్‌డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో తొలినుంచీ బిహార్‌లో లాలూ యాదవ్ పరిపాలనపై 'జంగిల్ రాజ్' అంటూ ఆరోపణలు కొనసాగిస్తూ వచ్చింది.

''ఎన్‌డీఏ కూటమి అత్యంత విజయవంతమైన వ్యూహం ఏమిటంటే, తమ పాలనలోని లోపాలేవీ చర్చకు రాకుండా చేశారు. దానికి బదులుగా లాలూ శకాన్ని తెరపైకి తెచ్చి, చర్చ కూడా దాని చుట్టూనే తిరిగేలా చూశారు'' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

''జంగిల్ రాజ్‌ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించడంలో ఎన్‌డీఏ కూటమి విజయవంతమైంది. దాన్ని సమర్థంగా తిప్పికొట్టడానికి కాంగ్రెస్ వద్ద ఎలాంటి వ్యూహం లేకపోయింది'' అని నచికేత నారాయణ్ అన్నారు.

మహాఘట్‌బంధన్‌ నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహాఘట్‌బంధన్‌ నాయకులు

4. సమన్వయలోపం...

బిహార్ ఎన్నికల్లో, ఒకవైపు కొత్త పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటూ ఎన్‌డీఏ బలోపేతమవుతుంటే, మరోవైపు మహాఘట్‌బంధన్‌లో ప్రధాన భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆర్‌జేడీ మధ్య సమన్వయలోపం, విశ్వాసం లేకపోవడం కనిపించింది.

''కాంగ్రెస్ పార్టీ బిహార్‌లో తమ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడంపై గానీ, మహాఘట్‌బంధన్‌లో తోటి పార్టీలతో సమన్వయం చేసుకోవడంపై గానీ దృష్టి పెట్టలేదు. మండల్ కమిషన్ తర్వాత లాలూ యాదవ్‌తో కలిసి ఉండాలా లేక స్వతంత్రంగా ఉండాలా అనే విషయమై కాంగ్రెస్ పార్టీలోనే విభేదాలు వచ్చాయి. బిహార్‌లో పార్టీ విభాగం అభిప్రాయం ఎలా ఉన్నా అధినాయకత్వం మాత్రం ఆర్‌జేడీతో పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపించింది. కానీ ఈ పొత్తు నిష్ఫలంగా కనిపిస్తోంది'' అని అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

''ఆర్‌జేడీతో పొత్తు నుంచి కాంగ్రెస్ వైదొలగి ఉంటే, అదో పెద్ద పొరపాటు అయ్యేది. ఎందుకంటే విడిపోయిన తర్వాత, దాని ఓట్ల శాతం ఎంతగా తగ్గిపోయేదంటే, అది బిహార్‌లో తన ఉనికి కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్లుగా కనిపించేది'' అని జర్నలిస్టు సురూర్ అహ్మద్ అన్నారు.

''కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం లేకపోవడం ఒక ప్రధాన అంశం. చాలాచోట్ల స్నేహపూర్వక పోటీలు జరిగాయి. ఇది ఎన్నికల వ్యూహానికి, పార్టీకి నష్టం కలిగించింది'' అని నచికేత నారాయణ్ చెప్పారు.

పాట్నాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

5. బలహీనమైన కేడర్, అభ్యర్థుల ఎంపికపై అలక్ష్యం...

కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, అంకితభావం గల కార్యకర్తలు కానీ లేరు. ఇటీవలి సంవత్సరాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా మరింత బలహీనపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

''కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నిర్మాణం బలంగా లేదు. మధ్యతరగతి, కొంతమంది ఉత్సాహవంతుల అభిమానం ఉన్నా దానిని బలమైన పునాదిగా మలచుకోలేకపోయింది. బిహార్‌లో ఆర్‌జేడీ లేదా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ మాదిరిగా అంకితభావంగల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి లేరు. ఇది కాంగ్రెస్ పార్టీ అంత బలమైన స్థితిలో లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది'' అని సురూర్ అహ్మద్ అన్నారు.

''ఒక పార్టీకి స్పష్టమైన ఎజెండా, చొరవతో ప్రజలలో మమేకమైనప్పుడు ఎన్నికలలో మెరుగైన ఫలితాలను సాధించగలుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న లోపం. ప్రాంతీయ పార్టీల్లేని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక బలమైన సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ, బలమైన ప్రాంతీయ పార్టీలున్న ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఆ విషయంలో విఫలమైంది'' అని అజయ్ కుమార్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అలక్ష్యం కూడా వేలెత్తిచూపేలా ఉందని నచికేత నారాయణ్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)