బిహార్ ఎన్నికల ఫలితాలు: ఎన్డీయే కూటమి విజయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఎన్డీయే ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 89 స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ 85 స్థానాల్లో గెలుపొందింది.
మరోవైపు మహాఘట్‌బంధన్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ కూటమిలోని ఆర్జేడీ 25 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలిచింది.
మరోవైపు, ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ తన ఖాతా తెరవలేకపోయింది. ఒక్క సీటూ దక్కలేదు.

బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్నిచోట్ల ఆధిక్యంలో ఉంది?
బిహార్‌లో రెండు దశలలో పోలింగ్ జరిగింది. మొత్తంగా 67.13 శాతంగా పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో 1951 తర్వాత ఇదే అత్యధిక శాతం పోలింగ్.
కచ్చితమైన సమాచారం కోసం ఈసీఐ రిజల్ట్స్ వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేయాలని, వదంతులు లేదా అనధికారిక అప్‌డేట్స్ ప్రచారం చేయవద్దని ఈసీఐ సూచించింది.
టీవీ, ఆన్‌లైన్ మీడియా కూడా అధికారిక డేటాపై మాత్రమే ఆధారపడాలని తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌లో ప్రధాన పోటీ ఎవరి మధ్య?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అధికార ఎన్డీయే, మహాఘట్‌బంధన్ మధ్యే కీలకమైన పోటీ జరిగింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ మొదటిసారిగా పోటీ చేశాయి.
ఎన్డీఏ కూటమిలో ఐదు పార్టీలున్నాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో 6 సీట్లలో పోటీ చేశాయి.
మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కూడిన మహాఘట్‌బంధన్ తమ కూటమిలో ఎవరికెన్ని సీట్లు అనేది అధికారికంగా ప్రకటించలేదు.
అయితే.. ఆర్జేడీ 143 సీట్లలో, కాంగ్రెస్ 61 సీట్లలో, సీపీఐఎంఎల్ 20 సీట్లలో, వీఐపీ 13 సీట్లలో, సీపీఐ(ఎం) 4 సీట్లలో, సీపీఐ 9 సీట్లలో పోటీ చేశాయి.
ఎన్డీయే కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. అయితే, మహాఘట్‌బంధన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేసింది.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్ ఎగ్జిట్ పోల్.. ఎన్డీయే కూటమి 147-167 సీట్లు, మహాఘట్‌బంధన్ 70-90 సీట్లు, ఇతరులు 2-6 సీట్లు గెలుచుకోనున్నాయని పేర్కొంది.
ఇందులో బీజేపీకి 65-73 సీట్లు, జేడీయూకి 67-75 సీట్లు, ఎల్జేపీ (ఆర్)కి 7-0 సీట్లు, హెచ్ఏఎంకి 4-5 సీట్లు, ఆర్ఎల్ఎంకి 1-2 సీట్లు వస్తాయని పోల్ చెప్పింది.
ఇక మహాఘట్‌బంధన్‌లోని ఆర్జేడీకి 53-58 సీట్లు, కాంగ్రెస్‌కు 10-12 సీట్లు, వీఐపీకి 1-4 సీట్లు, వామపక్షాలకు 9-14 సీట్లు వస్తాయని చెప్పింది.
ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీయేకు 48 శాతం ఓట్లు, మహాకూటమికి 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్, ఎన్డీయేకి 130-138 సీట్లు, మహాఘట్‌బంధన్‌కు 100-108 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీయే 145-160 సీట్లు, మహాఘట్‌బంధన్ 73-91 సీట్లు వస్తాయని అంచనా.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీయే 133-159 సీట్లు, మహాఘట్‌బంధన్ 75-101 సీట్లు గెలుచుకుంటుంటని అంచనా.
పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్, ఎన్డీయే కూటమి 133-148 సీట్లు, మహాఘట్‌బంధన్ 87-102 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కాబట్టి, ఇవి తుది ఫలితాలు కావని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ని సీట్లు రావాలి?
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏదైనా పార్టీ లేదా కూటమికి 122 సీట్లు ఉండాలి.
ప్రస్తుతం, బిహార్‌లో జేడీయూ, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలలో 122 స్థానాలను మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది.

ఫొటో సోర్స్, UGC
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు.
ఉపఎన్నికను ఈ మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బహిరంగ సభ, రోడ్ షోలతో ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి కేటీఆర్ కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ తరఫున రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. స్వతంత్రులూ గట్టిగానే ప్రచారం చేశారు.
మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా తెలంగాణలో పేరుమోసిన రాజకీయ నాయకుల్లో చాలామంది కొన్నివారాలుగా జూబ్లీహిల్స్‌లోనే కనిపించారు.
దీంతో ఫలితాల కోసం పోటీ చేసిన, ప్రచారం చేసినవారే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఉప ఎన్నికకు ఈనెల 11న పోలింగ్ ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















