'సాక్స్‌కు రూ. 20 వేలా?' యాపిల్ ప్రోడక్ట్‌పై ఆన్‌లైన్‌లో ఎగతాళి

యాపిల్, ఐఫోన్ కవర్, పాకెట్

ఫొటో సోర్స్, Apple

ఫొటో క్యాప్షన్, చిన్న హ్యాండిల్ ఉన్న పాకెట్ ఎనిమిది రంగులలో, భుజం పట్టీ ఉన్నది మూడు రంగులలో తీసుకొస్తోంది కంపెనీ.
    • రచయిత, లారా క్రెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐఫోన్‌ను క్యారీ చేసేందుకు యాపిల్ తీసుకొచ్చిన ఐఫోన్ పాకెట్‌పై ఆన్‌లైన్‌లో యూజర్లు ఎగతాళి చేస్తున్నారు.

ఈ పాకెట్ ధర 229.95 డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.20,390) ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది.

ఆన్‌లైన్ యూజర్లలో కొందరు పాకెట్ అధిక ధరపై, మరికొందరు పాకెట్‌ను షూ సాక్‌తో పోల్చుతూ చమత్కరించారు.

‘ఎక్స్’లో ఒక యూజర్ "కట్-అప్ సాక్‌కు 230 డాలర్లు" అని రాశారు.

ఇది "యాపిల్ ఏ ప్రొడక్ట్ విడుదల చేసినా కొనే లేదా సమర్థించే ఫ్యాన్స్‌కు పరీక్ష" అని టెక్ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ అన్నారు.

జపనీస్ ఫ్యాషన్ లేబుల్ 'ఇస్సే మియాకే' తో కలిసి ఐఫోన్ పాకెట్ రూపొందించినట్లు యాపిల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటిని పరిమిత సంఖ్యలోనే విక్రయించనున్నట్లు చెప్పింది.

మూడేళ్ల కిందట మరణించిన డిజైనర్ ఇస్సే మియాకే గతంలో యాపిల్‌తో కలిసి పనిచేశారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించే నల్లటి టర్టిల్‌నెక్‌లను రూపొందించింది ఆయనే.

ఐఫోన్ పాకెట్ 'ఒక వస్త్రం ముక్క' నుంచి ప్రేరణ పొందిందని, 'అదనపు పాకెట్‌ను సృష్టించడం' అనే ఆలోచన నుంచి వచ్చిందని యాపిల్ తెలిపింది.

చిన్న హ్యాండిల్ ఉన్న బ్యాగ్(పాకెట్) ఎనిమిది రంగులలో, భుజం పట్టీ ఉన్న బ్యాగ్ మూడు రంగులలో తీసుకొస్తోంది కంపెనీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాపిల్, ఫోన్ కవర్

ఫొటో సోర్స్, Getty Images

'విశ్వసనీయతకూ పరిమితులు'

కంపెనీ ప్రకటన సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. యాపిల్ అభిమానులు దేనికైనా డబ్బు చెల్లిస్తారని ఇది చూపిస్తుందని చాలామంది అంటున్నారు. బ్యాగ్ ఓపెన్ టాప్, సాక్ లాంటి రూపాన్ని కూడా ఎగతాళి చేశారు.

"జిప్ లేదు, ఆకారం లేదు, ఈ రోజుల్లో చాలా ఐఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. భద్రత లేదా?" అని ఓ ఎక్స్ యూజర్ ప్రశ్నించారు.

కొందరు బోరాట్‌ పాత్రలోని నటుడు సచా బారన్ కోహెన్ ఫన్నీ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ బ్యాగ్‌ను ఆ పాత్రకు సంబంధించిన ఆకుపచ్చ మన్కినితో పోల్చారు.

కొత్త ప్రోడక్ట్ విషయంలో కొందరు యాపిల్‌ను సమర్థించారు. ఇస్సే మియాకేతో భాగస్వామ్యం కారణంగా అధిక ధర వచ్చిందని అన్నారు.

పాకెట్ ధర ఆచరణాత్మక ఉపయోగం కంటే దాని శైలి, బ్రాండ్ ఇమేజ్, ప్రత్యేకతలకు సంబంధించినదని సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవరా బీబీసీతో అన్నారు.

"ఈ రకమైన ధర లగ్జరీ ఫ్యాషన్, డిజైనర్ భాగస్వామ్యాలలో సాధారణం'' అన్నారు.

"కానీ చాలామందికి, యాపిల్ తన కస్టమర్లు నిజంగా ఎంత విధేయులుగా ఉన్నారో పరీక్షిస్తున్నట్లు అనిపిస్తుంది" అన్నారు మాట్ నవరా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)