జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బి.సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈ ఉప ఎన్నిక కోసం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
ఎన్నికల సంఘం జాబితా ప్రకారం, మొత్తం 4,01,365 మంది ఓటర్లు నియోజవర్గ పరిధిలో ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు.
ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 20.76 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆయన ఇక్కడ గెలవడం అది మూడోసారి. అంతకుముందు ఆయన 2014లో టీడీపీ నుంచి, 2018లో బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) నుంచి గెలుపొందారు.


ఫొటో సోర్స్, UGC
మొత్తం 58 మంది అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీలో నిలిపింది.
మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది.
ఇక మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలుపుకుని మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లుగా సీఈవో బి.సుదర్శన్ రెడ్డి చెప్పారు.
''68 సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో భదత్ర ఏర్పాటు చేశాం'' అని అన్నారు.
ఏవైనా సమస్యలు ఎదురైతే 1950 నంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC
డ్రోన్ల సాయంతో నిఘా
ఈ ఎన్నికల్లో మొదటిసారిగా డ్రోన్ల సాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి మీడియాతో చెప్పారు.
మొత్తం 1761మంది పోలీసు బలగాలతోపాటు మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
గత మూడు ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే, ఒక్కసారి మినహా ఓటింగ్ ఎప్పుడూ 50 శాతానికి మించి నమోదు కాలేదు. 2014 ఎన్నికల్లోనే 50.2 శాతం ఓటింగ్ నమోదైంది.
2018లో 45.49 శాతం, 2023లో 47.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే, 2019లో 39.8 శాతం, 2024లో 45.5 శాతం ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నమోదయ్యాయి.
2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి కనుక, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతం కూడా 50.2 శాతంగానే ఉంది.














