ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరొచ్చా? ఈ ప్రశ్నకు మోహన్ భాగవత్ ఏమన్నారంటే..

ముస్లింలు, ఆర్ఎస్ఎస్‌, మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, IDREES MOHAMMED/AFP via Getty Image

ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి సంఘ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇటీవల ఆర్ఎస్ఎస్ గురించి ఖర్గే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

"దేశవ్యాప్తంగా ప్రభావం, ఉనికి ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటికీ ఎందుకు రిజిస్టర్ కాలేదు?" అని ప్రియాంక్ ఖర్గే ఎక్స్‌ ద్వారా ప్రశ్నించారు.

"దేశంలోని ప్రతి మతపరమైన, ధార్మిక సంస్థకు ఆర్థికపరమైన పారదర్శకత తప్పనిసరి అయితే, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి వ్యవస్థ లేకపోవడాన్ని ఎలా సమర్థిస్తారు?" అని ఆయన ఆ పోస్టులో రాశారు.

దీనిపై స్పందిస్తూ, 'దేశంలో రిజిస్టర్ కానివి ఎన్నో ఉన్నాయి, హిందూ మతం కూడా రిజిస్టర్ కాలేదు' అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియాంక్ ఖర్గే

ఫొటో సోర్స్, @PriyankKharge

ఫొటో క్యాప్షన్, ప్రియాంక్ ఖర్గే మరోసారి సంఘ్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు.

'హిందూ మతం కూడా రిజిస్టర్ కాలేదు'

ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు మోహన్ భాగవత్ ఈ ప్రకటన చేశారు.

"ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు రిజిస్టర్డ్ సంస్థ కాదు? ఇది కేవలం యాదృచ్చికమా, లేదా సంఘ్ స్వచ్ఛందంగా దానిని నమోదు చేయలేదా? లేదా ఏదైనా చట్టపరమైన విషయాల నుంచి తప్పించుకోవడానికి అలా చేసిందా?" అని ఆ కార్యక్రమంలో ఆయనను అడిగారు.

దీనికి మోహన్ భాగవత్ స్పందిస్తూ, "నిజానికి, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగ విరుద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగ పరిధిలో ఉన్న సంస్థ. మా చట్టబద్ధత ఈ రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కాబట్టి, మాకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రిజిస్టర్ కానివి ఎన్నో ఉన్నాయి. హిందూ మతం కూడా రిజస్టర్ కాలేదు" అని బదులిచ్చారు.

"ఈ ప్రశ్నకు ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానం ఇచ్చాం. 1925లో ఆర్ఎస్ఎస్‌ ఏర్పాటైంది. ఆ సమయంలో మా సర్ సంఘ్ చాలక్‌లు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేం బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామా? అలా నమోదు చేయించి ఉండాలని మీరు అనుకుంటున్నారా?" అని ఆయన ప్రశ్నించారు.

"స్వాతంత్య్రం తర్వాత వచ్చిన చట్టాలు కూడా రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయలేదు. చట్టపరంగా మేం'బాడీ ఆఫ్ ఇండివిజువల్స్', అంటే వ్యక్తుల సంఘం. ఇది అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థే" అని ఆయన చెప్పారు.

మోహన్ భాగవత్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ నాయకుడు బి.కె హరిప్రసాద్ మాట్లాడుతూ, "ఇది దేశంలోనే అతిపెద్ద అబద్ధం. మోహన్ భాగవత్ నుంచి ఇలాంటివి ఆశించరు. దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, ఎవరూ రాజకీయ పార్టీలను లేదా ఎన్జీవోలను రిజిస్టర్ చేయలేదు. మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత, రాజ్యాంగానికీ, దేశానికీ జవాబుదారీగా ఉండటం ప్రతి భారతీయుడి కర్తవ్యం" అని అన్నారు.

"వారు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని చెప్పుకుంటున్నారు. వారి సభ్యుల జాబితా ఎక్కడ? గురు పౌర్ణిమ లేదా విజయదశమి వంటి సందర్భాలలో స్వచ్ఛంద సేవకుల నుంచి విరాళాలు స్వీకరిస్తామని వారు చెబుతున్నారు. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంది? వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మేం ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాం. ఏదైనా తప్పు జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు?" అని బి.కె హరిప్రసాద్ అన్నారు.

ఆర్ఎస్ఎస్

ఫొటో సోర్స్, @RSSorg

ఫొటో క్యాప్షన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

'ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ పరిధిలో ఉన్న సంస్థ'

ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, నిధులకు సంబంధించిన విషయాలతో పాటు ఆర్ఎస్ఎస్ అనే భావన గురించి ఎందుకు మాట్లాడరు? అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను ప్రశ్నించగా.. "ఆదాయ పన్ను శాఖ మమ్మల్ని పన్నులు చెల్లించమని అడిగింది. దీనిపై కేసు నమోదైంది. ఇది వ్యక్తుల సమూహంగా గుర్తింపు పొందిన సంస్థ, మాకు వచ్చే గురుదక్షిణ ఆదాయ పన్ను పరిధిలోకి రాదు అని కోర్టు తీర్పు ఇచ్చింది" అని భాగవత్ బదులిచ్చారు.

"మమ్మల్ని మూడుసార్లు నిషేధించారు. దీనర్థం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. మేం లేకుంటే, ప్రభుత్వం ఎవరిని నిషేధించింది? ప్రతిసారీ కోర్టు నిషేధాన్ని ఎత్తివేసి, ఆర్‌ఎస్‌ఎస్‌ని చట్టబద్ధమైన సంస్థగా చేసింది."

ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా అనేక చర్చలు జరిగాయని, పార్లమెంట్‌లో కూడా ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడారని, ఇది ఆర్ఎస్ఎస్‌ను గుర్తింపు పొందిన సంస్థగా నిర్ధరించే సాక్ష్యం" అని మోహన్ భాగవత్ అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు బి.కె హరిప్రసాద్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ సభ్యుల జాబితా ఎక్కడ? అని కాంగ్రెస్ నాయకుడు బి.కె హరిప్రసాద్ అడిగారు.

ముస్లింలు, క్రైస్తవుల గురించి కూడా భాగవత్ మాట్లాడారు..

ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరేందుకు హిందువులకు మాత్రమే అనుమతి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

"ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరొచ్చా? ఒకవేళ ముస్లింలకు ఆర్ఎస్‌ఎస్‌లో చేరేందుకు అనుమతి ఇస్తే, వారికి నమ్మకం ఎలా కలిగిస్తారు?" అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

"ఈ సంఘ్‌లో బ్రాహ్మణులకు చోటు లేదు., మరే ఇతర కులాల వారికి కూడా అనుమతి లేదు. అలాగే ముస్లింలు, క్రైస్తవులు, శైవులు, శాక్తులు ఎవరికీ ఇందులో చేరేందుకు అనుమతి లేదు. ఇక్కడ కేవలం హిందువులకు మాత్రమే అనుమతి ఉంది" అని భాగవత్ అన్నారు.

"వివిధ మతాల వారు, ముస్లింలు, క్రైస్తవులు, ఎవరైనా సంఘ్‌లో చేరవచ్చు, కానీ మీరు మీ ప్రత్యేక గుర్తింపును పక్కన పెట్టేయాలి. అయితే, సంఘ్‌‌లోకి వచ్చాక మీరు భరతమాత బిడ్డ. అంటే, మీరు ఈ హిందూ సమాజంలో సభ్యుడైపోతారు."

" ఇతర కులాల వారు వచ్చినట్లే ముస్లింలు, క్రైస్తవులు కూడా సంఘ్‌కి వస్తారు. మేం వారేంటనేది పట్టించుకోం. మీరు ఎవరు అని అడగం. మనమందరం భారతమాత బిడ్డలం. దీని ఆధారంగానే సంఘ్ పనిచేస్తుంది" అని ఆయన అన్నారు.

ఒకవేళ ముస్లింలకు దగ్గరయ్యేందుకు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేపడితే వారి కోసం విద్యాసంస్థలు నెలకొల్పే ఆలోచన ఏమైనా ఉందా? అని భాగవత్‌ను అడిగారు.

అందుకు ఆయన స్పందిస్తూ, "నిజానికి, మేం ఎవరికీ ఏమీ చేయం. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ తమను తాను రక్షించుకోవాలి. ఎవరూ మీకోసం రారు. తమ కోసం తాము నిలబడేవారికే దేవుడు కూడా సాయమందిస్తాడు" ఆయన బదులిచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)