అద్దెకు బ్యాంక్ అకౌంట్, నెలకు 25 వేలు.. ఇలా వందల కోట్లు కొల్లగొట్టారు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్సీ గగ్డేకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇళ్లు, దుకాణాలు, కార్లు, బంగ్లాలను అద్దెకు ఇవ్వడం సర్వసాధారణం. కానీ, ఇటీవల గుజరాత్‌లో బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరస్తులు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్న 100కి పైగా ఇలాంటి బ్యాంక్ అకౌంట్లను గుజరాత్ పోలీసులు గుర్తించారు.
ఈ ఖాతాలు గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వీటిలో చాలావరకూ నేరానికి పాల్పడిని వారి బంధువులు, స్నేహితులవే.
ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి అకౌంట్లు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
గుజరాత్ సైబర్ క్రైమ్ సెల్ దాడులతో, దాదాపు రూ. 200 కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. నిందితులు మోసం, డిజిటల్ అరెస్ట్, ఉద్యోగ ఆఫర్లు, ఫిషింగ్ స్కామ్‌ల వంటి వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును దోచుకున్నట్లు నిందితులపై ఆరోపణలున్నాయి.
బ్యాంక్ అకౌంట్‌ను అద్దెకు ఇవ్వడం అంటే, వేరే వ్యక్తి తన ఖాతాలో ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఖాతాదారు తనకు తెలిసీ లేదా తెలియకుండా అనుమతించడం.
డబ్బును సైబర్ నేరస్తులకు బదిలీ చేయడంలో అలాంటి ఖాతాలు తెలియకుండానే సహాయపడతాయని పోలీసులు అంటున్నారు.
ఇలా బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చే వారిని సైబర్ క్రైమ్ భాషలో 'మనీ మ్యూల్స్' అని పిలుస్తారు. అలాంటి ఖాతాలను 'మ్యూల్ అకౌంట్స్' అంటారు. సైబర్ క్రైం బాధితులు తమ డబ్బును ఈ 'మ్యూల్ అకౌంట్'లో జమ చేసేవారు.
ఇలాంటి సైబర్ మోసం కేసులో గుజరాత్ సీఐడీ క్రైమ్ విభాగంలోని సైబర్ క్రైమ్ సెల్ ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.
నిందితుల్లో మోర్బికి చెందిన మహేష్ సోలంకి, రూపిన్ భాటియా, సురేంద్రనగర్‌లోని లఖ్తార్‌కు చెందిన రాకేష్ లానియా, రాకేష్ దఖావాడియా, సూరత్‌కు చెందిన నవ్య ఖంభాలియా, పంకిత్ కఠారియాలు ఉన్నారు.
చాలామంది తమ బ్యాంకు ఖాతాలను నెలకు రూ.25,000 లేదా రూ.1 లక్ష లావాదేవీకి రూ.650 చొప్పున ప్యాకేజీకి అద్దెకు ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బు ఈ ఖాతాలలో జమ అవుతుంది. ఆ తర్వాత మోర్బి, సూరత్, దుబాయ్‌లకు చేరుతుంది.
"నిందితులు మోర్బిలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సూరత్, సురేంద్రనగర్ నిందితులతో కనెక్ట్ అయి పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించారు. నిందితులలో కొందరు గతంలో వజ్రాల గ్రైండింగ్ యూనిట్లలో పనిచేశారు. కానీ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరాల వైపు మళ్లారు" అని సైబర్ క్రైమ్ సెల్ ఏఎస్పీ సంజయ్ కుమార్ కేష్వాలా బీబీసీతో చెప్పారు.
నిందితులు తమ బంధువులతో పాటు ఇతరుల పేరుతో ఖాతాలను తెరిచి, వాటితో లావాదేవీలు జరిపారని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఈ స్కామ్ గురించి పోలీసులకు ఎలా తెలిసింది?
భారత్‌లో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, పోలీసులలోని వివిధ ఆర్థిక నేర విభాగాలు అసాధారణ లావాదేవీలున్న ఖాతాలపై నిఘా ఉంచుతుంటాయి.
ఇందులో భాగంగా, లఖ్తార్‌లోని ఏపీఎంసీలో పనిచేస్తున్న శివమ్ ట్రేడింగ్ అనే కంపెనీ బ్యాంక్ ఖాతాలో అసాధారణ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేయగా స్కామ్ వెలుగులోకి వచ్చింది.
"అటువంటి ఖాతా గురించి తెలియగానే, నిఘా విభాగం దానిపై దృష్టి సారిస్తుంది. మేం ఈ ఖాతాపై దాదాపు నెలన్నర పాటు నిఘా ఉంచాం. ఆధారాలు దొరికిన తర్వాతే దర్యాప్తు జరిపాం" అని ఏఎస్పీ సంజయ్ కుమార్ అన్నారు.
ఈ సమయంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది. ఎక్కడికి, ఎలా వెళుతోంది, దాని వెనుక ఎవరున్నారు? ఈ డబ్బు చివరికి ఎక్కడికి చేరుతుందనే విషయాలపై పోలీసులు విచారణ జరిపారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, అలాంటి మ్యూల్ ఖాతాలో డబ్బు జమ అయిన తర్వాత, మోర్బిలోని ఏదో ఒక బ్యాంకు శాఖ నుంచి విత్‌డ్రా చేశారు. ఆ తర్వాత అంగడియా(కొరియర్) ద్వారా సూరత్‌కు డబ్బును పంపారు. అక్కడ, ఆ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి, దుబాయ్‌లోని ఒక వ్యక్తికి చేరవేశారు.
క్రిప్టోకరెన్సీ రూపంలో ఉన్న ఈ డబ్బు దుబాయ్‌లో ఎవరికి చేరుతోందో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి శిక్ష పడుతుంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2011 జులైలో విడుదల చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, మ్యూల్ అకౌంట్స్ ఖాతాదారులను మనీ మ్యూల్స్ అని పిలుస్తారు.
"ఖాతాదారుడికి ఇది తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు. ఖాతాను అలా ఉపయోగిస్తే, దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. దానిలోని డబ్బు ఈ నేరానికి సంబంధించినది కాకపోయినా స్తంభింపజేయవచ్చు" అని సైబర్ క్రైమ్ నిపుణులు, న్యాయవాది పరేష్ మోదీ బీబీసీతో చెప్పారు.
"సాధారణంగా, ఈ రకమైన నేరానికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ, మనీలాండరింగ్, ఫోర్జరీ లేదా ఎన్డీపీఎస్ సెక్షన్లు కూడా చేరితే, శిక్ష 20 ఏళ్ల వరకు ఉండవచ్చు" అని ఆయన అన్నారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఖాతా ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలకు వీలు కల్పిస్తే, మనీలాండరింగ్ చట్టం- 2002, బీఎన్ఎస్(ఐపీసీ), ఐటీ చట్టం కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది.
అలాంటి వ్యక్తిని బీఎన్ఎస్ సెక్షన్ 316 ప్రకారం నమ్మక ద్రోహం నేరం (ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష), బీఎన్ఎస్ సెక్షన్ 318 ప్రకారం మోసం (మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష), మనీలాండరింగ్ సెక్షన్ల కింద శిక్షిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
8.5 లక్షల మ్యూల్ అకౌంట్స్
2025లో, సీబీఐ అలాంటి 8.5 లక్షల మ్యూల్ అకౌంట్స్‌ను గుర్తించింది.
ఈ ఏడాది ప్రారంభంలో, 'ఆపరేషన్ చక్ర-వీ' కింద సీబీఐ జాతీయ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది. జూన్‌లో రాజస్థాన్, దిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో 42 ప్రాంతాలలో దాడులు చేసింది.
డిజిటల్ అరెస్టులు, నకిలీ ప్రకటనలు, యూపీఐ ఆధారిత మోసం, మ్యూల్ అకౌంట్ల నెట్‌వర్క్ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
ఈ ఖాతాలను తెరిచే క్రమంలో కేవైసీ నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని సీబీఐ అంటోంది. చాలామంది ఖాతాదారులకు నకిలీ చిరునామాలు ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్లు వీటిపై సరిగ్గా దృష్టి పెట్టలేదు.
మ్యూల్ అకౌంట్లను తెరిచే ప్రక్రియలో కమీషన్ కోసం కొంతమంది బ్యాంకు ఉద్యోగులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఈ-మిత్ర ఆపరేటర్లు కూడా భాగమయ్యారు.
దాడుల సమయంలో మొబైల్ ఫోన్లు, కేవైసీ పత్రాలు, లావాదేవీల సమాచారం, బ్యాంక్ అకౌంట్ తెరవడానికి వాడిన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














