పీరియడ్స్ నొప్పి వల్ల వేగంగా పనిచేయలేకపోతున్నామంటే ప్రూఫ్ కోసం శానిటరీ ప్యాడ్స్ ఫొటో తీసి పంపించమని అడిగిన సూపర్‌వైజర్లు.. హరియాణాలో అమానుషం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవ్‌జ్యోత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నెలసరి వచ్చిన మహిళా పారిశుధ్య కార్మికులను అందుకు రుజువు చూపాలన్న ఘటన వెలుగు చూసింది. నెలసరికి రుజువుగా శానిటరీ ప్యాడ్ల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపమని బలవంతం చేశారనే ఫిర్యాదు నమోదైంది.
హరియాణాలోని రోహ్‌తక్‌లో మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. దీనిపైముగ్గురు మహిళా పారిశుధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఈ ఆరోపణలపై తక్షణమే ఇద్దరు సీనియర్ శానిటరీ సూపరింటెండెంట్లను యూనివర్సిటీ సస్పెండ్ చేసింది.


ఫొటో సోర్స్, MDU Rohtak
అసలు ఏమైంది?
యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు మహిళా పారిశుధ్య కార్మికురాలు రాసిన ఫిర్యాదులో ఇలా ఉంది.
'నేను 11 ఏళ్లుగా విశ్వవిద్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఈ అక్టోబర్ 26న ఇతర సహోద్యోగులతో కలిసి విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను శుభ్రం చేస్తుండగా, అక్కడ ఉన్న ఇద్దరు పురుష శానిటరీ సూపర్‌వైజర్లు త్వరగా పని చేయాలని ఒత్తిడి తెచ్చారు. నెలసరి కారణంగా వచ్చే నొప్పి వల్ల వేగంగా పని చేయలేమని ఇద్దరు వర్కర్లు సమాధానం ఇచ్చారు.
తర్వాత, సూపర్‌వైజర్ మాతో దుర్భాషలాడారు. పీరియడ్స్‌ను ధ్రువీకరించడానికి రుజువుగా శానిటరీ ప్యాడ్‌ల ఫోటోలు చూపాలని ఉన్నతాధికారులు ఆదేశించారని చెప్పారు.నాతో పాటు మరో ఇద్దరు వర్కర్లను శానిటరీ ప్యాడ్‌ల ఫోటోలు తీయాలంటూ ఒత్తిడి చేశారు.ఇందుకు ఒక కార్మికురాలు నిరాకరిస్తే ఆమెను తిట్టారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారు' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒత్తిడి, బలవంతం కారణంగా తనతో పాటు మరో సహోద్యోగి వాష్‌రూమ్‌కు వెళ్లి ఫోన్‌లో శానిటరీ ప్యాడ్‌ల ఫోటోలు తీశామని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
సూపర్‌వైజర్ చెప్పినదాని ప్రకారం ఈ విషయంలో విశ్వవిద్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు కూడా ప్రమేయం ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ఫిర్యాదుదారు ఏమి చెప్పారు?
మరో మహిళా పారిశుధ్య కార్మికురాలు మీడియాతో పంచుకున్న వివరాల ప్రకారం, 'నేను ఉదయం 7 గంటల నుంచి పని చేస్తూనే ఉన్నా. నెలసరి కారణంగా కొన్ని గంటల విశ్రాంతి కావాలని మధ్యాహ్నం 2 గంటలకు సూపర్‌వైజర్‌ను అడిగాను. అందుకు ఆయన ఒప్పుకున్నారు.
నా సహోద్యోగుల్లో మరో ఇద్దరు తాము కూడా నెలసరి నొప్పితో బాధపడుతున్నామని చెప్పారు. అప్పుడు, వారికి కూడా కొన్ని గంటల విశ్రాంతి కోసం అనుమతి అడగడానికి మళ్లీ సూపర్‌వైజర్‌కు ఫోన్ చేశాను. దానికి ఆయన మీ అందరికీ ఒకేసారి ఈ సమస్య వచ్చిందా అన్నారు.
విశ్రాంతి అడిగిన ఉద్యోగులందరినీ చెక్ చేయమంటూ అక్కడే ఉన్న మరో మహిళా పారిశుధ్య కార్మికురాలిని పంపారు. చెక్ చేయమంటూ తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు.
తర్వాత మాతో పాటు ఒక పారిశుధ్య కార్మికురాలు బాత్రూమ్‌లోకి వచ్చి, చెక్ చేసి ఫోన్‌లో శానిటరీ ప్యాడ్‌ల ఫోటోలు తీసింది. సూపర్‌వైజర్ దగ్గరకు వెళ్లి వారికి నెలసరి వచ్చిందని చెప్పింది' అని ఆమె మీడియాకు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘న్యాయం కావాలి'
ఇది చాలా అవమానకర ఘటన అని సూపర్‌వైజర్‌పై ఫిర్యాదు చేసిన మహిళా పారిశుధ్య కార్మికురాలు అన్నారు.
'నెలసరి అనేది సహజ ప్రక్రియ. ప్రతీ మహిళ నెలసరి నొప్పిని ఎదుర్కొంటారు. ఒకేరోజు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలకు నెలసరి వచ్చే అవకాశం ఉంది. మాతో ఇలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి' అని ఆమె అన్నారు.
'వారిని సస్పెండ్ చేశాం'
విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ ఈ ఘటనను ఖండించారని ఎండీయూ రిజిస్ట్రార్ డాక్టర్ కృష్ణకాంత్ గుప్తా బీబీసీతో చెప్పారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సూపర్‌వైజర్లను తక్షణమే సస్పెండ్ చేశామని తెలిపారు.
లైంగిక వేధింపులకు సంబంధించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఈ విషయంపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

'కఠిన చర్యలు తీసుకోవాలి'
ఈ విషయం తెలిసిన వెంటనే ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్టు బీబీసీతో హరియాణా మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేణు భాటియా చెప్పారు.
'ఒక మహిళను ఆమె నెలసరి రుజువును అడగడం కంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా రోహ్‌తక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, విశ్వవిద్యాలయం నుంచి ఈ విషయంపై సవివరమైన నివేదిక కోరా'' అని ఆమె చెప్పారు.
కేసు నమోదు
ఈ ఘటనపై రోహ్‌తక్ పీజీఐఎంఎస్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రోహ్‌తక్ ఎస్పీ సురేందర్ సింగ్ భౌరియా చెప్పారు.
ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, సంబంధిత సెక్షన్ల కింద దోషులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














