తిరుమల కల్తీనెయ్యి వివాదం: ‘‘చుక్క పాలు కొనకుండా లక్షలాది కేజీల నెయ్యి’’ తయారు చేశారా, సీబీఐ సిట్ రిమాండ్ రిపోర్టు పేరుతో వెలుగులోకి వచ్చిన నోట్‌లో ఏముంది?

ఫొటో సోర్స్, RAJESH
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కేసులో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.
''ఆరున్నర లక్షల కిలోల రసాయనాలను సుమారు రూ.8 కోట్లకు కొని, వాటితో చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు'' అని సిట్ రిమాండ్ రిపోర్టులో ఉందని టీడీపీ నాయకుడు పట్టాభి ఆరోపించారు.
మోనోగ్లిసరైడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలతో ఈ నెయ్యి తయారైందని, ఒక్క లీటరు పాలు కూడా కొనకుండానే, లక్షల కేజీల నెయ్యి తయారు చేశారని ఆయన ఆరోపించారు.
జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ''ఈ లడ్డూ ప్రసాదం కల్తీతో సనాతనుల మనోభావాలను, ఆచారాలను ఎగతాళి చేసి, తక్కువ చేయడం కోట్లాది భక్తుల నమ్మకాన్ని, భక్తినీ ముక్కలు చేశారు. తక్షణం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి'' అని డిమాండ్ చేశారు.
''కల్తీ జరిగినట్టు రిమాండు రిపోర్టులో ఎక్కడా స్పష్టంగా లేదు. రిపోర్టు వీళ్లే రాయించుకున్నారు. ఒక్కో చోట ఒక్కోలా రాసుకున్నారు. చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు'' అని వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
ఈ కేసులో తాజా పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి.


ఫొటో సోర్స్, facebook/Telugu Desam Party
టీడీపీ ఏమంటోంది?
సీబీఐ ప్రత్యేక విచారణ బృందం (సిట్) ద్వారా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ16గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యాపారిని విచారణాధికారులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు కోర్టులో సమర్పించిన ఆయన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయంటూ విలేఖరుల సమావేశంలో పట్టాభి తెలిపారు.
అయితే ఆ రిమాండ్ రిపోర్టును బీబీసీ స్వయంగా పరిశీలించలేదు.
''అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి నుంచి భోలే బాబా డైరీ వారు 6.5 లక్షల కిలోల పరిమాణంలో, 7 కోట్ల 94 లక్షల రూపాయల విలువ చేసే రసాయనాలు కొన్నారు. 2022 నుంచి 2024-25 మధ్య వీటిని కొన్నారు. ఈ భోలే బాబా డైరీ ఒక్క లీటరు పాలు కూడా కొనకుండానే ఈ రసాయనాలు, పామాయిల్ వాడి నెయ్యి తయారు చేసింది. కొరియా నుంచి కూడా రసాయనాలు దిగుమతి చేసుకున్నారు. మోనోగ్లిసరైడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాడి నెయ్యి తయారు చేశారు. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ సుగంధ్ నుంచి భోలే బాబా డైరీ యజమానులకు చెందిన హర్ష్ కంపెనీ పేరుతో ఈ కొనుగోళ్లు జరిగాయి'' అని రిమాండ్ రిపోర్టులో ఉందని పట్టాభి మీడియాకు చెప్పారు.
రిమాండ్ రిపోర్టులోని అంశాలుగా చెబుతున్న విషయాలతో కూడిన నోట్ ఒకటి ఆంధ్రా రాజకీయ, అధికార, మీడియా పెద్దల మధ్య సర్క్యులేట్ అవుతోంది.
ఆ నోట్‌లోని విషయాలనే కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ నోట్‌ని బీబీసీ పరిశీలించింది.

ఫొటో సోర్స్, FACEBOOK
ఆ నోట్‌లో ఏముంది?
''పొమిల్ జైన్, విపిన్ జైన్ అనే ఇద్దరూ భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వారు పాలు సేకరించకుండానే కల్తీ నెయ్యిని తయారు చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలోని భగవాన్ పూర్ దగ్గర ప్లాంటులో ఇది జరిగింది. ఇందుకోసం వారు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామోలీన్ అనే పదార్థాలు వాడారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నుంచి వాటిని కొన్నారు.
ఈ క్రమంలో అసలైన నెయ్యి చాలా చాలా తక్కువ మోతాదులో వాడి, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్లు, ఇతర కల్తీ కారక పదార్థాలు, రసాయనాలతో ఆ నెయ్యి తయారు చేశారు. ఈ రసాయనాలను చాలా జాగ్రత్తగా… అంటే ల్యాబ్ టెస్టుల్లో బయట పడకుండా, నెయ్యి అరోమా ఉండేలా కలిపి జాగ్రత్తలుతీసుకున్నారు. కేవలం తమ డైరీ భోలే బాబా ద్వారానే కాకుండా, శ్రీకాళహస్తి దగ్గర్లోని శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, పుణెకి చెందిన మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్ కి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా ఈ కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు పొమిల్ జైన్, విపిన్ జైన్ '' అని ఆ నోట్‌లో ఉంది.
ఆ నోట్‌లో ఉన్న ప్రకారం మొత్తం భోలే బాబా నుంచి, ఆ సంస్థ యజమానులతో చేతులు కలిపిన వారి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా సరఫరా అయిన నెయ్యి, దాని విలువ వివరాలివి.

ఆ నోట్ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరీలు మొత్తం 60.37 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేశాయి. వాటి విలువ మొత్తం సుమారు రూ.241 కోట్లు. అయితే ఇదంతా కల్తీదేనా లేక అందులో కొంత భాగమే కల్తీదా అన్నది స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, X/yvsubbareddymp
సుబ్బారెడ్డి పాత్రపై ప్రస్తావన
ఇదే పత్రంలో, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన పీఏ పాత్ర గురించి ప్రస్తావన ఉంది. ఆ పీఏ కడూరు చిన్నప్పన్న ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ పత్రంలో ఉన్న వివరాల ప్రకారం, 2022లో వైవీ సుబ్బారెడ్డికి ఒక గుర్తు తెలియని వ్యక్తి భోలే బాబా డైరీపై ఫిర్యాదు చేశారు. ఆ లేఖను 2022 మే 16న అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రమణ్యానికి అందించి విచారణ చేయమన్నారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆ ఆవు నెయ్యిని సీఎఫ్‌టీఆర్ఐ ల్యాబ్‌కు పంపి నాణ్యత పరీక్షలు చేయించాలని సుబ్రమణ్యానికి సూచించారు సుబ్బారెడ్డి. జూన్‌లో ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్, భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ సంస్థల నుంచి వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు తీసుకున్నారు. ఇది కాక, భోలే బాబా సరఫరా చేసిన టిన్నుల్లోని నెయ్యి నమూనా కూడా మైసూరులోని ల్యాబ్‌కు పంపించారు టీటీడీ అధికారులు.
వాటి ఫలితాలు ఆగస్టులో రాగా, మొత్తం అన్ని నమూనాల్లోనూ నెయ్యి కల్తీ అయిందని ల్యాబ్ నిర్ధరించింది. బీటా సిటోస్టెరాల్ పద్ధతిలో పరీక్షించగా ఆ నెయ్యి వెజిటబుల్ నూనెలతో కల్తీ అయినట్టు తేలింది. కానీ, సరఫరా చేసిన వారిపై ఏ చర్యలూ తీసుకోకపోగా, ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్, శ్రీ వైష్ణవి డైరీలను నెయ్యి సరఫరాకు 2024 వరకూ అనుమతించారు. భోలే బాబాను 2022 అక్టోబరు వరకూ అనుమతించారని పత్రంలో రాశారు.
''2022 మేలో కైలాశ్ చంద్ మంగ్లా, పీపీ శ్రీనివాసన్ అనే ఇద్దరితో కలసి వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు పొమిల్ జైన్. ఆ సమయంలోనే తమ ప్లాంట్‌ను కనీసం ఏడాది పాటు ఇన్‌స్పెక్షన్ చేయవద్దని సుబ్బారెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, సుబ్బారెడ్డి పీఏగా ఉన్న కడూరు చిన్నప్పన్న ఒక కేజీ నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం అడిగారని సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు పొమిల్ జైన్. విచారణలో ప్రీమియర్ ఆగ్రో వారు కడూరు చిన్నప్పన్నకు సుమారు రూ.50 లక్షలు లంచం ఇచ్చినట్టు తేలింది. న్యూదిల్లీలో ఈ నగదు లావాదేవీలు జరిగాయి'' అని ఆ నోట్‌లో ఉంది.
ఈ విచారణ నేపథ్యంలోనే హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి వేసిన మరో పిటిషన్ చర్చనీయాంశంగా మారింది. సీబీఐ సిట్ తన బ్యాంకు ఖాతాలపై విచారణ జరపరాదని కోరుతూ హైకోర్టులో సుబ్బారెడ్డి పిటిషన్ వేయగా, దానికి కౌంటర్‌గా సీబీఐ వాదనలు వినిపించింది.
''సుబ్డారెడ్డి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు సిట్ వారికి ఖాతాల వివరాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారు? పాపపు సొమ్ము తిని ఉండకపోతే ఎందుకు వాటిని బయట పెట్టరు?'' అని ప్రశ్నించారు పట్టాభి.

ఫొటో సోర్స్, FB/Pawan Kalyan
మరోసారి తెరపైకి 'సనాతన బోర్డు'
దేశవ్యాప్తంగా ఈ అంశానికి విస్తృతమైన కవరేజీ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ పత్రికల కథనాలను ఉటంకిస్తూ ఎక్స్ వేదికగా సనాతన ధర్మ బోర్డు గురించి మరోసారి డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
''గత టీటీడీ బోర్డు పాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తీరని, క్షమించరాని బాధను కలిగించి, తిరుమల పవిత్రతను ఛిద్రం చేశాయి. విశ్వాసాన్ని ఉల్లంఘించిన ఈ బాధాకరమైన సంఘటన, ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక గొప్ప గుణపాఠంగా నిలవాలి. ఈ బోర్డు తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి కృషి చేయాలి. ఆర్థిక, నాణ్యతా నివేదికలు ఇతర లావాదేవీలన్నీ సంపూర్ణ పారదర్శకతతో చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయడం భవిష్యత్తుకు ఒక ముందడుగు. ధర్మాన్ని పరిరక్షించే, దాని పక్షాన నిలబడే బాధ్యత ప్రతి ఒక్క సనాతనుడి ఉమ్మడి బాధ్యత'' అని తెలిపారు పవన్ కల్యాణ్.

ఫొటో సోర్స్, FB/Sajjala Ramakrishna Reddy
కుట్రతో దుష్ప్రచారం: వైసీపీ
ఒక వ్యవస్థీకృత కుట్రతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
''సిట్‌లో కూడా తన వాళ్లనే పెట్టుకున్నారు. వీళ్లు సిట్ అంటే సిట్ (కూర్చోమంటే కూర్చుంటారు అనే అర్థంలో). రిమాండ్ రిపోర్టు కూడా ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు తిరుమలలో నెయ్యి పరీక్షకు ల్యాబ్ పెట్టిందే మా ప్రభుత్వం. మైసూరు పరీక్షల కోసం పంపించింది మేమే. భోలే బాబా డైరీ బాలేదని ఆపేసింది మేమే. మా వైపు తప్పు ఉంటే మేం భోలే బాబా డైరీ ఎందుకు ఆపేస్తాం? ఎందుకు విచారణ చేస్తాం?. 2024 జులై, ఆగస్టుల్లో మీ ప్రభుత్వ హయాంలో కూడా ఆ నెయ్యి వచ్చింది కదా?'' అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి.
''చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. తలా తోకాలేని ఆరోపణలు చేయడం కాదు, తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకోండి. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నను బెదిరించారు. ఈ మొత్తం కేసు సీబీఐకి ఇవ్వాలి. దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షలు సమగ్రంగా నిర్వహించి ఆ ల్యాబ్ నివేదికలు శాస్త్రవేత్తలు, మీడియా.. అందరికీ ఇవ్వాలి. వివిధ ల్యాబ్‌లు పరీక్షలు చేసే విధానం, సెన్సిటివిటీ బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. స్టాండర్డ్స్ మారుతాయి. ఆ సైంటిఫిక్ ప్రొసెస్ చెప్పండి. తెలుగుదేశం హయాం కంటే ఉత్తమమైన ల్యాబ్స్ మేం పెట్టాం కాబట్టే కల్తీ నెయ్యి వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించాం. అసలు 2019-2024 మధ్య నెయ్యి మొత్తం కల్తీ అయిందని సీబీఐ నిర్ధరించినట్టు ఒక్క పత్రం అయినా ఉందా?'' అని ప్రశ్నించారు సజ్జల.
ఆ రిమాండ్ రిపోర్టులో ఒక చోట పామాయిల్ అని, ఒక చోట రసాయనాలని.. పొంతన లేకుండా ఉందని ఆయన విమర్శించారు. ఎక్కడా కల్తీ నిర్ధరణ అయినట్టు లేదన్నారు.
''తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలు జరిగినప్పుడు పవన్ ఏమయ్యారు? అప్పుడు సనాతన ధర్మం ఏమైంది?'' అని ప్రశ్నించారు సజ్జల.
ప్రస్తుతం సిట్ విచారణ ఈ కేసులో ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిట్, తాజాగా వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలిచింది. ఆయన త్వరలో విచారణకు రానున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














