60 వేల ఏనుగులు, లక్ష గుర్రాలు, లెక్కలేనంత సైన్యంతో దండెత్తిన హర్షవర్ధనుడు దక్షిణ భారత రాజు రెండో పులకేశి చేతిలో ఎలా ఓడిపోయారు?

హర్షుడు

ఫొటో సోర్స్, NCERT

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుప్త సామ్రాజ్య పతనం తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన ఉత్తర భారతదేశాన్ని ఏకం చేయడంలో హర్షవర్ధనుడు కీలక పాత్ర పోషించారని చరిత్ర చెబుతోంది.

అయితే, రాజులను కేవలం గొప్ప విజేతలుగానే కాకుండా, సమర్థ పాలకులుగా, రచయితలుగా చూడటం చాలా అరుదు.

క్రీ.శ. 590లో హర్షవర్ధనుడు జన్మించారు. హర్షవర్ధనుడి జీవిత చరిత్ర 'హర్షచరిత్ర' రాసిన ఆస్థానకవి బాణుడు(బాణభట్టు) ఆయన గురించి వివరించారు. ‘నిరంతరం ఆయుధం వినియోగించడం వల్ల హర్షవర్ధనుడి చేతులు నలుపెక్కిపోయాయి. అది సమస్త రాజుల ప్రతాపాగ్నిని చల్లార్చడం వల్ల అంటిన మసి వలె ఉంది’ అని బాణభట్టు రాశారు.

తన 16 ఏళ్ల వయస్సులోనే థానేశ్వర్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, హర్షుడు అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, ఆ కష్టాలకు భయపడకుండా తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు.

విజయ్ నాహర్ తన 'శీలాదిత్య సామ్రాట్ హర్షవర్ధన్ - ఉన్‌కా యుగ్'(శీలాదిత్య చక్రవర్తి హర్షవర్ధనుడు, ఆయన యుగం) అనే పుస్తకంలో.. ‘‘తండ్రి ప్రభాకరవర్ధనుడి మరణం, తల్లి సతీసహగమనం, కుట్రలో అన్నయ్య రాజ్యవర్ధనుడి మరణం, బావ మోఖరి రాజు గృహవర్మ హత్య, సోదరి రాజ్యశ్రీ రాజ్యం వదిలి వింధ్యాచల అడవులకు పారిపోవడం వంటి అనేక బాధాకర సంఘటనలు హర్షవర్ధనుడి జీవితంలో జరిగాయి. చిన్న వయసు, అనుభవం లేకపోవడం వంటి అన్ని సమస్యలను ఆయన చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు’’ అని రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హర్షుడి ఊహాచిత్రం

ఫొటో సోర్స్, Aavishkar Publishers

అయిష్టంగానే రాజ్యం చేపట్టిన హర్షుడు

ప్రభాకరవర్ధనుడు మరణించినప్పుడు హర్షవర్ధనుడు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ప్రభాకరవర్ధనుడి పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుడు హూణులతో యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు.

హూణులతో యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చినప్పుడు రాజ్యవర్ధనుడు తన తండ్రి మరణ వార్త తెలుసుకున్నారు. దీంతో అతను కలత చెంది, రాజ్యం బాధ్యతల నుంచి విరమించుకోవాలనుకున్నాడు. కానీ హర్షుడు తన సోదరుడిని సింహాసనం అధిష్టించాలని ఒప్పించాడు.

అదే సమయంలో, రాజ్యవర్ధనుడు తన బావ మోఖరి గృహవర్మ హత్య వార్త విన్నారు. ఆయన హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తన సైన్యంతో దండెత్తారు. మాల్వా రాజు సైన్యాన్ని ఓడించి కనోజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత, గౌడ రాజు శశాంకుని శిబిరాన్ని ముట్టడించారు. కానీ శశాంకుడు కుట్రతో రాజ్యవర్ధనుడిని హత్య చేయించారు.

'రాజ్యవర్ధనుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన శశాంకుడు, తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిపాదించారు. దీంతో ఒంటరిగా అతని శిబిరానికి వెళ్లిన రాజ్యవర్ధనుడిని శశాంకుడు హత్య చేయించాడు" అని బాణుడి ‘హర్ష చరిత్ర’లో ఉంది.

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు హర్ష శకం ఆరంభమైంది.

"రాజ్యవర్ధనుడి మరణంతో కనోజ్ సింహాసనం ఖాళీ అయింది. కనోజ్ ఆస్థాన సభ్యులు రాజ్యవర్ధనుడి తమ్ముడు హర్షవర్ధనుడిని పాలన చేపట్టాలని కోరారు. తొలుత, హర్షుడు ఈ అభ్యర్థనను తిరస్కరించాడు. కానీ మత పెద్దలు అతన్ని రాజుగా ఉండాలని.. కానీ, సింహాసనంపై కూర్చోవద్దని, 'మహారాజా' అనే బిరుదును తన కోసం ఉపయోగించవద్దని సలహా ఇచ్చారు. అలా, హర్షుడు కనోజ్‌కు రాజు అయ్యాడు. అతను తన కోసం 'రాజపుత్ర' అనే బిరుదును ఉపయోగించాడు" అని బాణుడు రాశారు.

హర్షవర్ధనుడి పాలన సమయంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్

ఫొటో సోర్స్, Bloomsbury Publishing

ఫొటో క్యాప్షన్, హర్షవర్ధనుడి పాలన సమయంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్

గొప్ప యోధుడు హర్షుడు...

హర్షుడి పట్టాభిషేకం క్రీ.శ.612లో జరిగినట్లు చరిత్ర చెప్తోంది.

తన 16 ఏళ్ల వయసులో హర్షుడు.. తన అన్న, బావల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఐదు వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, అంతే సంఖ్యలో పదాతిదళంతో కూడిన సైన్యంతో దండయాత్రకు బయలుదేరారు.

ఈ దండయాత్రను హుయాన్ త్సాంగ్ వివరించారు. ''గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడిలాగే, హర్షుడు కూడా గొప్ప యోధుడు. ఆరేళ్లలో ఆయన తన సోదరిని కనుగొని ఆమెను కనోజ్‌లో ఉంచాడు. కనోజ్‌తో పాటు పంచ భారతం (సారస్వత్, కన్యాకుబ్జ, గౌడ, మిథిల, ఉత్కళ ప్రాంతాలు) జయించాడు. ఈ సమయానికి, హర్షుడి సైన్యం భారీగా పెరిగింది. అతని సైన్యంలో అరవై వేల ఏనుగులు, లక్ష గుర్రాలు, అంతే సంఖ్యలో పదాతిదళం ఉన్నాయి. ఇంతటి భారీ సైన్యంతో, అతను వెంటనే వల్లభి, భరోచ్, సింధ్ ప్రాంతాలను జయించి తన రాజ్యం సరిహద్దులను పశ్చిమ సముద్రం వరకు విస్తరించాడు."

బాణభట్టు రచనల ప్రకారం.. హర్షుడి సైన్యం రోజుకు దాదాపు 16 మైళ్ల (సుమారు 25 కి.మీ.) దూరం ప్రయాణించేది. హర్షుడి పాలనలో ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అతను ఓడిపోయిన రాజులకు వారి రాజ్యాలను తిరిగి ఇచ్చేసి, వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు.

ఇది హర్షుడి సమాఖ్య విధానం. గుప్తులు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు.

క్రీ.శ. 634లో, హర్షుడు దక్షిణాది చాళుక్య చక్రవర్తి రెండో పులకేశితో యుద్ధం చేశారు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోవడంతో హర్షుడు తన సామ్రాజ్యాన్ని దక్షిణాదికి విస్తరించలేకపోయారు.

"ఈ ఓటమి తర్వాత కూడా, హర్షుడికి 'గొప్ప విజేత' అనే బిరుదు సరికాదని ఎవరూ అనలేదు. ప్రపంచ చరిత్రలో నెపోలియన్ వంటి గొప్ప యోధులు కూడా యుద్ధంలో ఓడిపోయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి" అని విజయ్ నాహర్ రాశారు.

హర్షుడి జీవిత చరిత్రను రచించిన బాణభట్టు

ఫొటో సోర్స్, NCERT

ఫొటో క్యాప్షన్, హర్షుడి జీవిత చరిత్రను రచించిన బాణభట్టు

సమర్థ పాలకుడిగా..

అశోకుడి మాదిరిగానే, హర్షుడికి కూడా ప్రజల జీవన పరిస్థితులను అంచనా వేయడానికి తన రాజ్యం అంతటా పర్యటించే అలవాటు ఉండేది. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజల కష్టాలను తెలుసుకునేవారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు ఏఎల్ బాశం తన 'ద వండర్ దట్ వజ్ ఇండియా' పుస్తకంలో.. ‘ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను హర్షుడు తన ఆస్థానంలో కాకుండా జనం మధ్యే వీధుల్లో విన్నాడు. అతను తన స్నేహితులకు చాలా నమ్మకంగా ఉండేవాడు. సుదూర రాజ్యమైన అస్సాం రాజు భాస్కరవర్మన్ అతని ఆస్థానానికి వచ్చేవాడు. శశాంకుడితో యుద్ధంలో అతనికి మద్దతు ఇచ్చాడు" అని రాశారు.

‘‘హర్షుడు చాలా కష్టపడి పనిచేసే రాజు. అతని దినచర్య మూడు భాగాలుగా విభజించేవారు. మొదటి భాగంలో, అతను తన సమయాన్ని రాజ వ్యవహారాలకు కేటాయించాడు. మిగిలిన రెండు భాగాలలో, అతను మతపరమైన కార్యకలాపాలను నిర్వహించాడు. అతను ఎప్పుడూ అలసిపోలేదు, కొన్నిసార్లు తన ప్రజల కోసం పనిచేస్తూ నిద్రాహారాలు మరచిపోయేవాడు'' అని హుయాన్ త్సాంగ్ రాశారు.

"హర్షుడి కాలంలో పన్నుల రేటు చాలా తక్కువగా ఉండేది. మంత్రులు, అధికారులకు నగదు రూపంలో కాకుండా భూమి రూపంలో జీతం ఇచ్చేవారు. దాని నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం వారిదే. హర్షుడు రాజ్యంలోని మొత్తం భూమిలో నాలుగో వంతు అలా వారికి కేటాయించాడు. నాలుగో వంతు భాగాన్ని రాజ్య ఖర్చులకు ఉపయోగించారు. సాధారణ ప్రజలకు ఆహారంగా గోధుమలు, బియ్యం అందేవి'' అని రాశారు.

హర్షుడి చిత్రం

ఫొటో సోర్స్, NCERT

ఫొటో క్యాప్షన్, హర్షుడి చిత్రం

మరణశిక్షకు హర్షుడు వ్యతిరేకం

హర్షుడి పాలనలో మరణశిక్షలు విధించలేదు. ప్రజల మధ్య చాలా సామరస్యం ఉండేది, కాబట్టి నేరాలు అరుదుగా ఉండేవి.

ప్రముఖ చరిత్రకారుడు రాధాకుముద్ ముఖర్జీ తన 'హర్ష' పుస్తకంలో.. 'రాజద్రోహానికి మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదు విధించేవారు. నైతిక ఉల్లంఘనల నేరాలకు గాను నేరస్తుడి అవయవాలను నరికివేయడం లేదా రాజ్యం నుంచి బహిష్కరించడం లేదా అడవులకు పంపించడం వంటి శిక్షలు విధించేవారు. కొన్నిసార్లు వారిని సమాజం నుంచి వెలివేసేవారు. ప్రజలు చెడుకు దూరంగా ఉండేవారు, పాపాలు చేయడానికి భయపడేవారు" అని రాశారు.

హర్షవర్ధనుడి సామ్రాజ్యానికి రాజధానిగా మారిన తర్వాత కనోజ్ ప్రాముఖ్యం రెట్టింపు అయింది.

దీనికి గురించి హుయాన్ త్సాంగ్.. "కనోజ్‌లో అన్నిచోట్లా ఆర్థిక శ్రేయస్సు ఉండేది. ప్రజలు నాగరికంగా ఉండేవారు. ఈ నగరం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉంది. ఐదు మైళ్ల(సుమారు 8 కిలోమీటర్లు) పొడవు, ఒకటింపావు మైళ్ల(సుమారు 2 కిలోమీటర్లు) వెడల్పుతో ఈ నగరం విస్తరించి ఉంది. ఇళ్లు అందంగా, శుభ్రంగా ఉన్నాయి. వాటి గోడలు ఎత్తుగా, మందంగా ఉన్నాయి. అందమైన తోటలు, స్వచ్ఛమైన చెరువులు, ఒక మ్యూజియం ఉన్నాయి. అక్కడి ప్రజలు మెరిసే, పట్టు వస్త్రాలు ధరించేవారు. వారి భాష మధురంగా ఉంది. మాంసం వ్యాపారులు, మత్స్యకారులు, నృత్యకారులు నగరం వెలుపల నివసించేవారు. సైన్యం రాత్రిపూట రాజభవనం చుట్టూ గస్తీ తిరుగుతుంటుంది" అని పేర్కొన్నారు.

భారతదేశ చరిత్రలో హర్షుడిలా ఉదార స్వభావంగల చక్రవర్తులు అరుదు.

''ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రయాగలో జరిగే మహామోక్ష పరిషత్‌లో హర్షుడు తన ఆయుధాలు మినహా తనకున్న ప్రతిదీ దానం చేసేవారు. తన పాత దుస్తులన్నీ ఇచ్చేసేవారు. ఆ తర్వాత, తన సోదరి నుంచి పాత దుస్తులు అప్పుగా తీసుకొనేవారు'' అని విజయ్ నాహర్ రాశారు.

హర్షుడు పోషించిన నలందా విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్షుడు పోషించిన నలందా విశ్వవిద్యాలయం

నలంద విశ్వవిద్యాలయ పోషకుడు

చక్రవర్తి హర్షుడు మహాయోధుడు మాత్రమే కాదు, పండితుడు కూడా. గొప్ప కవి బాణభట్టును ఆస్థాన పండితుడిగా నియమించారు. హర్షుడికి సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. 'రత్నవల్లి', 'ప్రియదర్శిక', 'నాగానంద' అనే నాటకాలను సంస్కృతంలో రచించారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.బి.హావెల్ తన 'ది హిస్టరీ ఆఫ్ ఆర్యన్ రూల్ ఇన్ ఇండియా ఫ్రమ్ ది ఎర్లీస్ట్ టైమ్స్ టు ది డెత్ ఆఫ్ అక్బర్' అనే పుస్తకంలో.. "హర్ష చక్రవర్తి తన ఖడ్గం వాడకంలో ఎంత నైపుణ్యం కలవాడో, కలం వాడకంలోనూ అంతే నిపుణుడు'' అని రాశారు.

''హర్షుడు గొప్ప సేనాని, మేనేజర్. అంతకుమించి అతను గొప్ప సాహిత్య, మత పోషకుడు కూడా'' అని డాక్టర్ హేమచంద్ర రాయ్‌చౌధురి రాశారు.

ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ఆర్.సి. మజుందార్ తన 'ది క్లాసికల్ ఏజ్' పుస్తకంలో, "హర్షుడు గొప్ప సాహిత్యవేత్త, విద్యాభిమాని. తన 'నాగానంద' రచనలో అతను శృంగారంతో పాటు ప్రేమ, మానవత్వం, సోదరభావం, కరుణ, ఆప్యాయత గురించి సందేశాన్ని ఇచ్చాడు. ఇది హర్షుడిని సాహిత్యకారుడిగా అమరుడిని చేసింది" అని పేర్కొన్నారు.

హర్షుడి కాలంలో నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని గొప్ప విద్యా సంస్థలలో ఒకటి. హర్షుడు దాని పోషకుడు. దాని నిర్వహణ కోసం అతను 100 గ్రామాలను దానం చేశారు. అక్కడ 100 అడుగుల కాంస్య స్తూపాన్ని ఏర్పాటుచేశారు. విద్వాంసులకు, విద్యాసంస్థలకు పోషణ కారణంగా హర్షుడు సాహిత్య రంగంలో అశోకుడిని అధిగమించాడని చరిత్రకారులు భావిస్తారు.

బుద్ధుడు

ఫొటో సోర్స్, Getty Images

బౌద్ధమతంలోకి..

హర్ష చక్రవర్తి ఏ మతాన్ని అనుసరించారనే విషయంలో చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

బాణభట్టు ప్రకారం, హర్షుడి పూర్వీకులది శైవ మతం. హర్షుడి జననం సమయంలో యజ్ఞం, వేద మంత్రాల పఠనం వర్ధన రాజవంశం వైదిక మతాన్ని ఆచరించినట్లు సూచిస్తున్నాయి. హర్షుడి నాణేలపై శివుడు, నంది చిహ్నాలు అతని శైవ మతాన్ని సూచిస్తున్నాయి.

బన్స్‌ఖేడా, మధుబన్ శాసనాలు హర్షుడి పేరుతో 'పరమ పరమేశ్వర' అనే బిరుదును ఉపయోగిస్తాయి. అది ఆ కాలంలో శైవమత అనుచరుల కోసం ఉపయోగించినది. కానీ, బాణభట్టు, హుయాన్ త్సాంగ్ రచనల ప్రకారం, హర్షుడు తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని అనుసరించడం ప్రారంభించారు. గౌతమ బుద్ధుడిపై అపారమైన విశ్వాసం ఏర్పరచుకున్నారు.

హర్షుడి రెండు నాటకాలు, 'రత్నావళి', 'ప్రియదర్శిక' లలో ప్రశంసించిన దేవతలందరూ వైదిక మతానికి చెందినవారు. కానీ, హర్షుడి మూడవ నాటకం, 'నాగానంద'లో అతను బుద్ధుడిని దేవుడిగా భావించి కీర్తించారు. కానీ దీనితో పాటు, గరుడ, గౌరీ కీర్తన కూడా ఉంది.

"హర్ష చక్రవర్తి మొదట్లో బౌద్ధమతాన్ని అనుసరించేవాడు కాదు. కానీ, బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత కూడా, అతను ఇతర మతాలను విస్మరించలేదు. అశోకుడు, కనిష్కుడిలా కాకుండా హర్షుడు బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయలేదు. కానీ క్షీణ దశకు చేరుకుంటున్న బౌద్ధ మతాన్ని కాపాడిన ఘనత హర్షుడికే దక్కుతుంది. కనోజ్ మత సంబంధిత సభలో కనోజ్ కౌన్సిల్, ప్రయాగలోని మహా మోక్ష పరిషత్‌లో బుద్ధుడిని మొదట పూజించిన వ్యక్తి ఆయనే, బౌద్ధమత ప్రాముఖ్యాన్ని పెంచారు" అని రాధా కుముద్ ముఖర్జీ రాశారు.

హర్షుడి ఆస్థానంలో హుయాన్ త్సాంగ్

చైనాకు తిరిగి వెళ్లే ముందు హుయాన్ త్సాంగ్‌ను హర్షుడు తన ఆస్థానంలో చర్చకు ఆహ్వానించారు. ఆ సమయంలో హర్షుడి పాలన ఉన్నత స్థితిలో ఉంది. ఇద్దరూ కలుసుకున్నారు, స్నేహితులుగా మారారు.

క్రీ.శ. 643లో హుయాన్ త్సాంగ్ హర్షుడి ఆస్థానాన్ని సందర్శించారు. ఈ సమావేశంలో, హర్షుడు చైనా, అక్కడి పాలకుల గురించి హుయాన్ త్సాంగ్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. హుయాన్ త్సాంగ్ చైనా గురించి తనకున్న పరిజ్ఞానంతో హర్షుడిని ఆశ్చర్యపరిచారు.

ఇదిలా ఉండగా, హర్షుడు తన రాయబారులతో బుద్ధ గయ నుంచి తెప్పించిన బోధి మొక్కను.. వైద్యం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన బౌద్ధ గ్రంథాలను చైనా చక్రవర్తి తాయిజోగ్‌కు బహుమతిగా పంపారు.

"హుయాన్ త్సాంగ్ చైనాకు తిరుగు ప్రయాణంలో హర్షుడు అందించిన ఏనుగుపై బయలుదేరారు. ఆయనతో పాటు తన నలుగురు అధికారులను హర్షుడు చైనాకు పంపారు. హుయాన్ త్సాంగ్ బృందానికి అన్నిరకాల సహాయం, గుర్రాలను అందించాలని మార్గమధ్యలోని దేశాల రాజులను కోరుతూ హర్షుడు వారితో లేఖలు పంపారు'' అని విలియం డాల్రింపల్ తన 'ది గోల్డెన్ రోడ్' పుస్తకంలో రాశారు.

హర్షుడిపై రచన

ఫొటో సోర్స్, Bloomsbury Publishing

హర్షుడి మరణం తర్వాత సామ్రాజ్యం కనుమరుగు...

ప్రాచీన భారతదేశ చరిత్రలోని గొప్ప చక్రవర్తులలో హర్షుడిని ఒకరిగా పరిగణిస్తారు.

ప్రముఖ చరిత్రకారుడు కె.ఎం.పణిక్కర్ తన 'శ్రీ హర్ష ఆఫ్ కనోజ్' పుస్తకంలో.. "చంద్రగుప్త మౌర్యుడి నుంచి ప్రారంభమైన సుదీర్ఘ పాలకుల శ్రేణిలో హర్షుడు చివరివాడు. అతని కాలంలో, ప్రపంచం భారతదేశాన్ని ఒక పురాతన, గొప్ప నాగరికతగా మాత్రమే కాకుండా మానవాళి అభ్యున్నతి కోసం పనిచేసే బాగా వ్యవస్థీకృతమైన, శక్తిమంతమైన రాజ్యంగా కూడా చూసింది. పాలకుడిగా, కళల పోషకుడిగా, సాహితీవేత్తగా హర్షుడు భారతదేశ చరిత్రలో ఉన్నత స్థానాన్ని పొందుతారనడంలో సందేహం లేదు" అని రాశారు.

క్రీ.శ. 655లో హర్షుడు మరణించాడు.

చంద్రగుప్త మౌర్యుడు, సముద్రగుప్తుడి మాదిరిగా తన తర్వాత చాలా సంవత్సరాల తరబడి నిలబడగలిగే సామ్రాజ్యాన్ని హర్షుడు నిర్మించలేకపోయాడని కొంతమంది చరిత్రకారులు చెప్తారు.

హర్షుడు మరణించిన వెంటనే ఆయన సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఆయనకు పిల్లలు లేకపోవడం, తన సింహాసనానికి తగిన వారసుడిని ప్రకటించకపోవడం అందుకు కారణం కావచ్చనేది చరిత్రకారుల అభిప్రాయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)