భారతదేశపు రాజులు నిజంగానే మగతనం లేని అసమర్ధులా? లేక బ్రిటిష్ పాలకులు కావాలనే అలా ప్రచారం చేశారా?

మైసూరు మహారాజు చామరాజేంద్ర వడియార్ పరిశ్రమలను ప్రోత్సహించిన రాజుగా పేరు తెచ్చుకున్నారు

ఫొటో సోర్స్, JUGGERNAUT

ఫొటో క్యాప్షన్, మైసూరు మహారాజు చామరాజేంద్ర వడియార్ పరిశ్రమలను ప్రోత్సహించిన రాజుగా పేరు తెచ్చుకున్నారు

సాధారణంగా పూర్వకాలపు రాజులంటే ఏనుగు అంబారీలు, సభలో నాట్యం చేసే నర్తకులు, విశాలమైన భవనాలు, వైభోగాలతో తులతూగుతూ ఉండేవారని అనుకుంటాం.

కానీ, ఆ సంపద, వైభోగాల పేరుతో వారు ఎగతాళికి, అపహాస్యానికి గురయ్యారని, అప్రతిష్ఠ పాలయ్యారన్నది కూడా వాస్తవమే అంటారు చరిత్రకారులు మను పిళ్లై.

బ్రిటిష్‌వారు భారత దేశంలోకి అడుగుపెట్టిన తరువాత స్థానిక రాజులను హీనంగా చూసేవారు. శృంగారానికి బానిసలని, ప్రభుత్వం నడపడం కన్నా తళుకుబెళుకులపైనే వారికి మోజు అని చీదరించుకునేవారు.

ఉదాహరణకు ఒక తెల్లదొర భారతీయ రాజులను వ్యంగ్యంగా వర్ణిస్తూ "భయంకరమైన స్థూలకాయులు, వికారంగా, చూడ్డానికి రోత కలిగించేలా ఉంటారు" అని, "చెవులకు కమ్మలు, మెడలో గొలుసులు ధరించి" నాట్యగత్తెలను తలపిస్తారని, శ్వేతజాతీయుల్లాగ మగతనం ఉన్నవారు కాదని, ఆడంగి లక్షణాలున్న "దుష్టులు" అని బహిరంగంగా వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ వారికి ఈ అభిప్రాయం దశాబ్దాలపాటు కొనసాగింది.

ఉదయ్‌పూర్ రాజు ఫతేసింగ్ తన సీనియారిటీని, పేరు ప్రతిష్టలను వ్యూహాత్మకంగా వినియోగించుకునే వారు

ఫొటో సోర్స్, JUGGERNAUT

ఫొటో క్యాప్షన్, ఉదయ్‌పూర్ రాజు ఫతేసింగ్ తన సీనియారిటీని, పేరు ప్రతిష్టలను వ్యూహాత్మకంగా వినియోగించుకునే వారు

హేళన చేసే ప్రయత్నం

1947లో 'లైఫ్' మ్యాగజీన్ వీరికి వంత పాడుతూ, భారతీయ రాజుల గురించి కొన్ని గణాంకాలు ప్రచురించింది.

భారతదేశంలో మహారాజులకు సగటున "11 బిరుదులు, 3 ఏకరీతి వస్త్రాలు (యూనిఫారం), 5.8 భార్యలు, 12.6 పిల్లలు, 5 కోటలు, 9.2 ఏనుగులు, 3.4 కి తక్కువ కాకుండా రోల్స్ రాయిస్ కార్లు" ఉన్నాయని లెక్కలు కట్టింది.

ఈ లెక్కలు తప్పుదోవ పట్టిస్తాయన్నది ఒక అంశం అయితే, ఇదంతా కూడా అపహాస్యం చేయడానికి, వినోదానికి చేసిన పని అన్నది మరొక పార్శ్వం.

ఎందుకంటే, వాళ్లు లెక్కేసిన 562 "రాష్ట్రాల్లో" చాలావరకు రాజకీయంగా పలుకుబడి లేని చిన్న చిన్న జమీందారీలు.

కొన్ని చదరపు కిలోమీటర్ల భూమి ఉన్న భూస్వాములను, జమీందార్లను కూడా కలుపుకుని సుమారు 100 మంది రాజులు ఉన్నారని లెక్కేయడం హేళనే కాక, వారి స్థాయిని దిగజార్చడానికి చేసిన ప్రయత్నం. ఇది ఎలిజబెత్ రాణిని ఒక సామంతుడితో పోల్చినట్టుగా కనిపించింది.

వాస్తవంలో, భారత ఉపఖండంలో విస్తరించి ఉన్న 40 శాతం రాచరిక భూభాగాలు నేరుగా బ్రిటిష్ నియంత్రణలో ఉన్నవి కావు. కొన్ని ఒప్పందాల ద్వారా వారికి సామంతులుగా ఉన్న రాజ్యాలు.

ఈ భూభాగాల రాజులు మాత్రం కచ్చితంగా ఆడంబరాలు, వైభోగాలకు లొంగిపోయినవారు కాదు.

లైఫ్ మ్యాగజీన్‌లో ప్రచురించిన ఆ కథనంలోనే చెప్పినట్టుగా, కొచ్చిన్ మహారాజు ఉంపుడుగత్తెల ఒడిలో తల వాల్చడం కన్నా, సంస్కృత కావ్యాలలో తల దూర్చడానికే మొగ్గు చూపేవారు.

అలాగే, ఇటీవల మరణించిన గోండల్ రాజు సుశిక్షితుడైన వైద్యుడు. పెద్ద పెద్ద రాజ్యాల రాజులు మత్తులో మునిగి, విలాసాలకు బానిసలైనవారు కారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి రాజ్యపాలన చేసిన సమర్థులు.

అయితే, రాచరికపు విపరీత ధోరణుల గురించి చెప్పిన విషయాల్లో కొంత నిజం లేకపోలేదు.

ఒక మహారాజు, స్కాటిష్ సైన్యాన్ని చూసి, తన సైనికులు కూడా వారిలాగే పొట్టి స్కర్టులు, కాళ్లకు గులాబీ రంగు బిగుతు వస్త్రాలు ధరించాలని ఆజ్ఞాపించారు.

అలాగే, మరొక రాజు, తనను తాను లూయిస్ XIV గా భావిస్తూ, పంజాబ్‌లో పునర్జన్మ ఎత్తినట్లు విశ్వసించేవారని చెబుతారు.

కానీ, భారతీయ రాజులంతా అలాంటివారే అనుకుంటే పొరపాటే.

బ్రిటిష్ వారిలో కూడా ఇలాంటి వేలం వెర్రి పనులు చేసినవారు ఉన్నారు. లార్డ్ కర్జన్ లాంటి సంప్రదాయ, సంకుచిత స్వభావం గల వైస్రాయ్ కూడా ఒకసారి పూర్తి నగ్నంగా టెన్నిస్ ఆడారు.

బరోడా మహారాజు శాయాజీ రావ్ గైక్వాడ్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని తరచూ విమర్శించేవారు

ఫొటో సోర్స్, JUGGERNAUT

ఫొటో క్యాప్షన్, బరోడా మహారాజు శాయాజీ రావ్ గైక్వాడ్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని తరచూ విమర్శించేవారు

వాస్తవాలు ఏంటి?

భారతీయ రాజులను "స్వార్థపూరితమైన మూర్ఖులుగా" చిత్రీకరించడం ద్వారా వారి వాస్తవ గాధలను కప్పిపెట్టే ప్రయత్నాలు జరిగినట్లు నా పరిశోధనలో కనుగొన్నాను.

దక్షిణ భారత దేశానికి చెందిన మైసూర్ మహారాజు దగ్గర చాలా ఏనుగులు ఉన్నమాట వాస్తవమే. కానీ, ఆయన పారిశ్రామికీకరణే లక్ష్యంగా పాలన సాగించిన సమర్థుడైన రాజు అన్నది కూడా వాస్తవమే.

పశ్చిమాన బరోడా మహారాజు విద్య నిమిత్తం ప్రతీ 55 మంది పౌరులకు సుమారు 370 రూపాయలు కేటాయించారని ఒక పాత్రికేయుడు గుర్తించారు. అదే సమయంలో, బ్రిటిష్ ఇండియాలో చదువు కోసం ప్రతీ వెయ్యి మందికి 370 రూపాయలు కేటాయించేవారు.

అదే విధంగా, పాఠశాలలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాల్లో తిరువాంకూర్ సంస్థానం ఆదర్శంగా నిలిచింది.

నిజానికి, ఇలాంటి సంస్థానాల్లో అప్పట్లోనే రాజ్యాంగంపై చర్చలు చేసేవారు. భారతదేశంలో రాజ్యాంగం గురించి మాట్లాడడం అప్పుడే ప్రారంభమైంది.

మరెందుకు రాజులు అనేసరికల్లా అంతఃపురాలు, ఆడంబరాలు, శృంగార కార్యకలాపాల ప్రస్తావన మాత్రమే వస్తుంది?

ఇలాంటి అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి కారణాలు ఏంటి?

ఒక కారణం, చెడు అలవాట్లకు బానిసలైన భారతీయులను క్రమశిక్షణలో పెట్టి, వారిని ఉద్ధరించిన మహనీయులుగా బ్రిటిష్ అధికారులను వెలుగులోకి తేవడం ఆంగ్లేయుల పాలనకు అనుకూలం అవుతుంది.

భారతీయులు పరిపాలనలో బలహీనులని, బ్రిటిష్ సామ్రాజ్యం నాగరికతకు పునాదులు వేస్తుందని నిరూపించడానికి.

అలాగే, బ్రిటిష్ పాలకుల భయాలను, దౌర్బల్యాన్ని కప్పిపుచ్చడానికి. అధికారికంగా భారత రాజులు "బ్రిటిష్ సామ్రాజ్యానికి మూల స్తంభాలే" అయినా, ఆచరణలో వారు భాగస్వాములుగా ఉండేవారు. బ్రిటిష్ పాలకులను ఓ కంట కనిపెడుతూ ఉండేవారు.

ఉదాహరణకు, బ్రిటిష్ వ్యతిరేక సాహిత్యానికి బరోడా రాజ్యం కేంద్రంగా ఉండేది. "కూరగాయల ఔషధం" లాంటి అనుమానం రాని పేర్లతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచనలు జరిగేవి.

అలాగే, మైసూర్ సంస్థానంలో రాజకుటుంబం గురించి రాసేందుకు స్థానిక పత్రికలకు అనుమతి ఇచ్చేవారు కాదుగానీ, బ్రిటిష్ పాలనను విమర్శించడానికి ఎడిటర్లకు అనుమతి ఇచ్చేవారు.

జైపూర్ పాలకులు చడీచప్పుడు లేకుండా అకౌంట్లను తారుమారు చేసేవారు. బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన రుసుము తప్పించుకోవడానికి తమకు వచ్చే ఆదాయాన్ని దాచిపెట్టేవారు.

మైసూరు మహారాజు కృష్ణరాజ వడియార్

ఫొటో సోర్స్, JUGGERNAUT

ఫొటో క్యాప్షన్, మైసూరు మహారాజు కృష్ణరాజ వడియార్

జాతీయోద్యమంలో...

మరో పక్క, స్వతంత్ర పోరాటం కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీకి అనేకమంది రాజులు ఆర్థిక సహాయం అందించేవారు. 1920లలో కూడా రాజులు జాతీయ భావంతో స్వతంత్ర పోరాటాన్ని ఎగదోసేవారని కర్జన్ భావించేవారు.

వినడానికి ఇది కాస్త వింతగా అనిపించినప్పటికీ, చాలావరకు స్వతంత్ర పోరాటంలో స్థానిక రాజులు హీరోలుగా వెలిగారు.

"స్థానికులు" తమను తాము పాలించుకోలేరనే భావనను విచ్ఛిన్నం చేయడం ద్వారా పెద్ద పెద్ద రాజ్యాలు సాధించిన విజయాలు మహాత్మా గాంధీలాంటి జాతీయవాదులకు గర్వకారణంగా నిలిచాయి.

కానీ 1930, 1940ల నాటికి పరిస్థితులు మారిపోయాయి. విద్యావకాశాలు పెరగడం, ఎక్కువమంది చదువుకోవడం వలన ప్రజాస్వామ్య పాలనకు డిమాండ్ పెరిగింది.

ఆంగ్లేయులు భారతదేశాన్ని విడిచిపెట్టిన తరువాత రాజులు, వారి సంస్థానాలు కనుమరుగైపోయాయి. భారతదేశంలో రాజులు మూటగట్టుకున్న అప్రతిష్ట గాథలు అలా ముగిశాయి.

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే, కనిపిస్తున్నదానికన్నా వాస్తవం సంక్లిష్టమైనదని గ్రహించాలి.

భారతదేశ రాజుల విషయంలో కూడా ఇది నిజం. బయటకు కనిపించే అంతఃపురాలు, నాట్యగత్తెలు, ఏనుగులు, ఆడంబరాల వెనుక ఆధునీకరణను ప్రోత్సాహించిన తెలివి, సామర్థ్యం, పాలనా దక్షత కూడా ఉన్నాయి.

(మను పిళ్లై ఒక చరిత్రకారుడు. ఫాల్స్ అలైస్: ఇండియాస్ మహారాజాస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ రవి వర్మ పుస్తక రచయిత.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)