తల్లిపాలలో యురేనియం.. ఆ పాలు తాగిన చిన్నారుల రక్తంలోనూ

తల్లిపాలు, బిహార్, యురేనియం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యురేనియం
    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని ఆరు జిల్లాల్లో నివసించే కొందరు తల్లుల పాలలో యురేనియం ఉన్నట్టు గుర్తించారు.

దీనిపై పరిశోధకులు, వైద్యులు ఆందోళన వ్యక్తంచేశారు. 17 నుంచి 35 ఏళ్ల వయసున్న 40 మంది మహిళలపై ఈ పరిశోధన జరిపారు.

రేడియోధార్మికత ఉండే యురేనియం లోహం రసాయన సంకేతం 'యు'.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాముల యురేనియం మాత్రమే ఉండాలి. యురేనియం ఎక్కువగా ఉంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది.

పట్నాలోని మహావీర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, దిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్, వైశాలి) సంస్థల సాయంతో ఈ పరిశోధన జరిపారు.

నిల్వ ఉంచిన తల్లిపాలపై కాకుండా పిల్లలకు పాలిస్తున్న తల్లుల నుంచి సేకరించిన పాలపై 2021 అక్టోబరు నుంచి 2024 జులై వరకు ఈ అధ్యయనం జరిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తల్లిపాలు, బిహార్, యురేనియం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు
ఫొటో క్యాప్షన్, మరింత విస్తృతస్థాయిలో అధ్యయనం నిర్వహించాలని పరిశోధకులు భావిస్తున్నారు.

పరిశోధన ఎలా జరిపారంటే?

బిహార్‌లోని భోజ్‌పుర్, సమస్తీపుర్, బేగుసరాయ్, ఖగాఢియా, కటిహార్, నలంద జిల్లాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. దీని కోసం ఒక్కో గ్రూపు ఒక మహిళ నుంచి నేరుగా శాంపిళ్లు సేకరించింది.

ఈ శాంపిళ్లను వైశాలిలోని ఎన్ఐపీఈఆర్‌లో పరీక్షించారు. ఎల్‌సీ-ఐసీపీ-ఎంఎస్‌గా పిలిచే మెషీన్‌తో ఈ శాంపిళ్లను విశ్లేషించారు. ద్రవ భారలోహాలను గుర్తించడంలో ఈ మెషీన్ చాలా శక్తిమంతమైనది.

ఒక్కో లీటర్ తల్లి పాలలో 0 నుంచి 5.25మైక్రోగ్రాముల యురేనియం ఉన్నట్టు గుర్తించారు.

పిల్లల రక్తంలోనూ యురేనియం

కటిహార్ జిల్లాలో సేకరించిన తల్లి పాలలో యురేనియం స్థాయి ఎక్కువగా 5.25 మైక్రోగ్రాములు ఉన్నట్టు తేలింది. తక్కువ యురేనియం స్థాయి భోజ్‌పుర్‌ తల్లుల్లో కనిపించింది. నలందలో పాలిచ్చే తల్లుల్లో సగటున 2.35మైక్రోగ్రాములు యురేనియం ఉన్నట్టు, ఖగాడియాలో 4.035మైక్రోగ్రాములున్నట్టు గుర్తించారు.

తల్లి పాలు తాగే 35మంది పిల్లల శాంపిళ్లను కూడా ఈ అధ్యయనంలో భాగంగా సేకరించారు.

వారిలో 70 శాతం మంది పిల్లల రక్తంలోనూ యురేనియం గుర్తించారు. ఈ పిల్లల కిడ్నీలు, నాడీ వ్యవస్థ, మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం ఉండొచ్చని పరిశోధన సూచించింది.

తల్లిపాలు, బిహార్, యురేనియం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు
ఫొటో క్యాప్షన్, పట్నాలోని మహావీర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్

తల్లిపాలు శిశువుకు సురక్షితమైనవని, పిల్లలకు పాలివ్వడం తల్లులు కొనసాగించాలని మహావీర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, అంకాలజీ మెడికల్ హెడ్ మనీషా సింగ్ బీబీసీతో చెప్పారు.

''నీటిలో యురేనియం ఎంత స్థాయిలో ఉండాలనేదానిపై పరిమితులున్నాయి కానీ తల్లిపాల విషయంలో అలాంటివేమీ స్పష్టంగా లేవు. తల్లిపాలలో యురేనియం ఉంటే అంది ఆందోళన చెందాల్సిన విషయమే'' అని ఆమె అన్నారు.

ఈ ఆరు జిల్లాల్లో నీటిలో యురేనియం స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరిశోధన మరింత విస్తృతస్థాయిలో నిర్వహించాలని మహావీర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ భావిస్తోంది.

''మరింత విస్తృత పరిశోధన కోసం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆరోగ్యశాఖ మంత్రిని కలవాలనుకుంటున్నాం. ప్రస్తుత అధ్యయనంలో శాంపిల్ సైజ్ తక్కువ. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నిర్వహణలో మాకున్న అనుభవం ప్రకారం ఎంత తొందరగా వ్యాధిని గుర్తిస్తే అంత మంచిది'' అని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఎల్‌బీ సింగ్ చెప్పారు.

తల్లిపాలు, బిహార్, యురేనియం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ పరిశుభ్రమైన మంచినీళ్లు అందించడం సవాల్‌గా మారింది.

దేశంలోని 151 జిల్లాల్లో యురేనియం

మరో అధ్యయనంలో బిహార్‌లోని 11జిల్లాల్లోని భూగర్భజలాల్లో యురేనియం గుర్తించారు. అవి గోపాల్‌గంజ్, సివాన్, సారణ్, తూర్పు చంపారన్, పట్నా, వైశాలి, నవాదా, నలందా, సుపౌల్, కటిహార్, భాగల్పుర్.

''నీటిపై జరిపిన పరిశోధనలో అర్సెనిక్, ఫ్లోరైడ్, మాంగనీస్, క్రోమియం, మెర్క్యురీ, యురేనియం ఉన్నట్టు గుర్తించారు. ఆర్సెనిక్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. బిహార్‌లో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ప్రజలకు శుభ్రమైన మంచినీళ్లు అందించడం సవాలుగా మారింది'' అని మహావీర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మెడికల్ రీసెర్చ్ హెడ్, దీర్ఘకాలంగా నీటి పరిశోధకులుగా ఉన్న అశోక్ కుమార్ ఘోష్ చెప్పారు.

''తాగునీటి నుంచి కానీ, ఆయా జిల్లాల్లో పండించే ఆహారధాన్యాల నుంచి కానీ తల్లిపాలలోకి యురేనియం చేరుతుండొచ్చని అశోక్ కుమార్ ఘోష్ తెలిపారు.

యురేనియంతో రెండురకాల సమస్యలొస్తాయని ఆయన చెప్పారు. నాన్ కార్సినోజెనిక్(క్యాన్సర్ కారకం కాని), కార్సినోజెనిక్ సమస్యలను కలిగిస్తుందని, నాన్ కార్సినోజెనిక్‌తో కిడ్నీలు, నాడీవ్యవస్థకు సంబంధించిన రోగాలు వస్తాయని, కార్సినోజెనిక్‌ క్యాన్సర్‌కు దారితీస్తుందని ఆయన వివరించారు.

తల్లిపాలు, బిహార్, యురేనియం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్‌లోని చాలా ప్రాంతాల్లో భూగర్భజలాల్లో యురేనియం ఉన్నట్టు తేలింది.

భూగర్భజలాల నాణ్యత నివేదిక

అయితే, బిహార్‌లోని ఒకే ఒక జిల్లాలోని నీటిలో మాత్రమే యురేనియం ఉందని 2025 మార్చిలో కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

2024 భూగర్భ జలాల నాణ్యత నివేదిక ప్రకారం బిహార్‌లో నైట్రేట్ పరీక్ష కోసం 808 శాంపిళ్లను సేకరించారు. ఇందులో 2.35 శాతం శాంపిళ్లలో లీటరుకు 45 మిల్లీగ్రాముల కన్నా నైట్రేట్ స్థాయులు ఎక్కువ ఉన్నట్టు, రాష్ట్రంలోని 15జిల్లాలపై ఈ ప్రభావం ఉన్నట్టు తేలింది.

అలాగే ఫ్లోరైడ్ పరీక్ష కోసం 808 శాంపిళ్లు సేకరించారు. 4.58 శాతం శాంపిళ్లలో 1.5 మిల్లీగ్రాముల కన్నా ఫ్లోరైడ్ స్థాయి ఎక్కువ ఉన్నట్టు, ఆరు జిల్లాలు ప్రభావితమవుతున్నట్టు తేలింది.

ఆర్సెనిక్‌ను పరిశీలించేందుకు తీసిన 607శాంపిళ్లలో 11.9 శాతం శాంపిళ్లలో 10పీపీబీ(పార్ట్స్ పర్ బిలియన్)ఉన్నట్టు, 20 జిల్లాలపై ప్రభావం ఉన్నట్టు తేలింది.

అలాగే యురేనియం ప్రభావాన్ని పరిశీలించేందుకు 752 శాంపిళ్లు సేకరించారు. 0.1శాతం శాంపిళ్లలో మాత్రమే 30 పీపీబీ పైగా యురేనియం ఉందని, ఒక జిల్లా మాత్రమే ప్రభావితమవుతోందని వెల్లడైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)