లానా పాంటింగ్: ‘‘ సీఐఏ నాపై రహస్య ప్రయోగాలు చేసింది, అప్పుడు నా వయసు 16 ఏళ్లు’’

 సీఐఏ, ప్రయోగాలు, సైకిక్ డ్రైవింగ్

ఫొటో సోర్స్, Submitted photo

ఫొటో క్యాప్షన్, లానా పాంటింగ్
    • రచయిత, రాబిన్ లెవిన్‌సన్ -కింగ్ అండ్ ఎలోయిస్ ఎలెనా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కెనడాలోని మాంట్రియల్‌లో సైకియాట్రిక్ ఆస్పత్రి ఆలన్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ గురించి లానా పాంటింగ్‌కు ఏర్పడిన తొలి జ్ఞాపకం దాని ఘాటైన, ఔషధాల వాసన.

"ఆ ప్రదేశం లుక్ నాకు నచ్చలేదు. అది నాకు హాస్పిటల్‌లా అనిపించలేదు" అని లానా గుర్తుచేసుకున్నారు.

ఒకప్పుడు స్కాటిష్ షిప్పింగ్ వ్యాపారి నివాసమైన ఆ ఆస్పత్రి, 1958 ఏప్రిల్‌లో ఒక నెల పాటు లానాకు నివాసంగా మారింది. "అవిధేయత ప్రవర్తన" కారణంగా 16 ఏళ్ల లానాను చికిత్స కోసం అక్కడికి పంపాలని ఒక న్యాయమూర్తి ఆదేశించారు.

మైండ్ కంట్రోల్‌పై తన రహస్య పరిశోధన కోసం సీఐఏ ఎంచుకున్న వేలమందిలో లానా పాంటింగ్ కూడా ఒకరు.

కెనడాలో ఈ ప్రయోగాల బాధితుల తరపున దాఖలైన దావాకు సంబంధించిన ఇద్దరు వాదుల్లో ఇప్పుడామె ఒకరు. రాయల్ విక్టోరియా హాస్పిటల్ చేసిన అప్పీల్‌ను జడ్జి తోసిపుచ్చారు.

వైద్య రికార్డుల ప్రకారం, లానా తరచుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి స్నేహితులతో గడుపుతుండేవారు. ఇది ఆమె తల్లిదండ్రులకు ఇష్టముండేది కాదు. ఆమె కుటుంబం ఒట్టావా నుంచి మాంట్రియల్‌కు మారిన తర్వాత ఇది జరిగింది. అక్కడ పరిస్థితులు వారికి కష్టంగా మారాయి.

"నేను ఒక మామూలు టీనేజర్‌ని" అని ఆమె చెప్పారు. కానీ న్యాయమూర్తి ఆమెను ఆలన్ (సైకియాట్రిక్ ఆస్పత్రి)కి పంపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'సైకిక్ డ్రైవింగ్'

అక్కడికి చేరుకున్న తర్వాత, ఆమె తనకు తెలియకుండానే ఎంకె-అల్ట్రా అని పిలిచే ఒక రహస్య సీఐఏ ప్రయోగంలో భాగమయ్యారు. ఇది ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎల్ఎస్‌డీ, ఎలక్ట్రోషాక్ థెరపీ, బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్‌ వంటి సికెడెలిక్ ఔషధాల ప్రభావాలను వారి అనుమతి లేకుండా ప్రజలపై పరీక్షించారు.

అమెరికా, కెనడాలోని ఆస్పత్రులు, జైళ్లు, పాఠశాలలతో సహా 100కి పైగా సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి.

ఆలన్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో పరిశోధకులు డాక్టర్ ఎవెన్ కామెరాన్, రోగులకు ఓపియేట్ డ్రగ్స్ ఇచ్చి, రికార్డింగ్‌లను వినమని చెప్పేవారు. కొన్ని వేలసార్లు ఇలా జరిగేది. ఈ ప్రక్రియను పరిశోధనగా చెప్పుకునేవారు.

లానా పాంటింగ్‌తో డాక్టర్ కామెరాన్ ఒకే టేప్ రికార్డింగ్‌ని వందలసార్లు వినించేవారు.

"ఆ రికార్డింగ్ పదే పదే ప్లే అవుతూనే ఉండేది. అందులో ‘‘యు ఆర్ ఏ గుడ్ గర్ల్, యు ఆర్ ఏ బ్యాడ్ గర్ల్’’ అని పదే పదే వినిపిస్తుండేదని లానా గుర్తుచేసుకున్నారు.

డాక్టర్ కామెరూన్ ప్రయోగాలు, వాటి నైతిక సమస్యలను పరిశోధించిన డాక్టోరల్ విద్యార్థి జోర్డాన్ టోర్బే, ఈ పద్ధతిని సైకిక్ డ్రైవింగ్ అని పిలిచారు.

"ప్రాథమికంగా, పదే పదే పలికే పదాలు, సంకేతాల ద్వారా రోగుల మైండ్‌ నియంత్రణకు గురవుతుంది" అని ఆమె చెప్పారు.

నిద్ర మాత్రలు, ఇంద్రియ లోపం, కృత్రిమ కోమా ప్రభావాలపై డాక్టర్ కామెరాన్ కూడా పనిచేశారని అన్నారు.

వైద్య రికార్డులు ప్రకారం లానాకు సోడియం అమిటాల్ (బార్బిట్యురేట్), డెసాక్సిన్ (ఉత్తేజపరిచేది), నైట్రస్ గ్యాస్ అంటే లాఫింగ్ గ్యాస్‌తో పాటు ఎల్ఎస్‌డీ ఇచ్చారు.

డాక్టర్ కామెరాన్ తన మెడికల్ ఫైల్స్‌లో ఒకదానిలో ఇలా రాశారు, "ఏప్రిల్ 30 నాటికి, రోగికి ఎక్స్‌ట్యూబేషన్ ప్రక్రియ జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చిన తర్వాత, ఆమె చాలా ఒత్తిడికి గురై హింసాత్మకంగా ప్రవర్తించారు, మంచం మీద నుంచి సగానికి పైగా మనిషి బయటకు వచ్చి, ఊగి అరుస్తూ ఉన్నారు" అని పేర్కొన్నారు.

ఈ మెడికల్ ఫైల్‌ను సమాచార హక్కు చట్టం కింద పొందారు లానా పాంటింగ్.

 సీఐఏ, ప్రయోగాలు, సైకిక్ డ్రైవింగ్
ఫొటో క్యాప్షన్, ఆలన్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్

1970లలో మొదటగా బయటికొచ్చిన సమాచారం

ఎంకె-అల్ట్రా ప్రయోగాల గురించిన నిజం మొదట 1970లలో వెలుగులోకి వచ్చింది. తర్వాత అనేకమంది బాధితులు అమెరికా, కెనడా ప్రభుత్వాలపై దావా వేశారు.

అమెరికాలో చాలా వ్యాజ్యాలు విఫలమయ్యాయి. కానీ 1988లో ఒక కెనడా న్యాయమూర్తి అమెరికా ప్రభుత్వాన్ని తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి 67,000 డాలర్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

1992లో కెనడా ప్రభుత్వం 77 మంది బాధితులకు ఒక్కొక్కరికి దాదాపు 80,000 డాలర్లు చెల్లించింది. కాను తాను తప్పు చేసినట్లు మాత్రం అంగీకరించలేదు.

పరిహారం పొందిన వారిలో లానా పాంటింగ్ లేరు. ఎందుకంటే ఆ సమయంలో తాను కూడా బాధితురాలని ఆమెకు తెలియదు.

తనలో ఏదో అనారోగ్యం ఉందనే భావన దశాబ్దాలుగా ఆమెకుంది. కానీ ఇటీవలే తనపై నిర్వహించిన ప్రయోగాల పూర్తి వివరాలు ఆమెకు తెలిశాయి.

ఆలన్‌లో గడిపిన సమయం లేదా ఆ తర్వాతి సంవత్సరాల గురించి తనకు పెద్దగా జ్ఞాపకాలు లేవని ఆమె చెప్పారు.

లానా తరువాత వివాహం చేసుకుని మానిటోబాకు వెళ్లారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లల పిల్లలకు అమ్మమ్మ అయ్యారు.

కానీ అలెన్‌లో గడిపిన సమయం ప్రభావం తన జీవితంపై ఎప్పుడూ ఉందని ఆమె చెప్పారు.

"నా జీవితాంతం ఈ ప్రభావాన్ని నేను అనుభవించా" అని ఆమె అన్నారు.

"నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నానో, నాకు నిజంగా ఏం జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉండేది" అని ఆమె తెలిపారు.

తన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి జీవితాంతం అనేక రకాల మందులు తీసుకోవలసి వచ్చిందని లానా పాంటింగ్ చెప్పారు.

ఇదంతా తాను ఆలన్‌లో ప్రయోగాలకు గురికావడం వల్లేనని ఆమె అనుకుంటున్నారు. ఇప్పటికీ పదే పదే పీడకలలు వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పారు.

"కొన్నిసార్లు నేను రాత్రిపూట అరుస్తూ మేల్కొంటాను. ఎందుకంటే అక్కడ జరిగినదంతా నాకు గుర్తుంది" అని ఆమె అన్నారు.

ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, దీనిపై వ్యాఖ్యానించడానికి రాయల్ విక్టోరియా హాస్పిటల్, మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నిరాకరించాయి.

1992లో బీబీసీతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తూ, ఈ చర్య "మానవతా కారణాల" దృష్ట్యా తీసుకున్నామని, చట్టపరమైన బాధ్యతను అంగీకరించడానికి కాదని తెలిపింది.

లానా పాంటింగ్‌కు ప్రస్తుతం జరుగుతున్న విచారణ కొంత ఓదార్పునిచ్చే అవకాశం.

"కొన్నిసార్లు నా గదిలో కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సు వెనక్కి వెళ్తుంది. నాకు జరిగిన అన్ని విషయాలను గుర్తుచేసుకోవడం ప్రారంభిస్ను. డాక్టర్ కామెరాన్ మొహం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది" అని లానా అన్నారు.

 సీఐఏ, ప్రయోగాలు, సైకిక్ డ్రైవింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 16ఏళ్ల వయసులో తనపై చేసిన ప్రయోగాల ప్రభావం జీవితాంతం ఉందని లానా పాంటింగ్ చెప్పారు.

‘ఆ ప్రయోగాలు నైతికమైనవి కాదు’

డాక్టర్ కామెరాన్ పేరు ఇప్పుడు ఎంకె-అల్ట్రా ప్రయోగాలకు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, తనకు సీఐఏ నిధులు అందుతున్నాయని ఆ సమయంలో ఆయనకు తెలియదని ఆయన అధ్యయనం చూపిస్తోందని జోర్డాన్ టోర్బే చెప్పారు.

అమెరికా నిఘా సంస్థతో కలిసి కామెరాన్ చేసిన పని 1964లో ముగిసింది. మూడేళ్ల తర్వాత 1967లో ఆయన గుండెపోటుతో మరణించారు.

వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు, కానీ వారు నిర్వహిస్తున్న ప్రయోగాలు నైతికమైనవికాదని వారికి తెలిసి ఉండాలని టోర్బే అంటున్నారు.

"ఈ కేసు ముందుకు సాగుతుందని, బాధితులకు కొంత న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది నిజంగా వారు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇస్తుందని కాదుగానీ వారి బాధ వృథా కాకుండా చూసుకోవడం, దాని నుంచి మనం నేర్చుకోగలగడం" అని జోర్డాన్ టోర్బే అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)