సౌదీ బస్సు ప్రమాదం: 'మా వాళ్లు 18 మంది చనిపోయారని చెబుతున్నారు'

సౌదీ అరేబియా, మదీనా, భారత యాత్రికులు, ప్రమాదం,
ఫొటో క్యాప్షన్, గయాజుద్దీన్

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 45 మంది మృతి చెందారని ప్రాథమికంగా సమాచారం అందుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌‌లోని పంజాగుట్టకు చెందిన గయాజుద్దీన్ బీబీసీతో మాట్లాడుతూ, మృతుల్లో తమ బంధువులు 18 మంది ఉన్నారని చెప్పారు.

"ఈ కుటుంబం పెద్ద నసీరుద్దీన్. ఆయన కొడుకులు, కూతుళ్లు, వారి భార్యలు, పిల్లలు మక్కా వెళ్లారు. ఈ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి అమెరికాలో ఉండడంతో మక్కా వెళ్లలేదు. ఆయన తప్ప కుటుంబంలోని అందరూ మరణించారు" అని గయాజుద్దీన్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సౌదీ అరేబియా, మదీనా, భారత యాత్రికులు, ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మదీనా(ఫైల్ ఫోటో)

‘మొదటిసారి యాత్రకు వెళ్లి’

‘‘నా పేరు గయాజుద్దీన్. పంజాగుట్టలో ఉంటాను. నా సోదరి కుమార్తె కుటుంబానికి చెందిన మొత్తం 18 మంది బస్సు ప్రమాదంలో చనిపోయారని చెబుతున్నారు. పొద్దున్న నేను ఆఫీస్‌కి బయలుదేరుతున్నప్పుడు మా మేనల్లుడు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పారు. మేం వెంటనే మా సోదరి ఇంటికి వెళ్లాం. అప్పుడు ప్రమాదానికి సంబంధించి ఇక్కడ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారని తెలిసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక మొత్తం18 మంది ప్రమాదంలో చనిపోయారని తెలిసింది’’ అని గయాజుద్దీన్ తెలిపారు.

‘‘మక్కా నుంచి మదీనాకు వెళ్లేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. నా సోదరి కూతురు ఆమె. నా అల్లుడి కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు. నా సోదరి వియ్యంకుల కుటుంబంలోని బంధువులతో కలిపి మొత్తం 18 మంది ట్రావెల్స్‌లో వెళ్లారు. అందరూ చనిపోయారు. వీళ్లందరూ మొదటిసారి ఉమ్రా యాత్రకు వెళ్లారు’’ అని ఆయన చెప్పారు.

సౌదీ అరేబియా, మదీనా, భారత యాత్రికులు, ప్రమాదం, ఉమ్రా యాత్ర
ఫొటో క్యాప్షన్, రిజ్వాన్ అహ్మద్

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

సౌదీ బస్సు ప్రమాదంలో తన కుటుంబ సభ్యులు ఐదుగురు మరణించినట్టు రిజ్వాన్ అహ్మద్ చెప్పారు. తన తల్లి, అన్న, వదిన, వారి ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోయారని తెలిపారు

‘‘నా పేరు రిజ్వాన్ అహ్మద్. మా పెద్దన్నయ్య, ఆయన భార్య, వాళ్లిద్దరు పిల్లలతోపాటు మా అమ్మ మొత్తం ఐదుగురు మక్కాకి వెళ్లారు. ఉదయం 8.30 గంటలకు నాకు విషయం తెలిసింది. బస్సుకు నిప్పంటుకుంది. అందరూ బస్‌లోనే ఉన్నారని మా ఆంటీ చెప్పారు. మా పెద్దన్నయ్య దుబయ్‌లో పనిచేస్తున్నారు, సెలవుమీద ఇక్కడకు వచ్చారు.

రాత్రి(నవంబరు 16) ఎనిమిదింటికి ఫోన్ చేశారు. మేం బస్‌ ఎక్కాం. మదీనాకు వెళుతున్నాం అని చెప్పారు. పదిహేనురోజుల టూర్ వాళ్లది. వచ్చే ఆదివారం తిరిగి వచ్చేవారు. మా అన్నయ్య పిల్లలిద్దరూ చిన్నవాళ్లే. ఒకరికి తొమ్మిది, మరొకరికి ఏడేళ్లుంటాయి. మా అమ్మకి 60 ఏళ్లు. మేం రాత్రి ఒంటిగంటకి కాల్ చేశాం, కానీ కాల్ కలవలేదు. ఉదయం కూడా కాల్ చేశాం. కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాం. కానీ, కలవలేదు. ఉదయం విషయం తెలిసింది.’’

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)