బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష, తీర్పు వెలువరించిన స్పెషల్ ట్రిబ్యునల్.. స్పందించిన హసీనా

షేక్ హసీనా, బంగ్లాదేశ్, మరణశిక్ష

ఫొటో సోర్స్, Getty Images

గత ఏడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఘోరమైన అణచివేతకు పాల్పడినట్లు తేల్చిన స్పెషల్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

హసీనా గైర్హాజరీలో ఈ విచారణ జరిగింది. ఆమె అమానవీయ నేరాలకు పాల్పడినట్లు నిర్ధరించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

గతేడాది జరిగిన విద్యార్థి ఆందోళనలను అణచివేయడంలో అమానుష నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను షేక్ హసీనా ఎదుర్కొంటున్నారు.

స్పెషల్ ట్రిబ్యునల్ విచారణ ఆమె గైర్హాజరీలో జరిగింది.

ఢాకా కోర్టు తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు "పక్షపాతపూరితమైనది, రాజకీయ ప్రేరేపితం" అని ఆమె పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షేక్ హసీనా, బంగ్లాదేశ్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, ట్రిబ్యునల్ ముందు గుమిగూడిన జర్నలిస్టులు

అమానవీయ నేరాలకు పాల్పడినట్లు నిర్ధరిస్తూ ఆమెను దోషిగా తేల్చింది. ఆమెతో పాటు అప్పటి హోం మంత్రి, పోలీస్ చీఫ్‌కూ శిక్ష విధించింది. నిరసనకారులపై ప్రాణాంతక దాడులు జరిపినందుకు, వారిపై జరిగిన అణిచివేత చర్యలను అడ్డుకోనందుకు దోషులుగా నిర్ధరించింది.

అయితే, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా తనపై వచ్చిన ఆరోపణలను గతంలో ఖండించారు. ఆమె విచారణకు హాజరు కాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మాజీ పోలీస్ చీఫ్ అబ్దుల్లా అల్-మమౌన్ మాత్రమే శిక్ష ప్రకటన సమయంలో కోర్టుకు హాజరయ్యారు.

షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత కోర్టు లోపల, వెలుపల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కొందరు షేక్ హసీనాను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కొన్ని సెకన్ల పాటు కొందరు సంబరాలు చేసుకున్న తర్వాత కోర్టు మర్యాద పాటించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది.

షేక్ హసీనా, బంగ్లాదేశ్, మరణశిక్ష

ఫొటో సోర్స్, Getty Images

తీర్పుపై షేక్ హసీనా ఏమన్నారు?

ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్ హసీనా ఢాకా కోర్టు తీర్పును ఖండించారు. 'ఇది పక్షపాతపూరితం, రాజకీయ ప్రేరేపితం'గా పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఆమె ఐదుపేజీల ప్రకటన విడుదల చేశారు.

మరణశిక్ష విధించడం.. తన పార్టీ అవామీలీగ్‌ను రాజకీయంగా పూర్తిగా నిర్మూలించేందుకు తాత్కాలిక ప్రభుత్వానికి ఒక మార్గంగా హసీనా పేర్కొన్నారు.

''సాక్ష్యాలను న్యాయంగా పరిశీలించి, విచారణ జరిపే సరైన కోర్టులో నాపై ఆరోపణలు చేసిన వారిని ఎదుర్కొనేందుకు నాకెలాంటి భయం లేదు'' అని హసీనా అన్నారు. ఈ ఆరోపణలను హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె సవాల్ చేశారు.

మానవ హక్కులు, అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికున్న రికార్డు చూసి తాను చాలా గర్వపడుతున్నానని ఆ ప్రకటనలో హసీనా పేర్కొన్నారు.

విచారణ సమయంలోనూ హసీనా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు.

షేక్ హసీనా, బంగ్లాదేశ్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, స్పెషల్ ట్రిబ్యునల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం

గతేడాది విద్యార్థి ఆందోళనల తర్వాత ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

తీర్పు వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు వెలుపల సాయుధ భద్రతా సిబ్బంది, పోలీసులను పెద్దయెత్తున మోహరించారు.

ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో పోలీసులు కొన్ని చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

షేక్ హసీనా, బంగ్లాదేశ్, మరణశిక్ష
ఫొటో క్యాప్షన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మీడియా తప్ప మరెవర్ని ట్రిబ్యునల్ ప్రాంతంలోకి అనుమతించడం లేదు.

పేలిన నాటుబాంబు

ఆందోళనలకు ప్రణాళికలు రచిస్తున్నారన్న అనుమానంతో.. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. గతేడాది తన ఉత్తర్వులతోనే ఆందోళనకారులపై పోలీసులు చర్యలు చేపట్టారని వారు ఆరోపిస్తున్నారు.

ఢాకా పరిసర ప్రాంతమైన ధన్‌మోండిలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఓ నాటు బాంబు పేలినట్లు సీనియర్ పోలీసు అధికారి జిసానుల్ హక్ తెలిపారు.

ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన చెప్పారు. అయితే… ఆ ప్రాంతంలో ఇంకా ప్రస్తుతం పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇటీవల ఢాకాలో 30కిపైగా నాటు బాంబుల పేలుళ్లు జరిగాయని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

తీర్పుకు ముందు కోర్టు వద్ద పరిస్థితి..

గతేడాది పోలీసుల అణచివేతలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు కోర్టు వద్దకు చేరుకుంటూ ఉన్నారు.

స్పెషల్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించే సమయంలో కనీసం 15 కుటుంబాల వరకు అక్కడ ఉంటాయని ప్రాసిక్యూటర్లు చెప్పారు.

ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు కూడా కోర్టు వద్దకు చేరుకోవడం కనిపించింది.

భద్రతా సిబ్బంది, మీడియా సహా ప్రజలు చాలా మంది కోర్టు గేటు బయట కనిపించారు.

 షేక్ హసీనా దిగిపోవాలంటూ జరిగిన ఆందోళనలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలంటూ 2024లో జరిగిన ఆందోళనలు

'ఆందోళనల్లో 1400 మంది చనిపోయారు'

1971 యుద్ధంలో పాల్గొన్న వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు మొదలయ్యాయి.

1971 తర్వాత బంగ్లాదేశ్‌ చూసిన అత్యంత దారుణమైన హింస ఇదని చెబుతారు.

2024 ఆగస్టు 5న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

దీంతో షేక్ హసీనా హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత ఆందోళనకారులు ఆమె నివాసంలోకి చొచ్చుకొవచ్చారు.

ఐక్యరాజ్య సమితి పరిశీలకుల ప్రకారం, గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది చనిపోయారు.

బీబీసీ ధ్రువీకరించిన ఆడియోలో ఏముందంటే..

ఆందోళనలను క్రూరంగా అణచివేసేందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్న ఒక ఫోన్‌ కాల్ ఆడియోను బీబీసీ ఐ గతంలో ధ్రువీకరించింది.

మార్చిలో ఆన్‌లైన్‌లో లీకైన ఈ ఆడియోలో నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ప్రయోగించడానికి భద్రతా దళాలకు అధికారం ఇచ్చానని, వాళ్లు ఎక్కడ దొరికితే అక్కడే కాల్చి వేయాలని హసీనా చెప్పినట్లుగా అందులో ఉంది.

2024 జులై 18న ఈ ఆడియో కాల్ జరిగినప్పుడు షేక్ హసీనా ఢాకాలోని తన నివాసంలో ఉన్నారని లీకైన ఆడియో గురించి తెలిసిన ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, Reuters

ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా..

షేక్ హసీనా.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కుమార్తె.

ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా పేరొందారు.

1996 నుంచి 2001 మధ్య .. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసేవరకు బంగ్లాదేశ్‌ను పరిపాలించారు.

1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో షేక్ హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)