'అమ్మ తెలుపు కాబట్టి, నేను కూడా తెల్లగా ఉన్నా అనుకునేదాన్ని. కానీ..'

ఐవీఎఫ్, వైద్యం, వైద్య పరిశోధన, కుటుంబం, జీవనం

ఫొటో సోర్స్, Hadeya Okeafor

ఫొటో క్యాప్షన్, తండ్రితో హెడేయా
    • రచయిత, సాండ్రిన్ లంగుంబు
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీసు

హెడేయా ఒకేఫర్ తానెవరో తెలుసుకున్న రోజున ఆమెకు 12 ఏళ్లు. సోఫాలో కూర్చుని, తన తల్లితో కలిసి సినిమా చూస్తున్నప్పుడు, ఆమె హెడేయాకు ఓ విషయం చెప్పారు.

''నీకు కూడా ఇలా జరిగిందని నేను చెబితే?'' అంటూ తన తల్లి విషయం చెప్పడం ప్రారంభించారు.

అదే తొలిసారి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా తనకు జన్మనిచ్చినట్లు హెడేయాకు ఆమె తల్లి చెప్పారు. కానీ, ఒక పొరపాటు జరిగిందని ఆమెతో అన్నారు.

''ఆ సమయంలో, అదొక పిచ్చి కథ అని అనుకున్నట్లు నాకింకా గుర్తుంది. కానీ, ఇంతకుముందే దీనిని నేనెందుకు గుర్తించలేకపోయాను? అని కూడా ఆలోచించా. నేనప్పుడు చిన్నదాన్ని. అందుకే అంతగా పట్టించుకోలేదు'' అనిహెడేయా చెప్పారు.

''మేం చూడ్డానికి ఒకేలా లేమని అనిపించేది. కానీ, నేనెప్పుడూ అడగలేదు. అమ్మ తెలుపు కాబట్టి, నేను కూడా తెల్లగా ఉన్నా అనుకునేదాన్ని'' అని కెనడాకు చెందిన 26 ఏళ్ల పురావస్తు శాస్త్రవేత్త హెడేయా గుర్తుచేసుకున్నారు.

''ఘనాకు చెందిన మిశ్రమ జాతి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను, అనుకోకుండా అలా జరిగింది'' అని అన్నారామె.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1978లో ఈ చికిత్సను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుట్టారని యూనివర్సిటీ కాలేజీ లండన్ హాస్పిటల్‌కు చెందిన అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్‌ కన్సల్టెంట్ డిమిట్రియోస్ మావ్రెలోస్ బీబీసీతో చెప్పారు.

ఈ రోజుల్లో ఇలాంటి తప్పులు చాలా అరుదు. కానీ, ఐవీఎఫ్ ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో ఇవి చాలా సాధారణంగా జరిగేవి. ఎందుకంటే, ఆ సమయాల్లో ప్రమాణాలు తక్కువ.

ఐవీఎఫ్, వైద్యం, వైద్య పరిశోధన, కుటుంబం, జీవనం

ఫొటో సోర్స్, Hadeya Okeafor

ఫొటో క్యాప్షన్, హెడేయా ఒకేఫర్

స్కూల్లో వెక్కిరింపులు..

తూర్పు తీర ప్రాంతం, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌లో‌ని ఒక చిన్న పట్టణంలో పెరిగినట్లు హెడేయా తెలిపారు. హైస్కూల్‌లో జాతి వివక్షతో కూడిన కొన్ని వెక్కిరింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

''కొంతమంది పిల్లలు 'నువ్వు నిజానికి నల్లగా ఉండాల్సింది', అనేవారు. లేదా ఆఫ్రికన్ల మీద జోక్స్ వేసేవారు'' అని తెలిపారు.

ఈ జాత్యాహంకార వేధింపులు కేవలం తాను మాత్రమే కాదు, తన తోబుట్టువులు కూడా ఎదుర్కొన్నారని హెడేయా చెప్పారు. (ఐవీఎఫ్ ద్వారా హెడేయా పుట్టిన తర్వాత, ఆమె తల్లిదండ్రులు మరో నలుగురు పిల్లలకు సహజంగానే జన్మనిచ్చారు.)

ఐవీఎఫ్, వైద్యం, వైద్య పరిశోధన, కుటుంబం, జీవనం

ఫొటో సోర్స్, Hadeya Okeafor

ఫొటో క్యాప్షన్, తండ్రితో హెడేయా ఒకేఫర్

తన పుట్టుక గురించి తెలుసుకున్న తర్వాత, తన తండ్రితో హెడేయాకున్న బంధం ఏమీ మారలేదు. తన జీవితం గురించి ఒక వాస్తవాన్ని మాత్రమే ఆమె తెలుసుకున్నారు.

''నా మదిలో తొలిచే ఓ ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ, ఇప్పటికీ నేను వెతుకుతున్న ఒకదాన్ని మాత్రం ఇంకా చేరుకోలేకపోయాను'' అని ఆమె అంటున్నారు.

ఈ పొరపాటు ఎలా జరిగిందనేది తెలుసుకోవాలని ఆమె కోరుకుంటున్నారు.

''ఆయన ఎప్పటికీ మా నాన్నే. నన్ను పెంచిన తండ్రే. నేను పుట్టినప్పుడు, నేటికీ నాతోనే ఉన్నారు. అందులో ఎలాంటి తేడాను నేను ఫీలవ్వడం లేదు'' అని హెడేయా చెప్పారు.

''నా బాల్యం నిజం. నన్ను నేను కొంతవరకు ఘనా వ్యక్తిగానే భావిస్తా, ఎందుకంటే నేను ఘనా ఆహారం తింటూ, ఆ భాష వింటూ పెరిగాను. నేను మాట్లాడలేను కానీ, కొంత అర్థం చేసుకోగలను'' అని ఆమె అన్నారు.

ఐవీఎఫ్, వైద్యం, వైద్య పరిశోధన, కుటుంబం, జీవనం

ఫొటో సోర్స్, Hadeya Okeafor

ఫొటో క్యాప్షన్, హెడేయా తల్లిదండ్రులు టొరంటోలో కలుసుకున్నారు.

హెడేయా తల్లిదండ్రులు 1990లలో టొరంటోలో కలిశారు. కలిసిన ఏడాదిలోనే పెళ్లి చేసుకున్నారు.

''నా తండ్రి ఘనాలో, తీరప్రాంత నగరమైన టెమాలో పెరిగారు. తన 20లలోనే కెనడాలోని టొరంటోకు వలసొచ్చారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌లోని నార్త్ రుస్టికాకు చెందిన నా తల్లిని కలిశారు'' అని హెడేయా చెప్పారు.

ఎన్నో ఏళ్ల పాటు ఇన్‌ఫెర్టిలిటీతో (వంధ్యత్వం) బాధపడిన తర్వాత, టొరంటో ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ ఇన్‌స్టిట్యూట్‌లో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీన్ని డాక్టర్ ఫిరోజ్ ఖాంసీ నిర్వహించేవారు. ప్రస్తుతం ఫిరోజ్ ఖాంసీ చనిపోయారు.

ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) విధానంలో మహిళ అండాశయం నుంచి అండాలను వేరు చేసి ప్రయోగశాలలో పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చెందిస్తారు. ఫలదీకరణం చెందిన ఆ అండాలు పిండాలుగా మారిన తరువాత వాటిని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడతారు.

ఈ దంపతులు ముందే స్పష్టంగా చెప్పారు. తల్లిదండ్రుల ఇద్దరి వారసత్వాన్ని పొందేందుకు వీలుగా నల్లజాతి వీర్యదాత కావాలని వారు కోరుకున్నారు.

''నేను పుట్టినప్పుడు, నా లేతరంగు చూసి నా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఐవీఎఫ్ క్లినిక్‌కు ఫోన్ చేస్తే, రంగు మారేందుకు ఏడాది సమయం పట్టొచ్చన్నారు'' అని హెడేయా తెలిపారు.

కానీ, ఏడాది తర్వాత హెడేయా తల్లి మళ్లీ క్లినిక్‌ను సంప్రదించారు. అప్పుడు వీర్యదాత కాకేసియన్ (తెల్లజాతి) వ్యక్తి అని, ఎర్ర జుట్టు వ్యక్తిగా చెప్పారు.

''ఏడాది అనంతరం, డోనర్ సిరంజి నంబర్ల విషయంలో తప్పిదం జరిగి, ఇలా అయిందని క్లినిక్ ఒప్పుకుంది'' అని హెడేయా చెప్పారు.

హెడేయా బయలాజికల్ ఫాదర్ బ్రౌన్ హెయిర్‌ వ్యక్తని, ఆయనకు ఎర్రటి జట్టు లేదని హెడేయా కనుగొన్నారు.

డాక్టర్ ఖాంసీను కలిసి తన తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు, ''మీకు పిల్లలు పుట్టినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పాలి. మీకిప్పుడు అందమైన కుటుంబం ఉంది. మీకు కావాల్సింది దొరికింది. కావాలంటే, నన్ను కోర్టుకు లాగొచ్చు" అని ఆయన అన్నారు.

2003లో హెడేయా తల్లిదండ్రులు క్లినిక్‌ను కోర్టుకు లాగారు. ఆ తర్వాత, డబ్బులతో కేసు సెటిల్ చేసుకున్నారు.

''నాకు చాలా ఫన్నీగా అనిపించిందేంటంటే, డీఎన్ఏ టెస్టు లేకుండా నేను కాకేసియన్ చైల్డ్ అని నిరూపించలేమని కోర్టులో క్లినిక్ వాదించింది. కానీ, నాకు స్పష్టంగా అర్థమవుతోంది'' అని హెడేయా తెలిపారు.

15 మంది తోబుట్టువులు..

2019లో హెడేయా డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నారు. తన బయలాజికల్ ఫాదర్ గురించి మరింత తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.

ఐదేళ్ల తర్వాత ఒకరు తనను సంప్రదించారని, ఆ వ్యక్తి డీఎన్ఏ సరిపోలిందని, అదే తన 12 మంది తోబుట్టువులను కనుగొనేందుకు సహకరించిందని ఆమె చెప్పారు.

వీరిలో చాలామంది 1994 నుంచి 1998 మధ్యలో ఒకే దాత ద్వారా జన్మించినట్లు తెలిసింది.

''నాకు 12 మంది తోబుట్టువులున్నట్లు తెలుసుకున్నప్పుడు కాస్త క్రేజీగా అనిపించింది. ఆ తర్వాత, మరో ముగ్గురిని కనుగొన్నా'' అని హెడేయా తెలిపారు.

''నాకొక్కదానికే ఇలా జరగలేదని తర్వాత తెలిసింది. అది మరిన్ని ప్రశ్నలకు, నా స్టోరీపై మరింత విచారణకు దారితీసింది'' అని చెప్పారు.

''ఆయన వీర్యాన్ని ఆరుగురి నుంచి ఎనిమిది మంది పిల్లల కంటే ఎక్కువమందిని పుట్టించేందుకు వాడమని మా తల్లులకు హమీ ఇచ్చినట్లు అనిపిస్తోంది'' అని అన్నారు.

కానీ, ఆ దాత వీర్యాన్ని కనీసం 15 ఐవీఎఫ్ చికిత్సలు చేసేందుకు వాడారు.

కాల్గరీ విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధన కోసం వీర్యాన్ని దానం చేసినట్లు స్పెర్మ్ డోనర్ భావించినట్లు ఆయన కూతుళ్లు హెడేయాకు తెలిపారు. కానీ, ఆయన వీర్యం క్లినిక్‌కు చేరిందని ఆమె చెప్పారు.

కెనడాలో, ఒక దాత నుంచి ఎన్నిసార్లు వీర్యాన్ని దానంగా తీసుకోవాలనే దానిపై ఎలాంటి చట్టపరమైన పరిమితి లేదు. కానీ, కొన్ని క్లినిక్‌లు వృత్తిపరమైన వివేచనతో, సొంతంగా పరిమితులు విధించుకున్నాయి.

ఐవీఎఫ్, వైద్యం, వైద్య పరిశోధన, కుటుంబం, జీవనం

ఫొటో సోర్స్, Hadeya Okeafor

ఫొటో క్యాప్షన్, సోదరుడు, తండ్రితో హెడేయా

'రెండు సంస్కృతులు ఉండడం వరం'

ఒకరినొకరు తెలుసుకునేందుకు ఆ వీర్య దాత ద్వారా పుట్టిన ఆమె తోబుట్టువులు చాలామంది గ్రూప్‌ చాట్‌లో చేరారు. వారందరూ ప్రస్తుతం టచ్‌లోనే ఉన్నారు.

''తూర్పు తీరంలో నా బయలాజికల్ బ్రదర్ ఉన్నారు. మేం ఇద్దరం రెండు వీధుల దూరంలోనే ఉండేవాళ్లం. కానీ, మాకు తెలియదు'' అన్నారు హెడేయా.

రెండు సంస్కృతులు ఉన్న కుటుంబంలో పెరగడాన్ని వరంగా భావిస్తున్నారు హెడేయా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)