సిడ్నీ రైలీ:'పుట్టుకతోనే మోసగాడు' అని బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్లతో అనిపించుకున్న ఈ గూఢచారిని రష్యాలో ఎలా చంపేశారు?

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1925 నవంబర్ 5 సాయంత్రం. మాస్కోలోని లుబ్యంకా జైలు నుంచి 73వ నంబర్ ఖైదీని అక్కడికి సమీపంలోని సోకోల్నికీ అడవిలోకి తీసుకెళ్లారు.
ఖైదీతో పాటు సోవియట్ సైనిక నిఘా సంస్థ ఓజీపీయూకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా కారులో ఉన్నారు. బగారోస్క్ రోడ్డు వెంట ఉన్న ఒక చెరువు దగ్గర ఆ కారు ఆగింది. ఖైదీని కారులో నుంచి దిగి అడవిలో నడవాల్సిందిగా ఆదేశించారు.
వారు ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే, అంతకుమునుపు కూడా ఆ ఖైదీని కొన్ని రోజుల వ్యవధిలో ఇలాగే వాకింగ్‌కు తీసుకెళ్లారు.
వార్‌ఫేర్ హిస్టరీ నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఆగస్టు 2004లో ప్రచురితమైన 'ది మిస్టీరియస్ సిడ్నీ రైలీ' అనే వ్యాసంలో విన్స్ హాకిన్స్ అనే వ్యాసకర్త ఈ ఘటన గురించి రాశారు.
'ఖైదీ ఆ కారు నుంచి దిగి 30 నుంచి 40 అడుగులు నడిచారో లేదో ఓజీపీయూ గూఢచారి అబ్రహమ్ అబీసాలోవ్ తన పిస్టల్‌తో ఖైదీ వీపులో కాల్చారు. తనను ఇలా చంపేస్తారని ఆ ఖైదీకి తెలియదు. ఒకవేళ తెలిసినా ఆయన బతికే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే స్వయంగా స్టాలిన్ ఆ ఖైదీని చంపమని ఆదేశించారు. ఫలితంగా బ్రిటిష్ నిఘా వర్గాల్లో గొప్ప గూఢచారిగా పేరున్న సిడ్నీ రైలీ జీవితం అక్కడికక్కడే ముగిసింది' అని ఆ వ్యాసంలో విన్స్ హాకిన్స్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Biteback Publishing
యుక్రెయిన్ యూదు కుటుంబంలో జననం
రైలీ చేసిన సాహసాలను బ్రిటిష్ నిఘా చరిత్రలోనే అత్యంత గొప్పవిగా పరిగణిస్తారు.
ఈ సాహసాల గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఆయన మరణం తర్వాతే తెలిసింది. 1931లో ఆయన మరణించాక ప్రచురితమైన ''అడ్వెంచర్స్ ఆఫ్ ఏ బ్రిటిష్ మాస్టర్ స్పై'' ఆత్మకథ ద్వారా అవన్నీ వెలుగులోకి వచ్చాయి.
ఈ ఆత్మకథలోని కొన్ని భాగాలు లండన్ ఈవినింగ్ స్టాండర్డ్‌లో కూడా ప్రచురితమయ్యాయి.
''ఒక మంచి గూఢచారికి ఉండాల్సిన అన్ని లక్షణాలు రైలీ లో ఉన్నాయి. ఆయన అనేక భాషలు మాట్లాడేవారు. ప్రజల్ని సులభంగా బోల్తా కొట్టించేవారు. అన్ని ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అద్భుతమైన సామర్థ్యం ఉండేది. స్నేహితులను చేసుకోవడం, వారి నుంచి రహస్యాలను పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సోవియట్ యూనియన్‌లో గూఢచర్యం చేయడానికి పంపిన అత్యుత్తమ గూఢచారుల్లో రైలీ ఒకరు'' అని తన పుస్తకం 'ద న్యూ స్పై మాస్టర్'లో స్టీఫెన్ గ్రే రాశారు.
యుక్రెయిన్‌లోని ఒడెస్సాలో ఒక యూదు కుటుంబంలో 1873లో రైలీ జన్మించారు. 1890లలో ఆయన లండన్ వెళ్లారు. అక్కడ ఆయన ఒక ఐరిష్ మహిళను పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె ఇంటి పేరును కూడా స్వీకరించారు. తనను తాను ఐరిష్ వ్యక్తిగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాతి నుంచి ఆయన కొన్నిసార్లు వ్యాపారవేత్తగా, కొన్నిసార్లు ఫ్రీలాన్స్ గూఢచారిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, Tempus
జపాన్, బ్రిటన్‌ల కోసం గూఢచర్యం
సమాచారాన్ని సేకరించడం, దాన్ని ఇతరులకు అమ్మడం ఆయన పని. కాకసస్‌లో చమురు నిల్వలు ఉండే అవకాశం గురించి బ్రిటిష్ నిఘా వ్యవస్థకు కచ్చితమైన సమాచారం ఇచ్చారు. జపాన్-రష్యా యుద్ధ సమయంలో ఆయన రష్యా రక్షణ ప్రణాళికలను దొంగిలించి జపాన్‌కు అమ్ముకున్నారు.
''యుద్ధ సామగ్రి కొనుగోలు, అమ్మకంలో రైలీ కీలక పాత్ర పోషించారు. జపాన్‌లో పెద్ద మొత్తంలో గన్‌పౌడర్ కొన్నారు. అదేసమయంలో రష్యా కోసం న్యూయార్క్‌లో ఆయుధాలనూ కొన్నారు. 1917 రష్యా విప్లవానికి ముందు, చివరిసారిగా1915 వేసవిలో రష్యాలో ఆయన కనిపించారు. 1914లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఒక జర్మన్ నౌకానిర్మాణ సంస్థ యజమాని నుంచి జర్మనీ నౌకా విస్తరణకు సంబంధించిన పూర్తి బ్లూప్రింట్‌ను దొంగిలించి, ఆ సమాచారాన్ని బ్రిటిష్ నిఘా సంస్థకు అమ్మేశారు'' అని తన పుస్తకం 'ఏస్ ఆఫ్ స్పైస్: ద ట్రూ స్టోరీ ఆఫ్ సిడ్నీ రైలీ'లో ఆండ్రూ కుక్ రాశారు.
రష్యాలో విప్లవం తర్వాత ఆయన బ్రిటిష్ సైన్యంలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
''రైలీ ఏదో ఒక నెపంతో రష్యాలోకి తిరిగి ప్రవేశించాలని అనుకున్నారు. ఎందుకంటే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చాలా విలువైన వస్తువులను, పెయింటింగ్స్‌ను ఆయన వదిలేసి వచ్చారు. వాటిని ఎలాగైనా తిరిగి బ్రిటన్ చేర్చాలని ఆయన ప్రయత్నించారు'' అని రైలీ జీవిత చరిత్రలో రచయిత ఆండ్రూ కుక్ పేర్కొన్నారు.
గూఢచర్యం కోసం రష్యాకు..
రైలీని 1918 మార్చి 18న రష్యాకు పంపించడానికి ముందు రైలీ నేపథ్యాన్ని విచారించారు, బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధిపతి సర్ మాన్స్‌ఫీల్డ్ కమింగ్.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ-5 ప్రకారం, రైలీ పుట్టుకతోనే మోసగాడు.
''రైలీ నమ్మదగిన వ్యక్తి కాదని, రష్యాలో అతనికి అప్పగించబోయే బాధ్యతలకు తగినవాడు కాదని న్యూయార్క్‌లోని ఐఎస్ఎస్ స్టేషన్, టెలిగ్రామ్ ద్వారా కమింగ్‌కు తెలిపింది.
‘‘అయినప్పటికీ కమింగ్ ఈ సూచనలను విస్మరించి, గూఢచర్యం మిషన్‌పై రైలీని రష్యాకు పంపాలని నిర్ణయించుకున్నారు'' అని కుక్ రాశారు.

ఫొటో సోర్స్, Public Affairs
మహిళలతో స్నేహం
సిడ్నీ రైలీని ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఎవరూ అభివర్ణించలేదు.
రష్యాలోని తన గూఢచారులకు రైలీ గురించి తెలుపుతూ కమింగ్ ఒక లేఖ రాశారు.
'అతని ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు. కళ్లు కాస్త ముందుకు పొడుచుకు వచ్చినట్లుంటాయి. ముఖం రంగు నలుపు. ముఖంపై చాలా గీతలు కనిపిస్తాయి' అని లేఖలో పేర్కొన్నారు.
కానీ, మహిళలు మాత్రం ఆయన వైపు ఆకర్షితులయ్యేవారు. సమాచారం సేకరించడానికి ఆయన మహిళలను విపరీతంగా వాడుకునేవారు.
''రైలీకి ఉన్న చాలామంది ప్రేయసుల్లో యువ రష్యన్ నటి యెలిజావెతా ఓటెన్ ఒకరు. క్రెమ్లిన్‌కు కొన్ని వందల గజాల దూరంలోని షెరెమెతివ్ లేన్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు రైలీ. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే దగ్మారా కరోజస్‌తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. దగ్మారా జర్మన్ పౌరురాలు. ఆమె గూఢచారి అనే అనుమానంతో 1915లో అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ ఆమెను విచారించింది'' అని 'స్పైయిస్ అండ్ కమీసార్స్' అనే పుస్తకంలో రాబర్ట్ సర్విస్ రాశారు.
రాబర్ట్ తన పుస్తకంలో రైలీ ప్రేయసులంటూ ఒక పెద్ద జాబితాను ఇచ్చారు.
''వీరే కాకుండా ఓల్గా స్టార్జెవెస్కాయా కూడా ఆయనను పిచ్చిగా ప్రేమించింది. త్వరలో తమ వివాహం జరుగుతుందని ఆమె ఆశించింది. ఆమె కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ కార్యాలయంలో టైపిస్ట్. ఆమెపట్ల రైలీ ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆమె ద్వారా ముఖ్యమైన పత్రాలను పొందడం. మరియా ఫ్రీదె అనే మరో మహిళతో కూడా ఆయనకు సంబంధం ఉంది. ఆమె సోదరుడు అలెగ్జాండర్, సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. సైనిక వ్యవహారాల కార్యాలయంలోనూ పనిచేశారు'' అని రాబర్ట్ పేర్కొన్నారు.
''రైలీ అండర్‌కవర్‌గా జీవించడంలో, వివిధ వేషాలు ధరించడంలో నిష్ణాతుడు. బహుభాషావేత్త. రష్యన్ భాషలో నిష్ణాతుడు. పెట్రోగ్రాడ్‌లో అతను తుర్కియే వ్యాపారి కాన్‌స్టాంటిన్ మాసినోగా అందరికీ పరిచయమయ్యారు. మాస్కోలో గ్రీకు వ్యాపారి కాన్‌స్టాంటైన్‌గా నటించారు. మరొకచోట రష్యన్ నిఘా సంస్థ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో సభ్యుడైన సిగ్మండ్ రెలిన్స్కీగా యాక్ట్ చేశారు'' అని స్టీఫెన్ గ్రే రాశారు.

ఫొటో సోర్స్, Biteback Publishing
లెనిన్ దగ్గర వరకు..
రైలీ 1918 ఏప్రిల్‌లో మాస్కో చేరుకున్న తర్వాత అక్కడున్న బ్రిటిష్ గూఢచారులతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. సోవియట్ విజయాలపై ఒక పుస్తకం రాసేందుకు పరిశోధన చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆయన నేరుగా క్రెమ్లిన్ వెళ్లారు. ఫలితంగా, లెనిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వ్లాదిమిర్ బ్రూవిచ్‌ను ఆయన సంప్రదించగలిగారు.
''సిడ్నీ రైలీ, బ్రూవిచ్ మధ్య సమావేశం చాలా విజయవంతమైంది. సిడ్నీకి ప్రభుత్వ కారు ఇవ్వడమే కాకుండా, ట్రాట్‌స్కీ ప్రసంగించనున్న పాలిటెక్నికల్ మ్యూజియంలో జరిగే మే డే వేడుకలకు హాజరు కావడానికి కూడా ఆయనను ఆహ్వానించారు. స్నేహితునితో కలిసి సిడ్నీ వేడుకలు జరిగే హాలుకు చేరుకున్నప్పటికే అది నిండిపోయింది. వారికి, ట్రాట్‌స్కీకి మధ్య ఉన్న సీటు పియానో అంత వెడల్పు మాత్రమే ఉంది. ట్రాట్‌స్కీని చంపి బోల్షివిజాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి ఇది ఒక అవకాశమంటూ స్నేహితునితో సిడ్నీ గుసగుసలాడారు’’ అని రాబర్ట్ సర్విస్ తన పుస్తకం 'స్పైస్ అండ్ కమీసార్స్'లో రాశారు.
మాస్కోలో ఉన్న బ్రిటిష్ గూఢచారులు రాబర్ట్ లాక్‌హార్ట్, జార్జ్ హిల్ తమ ఆత్మకథలలో సోవియట్ ప్రభుత్వంపై సిడ్నీ రైలీ తిరుగుబాటుకు ప్రణాళిక వేసినట్లు పేర్కొన్నారు.
జార్జ్ అలెగ్జాండర్ హిల్ రాసిన పుస్తకం పేరు 'గో స్పై ది ల్యాండ్'.
''రైలీ అసలు ప్రణాళిక ఏంటంటే, లెనిన్ సహా కమ్యూనిస్ట్ నాయకులందరినీ మాస్కో వీధుల గుండా ఊరేగించడం ద్వారా వారిని అవమానించి, రష్యన్లు ఎంత బలహీనంగా ఉన్నారో చూపించడమే. ఇది చాలా కష్టమైన పని. సిడ్నీ సహచరుడు హిల్ ఈ ప్లాన్‌ను వీటో చేశారు, ఇది ఆచరణాత్మకం కాదని చెప్పాడు’’ అని ఆ పుస్తకంలో జార్జ్ అలెగ్జాండర్ పేర్కొన్నారు.
ఆపరేషన్ విఫలం
మరో బ్రిటిష్ ఏజెంట్ జార్జ్ హిల్‌తో కలిసి రైలీ ఆగస్ట్ 17న లాత్వియన్ రెజిమెంటల్ లీడర్ ఒకరిని కలిశారు. సెప్టెంబర్ మొదటి వారంలో కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమిసార్స్ అండ్ సోవియట్ నాయకత్వం సమావేశం సందర్భంగా తిరుగుబాటు చేయాలని ప్లాన్ వేశారు.
కానీ చివరి నిమిషంలో జరిగిన ఆకస్మిక ఘటనలు ఈ ఆపరేషన్‌కు ఆటంకం కలిగించాయి. సోవియట్ నిఘా సంస్థ చెఖా పెట్రోగ్రాడ్ అధిపతి మోసెల్ యూరిత్క్సీని ఆగస్ట్ 30న ఒక సైనిక క్యాడెట్ హత్య చేశారు. అదే రోజు మాస్కోలోని ఒక ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళుతుండగా లెనిన్‌పై ఫాన్యా కప్లాన్ కాల్పులు జరిపారు.
ఆ కాల్పుల్లో లెనిన్ గాయపడ్డారు. ఈ ఘటనల తర్వాత, చెకా వేలాది మంది రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇందులో భాగంగా తిరుగుబాటుకు ప్రణాళిక వేసిన రైలీ సహచరులను కూడా అరెస్టు చేశారు. వారు పెట్రోగ్రాడ్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయంపై దాడి చేసి సిడ్నీ రైలీ సహచరుడు క్రోమీని చంపారు. మరో సహచరుడు రాబర్ట్ లాక్‌హార్ట్‌ను కూడా అరెస్టు చేశారు.
లండన్‌లో నిర్బంధానికి గురైన సోవియట్ దౌత్యవేత్త మాగ్జిమ్ లిత్వీనోవ్‌కు బదులుగా రాబర్ట్ లాక్‌హార్ట్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా రైలీ కోసం పనిచేసిన యెలిజావెతా ఓటెన్, మారియా ఫ్రీదె, మరో ప్రేయసి ఓల్గాను అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Bradley Smith/CORBIS/Corbis via Getty Images
రైలీ అరెస్ట్
రైలీ రహస్య స్థావరంపై కూడా రష్యా నిఘా వర్గాలు దాడి చేశాయి. కానీ బ్రిటిష్ గూఢచారుల సహాయంతో రష్యా నుంచి రైలీ తప్పించుకోగలిగారు. ఫిన్లాండ్, స్టాక్‌హోమ్ మీదుగా ప్రయాణించి నవంబర్ 9న ఆయన లండన్ చేరుకున్నారు.
డీబ్రీఫింగ్ తర్వాత రైలీ కొన్నేళ్ల పాటు యూరప్‌లోని కొన్ని దేశాల్లో గడిపారు. బోల్షివిక్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో ఒక రష్యన్ కోర్టు, సిడ్నీ రైలీకి మరణశిక్ష విధించింది. రైలీ చివరి మిషన్ కోసం 1925లో రష్యాకు తిరిగి వచ్చారు.
సోవియట్ యూనియన్ సైనిక, పారిశ్రామిక సామర్థ్యాలకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించడం ఆయన లక్ష్యం.
ఈ ఘటన గురించి 'సిడ్నీ రైలీ, ఏస్ ఆఫ్ స్పైజ్' పేరిట రాసిన వ్యాసంలో యూగీన్ నీల్సన్ పేర్కొన్నారు. ఈ వ్యాసం 2023 ఆగస్ట్ 21న జెరూసలెం టైమ్స్‌లో ప్రచురితమైంది.
''సోవియట్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కాంక్ష రైలీకి ఉండేది. సోవియట్ యూనియన్‌లో పనిచేస్తున్న 'ట్రస్ట్' అనే రహస్య బోల్షివిక్ వ్యతిరేక సంస్థ తనకు ఈ పనిలో సహాయపడుతుందని ఆయన నమ్మారు. కానీ నిజానికి ఇది విదేశీ ఏజెంట్లను, బోల్షివిక్ ప్రభుత్వ వ్యతిరేకులను రష్యాలోకి రప్పించడానికి రష్యన్ నిఘా సంస్థ పన్నిన ఉచ్చు. రైలీ ఈ ఉచ్చులో చిక్కారు'' అని యూగీన్ నీల్సన్ వ్యాసంలో పేర్కొన్నారు.
ఫిన్లాండ్ మీదుగా రష్యా సరిహద్దు దాటి భూమార్గం ద్వారా రావాలని రైలీకి చెప్పారు. ఫిన్లాండ్ నుంచి ట్రస్ట్ ఏజెంట్ అయిన ఫ్యోడోర్ ఆయనతో పాటు రష్యా వచ్చారు. ఫ్యోడోర్ నిజానికి రష్యన్ నిఘా సంస్థ ఏజెంట్. ఆయన రైలీని మారుమూల ప్రాంతంలోని క్యాబిన్‌కు తీసుకెళ్లారు. తర్వాత కాసేపటికే ఆ క్యాబిన్‌ను రష్యన్ సైనికులు చుట్టుముట్టారు. రైలీని అరెస్టు చేసి మాస్కోలోని లుబ్యంకా జైలుకు తరలించారు. అక్కడ ఆయనను చాలారోజుల పాటు తీవ్రంగా విచారించారు.
మాస్కో సమీపంలోని అడవిలో 1925 నవంబర్ 5న ఆయనపై కాల్పులు జరిగాయి. జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆయనపై కాల్పులు జరపాల్సి వచ్చిందని చాలాకాలం పాటు రష్యా చెబుతూ వచ్చింది.
రైలీ జీవిత చరిత్ర రాసిన ఆండ్రూ కుక్‌కు 2002లో మాజీ సోవియట్ ఏజెంట్ బోరిస్ గుడ్జ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సిడ్నీ రైలీని విచారించి, తర్వాత ఆయనను కాల్చి చంపిన బృందంలో తాను ఒక సభ్యుడినని ఆ ఇంటర్వ్యూలో బోరిస్ తెలిపారు.
సిడ్నీ రైలీ, జేమ్స్ బాండ్
సిడ్నీ రైలీ జీవితం నుంచి పొందిన ప్రేరణతోనే ఇంటెలిజెన్స్ ఏజెంట్ జేమ్స్ బాండ్ పాత్రను ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించారని విశ్వసిస్తారు.
రైలీ సాహసాల గురించి ఆయన స్నేహితుడు రాబర్ట్ లాక్‌హార్ట్ నుంచి ఫ్లెమింగ్ తెలుసుకున్నారు. రష్యాలో రైలీతో కలిసి లాక్‌హార్ట్ పని చేశారు. 'రైలీ ఏస్ ఆఫ్ స్పైస్' అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.
రైలీ వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలను తీసుకొని ఫ్లెమింగ్.. జేమ్స్ బాండ్ పాత్రను సృష్టించారు. రైలీ రూపు రేఖలు, మోడ్రన్ దుస్తులు ధరించే ఆయన అలవాటు, స్త్రీలు, కార్లు, మద్యంపై ఆయనకున్న ప్రేమ, అనేక భాషలు మాట్లాడటం, ఆయుధాలు వాడటంలో ఆయనకున్న నైపుణ్యం, శత్రువులపై క్రూర వైఖరి వంటి లక్షణాలను జేమ్స్ బాండ్ పాత్రకు ఆపాదించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














