దిల్లీలో కారు పేలుడు: సమాధానం దొరకని నాలుగు ప్రశ్నలు

దిల్లీ పేలుడు ఘటన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దిల్లీ పేలుడులో చనిపోయినవారి బంధువులు

దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌కు సమీపంలో కారు పేలుడుపై విచారణ జరిపేందుకు మంగళవారం ఉదయం నుంచే ఘటనా స్థలం వద్దకు అధికారుల బృందం చేరుకుంది.

సోమవారం సాయంత్రం (నవంబర్ 10న సాయంత్రం) ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.

కారు పేలుడు వార్త తెలిసిన వెంటనే దర్యాప్తు సంస్థలు ఘటనా స్థలానికి వెళ్లాయి.

హోం మంత్రి అమిత్ షా కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. దర్యాప్తు అధికారులతో మాట్లాడారు.

ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలం నుంచి పలు నమూనాలను, ఆధారాలను సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.

అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సమాధానం దొరకని ప్రశ్నలు నాలుగు ఉన్నాయి.

అంబులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

పేలుడు ఎలా జరిగింది?

పేలుడు ఘటన గురించి మీడియాకు వివరించిన దిల్లీ పోలీసు కమిషనర్ సతీష్ గోల్చా, ''ఈ పేలుడు వల్ల సమీప వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే దిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్, ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీకి చెందిన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అంచనా వేశాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు అయిన వెంటనే వివరాలను వెల్లడిస్తాం'' అని చెప్పారు.

అయితే, కారు పేలుడుకు కారణమేంటో ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు.

ఎలా ఈ పేలుడు జరిగింది? అప్పటికే కారులో ఏదైనా పేలుడు పదార్థం లేదా బాంబు ఉందా? కారు ఫ్యూయల్ ట్యాంకు లేదా సీఎన్‌జీ ట్యాంకు పేలి ఇతర వాహనాలకు నిప్పంటుకుందా? కారులో ఉన్న వ్యక్తులకు ముందుగా ఏదైనా సమాచారం ఉందా? అనే వాటి గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పేలుడుకు కారణం ఎవరు?

ఈ ఘటన గురించి పోలీసులు కూడా ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అనేక దర్యాప్తు సంస్థలు ఈ ఘటనను విచారిస్తున్నాయని దిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు.

''ఘటనా స్థలంలో సేకరించిన నమూనాలను, ఆధారాలను ల్యాబ్‌కు పంపుతున్నాం. ఆ తర్వాతే మాకు మరింత సమాచారం తెలుస్తుంది. ఈ ఆధారాలను, నమూనాలను పరీక్షించిన తర్వాతే ఒక నిర్ధరణకు రాగలం'' అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ అధికారి మొహమ్మద్ వాహిద్ రిపోర్టర్లకు తెలిపారు.

ఈ పేలుడు గురించి మీడియాలో పలు ఊహాగానాలు వస్తున్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షులేమో ఈ పేలుడు సీఎన్‌జీ వల్లే జరిగిందని చెబుతున్నారు. అయితే, పోలీసులు ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు.

''దిల్లీ కారు పేలుడు ఘటనపై యూఏపీఏ, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్‌కు చెందిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఫోరెన్సిక్ నిపుణులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు, ఇతర నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి వచ్చాయి. అన్ని ఆధారాలను మేం సేకరిస్తున్నాం'' అని దిల్లీ నార్త్ డీసీపీ రాజా బంథియా మంగళవారం ఉదయం మీడియాకు చెప్పారు.

హోమ్ మంత్రి అమిత్ షా

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, హోమ్ మంత్రి అమిత్ షా
పేలుడు జరిగిన కారు ఎవరిది?

పేలుడు గురించి వివరాలు వెల్లడించిన హోం మంత్రి అమిత్ షా.. "సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఐ-20 హ్యుందాయ్ కారులో పేలుడు జరిగింది. పేలుడు వల్ల కొన్ని సమీప వాహనాలు దెబ్బతిన్నాయి" అని తెలిపారు.

అయితే, పేలుడు జరిగిన కారు గురించి అనేక మీడియా కథనాలు వచ్చాయి. కానీ, వాటిల్లో ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. ఈ కారు యజమాని ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది? ఎంతమంది కారులో ఉన్నారు? పేలుడులో ఎంతమంది చనిపోయారు? అనేది అస్పష్టంగా ఉంది.

కారు కదలికలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోనే చాలా గంటలుగా కారు ఉందని అనేక మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. అయితే, పేలుడు ప్రాంతంలోనే కారు పార్క్ చేసి ఉందా అనే దానిపై స్పష్టత లేదు.

పార్కింగ్ లాట్‌లో కారు పార్క్ చేసి ఉందని, పేలుడుకు ముందు నెమ్మదిగా కదిలించడం ప్రారంభించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగిన ప్రాంతం ఉంది.

అయితే, ఈ వివరాలను పోలీసులు ధ్రువీకరించలేదు.

దిల్లీ ఎర్రకోట
టార్గెట్ ఎవరు?

ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడు ప్రమాదకరంగా జరిగిందా? లేదా ఉద్దేశపూర్వకంగానే చేశారా? అనేది ఇంకా తెలియలేదు.

ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన పేలుడు అయితే, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? పౌరులు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారా? ఈ ఘటనకు స్థానికంగా సంబంధం ఉందా లేదా రాష్ట్రం, దేశం వెలుపల సంబంధాలు ఉన్నాయా?

ఈ విషయాలకు సంబంధించిన సమాచారమంతా ఇంకా తెలియాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)