ఫరీదాబాద్: ఆయుధాలు, 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు, అసలు విషయమేంటి?

ఫొటో సోర్స్, ANI
ఫరీదాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు హరియాణా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరియాణా, జమ్మూ కశ్మీర్ పోలీసులు 15 రోజులుగా సంయుక్త ఆపరేషన్ చేస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒక అద్దె ఇంటి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటెన్సివ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ)లను తయారు చేసేందుకు ఉపయోగించే అనేక వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయని పోలీసులు చెప్పారు.
"ఫరీదాబాద్‌లో జమ్మూ కశ్మీర్ పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా ఐఈడీలను తయారు చేసే సామగ్రి, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు" అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సత్యేంద్ర కుమార్ చెప్పారు.
"ఆయుధాల్లో ఓ అసాల్ట్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 83 లైవ్ రౌండ్లు, 8 లైవ్ రౌండ్లతో ఉన్న ఒక పిస్టల్, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, రెండు స్పేర్ మ్యాగజైన్లు, 8 పెద్ద సూట్‌కేసులు, 4 చిన్న సూట్‌కేసులు సహా ఒక బకెట్ ఉన్నాయి" ఆయన చెప్పారు.

"వీటితో పాటు 360 కేజీల పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని అమ్మోనియం నైట్రేట్‌గా అనుమానిస్తున్నారు. 20 టైమర్ బ్యాటరీలు, 24 రిమోట్లు, దాదాపు 5 కేజీల హెవీ మెటల్, వాకీటాకీ సెట్లు, ఎలక్ట్రికల్ వైర్లు, బ్యాటరీ, ఇతర నిషేధిత పదార్ధాలు, ఏకే 47ను పోలి ఉండే అసాల్ట్ రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి డాక్టర్ ముజామ్మిల్‌ను అరెస్ట్ చేశారు. ఆయన స్థానికంగా ఉన్న అల్ ఫలా యూనివర్సిటీలో పని చేసేవారు" అని పోలీస్ కమిషనర్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
జమ్మూ కశ్మీర్ పోలీసులు ఏం చెప్పారు?
ఇదే కేసుకు సంబంధించి ఒక స్థానికుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వ్యక్తి భార్య వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, "పోలీసులు ఇమామ్ సాహిబ్‌ను అరెస్ట్ చేశారు. వాళ్లు ఆయన్ను ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. పోలీసులు ఇంతకు ముందెప్పుడూ మా ఇంటికి రాలేదు. ఆయన 20 ఏళ్లుగా మసీదులో పని చేస్తున్నారు. డాక్టర్ కూడా రోజూ ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసేవారు. ఆయనది కశ్మీర్" అని చెప్పారు.
ఈ ఘటనపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ, "టెర్రరిజానికి మతం లేదని చెప్పే వారిని ఒకటే అడుగుతున్నా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఒక మతానికి చెందిన వారు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? " అని ప్రశ్నించారు.
"నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్ ఏ మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధమున్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ టెర్రర్ మాడ్యూల్‌ను చేధించాం" అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
దర్యాప్తులో భాగంగా, శ్రీనగర్, అనంతనాగ్, గండేర్బాల్, షోషియాన్ సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.
"హరియాణా పోలీసుల సాయంతో ఫరీదాబాద్‌లో, యూపీ పోలీసుల సాయంతో సహరాన్‌పూర్‌లో జమ్మూ కశ్మీర్ పోలీసులు సోదాలు నిర్వహించారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటివరకూ తాము స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
అందులో చైనీస్ స్టార్ పిస్టల్, బెరెట్టా పిస్టల్, ఏకే 56 రైఫిల్, ఏకే క్రింకోవ్ రైఫిల్ ఉన్నాయి. వీటితో పాటు ఈ ఆయుధాలకు సంబంధించిన మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి.
2900 కిలోల ఐఈడీ తయారీ సామగ్రి (పేలుడు పదార్థాలు, రసాయనాలు, మండే పదార్థాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్లు, టైమర్లు, మెటల్ షీట్లు మొదలైనవి) కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరిఫ్ నిసార్ దార్, యాసిర్-ఉల్-అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, జమీర్ అహ్మద్ అహంగర్, డాక్టర్ ముజామ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఆదిల్‌ను అరెస్టు చేసినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














