దోషిగా తేలిన షేక్ హసీనాకు ఆశ్రయం: భారత్‌, బంగ్లాదేశ్ సంబంధాలకు పరీక్షేనా, భారత్ ముందున్నదారులేంటి?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు దీర్ఘకాలంగా మద్దతు అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా విలువైనదే అయినా, రాజకీయంగా భారమైన విషయం.

హసీనా తన 15 ఏళ్ల పాలనాకాలంలో భారత్ తన పొరుగుదేశాల నుంచి ఆశించే ప్రయోజనాలను అందించారు. ప్రాంతీయ స్థిరత్వం, రవాణా వసతుల పెంపుతోపాటు చైనా కంటే భారత్‌తో మెరుగైన సంబంధాలకు మొగ్గుచూపారు.

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల వల్ల హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దానివల్ల ఆమె తన పదవి కోల్పోయారు. బంగ్లా సరిహద్దులు దాటి వచ్చి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రత్యేక న్యాయస్థానం మానవహక్కుల ఉల్లంఘనల కేసులో ఆమెకు మరణదండన విధించింది.

హసీనా 2024 అల్లర్ల కారణంగా దేశాన్ని వీడటంతో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పడీ మొత్తం వ్యవహారం భారత్‌కు దౌత్యపరమైన సంకటంగా మారింది. ఢాకా ప్రభుత్వం హసీనా అప్పగింతను కోరుకుంటోంది. కానీ అలా చేస్తే హసీనాకు మరణదండన అమలయ్యే ప్రమాదం ఉండటంతో దిల్లీ ఢాకా కోరికపై ఆసక్తి చూపడం లేదు.

భారత్ మానవతా ఆశ్రయంగా భావించినది ఇప్పుడు దేశానికి సుదీర్ఘమైన, అసౌకర్య పరీక్షగా మారుతోంది. తన పాత మిత్రురాలిని రక్షించడానికి భారత్ ఎంత దూరం వెళుతుంది, ఎంత దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది?.

భారత్‌కు ఇప్పుడు నాలుగు దారులున్నాయని దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ అన్నారు.

హసీనాను అప్పగించడం ఒక ఆప్షన్ - కానీ భారత్ నిజంగా అలా చేయాలనుకోవడం లేదు. మరొకటి ఆమెను భారతదేశంలోనే ఉంచడం. కానీ, బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అది ప్రమాదకరంగా మారవచ్చు.

భారతదేశం హసీనాను నిశ్శబ్దంగా ఉండమని, బహిరంగంగా మాట్లాడకుండా ఉండమని కూడా కోరవచ్చు. కానీ, ఆమె ఇప్పటికీ తన అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నందున ఆమె అంగీకరించకపోవచ్చు. ఈ విషయంలో భారత్ ఆమెను బలవంతం చేసే అవకాశం లేదు.

ఆమెను మరొక దేశానికి పంపడం చివరి ఆప్షన్. కానీ, ఇది కూడా అంత సులువైనది కాదు. ఎందుకంటే, ఇలా చట్టపరమైన సమస్యలు, తీవ్రమైన భద్రతా అవసరాలు ఉన్న వారిని చాలా తక్కువ దేశాలే స్వాగతిస్తాయి.

ఇక హసీనాను అప్పగించడం కష్టమే. ఎందుకంటే భారత ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఆమెను సన్నిహిత స్నేహితురాలిగా చూస్తాయి.

కుగెల్మాన్ చెప్పినట్లుగా, "భారతదేశం తన స్నేహితులను విడిచిపెట్టకపోవడంపై గర్విస్తుంది".

బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ కీలక పాత్ర పోషించడం, ఇరు దేశాల మధ్య బలమైన సంబంధం ఉన్నందున ఈ పరిస్థితి దిల్లీకి చాలా కష్టంగా ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్, విద్యార్థుల తిరుగుబాటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థుల తిరుగుబాటుతో గత సంవత్సరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది.

'సులభంగా తెగిపోయే బంధం కాదు'

బంగ్లాదేశ్ దక్షిణాసియాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్యభాగస్వామి. అలాగే ఆసియాలో బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గానూ ఉంది. గత ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం దాదాపు రూ.1.15 లక్షల కోట్లు. అయితే ముడిపదార్థాలు, ఇంధనం, రవాణా మార్గాల కోసం బంగ్లాదేశ్ భారత్ ఎక్కువగా ఆధారపడటం వల్ల ఆ దేశానికి వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది.

గత 10 సంవత్సరాలలో, బంగ్లాదేశ్‌కు భారత్ చౌకైన రుణాల రూపంలో దాదాపు రూ. 70 వేల కోట్ల నుంచి 88 వేల కోట్ల వరకు ఇచ్చింది. కొన్ని వస్తువులను సుంకం లేకుండా ప్రవేశించడానికి అనుమతించింది. రెండు దేశాల మధ్య రైలు సంబంధాలను నిర్మించింది. విద్యుత్, చమురు, ఎల్ఎన్‌జీని సరఫరా చేసింది. ఇది సులభంగా తెగిపోయే బంధం కాదు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధం ఉందని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సౌత్ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. ఇరుదేశాలు నీటి వనరులు, విద్యుత్ వంటివి పంచుకుంటాయని చెప్పారు.

బంగ్లాదేశ్‌, మొహమ్మద్ యూనస్

ఫొటో సోర్స్, Leon Neal/Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ నాయకుడు.

భారత్‌కు దూరంగా..

మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో, తాత్కాలిక ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని త్వరగా సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని చాలామంది భావిస్తున్నారు.

తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ విదేశీ విధానాన్ని "డి-ఇండియనైజ్(ఇండియాకు దూరంగా)" చేయడానికి ప్రయత్నిస్తోందని పొలిటికల్ సైంటిస్ట్ బియాన్ సాయి రాశారు. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం దీనికి సంబంధించిన పేపర్ ప్రచురించింది.

ఢాకా భారతదేశంతో చట్టపరమైన మార్పిడులను రద్దు చేస్తోంది. ఇంధన ఒప్పందాలపై తిరిగి చర్చలు జరుపుతోంది. భారత మద్దతు ఉన్న రవాణా ప్రాజెక్టులను నెమ్మదింపచేస్తోంది. చైనా, పాకిస్తాన్ తుర్కియేతో కూడా బలమైన సంబంధాలను బహిరంగంగా కోరుకుంటోంది.

సందేశం స్పష్టంగా ఉందని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశానికి అత్యంత విశ్వసనీయ పొరుగు దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం వెతుకుతోంది.

ఈ మార్పు ప్రజాభిప్రాయంలో కూడా కనిపిస్తోంది. ఢాకాలోని సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్స్ నిర్వహించిన సర్వేలో 75 శాతానికి పైగా బంగ్లాదేశీయులు చైనాతో సంబంధాలను సానుకూలంగా చూశారని, 11 శాతం మంది మాత్రమే భారత్‌ను సానుకూలంగా భావించారని తేలింది. హసీనాకు మద్దతు ఇస్తున్నందుకు భారతదేశాన్ని చాలామంది నిందిస్తున్నారు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్న పొరుగు దేశంగా చూస్తున్నారు.

'దౌత్యమే సమయమిస్తుంది'

సాధారణంగా రాజకీయ మార్పుల కంటే ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఎక్కువ కాలం ఉంటాయని ప్రొఫెసర్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య 2001- 2006 మధ్య కాలంలో వాణిజ్యం పెరిగింది. ఆ సమయంలో భారతదేశంతో తక్కువ స్నేహపూర్వకంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జమాతే ఇ ఇస్లామి (జేఇఐ) మద్దతుతో అధికారంలో ఉందని ఆయన గుర్తుచేశారు.

"వివిధ ప్రభుత్వాలతో దౌత్య సంబంధాలు మారవచ్చు. సాధారణంగా వాణిజ్యం, సంస్కృతి, క్రీడా సంబంధాలు బలంగా ఉంటాయి. కొత్త ప్రభుత్వం భారతదేశానికి దగ్గరగా లేకపోయినంత మాత్రాన, వాణిజ్యం లేదా ఇతర సంబంధాలు ఆగిపోతాయని అర్థం కాదు" అని భరద్వాజ్ అన్నారు.

భారతదేశానికి, సవాలు ఏమిటంటే, బహిష్కృత మిత్రదేశంతో వ్యవహరించడమే కాదు. ఉగ్రవాదాన్ని అణిచివేయడం, సరిహద్దు నియంత్రణ, ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవడానికి సహా భద్రతకు కీలకమైన పొరుగువారితో సంబంధాలను కొనసాగించడం. ఇక, భారత్, బంగ్లాదేశ్ 4,096 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో ఏదైనా రాజకీయ అశాంతి శరణార్థుల ప్రవాహాలకు లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో భారత్ తొందరపడకూడదని లండన్‌లోని ఎస్ఓఏఎస్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ స్టడీస్ బోధించే అవినాష్ పాలివాల్ అంటున్నారు. బంగ్లాదేశ్‌లోని ముఖ్యమైన రాజకీయ గ్రూపులతో, ముఖ్యంగా సైన్యంతో, నెమ్మదిగా దౌత్య చర్చల ద్వారా ముందుకు సాగాలని ఆయన సూచించారు. దౌత్యం మరింత సమయం ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.

భారత్-బంగ్లాదేశ్ సంబంధం రాబోయే 12–18 నెలల పాటు అస్థిరంగా ఉండొచ్చని పాలివాల్ అభిప్రాయపడ్డారు. ఇది ఎంత కష్టతరం అవుతుందనేది వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

"తాత్కాలిక ప్రభుత్వం నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా ఎన్నికలు నిర్వహించగలిగితే, ఎన్నికైన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రెండు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి, ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి అవకాశం లభిస్తుంది'' అన్నారు పాలివాల్.

అయితే, ఇపుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే: మానవ హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించిన నాయకులను రక్షిస్తుందనే ఆరోపణలు లేకుండా, మంచి, చెడు సమయాల్లో తమకు మద్దతు ఇస్తుందని భారత్ తన స్నేహపూర్వక ప్రభుత్వాలకు ఎలా చూపించగలదు?.

"ఈ సందిగ్ధతకు సులభమైన సమాధానాలు లేవు. భారత్ ఈ క్లిష్ట పరిస్థితిలో ఎందుకు చిక్కుకుందనేది ఆలోచించాల్సిన విషయం" అని పాలివాల్ అన్నారు.

'సంబంధాలు ఎందుకు మార్చడం'

"అధికారంలో ఉన్నవారితో మీరు డీల్ చేయాలి, వారు స్నేహంగా ఉంటే మీ పని పూర్తి చేసుకోవాలి. మీరు దానిని ఎందుకు మార్చడం?. విదేశాంగ విధానం ప్రజాభిప్రాయం లేదా నైతికతపై ఆధారపడి ఉండదు. దేశాల మధ్య సంబంధాలు అరుదైనవి" అని బంగ్లాదేశ్‌కు భారత రాయబారిగా పనిచేసిన పినాక్ రంజన్ చక్రవర్తి అన్నారు.

"అస్థిరంగా ఉన్న బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలను మనం నియంత్రించలేం" అన్నారు.

రాజకీయ నష్టాన్ని భారత్ సరిచేయగలదా? లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ఇది బంగ్లాదేశ్ తదుపరి ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

హసీనా అంశం ద్వైపాక్షిక సంబంధాలను బంగ్లాదేశ్ తదుపరి ప్రభుత్వం ఎంతవరకు ప్రభావితం చేయనిస్తుందనేది కీలకమని కుగెల్మాన్ చెప్పారు.

చివరికి, కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రధాన ప్రయోజనాలైన- సరిహద్దు భద్రత, వాణిజ్యం, రవాణా అనుసంధానం , దాని దేశీయ రాజకీయాలతో, చాలామందిలో బలంగా ఉన్న భారత వ్యతిరేక భావాలతో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

"నేను పెద్ద సంక్షోభాన్ని ఆశించను. కానీ సంబంధం బలహీనంగా, సున్నితంగానే ఉంటుందని భావిస్తున్నాను" అని కుగెల్మాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)