Amur falcon: 5 రోజుల్లో, 5 వేల కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన ఈ పక్షి కథ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె.శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రకృతి ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటి పక్షుల వలస. మహాసముద్రాల మీదుగా వేల కిలోమీటర్లు పయనించి వచ్చే పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు.
వాటి ప్రయాణ మార్గాలేంటి, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయి, విశ్రాంతి ఎలా... లాంటి విషయాలు తెలుసుకునేందుకు పక్షి శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు చేస్తారు.
అలాంటి కార్యక్రమాల్లో ఒకటి వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) నడుపుతున్న చేసే మణిపూర్అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా.. మూడు అముర్ ఫాల్కన్లకు (డేగలకు) నవంబర్ 11న రేడియో కాలర్లను ఫిట్ చేసి, వాటి కదలికలను పర్యవేక్షించడం ప్రారంభించారు.
మూడు అముర్ ఫాల్కన్లు అపపాంగ్ (అడల్డ్ మేల్), అలాంగ్ (యంగ్ ఫీమేల్), అహు (అడల్ట్ ఫీమేల్)లను ఈ అధ్యయనంలో పర్యవేక్షించారు.
వాటిల్లో అపపాంగ్ 5 రోజుల 15 గంటలపాటు ఏకధాటిగా ఎగురుతూ, 5,400 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు చేరుకుందని తమిళనాడు పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి సుప్రియా సాహు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు.
అముర్ ఫాల్కన్లు రోజుకు వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు.
ఆకాశం నుంచి దిగకుండా కొన్ని రోజుల పాటు ప్రయాణిస్తూ, గమ్యస్థానాన్ని చేరుకోగలవని అన్నారు.
మరి అముర్ ఫాల్కన్లకు ఇంత శక్తి ఎలా వస్తుంది? అంతంత దూరాలను ప్రయాణించడంలో వాటికి సహకరించేది ఏంటి? వాటి శరీర నిర్మాణం ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Dr. R Suresh Kumar
అముర్ ఫాల్కన్ల సముద్రయానం
ఆఫ్రికాకు వెళ్లే సమయంలో అముర్ ఫాల్కన్లు సముద్రాన్ని ఆనుకుని ఉన్న భారత ఉపఖండం మీదుగా ప్రయాణిస్తాయి.
160 నుంచి 200 గ్రాముల మధ్య బరువుండే ఈ పక్షులు, ఏడాదికి 22 వేల కి.మీలు ప్రయాణించి, అత్యంత సదూరం ప్రయాణించే వలస పక్షులుగా పేరొందాయి.
అముర్ నది ఉండే ఆగ్నేయ రష్యా, ఉత్తర చైనాలో తమ సంతానోత్పత్తి ప్రదేశాలను వదిలి, అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత భూభాగాన్ని చేరుకుంటాయి అముర్ ఫాల్కన్లు.
హిమాలయాల మీదుగా ప్రయాణించి, నాగాలాండ్, మణిపూర్, తూర్పు మేఘాలయాకు వస్తాయి.
ఈ ఫాల్కన్లు కొంతకాలం పాటు భారత భూభాగంపై విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తర్వాత పశ్చిమ తీరాన్ని చేరుకుంటాయి.
అక్కడ నుంచి అరేబియా సముద్రం మీదుగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సోమాలియా చేరుకునేందుకు మూడున్నర రోజుల నుంచి నాలుగు రోజుల పాటు విశ్రాంతి లేకుండా సాగుతుంది వీటి ప్రయాణం.
తమ ప్రయాణంలో భాగంగా భారత్‌కు వచ్చే వేలాది డేగల్లో కొన్నింటిన్ని ఎంపిక చేసి, ఈశాన్య భారత్‌లోని శాస్త్రవేత్తలు శాటిలైట్ ట్రాకింగ్ ఎక్విప్‌మెంట్‌తో పర్యవేక్షిస్తారు.
తాజాగా చేపట్టిన ఈ మానిటరింగ్‌లో మూడు ఫాల్కన్లలో ఒకటైన అపపాంగ్ (మగ డేగ) మణిపూర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఎక్కడా వాలకుండా అరేబియా సముద్రం దాటి, సోమాలియాకు చేరుకుంది.

ఫొటో సోర్స్, Dr. R Suresh Kumar
మణిపూర్ టూ సోమాలియా... నాన్ స్టాప్‌గా 5,400 కి.మీలు
మణిపూర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ రెండో దశలో మానిటర్ చేసిన పక్షుల వివరాలను సుప్రియా సాహు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్నారు. ''అపపాంగ్ ప్రయాణం అద్భుతం'' అని ఆమె అన్నారు.
రేడియో ట్రాన్స్‌మిటర్స్, శాటిలైట్లను వాడుతూ ఈ మూడు పక్షులను శాస్త్రవేత్తలు మానిటర్ చేశారు.
‘‘ ఈ ట్రాకర్ల నుంచి అందుకున్న సమాచారం ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచింది. మణిపూర్ నుంచి ఎగిరిన అపపాంగ్, మధ్య భారత్, అరేబియా సముద్రాలను దాటి సోమాలియా వైపు సముద్రం మీదుగా సాగింది'' అని సుప్రియా సాహు అన్నారు.
'' అపపాంగ్ అరేబియా సముద్రాన్ని దాటి, ఆఫ్రికాలోని సోమాలియాకు చేరుకుంది. సుమారు 5,400 కి.మీల దూరాన్ని ఇది కేవలం 5 రోజుల 15 గంటల్లో పూర్తి చేసింది. అంటే, ఈ పక్షి రోజుకు వెయ్యి కి.మీలను నాన్ స్టాప్‌గా ప్రయాణిస్తూ సోమాలియా చేరుకుంది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, P Jeganathan
సుదూరాలు ఎగిరేందుకు సాయపడే షార్ప్ వింగ్స్
అముర్ ఫాల్కన్ పక్షులు చూడటానికి అందంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత దూరం వలస వెళ్లే పక్షుల్లో ఇవి ఒకటి.
కళ్ల, ముక్కు చుట్టూ నారింజ గుర్తులు, రెండు రెక్కలపై వంపుగా, పదునుగా ఉండే కొసలు, ఎరుపు లేదా నారింజ కాళ్లు, చిన్న తోకలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి.
''కొద్దిగా వంపుతో, పదునుగా ఉండే రెక్కలు దూర ప్రయాణాలు చేసేందుకు వీటికి సాయపడతాయి'' అని పక్షుల శాస్త్రవేత్త డాక్టర్ పి. జగన్నాథన్ చెప్పారు.
ఇలాంటి శరీర నిర్మాణం ఉన్న పక్షులన్ని సుదూరాలకు వలస వెళ్తుంటాయని తెలిపారు.
అముర్ పక్షుల సుదూర వలస ప్రయాణాలను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్ కుమార్ గత 18 ఏళ్లుగా మానిటరింగ్ చేస్తున్నారు.
''అముర్ ఫాల్కన్లు సాధారణంగా ఈశాన్య భారత భూభాగంలో విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తర్వాత మధ్య భారతాన్ని దాటి, పశ్చిమ భారత్‌లోని తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. అవి అక్కడ కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉండి, ఆ తర్వాత సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించి, అరేబియా సముద్రాన్ని దాటుతాయి. అయితే, అప్పుడప్పుడు అపపాంగ్ మాదిరిగా, కొన్ని ఫాల్కన్లు ఎక్కడా విశ్రమించకుండా సోమాలియా వరకు మొత్తం దూరాన్ని ఒక్కసారే పూర్తి చేస్తాయి'' అని సురేశ్ కుమార్ తెలిపారు.
అంతంత దూరం ప్రయాణించాలంటే వాటికి చాలా శక్తి కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందుకు కావాల్సిన ఆహారాన్ని చాలావరకు ఈశాన్య భారతంలోని నాగాలాండ్, మణిపూర్ ప్రాంతాల్లో తీసుకుని శరీరంలో నిల్వ చేసుకుంటాయని డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అరేబియా సముద్రం పై ప్రయాణించేందుకు గాలుల సాయం
అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించేటప్పుడు మూడున్నర రోజుల నుంచి నాలుగు రోజుల పాటు ఎక్కడా కూడా ఇవి కిందకి దిగవు. వలస వెళ్లే తూనీగ (వాండరింగ్ గ్లైడర్) వంటివి తప్ప మరే ఆహారం వాటికి దొరికే అవకాశమే ఉండదు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత భూభాగంపైనే ఎక్కువగా తినడం, కొవ్వును నిల్వ చేసుకోవడం వాటికి అంతగా సాయం చేయకపోవచ్చని జగన్నాథన్ అభిప్రాయపడ్డారు.
''సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ వచ్చే గాలుల నుంచి అవి ప్రయోజనం పొందుతాయి. వాటికి అనుగుణంగా వాటి వలసలను సిద్ధం చేసుకుంటాయి'' అని తెలిపారు.

అవి వలస వెళ్లేటప్పుడు, ఇంటర్-ఈక్విటోరియల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్) అనే వెదర్ జోన్ ఏర్పడుతుంది. ఈ వెదర్ జోన్‌లో నైరుతి దిశగా వీచే గాలులు ఉంటాయి.
''అముర్ ఫాల్కన్లు ఆఫ్రికా దిశగా ఎగిరేటప్పుడు, ఈ గాలులను ప్రొపల్షన్‌గా వాడుకుంటాయి'' అని జగన్నాథన్ వివరించారు.
సైకిల్ తొక్కేటప్పుడు వెనుక నుంచి గాలులు నెడితే, సైకిత్ తొక్కడం తేలికైనట్లు వీటికి కూడా ఆ ప్రయాణం సులభంగా ఉంటుందని ఆయన చెప్పారు.
అలాగే, వసంతకాలం చివర్లో ఆసియాకు తిరిగి వచ్చేటప్పుడు కూడా వీచే గాలులకు అనుగుణంగా అవి ప్రయాణిస్తాయని జగన్నాథన్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారం కోసం వేట
కొన్నేళ్ల కిందటి వరకు నాగా ప్రజలు అముర్ ఫాల్కన్లను బాగా వేటాడేవారు. అయితే, ఈ పద్ధతులను ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ సురేశ్ చెప్పారు.
అముర్ ఫాల్కన్లు వాటి ఆహారాన్ని పొందేందుకు కొంతకాలం పాటు ఈశాన్య భారత్‌లో ఉండటంపై మాట్లాడిన జగన్నాథన్, ''నాగాలాండ్‌లోని డోయాంగ్ సరస్సు చుట్టూ వేల సంఖ్యలో ఈ పక్షులు గుమిగూడినప్పుడు, ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, చెట్లపై మొత్తం ఇవే కనిపిస్తున్నప్పుడు వీటిని చూడటం అద్భుతంగా ఉంటుంది'' అని అన్నారు.
''అముర్ ఫాల్కన్లను మూకుమ్మడిగా వేటాడటం, ఆహారం కోసం వాటిని విక్రయించడం చాలాకాలం కిందటి వరకు సాగింది. దీన్ని నివారించడంలో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్, పక్షి ప్రేమికుడు దివంగత రాంకీ శ్రీనివాసన్ కీలకపాత్ర పోషించారు'' అని డాక్టర్ జగన్నాథన్ వివరించారు.
స్థానిక ప్రజల జీవనోపాధిలో మాంసాహారం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ఎకో-టూరిజం అవకాశాలను కల్పించేందుకు శ్రీనివాసన్ పలు ప్రయత్నాలు చేశారని జగన్నాథన్ తెలిపారు.
ఇటువంటి చర్యల ఫలితమే అముర్ ఫాల్కన్లు మనుగడ ప్రమాదం నుంచి బయటపడేందుకు సాయపడింది.
సంప్రదాయికంగా ఆహారం కోసం అముర్ ఫాల్కన్లు వేటాడే నాగ గిరిజనులు, వాటిని రక్షిస్తామంటూ 2013లో ప్రతిజ్ఞ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














